News


ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఖాతాలు మళ్లీ మదింపు

Tuesday 12th February 2019
news_main1549950627.png-24147

  • ప్రక్రియ చేపట్టనున్న ఐసీఏఐ విభాగం
  • ఎన్‌సీఎల్‌టీ ఆదేశాల మేరకు నిర్ణయం
  • ఆడిటర్ల అభ్యంతరాలు

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇన్‌ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఖాతాలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మరోసారి మదింపు చేయనుంది. ఈ కేసులో ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఐసీఏఐ అకౌంటింగ్ రీసెర్చ్ ఫౌండేషన్ విభాగం దీన్ని చేపట్టనున్నట్లు ఐసీఏఐ తెలిపింది. 2012-13 నుంచి 2017-18 మధ్య కాలానికి సంబంధించి కంపెనీల చట్టంలోని సెక్షన్ 130 కింద (ఆర్థిక అవకతవకలు) ఐఎల్‌ఎఫ్‌ఎస్‌, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్‌, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్స్‌ ఖాతాలను, ఆర్థిక ఫలితాలను మరోసారి మదింపు చేయాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ముంబై బెంచ్‌ జనవరి 1న ఆదేశించడం తెలిసిందే. వీటికి అనుగుణంగానే ఐసీఏఐ తాజాగా ప్రక్రియ చేపట్టనుంది. పాత మేనేజ్‌మెంట్‌ హయాంలో పద్దుల్లో అవకతవకలు జరిగాయని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐవో), ఐసీఏఐ గత నివేదికల్లో సూచనప్రాయంగా వెల్లడించటం తెలిసిందే. ఖాతాల్ని మరోసారి మదించటానికి ఆర్‌బీఐ, సెబీ వంటి నియంత్రణ సంస్థలు అనుమతించినా.. ఆయా పద్దులు, ఆర్థిక ఫలితాలు కంపెనీ రూపొందించినవేనని, తమకు సంబంధం లేదని ఎస్‌ఆర్‌బీసీ అండ్ కో తదితర ఆడిటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ దాదాపు రూ.90,000 కోట్ల మేర బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు బాకీపడింది.
22 సంస్థలపై ఆంక్షల తొలగింపు...
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌లో కాస్త మెరుగ్గా ఉన్న 22 కంపెనీలు రుణాలపై వడ్డీల చెల్లింపును కొనసాగించేందుకు నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) అనుమతించింది. అలాగే గ్రూప్ దివాలా పరిష్కార ప్రక్రియ పర్యవేక్షణకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డీకే జైన్ నియామకాన్ని కూడా ఆమోదిస్తూ జస్టిస్ ఎస్‌జే ముఖోపాధ్యాయ సారథ్యంలోని ద్విసభ్య బెంచి నిర్ణయం తీసుకుంది. అటు విదేశాల్లో ఏర్పాటైన 133 సంస్థలపైనా మారటోరియం ఎత్తివేసి, దివాలా పరిష్కార ప్రక్రియలో భాగం అయ్యేలా ఉత్తర్వులు ఇచ్చింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ రుణ పరిష్కార ప్రణాళికను కార్పొరేట్ వ్యవహారాల శాఖ గత నెలలో సమర్పించింది. దీని ప్రకారం.. ఆర్థికంగా కాస్త మెరుగ్గా ఉన్న కంపెనీలను ఆకుపచ్చ రంగులోనూ, కొంత తీవ్రత ఉన్న వాటిని కాషాయ రంగు, తీవ్రంగా ఉన్న వాటిని ఎరుపు రంగులోనూ వర్గీకరించింది. ఆకుపచ్చ కేటగిరీలో వర్గీకరించినవి రుణ చెల్లింపులు కొనసాగించే సామర్థ్యం ఉన్నవి కాగా, రెండో కేటగిరీ సంస్థలు కేవలం నిర్వహణపరమైన చెల్లింపులు మాత్రమే జరపగలిగేవిగా ఉన్నాయి. ఇక, ఎరుపు వర్ణంలోనివి కనీసం సీనియర్ సెక్యూర్డ్ రుణదాతలకు కూడా చెల్లింపులు జరపలేని పరిస్థితుల్లో ఉన్నాయి.You may be interested

స్పైస్‌జెట్‌కు ఇంధన సెగ

Tuesday 12th February 2019

77 శాతం తగ్గిన నికర లాభం రూ.2,531 కోట్లకు మొత్తం ఆదాయం ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ, స్పైస్‌జెట్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక  కాలంలో 77 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.240 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.55 కోట్లకు చేరిందని స్పైస్‌జెట్‌ తెలిపింది. విమానయాన ఇంధనం ధరలు 34 శాతం పెరగడం,  రూపాయి 11 శాతం పతనం కావడం

రూ.899లకే విమాన టికెట్‌

Tuesday 12th February 2019

విస్తారా, ఇండిగో బంపర్‌ ఆఫర్లు న్యూఢిల్లీ: పలు ప్రధాన రూట్లలో భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తున్నట్లు విస్తారా ఎయిర్ లైన్స్‌, బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌ ఇండిగో ప్రకటించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి సెప్టెంబర్‌ 28 వరకు చేసే జర్నీలపై సోమవారం నుంచి బుధవారం వరకు ఆఫర్‌ ఇస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై ఈ ఆఫర్లు వర్తిస్తాయని స్పష్టంచేసింది. దేశీ విమానాల్లో రూ.899కే విమాన టికెట్‌ను అందిస్తుండగా..

Most from this category