News


క్రెడిట్‌ కార్డు... తీసుకుంటే లాభమే!

Tuesday 12th March 2019
personal-finance_main1552374302.png-24545

  • వడ్డీ లేకుండా రుణం
  • సకాలంలో చెల్లింపులు చేసే వారికే అనుకూలం
  • అత్యవసరాల్లో ఆదుకునే సాధనం
  • ఆన్‌లైన్‌ షాపింగ్‌లు, బిల్లుల చెల్లింపులపై తగ్గింపులు
  • మరెన్నో ఇతర ప్రయోజనాలు
  • గడువులోపు చెల్లించకపోతే మాత్రం భారీ వడ్డీ
  • క్రెడిట్‌ కార్డుల్లో ఎన్నో రకాలు
  • ఎవరికి వారు తమకు అనువైనదే ఎంచుకోవాలి
  • సకాలంలో బకాయిలు చెల్లించాలి
  • క్రెడిట్‌ స్కోరు తక్కువ ఉంటే కార్డుకు తిరస్కారం

క్రెడిట్‌ కార్డులో అధిక చార్జీలు ఉంటాయని, రుణ భారంలో చిక్కుకుంటామన్న అభిప్రాయాలతో చాలా మంది వీటిని తీసుకునేందుకు సుముఖత చూపరు. కానీ, నాణేనికి ఇది ఒకవైపు మాత్రమే. మరోవైపు క్రెడిట్‌ కార్డుల వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అత్యవసరాలు, ఆన్‌లైన్‌ చెల్లింపులకు వినియోగించడం ద్వారా మంచి క్రెడిట్‌ స్కోరును పెంచుకునేందుకు క్రెడిట్‌ కార్డు వీలు కల్పిస్తుంది. మంచి క్రెడిట్‌ స్కోరు అనేది గృహ రుణం, వ్యక్తిగత రుణాలకు ఎంతో అనుకూలమన్న విషయం తెలిసిందే. వాస్తవానికి ‍ప్రతీ సాధనానికి సానుకూల, ప్రతికూలతలు ఉన్నట్టే క్రెడిట్‌కార్డు విషయంలోనూ ప్రయోజనాలు, మైనస్‌ పాయింట్లు కూడా ఉన్నాయి. కాకపోతే అందరికీ ఒకే విధంగా ఉండవు. వ్యక్తుల ప్రొఫైల్‌ ఆధారంగా మారిపోతుంది. కనుక క్రెడిట్‌కార్డు విషయంలో అనుకూలతలను ఉపయోగించుకుని, అననుకూలతలను అధిగమించడం మంచి నిర్ణయం అవుతుంది. ఈ నేపథక్యంలో క్రెడిట్‌ కార్డుల గురించి సమగ్ర వివరాలను అందించే కథనమే ఇది. 

క్రెడిట్‌ స్కోరు
జీవితంలో కొన్ని సందర్భాల్లో రుణ అవసరం ఎంతో ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం రుణాలు, గృహ రుణాలు, వ్యాపార రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించినప్పుడు మంచి క్రెడిట్‌ స్కోరు ఉన్న వారికి రుణాలు సులభంగా వస్తాయి. మంచి క్రెడిట్‌ స్కోరు ఉన్న వారికి ఇతరులతో పోలిస్తే బ్యాంకులు వేగంగా ప్రక్రియను పూర్తి చేయడమే కాకుండా, తక్కువ వడ్డీ రేటును సైతం ఆఫర్‌ చేస్తుంటాయి. కాకపోతే క్రెడిట్‌ కార్డును వినియోగించే వారు క్రెడిట్‌ లిమిట్‌ దాటిపోకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. క్రెడిట్‌కార్డు పరిమితిలో 30-50 శాతం వరకే వినియోగించుకోవడం స్కోరును పెంచుకునే మంచి చర్యగా నిపుణులు పేర్కొంటున్నారు. దీన్ని రుణమిచ్చే సంస్థలు సానుకూలంగా చూస్తాయి. 

