News


పసిడిపై ఆర్‌బీఐ గురి

Saturday 16th March 2019
Markets_main1552720291.png-24636

- బంగారం నిల్వలు పెంచుకుంటున్న రిజర్వ్‌ బ్యాంక్‌
- జనవరిలో 6.5 టన్నుల కొనుగోలు
- త్వరలో నెదర్లాండ్స్‌ని దాటి పదో స్థానానికి

న్యూఢిల్లీ: వాణిజ్య యుద్ధ భయాలు, రాజకీయంగా అనిశ్చితి మొదలైన పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్‌ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. దేశీయంగా రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కూడా అదే బాటలో పసిడి కొనుగోళ్లు జరుపుతోంది. జనవరిలో 6.5 టన్నుల మేర పసిడి కొనుగోలు చేసింది. దీంతో ఆర్‌బీఐ వద్ద పసిడి నిల్వలు 607 టన్నులకు చేరాయి. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) గణాంకాల ప్రకారం భారత విదేశీ మారక నిల్వల్లో (ఫారెక్స్‌) పసిడి వాటా క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2018లో 6.2 శాతంగా ఉన్న పరిమాణం జనవరిలో మరికాస్త పెరిగి 6.4 శాతానికి చేరింది. డబ్ల్యూజీసీ గణాంకాల ప్రకారం ఫారెక్స్‌ నిల్వల్లో పసిడి వాటా అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ ప్రస్తుతం 11వ స్థానంలో ఉంది. 612.5 టన్నులతో నెదర్లాండ్స్‌ 10వ స్థానంలో ఉంది. రెండు దేశాల నిల్వల మధ్య వ్యత్యాసం కేవలం 5.5 టన్నులు మాత్రమే ఉండటంతో.. త్వరలోనే భారత్‌ 10వ స్థానానికి చేరొచ్చన్న డబ్ల్యూజీసీ భావిస్తోంది. నెదర్లాండ్స్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ పసిడి నిల్వల్లో గత దశాబ్దకాలంగా పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదు. అంతక్రితం దాకా యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్స్‌తో ఒప్పందాల కారణంగా నెదర్లాండ్స్‌ పసిడి విక్రయిస్తూ నిల్వలను తగ్గించుకుంటూ వచ్చింది. తాజా నిల్వల గణాంకాల ప్రకారం భారత్‌ త్వరలోనే నెదర్లాండ్స్‌ స్థానాన్ని ఆక్రమించే అవకాశముందని అంచనాలున్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా అదే ధోరణి..
వాస్తవానికి మిగతా ప్రపంచ దేశాల్లో కూడా ఇదే ధోరణి నెలకొంది. డాలర్‌ బలపడుతున్న నేపథ్యంలో సెంట్రల్‌ బ్యాంకులు తమ రిజర్వ్‌లలో ఇతరత్రా సాధనాల వాటాను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మిగతా అన్నింటికన్నా బంగారమే పటిష్టమైన హెడ్జింగ్‌ సాధనంగా ఉంటుందని భావిస్తున్నాయి. అందుకే పసిడి నిల్వలను పెంచుకుంటున్నాయి. 

రికార్డు స్థాయిలో కొనుగోళ్లు..
జనవరిలో స్థూలంగా 13 టన్నుల పసిడిని విక్రయించిన సెంట్రల్‌ బ్యాంకులు .. 48 టన్నుల మేర కొనుగోళ్లు జరిపాయి. దీంతో నికర కొనుగోళ్లు 35 టన్నులుగా నమోదయ్యాయి. ఇందులో సింహభాగం కొనుగోళ్లు తొమ్మిది సెంట్రల్‌ బ్యాంకులే జరిపాయి. 2002 తర్వాత జనవరి నెలలో సెంట్రల్‌ బ్యాంకులు ఈ స్థాయిలో పసిడి కొనుగోలు చేయడం ఇదే ప్రథమమని డబ్ల్యూజీసీ డైరెక్టర్‌ (మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌) అలిస్టెయిర్‌ హెవిట్‌ తెలిపారు. ఎక్కువగా వర్ధమాన దేశాల సెంట్రల్‌ బ్యాంకులు ఈ కొనుగోళ్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి తదితర అంశాల నేపథ్యంలో అవి హెడ్జింగ్‌ కోసం బంగారంపై దృష్టి పెడుతున్నాయని వివరించారు.  2018లో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్‌ బ్యాంకులు ఏకంగా 600 టన్నుల పసిడి కొనుగోలు చేశాయి. ఇది ఆయిదు దశాబ్దాల గరిష్టం కావడం గమనార్హం. వర్ధమాన దేశాల సెంట్రల్‌ మార్కెట్లే ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి. 

సెంట్రల్ బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు

దేశం        టన్నులు        ఫారెక్స్‌లో వాటా %

అమెరికా        8,133.5        75
జర్మనీ        3,369.7        70.6
ఐఎంఎఫ్‌        2,814            -
ఇటలీ        2,451.8        66.9
ఫ్రాన్స్        2,436            60.8
రష్యా        2,119.2        18.9
చైనా        1,864.3        2.5
స్విట్జర్లాండ్‌    1,040            5.6
జపాన్        765.2            2.5
నెదర్లాండ్స్    612.5            65.7
భారత్‌        607            6.4
ఈసీబీ        504.8            28.3You may be interested

ఏటీఎం కార్డు లేకుండానే

Saturday 16th March 2019

నగదు విత్‌డ్రా హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మరొక వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. యోనో యాప్‌ ద్వారా ఏటీఎం కార్డు అవసరం లేకుండానే నగదు ఉపసంహరణ సేవలను ప్రారంభించింది. ఈ మేరకు తెలంగాణ సర్కిల్‌ సీజీఎం జె.స్వామినాథన్‌ శుక్రవారమిక్కడ బ్యాంక్‌ ఆవరణలో సేవలను ప్రారంభించారు.  16500 ఏటీఎంల్లో సేవలు... దేశంలోని అన్ని ఎస్‌బీఐ ఏటీఎం సెంటరల్లో యోనో క్యాష్‌ సేవలను వినియోగించుకోవచ్చని

2022 నాటికి రూ.2,500 కోట్లకు టర్నోవర్‌

Saturday 16th March 2019

ప్రీఫ్యాబ్‌ వ్యాపారంలోకి మళ్లీ వస్తాం బిల్డింగ్‌ మెటీరియల్స్‌లో విస్తరిస్తాం ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ కె.రవి సిమెంట్‌, రెడీ మిక్స్‌ కాంక్రీట్‌, బోర్డ్స్‌, ఎనర్జీ వంటి వ్యాపారాల్లో ఉన్న ఎన్‌సీఎల్‌ గ్రూప్‌ 2022 నాటికి రూ.2,500 కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా చేసుకుంది. ఇందులో లిస్టెడ్‌ కంపెనీ అయిన ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ వాటా రూ.2,000 కోట్లుండనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రూప్‌ టర్నోవర్‌ రూ.1,850 కోట్లు నమోదు చేయబోతోంది. ఈ టర్నోవరులో రూ.1,450 కోట్లు ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌

Most from this category