News


భూముల అమ్మకంతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఊపిరి!

Friday 12th July 2019
Markets_main1562914971.png-27009

  • అమ్మదగిన భూముల గుర్తింపు
  • విలువ రూ.20,000 కోట్లుగా అంచనా

న్యూఢిల్లీ: తీవ్ర రుణ భారంతో ఉన్న ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌, దేశవ్యాప్తంగా తన ఆధీనంలో ఉన్న భూముల విక్రయంపై దృష్టి సారించింది. ఈ భూముల విలువ రూ.20,000 కోట్లు ఉంటుందని అంచనా. విక్రయించాల్సిన భూముల జాబితాను పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగానికి (దీపమ్‌) పంపింది. ఏటేటా ఆదాయాలు పడిపోతూ, నష్టాలు పెరిగిపోతున్న క్లిష్ట పరిస్థితుల్లో... భూములు, మొబైల్‌ టవర్లు, ఫైబర్‌ నెట్‌వర్క్‌ విక్రయం ద్వారా వచ్చే నిధులతో సంక్షోభం నుంచి బయటపడాలని సంస్థ భావిస్తోంది. దేశవ్యాప్తంగా 32.77 లక్షల చదరపు మీటర్ల విస్తీరణంలో భవనాలు, ఫ్యాక్టరీలు ఉండగా, 31.97 లక్షల చదరపు మీటర్ల విడి భూమి ఉందని గతంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయం జారీ చేసిన సర్క్యులర్‌ ఆధారంగా తెలుస్తోంది. ఇలా వినియోగంలో లేని భూమి పారదర్శక విలువ 2015 ఏప్రిల్‌ 1 నాటికి రూ.17,397 కోట్లు కాగా, ప్రస్తుత విలువ రూ.20,296 కోట్లుగా ఉంటుందని అంచనా. 2014-15 ద్రవ్యోల్బణ సూచీ వ్యయం ఆధారంగా ఈ విలువకు రావడం జరిగినట్టు బీఎస్‌ఎన్‌ఎల్‌  ఉత్తర్వులు తెలియజేస్తున్నాయి. అమ్మి, సొమ్ము చేసుకోవాలనుకుంటున్న వాటిల్లో ముంబై, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌, ఘజియాబాద్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ టెలికం ఫ్యాక్టరీలు, వైర్‌లెస్‌ స్టేషన్లు, ఇతర కార్యాలయ భవనాలు, ఉద్యోగుల కాలనీలు కూడా ఉన్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.14,000 కోట్ల నస్టాలను ప్రకటించొచ్చని భావిస్తున్నారు. ఆదాయం రూ.19,308 కోట్లుగా ఉండొచ్చని టెలికం మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఇటీవల లోక్‌సభకు ఇచ్చిన సమాధానం ఆధారంగా తెలుస్తోంది. 



You may be interested

విక్రయించినా దేశీ సంస్థల చేతుల్లోనే ఎయిరిండియా

Friday 12th July 2019

న్యూఢిల్లీ: భారీ రుణభారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వాటాల వ్యూహాత్మక విక్రయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి తెలిపారు. అయితే, వాటాలు విక్రయించినప్పటికీ ఎయిరిండియా భారతీయుల చేతుల్లోనే ఉండాలని కేంద్రం భావిస్తోందని ఆయన చెప్పారు. ౾గతంలో ఎయిరిండియా డిజిన్వెస్ట్‌మెంట్‌ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఈ నేపథ్యంలో ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు.

రుణ ప్రణాళికకు బ్యాంకర్లు ఓకే

Friday 12th July 2019

రిలయన్స్ ఇన్‌ఫ్రా వెల్లడి ముంబై: దాదాపు రూ. 7,500 కోట్ల రుణాల పరిష్కార ప్రణాళికకు రుణదాతలు ఆమోదం తెలిపినట్లు అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఇంటర్‌-క్రెడిటార్ ఒప్పందంపై (ఐసీఏ) రుణాలిచ్చిన మొత్తం 16 సంస్థలు సంతకాలు చేసినట్లు పేర్కొంది. ఆర్‌బీఐ కొత్త సర్క్యులర్‌ ప్రకారం రుణగ్రహీత ఏ ఒక్క బ్యాంకుకైనా డిఫాల్ట్ అయిన పక్షంలో 30 రోజుల్లోగా మిగతా రుణదాతలు సదరు ఖాతాను సమీక్షించాల్సి ఉంటుంది.

Most from this category