వడ్డీ రహిత అరువు
క్రెడిడ్‌ కార్డులో ఉన్న అత్యంత అనువైన ఫీచర్‌ వడ్డీ రహిత కాలం. క్రెడిట్‌ కార్డును సానుకూల ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలనుకుంటే ఇది చక్కని సదుపాయమే అవుతుంది. కార్డును బట్టి క్రెడిట్‌ లిమిట్‌ వినియోగించుకున్న తేదీ నుంచి 45-50 రోజుల వరకు వడ్డీ రహిత కాలం ఉంటుంది. అంటే ఈ కాల వ్యవధి దాటకుండా చెల్లింపులు చేస్తే వడ్డీ పడదు. కాకపోతే సకాలంలో చెల్లించే వారికే ఇది అనుకూలం. లేదంటే భారీ వడ్డీతో ప్రతికూలంగా మారుతుంది.

అత్యవసరాలు
అత్యవసరాలు చెప్పి రావు. ముఖ్యంగా వైద్య పరమైన అవసరాల్లో అప్పటికప్పుడు పెద్ద మొత్తం డబ్బులతో అవసరం పడొచ్చు. క్రెడిట్‌ కార్డును దాదాపు అన్ని ఆస్పత్రులు అనుమతిస్తున్నాయి. కీలక సందర్భాల్లో ఎదురయ్యే తక్షణ ఖర్చులను క్రెడిట్‌ కార్డుతో గట్టెక్కడానికి వీలుంటుంది. ఆ సమయాల్లో డబ్బు కోసం ఇతర మార్గాలను ఆశ్రయించాల్సిన శ్రమ తప్పుతుంది. 

ఆన్‌లైన్‌ చెల్లింపులు
ఈ కామర్స్‌ కంపెనీల విస్తరణతో ఆన్‌లైన్‌ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. వీటిల్లో చెల్లింపులకు క్రెడిట్‌ కార్డులు ఎంతో అనుకూలం. ఎందుకంటే క్రెడిట్‌ కార్డుల ద్వారా జీరో వడ్డీతో ఈఎంఐ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నాయి. పైగా ఈఎంఐ కొనుగోళ్లపై ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు కూడా కనిపిస్తుంటాయి. కాకపోతే క్రెడిట్‌ కార్డు ఉంది కదా అని ఆలోచన లేకుండా జోరుగా షాపింగ్‌ చేస్తే ఆ తర్వాత లబోదిబోమనాల్సి వస్తుంది. 

బిల్లుల చెల్లింపులు
క్రెడిట్‌ కార్డులతో ప్రతీ నెలా నిర్ణీత తేదీన బిల్లులు చెల్లింపులు జరిగేలా సెట్‌ చేసుకోవచ్చు. దీనివల్ల గడువు దాటిన తర్వాత లేట్‌ ఫీజు పడకుండా సకాలంలో చెల్లింపులు జరిగిపోతాయి. బీమా ప్రీమియం వంటి ముఖ్యమైన సాధనాలు ల్యాప్స్‌ అవకుండా కూడా చూసుకోవచ్చు. 

క్రెడిట్‌ కార్డు ఎంపిక...
క్రెడిట్‌ కార్డులు అన్నీ ఒకే విధంగా ఉండవు. కార్డులను బట్టి ప్రయోజనాలు మారిపోతుంటాయి. వార్షిక ఫీజులు, రివార్డు పాయింట్లు తదితర అంశాల ఆధారంగా మీకు అనువైన కార్డును ఎంపిక చేసుకోవాలి. గరిష్టంగా ఒకటి నుంచి మూడు కార్డులు మించకుండా జాగ్రత్తపడాలి. ఆర్థిక ప్రపంచంలో క్రెడిట్‌ కార్డు అన్నది ఓ కొకైన్‌ అని స్కాట్‌ ఆడమ్స్‌ అభివర్ణన. క్రెడిట్‌ కార్డుకు బానిస కాకుండా, దాన్ని మీ కోసం పనిచేయించుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. కొన్ని కార్డులు ప్రత్యేకంగా రెస్టారెంట్లలో చెల్లింపులపై డిస్కౌంట్లు ఇస్తుంటాయి. కొన్ని కార్డులు ప్రత్యేకంగా వాహనాలకు ఇంధనం నింపుకున్న సమయాల్లో రివార్డు పాయింట్లను క్యాష్‌ బ్యాక్‌గా పొందే సదుపాయంతో ఉంటాయి. ఈ అవసరాల కోసమే అయితే వీటిని తీసుకోవాలి. సాధారణ చెల్లింపులకు వీటి వల్ల ఉపయోగం ఉండదు. కొన్ని కార్డులపై విమానాశ్రయ లాంజెస్‌లో ఉచిత ప్రవేశ సదుపాయం ఉంటుంది. ఎక్కువగా విమానాల్లో ప్రయాణించే వారికి ఈ తరహా కార్డుతో లాభం. ఎందుకంటే లాంజ్‌లో విశ్రాంతి తీసుకునేందుకు ఒక్కొక్కరికి చార్జీ 32 డాలర్లపైనే ఉంటుంది. విదేశాలకు వెళ్లే సమయంలో క్రెడిట్‌ కార్డుకు బదులు ముందుగా కరెన్సీ లోడ్‌ చేసిన ట్రావెల్‌కార్డును తీసుకెళ్లడం వల్ల ఖర్చులు ఆదా చేసుకోవచ్చు. క్రెడిట్‌కార్డు ద్వారా విదేశాల్లో చెల్లింపులు చేస్తే కరెన్సీ మార్పిడి రేటు అధికంగా పడుతుంది. అదే సమయంలో ట్రావెల్‌ కార్డుతోపాటు ఒక క్రెడిట్‌ కార్డును కూడా వెంట తీసుకెళ్లడం మంచిది. 
 
