News


మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లో మెరుగైన రాబడులు

Monday 15th July 2019
personal-finance_main1563172050.png-27069

  • ఎల్‌అండ్‌టీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌

మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ ఇప్పటికే బాగా దిద్దుబాటుకు గురికాగా, అవి ఇంకా నేలచూపులే చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలానికి మెరుగైన రాబడులు ఆర్జించాలనుకునేవారు మిడ్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ను ప్రస్తుత పరిస్థితుల్లో పరిశీలించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విభాగంలో మంచి పనితీరు కలిగిన పథకాల్లో ఎల్‌అండ్‌టీ మిడ్‌క్యాప్‌ కూడా ఒకటి. అయితే, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో రిస్క్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక రిస్క్‌ తీసుకునే సామర్థ్యం ఉన్న వారు, అది కూడా సిప్‌ మార్గంలో ఇన్వెస్ట్‌ చేయడం మంచిది. 

రాబడులు...
ఈ పథకం దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇచ్చినట్టు పనితీరు తెలియజేస్తోంది. ఈ పథకం పనితీరుకు నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100ను ప్రామాణికంగా చూస్తున్నారు. ఏడాది కాలంలో నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100తో పోలిస్తే ఈ పథకం కాస్త వెనుకబడింది. ఈ పథకంలో ఏడాది కాలంలో నష్టాలు 2.9 శాతం స్థాయిలో ఉండగా, నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 ఇదే కాలంలో 1.4 శాతం మేర నష్టపోయింది. ఇక మూడేళ్ల కాలంలో ఎల్‌అండ్‌టీ మిడ్‌క్యాప్‌ పథకం 12 శాతం, ఐదేళ్లలో 14.6 శాతం చొప్పున వార్షిక రాబడులు ఇచ్చింది. ఇదే కాలంలో నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 రాబడులు 9.6 శాతం, 10.6 శాతంగానే ఉన్నాయి. ఇక పదేళ్ల కాలంలో ఈ పథకం వార్షిక రాబడులు 18 శాతంగా ఉన్నాయి. 2004లో ఈ పథకం ఆరంభమైనప్పటి నుంచి చూస్తే వార్షిక రాబడులు 18.65 శాతంగా ఉండడం గమనార్హం.

పెట్టుబడుల విధానం...
పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం, సరైన రంగాల ఎంపిక, వ్యూహాత్మక పెట్టుబడుల కేటాయింపు ఈ పథకం పనితీరుకు కారణాలుగా చెప్పుకోవచ్చు. సెబీ మార్గదర్శకాల ప్రకారం మిడ్‌క్యాప్‌ పథకాలు మొత్తం పెట్టుబడుల్లో కనీసం 65 శాతాన్ని మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌కు కేటాయించాల్సి ఉంటుంది. మిడ్‌క్యాప్‌లో 65 శాతాన్ని ఇన్వెస్ట్‌ చేస్తూనే, మార్కెట్లలో అస్థిరతలు పెరిగిన సమయాల్లో లార్జ్‌క్యాప్‌లో పెట్టుబడులను 15 శాతానికి పెంచుకోవడాన్ని ఈ పథకంలో గమనించొచ్చు. ఇక ఈక్విటీల్లో ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు గాను ఈ పథకం డెట్‌లోనూ కొంత పెట్టుబడులు పెట్టడం లేదా నగదు నిల్వలు పెంచుకోవడం చేస్తుంటుంది. 2015, 2016 మార్కెట్‌ అస్థిరతల సమయంలో ఈ పథకం ఈ‍క్విటీ పెట్టుబడులను 90 శాతం స్థాయిల్లోనే నిర్వహించింది. ఇక 2018 మార్కెట్‌ కరెక్షన్‌లోనూ ఈక్విటీ పెట్టుబడులను 85-93 శాతం మధ్య కొనసాగించడం గమనార్హం. 

ముఖ్యంగా ఏడాది కాలంలో ఈ పథకంలో నష్టాలు, బెంచ్‌ మార్క్‌తో పోలిస్తే కొంచెం ఎక్కువే ఉన్నప్పటికీ... 2018లో మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ బాగా పడిపోయిన సమయంలో మాత్రం బెంచ్‌ మార్క్‌తో పోలిస్తే నష్టాలను తక్కువగా 3 శాతానికే పరిమితం చేసింది. ఇక మార్కెట్‌ ర్యాలీ సమయాల్లోనూ ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో నూరు శాతం పెట్టుబడులు ఈక్విటీల్లోనే ఉండకపోవడం గమనించాల్సిన మరో అంశం. ప్రస్తుతం ఈక్విటీ పెట్టుబడులు 91.4 శాతంగా ఉంటే, నగదు, నగదు సమానాలు 8.6 శాతంగా ఉన్నాయి. పథకం పోర్ట్‌ఫోలియోలో 75 స్టాక్స్‌ వరకు ఉన్నాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, కన్‌స్ట్రక్షన్‌, ఇంజనీరింగ్‌ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది.



You may be interested

నష్టాల్లో మెటల్‌ షేర్లు

Monday 15th July 2019

అతి పెద్ద లోహా దిగుమతిదారైన చైనా జీడీపి వృద్ధి రేటు రెండవ త్రైమాసికంలో 27 ఏళ్ల కంటే తక్కువగా నమోదు కావడంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మెటల్‌ సూచీ సోమవారం ట్రేడింగ్‌లో 1.20 శాతం నష్టపోయి 2,792 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో వేదాంత లి. 2.36 శాతం, టాటా స్టీల్‌ 1.59 శాతం, సెయిల్‌ 1.59 శాతం, మొయిల్‌ లి. 1.45 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 1.19 శాతం,

క్రెడిట్‌ రిస్క్‌ నిర్వహణ చాలా ముఖ్యం

Monday 15th July 2019

డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్‌ అన్నది ఓ విభాగం. తక్కువ రేటింగ్‌ ఉన్న డెట్‌ సాధనాల్లో ఈ పథకం ప్రధానంగా ఇన్వె‍స్ట్‌ చేస్తుంది. సెబీ మార్గదర్శకాల ప్రకారం... క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌ ప్రధానంగా 65 శాతం పెట్టుబడులను ఏఏ అంతకంటే తక్కువ రేటింగ్‌ ఉన్న పేపర్లలో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. అధిక రిస్క్‌ తీసుకునే సామర్థ్యం ఉన్న వారు, వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా రెండంకెల రాబడులు

Most from this category