News


ఇన్పోసిస్‌ 1:1 బోనస్‌

Friday 13th July 2018
news_main1531502789.png-18294

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా 1:1 బోనస్‌ను ప్రకటించింది.  ఈ కంపెనీ ఈ క్యూ1లో రూ.3,612 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం (రూ.3,483 కోట్లు)తో పోల్చితే 4 శాతం వృద్ధి సాధించామని ఇన్ఫోసిస్‌ తెలిపింది. అయితే అంతకు ముందటి క్వార్టర్‌(గత ఆర్థిక సంవత్సరం క్యూ4)లో సాధించిన నికర లాభం, రూ.3,690 కోట్లతో పోల్చితే 2.1 శాతం క్షీణించింది. ఆదాయం రూ.17,078 కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.19,128 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ సలిల్‌ పరేఖ్‌ చెప్పారు. ఆదాయం అంతకు ముందటి క్వార్టర్‌ ఆదాయంతో పోల్చితే 6 శాతం ఎగసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి (నిలకడ కరెన్సీ) 6-8 శాతం అంచనాలను కొనసాగిస్తున్నామని సలీల్‌ తెలిపారు. అలాగే మార్జిన్‌ అంచనాలను 22-24 శాతం రేంజ్‌లో కొనసాగిస్తున్నామని వివరించారు. నికర లాభం, నిర్వహణ గణాంకాలు అంచనాలను అందుకోలేకపోగా, ఆదాయం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గైడెన్స్‌ మాత్రం అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. ఈ కంపెనీ రూ.19,093 కోట్ల ఆదాయంపై రూ.3,748 కోట్ల నికర లాభం సాధించగలదని విశ్లేషకులు అంచనా వేశారు. 
తగ్గిన మార్జిన్‌...
ఇబిట్‌ సీక్వెన్షియల్‌గా 5 శాతం తగ్గి రూ.4,267 కోట్లకు చేరిందని సలీల్‌ పరేఖ్‌ తెలిపారు.  అంతకు ముందటి క్వార్టర్‌లో 24.7 శాతంగా ఉన్న నిర్వహణ మార్జిన్‌ ఈ క్యూ1లో 23.7 శాతానికి తగ్గిందని తెలిపారు. వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినందువల్ల, వేతనాల పెంపు కారణంగా నిర్వహణ మార్జిన్‌ తగ్గిందని వివరించారు. మొత్తం ఆదాయంలో 28 శాతంగా ఉన్న డిజిటల్‌ వ్యాపారం 26 శాతం వృద్ధి చెందగా, ఆదాయంలో కీలకమైన ఆర్థిక సేవలు, బీమా విభాగాల ఆదాయం 1.5 శాతం తగ్గింది.
భవిష్యత్తు ఆశావహంగానే..
ఈ క్యూ1లో పటిష్టమైన ఆదాయ వృద్ధిని, మార్జిన్‌లను సాధించామని  సలిల్‌ పరేఖ్‌ చెప్పారు. డిజిటల్‌, కృత్రిమమేధ విభాగాలపై తమ ప్రయత్నాలకు మంచి ఫలితాలు దక్కాయని దీంతో వెల్లడవుతోందని వివరించారు. ఐటీకి భవిష్యత్తు ఆశావహంగానే ఉందని ఆయన పేర్కొన్నారు.  వివిధ ఆర్థిక అంశాల్లో మంచి పనితీరు సాధించామని కంపెనీ ఎమ్‌డీ, సీఎఫ్‌ఓ రంగనాధ్‌ తెలిపారు. రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఈఓ) 25 శాతం దాటేసిందని, ఫ్రెష్‌ క్యాష్‌ ఫ్లోస్‌ 32 శాతం ఎగిశాయని(సీక్వెన్షియల్‌గా) పేర్కొన్నారు. జనవరి-మార్చి క్వార్టర్‌లో రిట‍ర్న్‌ ఆన్‌ ఈక్విటీ 24.1 శాతంగా ఉందని వివరించారు. ఈ క్యూ1 చివరినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.09,905 గా ఉందని తెలిపారు. అంతకు ముందటి క్వార్టర్‌లో 19.5 శాతంగా ఉన్న ఆట్రీషన్‌(ఉద్యోగుల వలస) ఈ క్యూ1లో 23 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. కాగా ఈ వారంలోనే మరో ఐటీ దిగ్గజం టీసీఎస్‌ క్యూ1 ఫలితాలను వెల్లడించిన విషయం తెలిసిందే. టీసీఎస్‌ నికర లాభం 23 శాతం వృద్ధితో రూ.7,340 కోట్లకు, ఆదాయం 16 శాతం వృద్ధితో రూ.34,261 కోట్లకు పెరిగాయి. మార్కెట్‌ ముగిసిన త‍ర్వాత ఇన్ఫోసిస్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలు బాగానే ఉంటాయన్న అంచనాలతో బీఎస్‌ఈలో ఈ షేర్‌ 1.1 శాతం లాభంతో రూ.1,309 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ 3 శాతం లాభంతో రూ.1,331 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. జూన్‌ క్వార్టర్‌లో ఈ షేర్‌ 15 శాతం ఎగసింది. 