సకాలంలో చెల్లింపులు
క్రెడిట్‌ కార్డుల బిల్లులను గడువు దాటకుండా తీర్చివేసే వీలుంటేనే కార్డు తీసుకోవాలి. లేదంటే క్రెడిట్‌ స్కోరు తీవ్రంగా దెబ్బతింటుంది. అదే జరిగితే తర్వాత రుణం లభించడం కష్టమవుతుంది. గడువు దాటితే మూడు రూపాయలు, అంతకంటే ఎక్కువ వడ్డీతో చెల్లించాల్సి రావడం భారంగా మారుతుంది. ఆన్‌లైన్లో డిస్కౌంట్‌ ప్రయోజనం పొందేందుకు క్రెడిట్‌ కార్డుతో చెల్లింపులు చేసిన వారు... గడువు వరకు ఆగకుండా వీలైనంత ముందే ఆ మొత్తాన్ని చెల్లించాలి. 

నిష్ప్రయోజనం...
క్రెడిట్‌ కార్డులు తీసుకుని వాడకుండా షెల్ఫ్‌లో పెట్టేస్తే ఎటువంటి ప్రయోజనం నెరవేరదు. ఒకటికి మించి కార్డులు తీసుకుని ఏదో ఒకదాన్ని వాడుతూ, మిగిలిన వాటిని అత్యవసరాల్లో ఉపయోగడపతాయనే భావనతో ఉంచుకుంటే సరిపోదు. వాటిని కూడా మధ్య మధ్యలో వాడుకోవడం వల్లే ప్రయోజనం నెరవేరుతుంది. 

క్రెడిట్‌ లిమిట్‌
క్రెడిట్‌కార్డు లిమిట్‌ను కంపెనీలే నిర్ణయిస్తుంటాయి. అయితే, మీకు సౌకర్యం అనుకున్నంతకే లిమిట్‌ను మీరే నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు క్రెడిట్‌ కార్డును రూ.లక్ష లిమిట్‌తో జారీ చేసిన తర్వాత... దాన్ని తరచుగా వినియోగిస్తూ, సకాలంలో బిల్లుల చెల్లింపులు చేసే వారికి కంపెనీలు క్రెడిట్‌ లిమిట్‌ను ఏటేటా పెంచుతుంటాయి. ఇలా పెంచడం సౌకర్యంగా లేకపోతే, పెంచొద్దని కోరే అవకాశం ఉంటుంది. 

