News


ఎల్‌అండ్‌టీ ఇన్ఫో, శాక్‌సాఫ్ట్‌ భళా- బంధన్‌ డీలా

Wednesday 15th January 2020
Markets_main1579072667.png-30948

రెండు రోజులపాటు హుషారుగా కదిలి బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు బుధవారం మధ్యాహ్నానికల్లా మరింత నీరసించాయి. 1.40 ప్రాంతంలో అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్‌ 282 పాయింట్లు క్షీణించి 41,670కు చేరింది. నిఫ్టీ సైతం 80 పాయింట్లు నష్టపోయి 12,282ను తాకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలు ఆకట్టుకోవడంతో ఐటీ సేవల కంపెనీ ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇక రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ వార్తలతో సాఫ్ట్‌వేర్‌ సేవల స్మాల్‌ క్యాప్‌ కంపెనీ శాక్‌సాఫ్ట్‌ లిమిటెడ్‌ సైతం లాభాలతో కళకళలాడుతోంది. అయితే ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో పటిష్ట ఫలితాలు సాధించినప్పటికీ ఎన్‌పీఏలు, ప్రొవిజన్లు పెరగడంతో బంధన్‌ బ్యాంక్‌ కౌంటర్‌ అమ్మకాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం...

ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌
మిడ్‌సెషన్‌కల్లా ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ లిమిటెడ్‌ ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాలు వెల్లడించింది. త్రైమాసిక ప్రాతిపదికన క్యూ3లో ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ నికర లాభం 4.6 శాతం ఎగసింది. రూ. 377 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 9.4 శాతం పెరిగి రూ. 2811 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 13 శాతం ఎగసి రూ. 528 కోట్లుగా నమోదైంది. ఇబిటా మార్జిన్లు 18.1 శాతం నుంచి 18.8 శాతానికి బలపడ్డాయి. ఈ నేపథ్యంలో ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ షేరు 3.4 శాతం ఎగసి రూ. 1942 వద్ద ట్రేడవుతోంది. తొలుత 7 శాతం జంప్‌చేసింది. రూ. 2003కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! 

శాక్‌సాఫ్ట్‌ లిమిటెడ్‌
ఐటీ సేవల కంపెనీ శాక్‌సాఫ్ట్‌ లిమిటెడ్‌ బ్యాంక్‌ సౌకర్యాల(రుణ చెల్లింపు సామర్థ్యం) రేటింగ్‌ను తాజాగా కేర్‌ అప్‌గ్రేడ్‌ చేసింది. గతంలో శాక్‌సాఫ్ట్‌కు ఇచ్చిన BBB+ సానుకూల రేటింగ్‌ను తాజాగా A-స్థిరత్వం(స్టేబుల్‌)గా అప్‌గ్రేడ్‌ చేసినట్లు కేర్‌ పేర్కొంది. గత కొన్నేళ్లుగా స్థిరమైన వృద్ధి చూపుతూ లాభదాయకతను పెంచుకోవడంతో శాక్‌సాఫ్ట్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేసినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో శాక్‌సాఫ్ట్‌ షేరు 3 శాతం పెరిగి రూ. 241 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 249 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది.

బంధన్ బ్యాంక్‌
ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో బంధన్ బ్యాంక్‌ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో బ్యాంక్‌ నికర లాభం 121 శాతం జంప్‌చేసి రూ. 731 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం 37 శాతం ఎగసి రూ. 1540 కోట్లను అధిగమించింది. అయితే త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 0.17 శాతం పెరిగి 1.93 శాతానికి చేరగా.. నికర ఎన్‌పీఏలు కూడా 0.25 శాతం అధికమై 0.81 శాతాన్ని తాకాయి. అంతేకాకుండా ప్రొవిజన్లు రెట్టింపై రూ. 295 కోట్లకు చేరాయి. కాగా.. నిబంధనలకు అనుగుణంగా ప్రమోటర్ల వాటాను 62 శాతం నుంచి 40 శాతానికి తగ్గించుకోవలసి ఉన్నట్లు బ్యాంకింగ్‌ వర్గాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బంధన్ బ్యాంక్‌ షేరు 4 శాతం పతనమై రూ. 497 వద్ద ట్రేడవుతోంది. అయితే తొలుత రూ. 526 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. 



You may be interested

విప్రో షేరును ఏం చేద్దాం..!?

Wednesday 15th January 2020

కంపెనీ మూడో త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత రోజు విప్రో షేరు 3.5 శాతం నష్టపోయి, రూ.248 వద్ద ముగిసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం(రూ.2,510 కోట్లు)తో పోల్చితే 2 శాతం క్షీణించి రూ.2,456 కోట్లను ఆర్జించినట్లు కంపెనీ ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ.15,060 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.15,470 కోట్లకు పెరిగింది. త్రైమాసిక ప్రాతిపదికన ఐటీ సేవల వ్యాపారం 3శాతం వృద్ధిని

చైనాగూడ్స్‌పై టారిఫ్స్‌ కొనసాగుతాయ్‌!

Wednesday 15th January 2020

రెండో దశ ట్రేడ్‌ ఒప్పందం జరిగేవరకు చైనా వస్తువులపై విధించిన టారిఫ్‌లు కొనసాగుతాయని అమెరికా వాణిజ్య సెక్రటరీ స్టీవెన్‌ నుచిన్‌ చెప్పారు. తొలిదశ ఒప్పందంపై సంంతకాలకు అనుకున్న గడువు సమీపిస్తున్న వేళ స్టీవెన్‌ ఈ ప్రకటన చేశారు. రెండో దశ వాణిజ్య ఒప్పందం వేగంగా జరిగితే ప్రెసిడెంట్‌ ట్రంప్‌ టారిఫ్‌ల తగ్గింపును పరిగణిస్తారని చెప్పారు. బుధవారం మధ్యాహ్నం ట్రంప్‌, చైనాకు చెందిన లీయుహె తొలిదశ ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ట్రంప్‌

Most from this category