బోనస్‌ బొనంజా  
ఒక్కో షేర్‌కు మరొక్క షేర్‌ను బోనస్‌(ఉచితంగా) ఇవ్వడానికి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. అలాగే ఒక్కో అమెరికన్‌ డిపాజిటరీ షేర్‌(ఏడీఎస్‌)కు మరో అమెరికన్‌ డిపాజిటరీ షేర్‌ను స్టాక్‌ డివిడెండ్‌గా ఇవ్వనున్నామని వివరించారు. స్టాక్‌ మార్కెట్లో లిస్టయి పాతికేళ్లు అయిన సందర్భంగా ఈ బోనస్‌ను ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 12 కల్లా బోనస్‌ షేర్లు వాటాదారులకు అందనున్నాయి. రూ.2,600 కోట్ల స్పెషల్‌ డివిడెండ్‌తో సహా వాటాదారులకు మొత్తం రూ.13,000 కోట్లు చెల్లించనున్నామని ఈ కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలిపింది. అధిక రాబడులు ఆశిస్తున్న వాటాదారుల అంచనాలను నెరవేర్చడం తమ లక్ష్యమని, నగదు నిల్వల్లో 70 శాతం వరకూ వాటాదారులకు చెల్లించాలన్న​తమ విధానాన్ని కొనసాగిస్తామని వెల్లడించింది. You may be interested

ఎగుమతులు 18 శాతం అప్‌

Friday 13th July 2018

న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు జూన్‌లో 17.57 శాతం పెరిగి 27.7 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే, అదే సమయంలో అధిక ముడి చమురు రేట్ల కారణంగా దిగుమతుల భారం పెరిగి.. వాణిజ్య లోటు మూడున్నరేళ్ల గరిష్ట స్థాయి 16.6 బిలియన్ డాలర్లకు చేరింది. 2014 నవంబర్ తర్వాత వాణిజ్య లోటు ఈ స్థాయికి ఎగియడం ఇదే తొలిసారి. అప్పట్లో ఇది 16.86 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక గతేడాది జూన్‌లో

ల్యాంకో కేసులో మరో 16 రోజుల గడువు

Friday 13th July 2018

హైదరాబాద్‌: అప్పుల ఊబిలో ఉన్న ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ దివాళా ప్రక్రియలో భాగంగా త్రివేణి నూతన ప్రతిపాదనను పరిశీలించేందుకు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ 16 రోజుల గడువు ఇచ్చింది. తమిళనాడుకు చెందిన త్రివేణి ఎర్త్‌మూవర్స్‌ నూతన పరిష్కార ప్రణాళికను అధ్యయనం చేసేందుకు 270 రోజుల గడువు ఇవ్వాల్సిందిగా మధ్యంతర పరిష్కార నిపుణులు ఎన్‌సీఎల్‌టీని కోరారు. అయితే ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ 16 రోజుల గడువు మాత్రమే ఇచ్చింది. త్రివేణి తాజా ప్రతిపాదనపై

Most from this category