క్రెడిట్‌ కార్డుకు తిరస్కారం...
క్రెడిట్‌ కార్డు ఇచ్చే ప్రతీ సంస్థ కూడా కార్డుదారుడు బకాయిలు తిరిగి చెల్లించగలరా అని చూస్తుంది. అధిక రిస్క్‌తోపాటు, తిరిగి చెల్లించే సామర్థ్యం తక్కువగా ఉంటే కార్డు ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి, స్వయం ఉపాధిలో ఉన్న వారి నుంచి డిఫాల్ట్‌ రిస్క్‌ ఎక్కువగా ఉంటుందని లాడర్‌7 ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ వ్యవస్థాపకుడు సురేష్‌ శెడగోపన్‌ తెలిపారు. తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని తెలుసుకోవాలంటే అందుకు ఉన్న ఏకైక మార్గం క్రెడిట్‌ రిపోర్ట్‌ను చూడడమే. ప్రతీ వ్యక్తి తన రుణచరిత్రను క్రెడిట్‌ స్కోరు రూపంలో తెలుసుకోవచ్చు. రుణాలకు తిరిగి చెల్లింపులు ఏ విధంగా ఉన్నాయి, రుణాల్లో సమతుల్యత, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని క్రెడిట్‌ బ్యూరో సంస్థలు క్రెడిట్‌ స్కోరును ఇస్తాయని బ్యాంక్‌ బజార్‌ డాట్‌ కామ్‌ ముఖ్య అభివృద్ధి అధికారి నవీన్‌చందాని తెలిపారు. ‘‘తక్కువ క్రెడిట్‌ స్కోరు గతంలో రుణాలకు సకాలంలో చెల్లింపులు చేయలేదని సూచిస్తుంది. లేదా రుణ ఖాతాలను సరిగ్గా మూసివేయలేకపోవడం వల్ల కూడా ఇలా జరిగి ఉంటుంది. అలాగే, రుణానికి అవకాశం ఉంది కదా అని అధిక మొత్తంలో తీసుకోవడం కూడా స్కోరుపై ప్రభావం చూపిస్తుంది. దీంతో క్రెడిట్‌ కార్డు దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది’’ అని చందాని వివరించారు. అలాగే, క్రెడిట్‌ స్కోరు మెరుగుపడినప్పటికీ, గత రుణాలకు సంబంధించి డిఫాల్ట్‌ విషయాన్ని క్రెడిట్‌ రిపోర్ట్‌లో పేర్కొనడం వల్ల కూడా క్రెడిట్‌ కార్డు పొందలేని పరిస్థితి ఎదురుకావచ్చన్నారు. ‘‘ఒకేసారి ఒకటి మించి క్రెడిట్‌ కార్డులకు దరఖాస్తు చేసుకోరాదు. అలా చేస్తే అన్నీ కూడా తిరస్కరణకు గురి కావచ్చు. ఇది క్రెడిట్‌ కోసం అర్రులు చాచినట్టు అవుతుంది. ఇలా ఒకటికి మించిన దరఖాస్తులు కూడా క్రెడిట్‌ స్కోరును తగ్గిస్తాయి’’ అని చందానీ వివరించారు. అందుకే తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్నవారే క్రెడిట్‌ కార్డుకు వెళ్లాలని సూచించారు. ముందుగా క్రెడిట్‌ స్కోరును పరిశీలించుకుని తక్కువగా ఉంటే, ఏవైనా తప్పులు ఉన్నాయోమో చూసుకుని సరిచేయించుకోవాలన్నారు. అలాగే, పాత బకాయిలు ఉంటే వాటిని తీర్చివేసిన తర్వాత క్రెడిట్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.You may be interested

ఆర్థిక సవాళ్లకు సిద్ధమా?

Tuesday 12th March 2019

ఆరంభమే అదరాలి ప్రణాళిక మొదలు పెడితే పక్కాగా అమలు కావాలి చిన్న వయసులోనే ఇన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాలకు తగిన ప్రణాళికలు రిటైర్మెంట్‌ నాటికి అన్ని బాధ్యతలు తీరేలా ఉండాలి యవ్వనం నుంచి వృద్ధాప్యం సమీపించే వరకు ఉండే 40 ఏళ్ల కాలం ఎంతో విలువైనది అవుతుంది. ఈ కాలంలో ఆర్థికంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఎన్నో లక్ష్యాలు తెరపైకి వస్తాయి... కనుక ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి ప్రతి ఒక్కరూ సదా సన్నద్ధులు కావాలి. ఉదాహరణకు రూ.40 లక్షల గృహ

పసిడి లాభాల ర్యాలీ

Tuesday 12th March 2019

డాలర్‌ ఇండెక్స్‌ పతనం పసిడి ధరకు కలిసొస్తుంది. ఆసియా మంగళవారం ఔన్స్‌ పసిడి ధర 6డాలర్ల పెరిగింది. బ్రెగ్జిట్‌ డీల్‌ కీలక సవరణకు యూరోపిన్‌ కమీషన్‌ సోమవారం అంగీకారం తెలపడంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలహీనపడింది. అలాగే పసిడి ధర 1300డాలర్ల దిగువకు ట్రేడ్‌ అవుతుండటం కూడా ఇన్వెస్టర్లను పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు పురిగొల్పింది. ఈ నేపథ్యంలో నేడు ఔన్స్‌ పసడి ధర 6.25 డాలర్లు

Most from this category