News


మందగమనంలో మీ ఆర్థిక ప్రణాళిక ఇలా..!

Monday 9th September 2019
personal-finance_main1568006561.png-28266

  • పెట్టుబడులు కొనసాగాలి...
  • వీలైతే అదనపు పెట్టుబడులు
  • పెట్టుబడుల్లో వైవిధ్యం అవసరం
  • ప్రాపర్టీ కొనుగోళ్లకు తొందరెందుకు?
  • అత్యవసర నిధి ఏర్పాటుచేసుకోవాలి
  • అనవసర ఖర్చులకు కళ్లెం
  • అవసరమైనా, ఖరీదైనవి వాయిదా
  • కుటంబానికి వైద్య బీమా
  • రుణ చెల్లింపులు ఆపొద్దు

దేశ ఆర్థిక వృద్ధి నేల చూపులు చూస్తోంది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో జీడీపీ వృద్ధి 5 శాతానికి తగ్గింది. ఇది ఆరేళ్లలోనే కనిష్ట వృద్ధి. ఆటోమొబైల్‌ సహా పలు రంగాల్లో ఉద్యోగాలకు కోత పడుతోంది. డిమాండ్‌ పడిపోవడం, మార్కెట్లో నిధుల లభ్యత తగ్గిపోవడం వంటి పరిస్థితులు స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. స్టాక్స్‌ పతనంతో ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ కూడా కరిగిపోతోంది. ఇవన్నీ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసేవే. ఇటువంటి ‍ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థిక ప్రణాళికను మార్చుకోవాల్సివుంటుంది. అప్పుడే నిర్భయంగా ఉండగలరు. ఇటువంటి మందగమన సమయాల్లో ఇన్వెస్టర్లు తమ ఆర్థిక ప్రణాళికల విషయమై తీసుకోవాల్సిన రక్షణ చర్యల గురించి ఈ వారం ప్రాఫిట్‌ ఫ్లస్‌ కథనంలో తెలుసుకుందాం...

సిప్‌లు ఆపొద్దు..
మార్కెట్లు పడిపోతున్న సమయాల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ లేక ఈక్విటీల్లో సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) పెట్టుబడులను ఆపడం అతిపెద్ద తప్పిదమే అవుతుంది. ఇలా ఆపడం అసలు సిప్‌ ఉద్దేశ్యాన్ని, సిప్‌ లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే సిస్టమ్యాటిక్‌ (క్రమం తప్పకుండా)గా పెట్టుబడులు పెట్టడమే సిప్‌. మార్కెట్లు పెరిగిన సమయాల్లో, మార్కెట్లు పడిపోతున్న సమయాల్లోనూ పెట్టుబడులు కొనసాగాలి. కేవలం మార్కెట్లు ర్యాలీ చేస్తున్న సమయాల్లో సిప్‌ పెట్టుబడులు కొనసాగించి, పడిపోతున్న సమయాల్లో సిప్‌ ఆపేయడం వల్ల రాబడులు దారుణంగా ఉంటాయి. ఎందుకంటే మార్కెట్లు కరెక్షన్‌లో వున్నపుడు ఫండ్స్‌ యూనిట్ల విలువ తగ్గుతుంది. దాంతో ఆ సమయంలో సిప్‌తో తక్కువ ధరలో ఎక్కువ యూనిట్లు వస్తాయి. తర్వాత ర్యాలీలో వీటిపై అధిక రాబడులు వస్తాయి. కానీ, మార్కెట్‌ పతనాల్లో సిప్‌లు ఆపితే, సగటు కొనుగోలు ధరను తగ్గించే అవకాశాన్ని కోల్పోయినట్లవుతుంది. ఇక మార్కెట్ల పతనాల్లో సిప్‌కు అదనంగా పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ రాబడులు సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. చారిత్రక గణాంకాలను పరిశీలిస్తే ఇదే తెలుస్తుంది. కనుక ఈ అవకాశాన్ని మిస్‌ చేసుకోవద్దు.

అస్థిరతలు తక్కువగా...
మార్కెట్లు క్షీణ దశలో ఉన్నప్పుడు హైబ్రిడ్‌ ఫండ్స్‌ అన్నవి డౌన్‌ సైడ్‌ రిస్క్‌ను తగ్గించేందుకు బాగా ఉపకరిస్తాయి. రాబడుల పరంగా అస్థిరతలను పరిమితం చేసే విధంగా ఈ పథకాలు పనిచేస్తుంటాయి. డైనమిక్‌ అస్సెట్‌ అలోకేషన్‌ లేదా బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్స్‌ అన్నవి డెట్‌, ఈక్విటీలోనూ ఇన్వెస్ట్‌ చేస్తాయి. పైగా అటు ఈక్విటీలు, ఇటు డెట్‌లోనూ మార్కెట్‌ పరిస్థితులు, విలువలకు అనుగుణంగా పెట్టుబడులను సున్నా నుంచి నూరు శాతం వరకు మార్చుకునే స్చేచ్ఛతో ఉంటాయి.పెట్టుబడుల విలువ భారీగా క్షీణించడాన్ని నివారించేందుకు, ఈక్విటీ డెరివేటివ్స్‌లోనూ  బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్స్‌ ఆర్బిట్రేజ్‌ చేస్తుంటాయి. ఇక మల్టీ అస్సెట్‌ ఫండ్స్‌ను కూడా ఇన్వెస్టర్లు ప్రతికూల పరిస్థితుల్లో పరిశీలించాల్సినవి. ఎందుకంటే ఇవి కేవలం ఈక్విటీల్లోనే కాకుండా, బంగారం, డెట్‌, రీట్‌, ఇన్విట్‌ వంటి సాధనాల్లోనూ ఇన్వెస్ట్‌ చేస్తాయి. దీంతో ప్రతికూల సమయాల్లో ఈక్విటీ పెట్టుబడుల రిస్క్‌ పరిమితంగా ఉంటుంది. మొత్తం పెట్టుబడుల్లో 65 శాతానికి మించి ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయవు. సాధారణంగా మాంద్యం సమయాల్లో సురక్షిత సాధనమైన బంగారంపై పెట్టుబడులు పెరుగుతుంటాయి. అందుకే బంగారం ధరల ర్యాలీని ప్రస్తుతం చూస్తున్నాం. మల్టీ అస్సెట్‌ ఫండ్స్‌ బంగారంలోనూ ఇన్వెస్ట్‌ చేయడం కలిసొస్తుంది. ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌ కూడా ఉన్నాయి. ఇవి షేర్లతోపాటు, డెరివేటివ్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఈ రెండింటిలోనూ కనీసం 65 శాతం పెట్టుబడులు పెడుతుంటాయి. మిగిలిన 35 శాతం వరకు పెట్టుబడులను డెట్‌ విభాగానికి కేటాయిస్తాయి. అంటే స్థిరాదాయాన్నిచ్చే సాధనాల్లో పెట్టుబడులు పెడతాయి. ఈక్విటీల్లో ఎక్స్‌పోజర్‌ను తగ్గించడం వల్ల అస్థిరతలు తగ్గుతాయి. ఇక రెగ్యులర్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌లో కన్జర్వేటివ్‌ (ఈక్విటీల్లో 25 శాతం వరకు), బ్యాలన్స్‌డ్‌ (ఈక్విటీలు, డెట్‌ సరిసమానంగా), అగ్రెస్సివ్‌ (ఈక్విటీల్లో 65-75 శాతం వరకు) అని మూడు రకాలు ఉంటాయి. ఇన్వెస్టర్లు తమ రిస్క్‌ స్థాయి ఆధారంగా వీటిల్లో ఒక రకాన్ని ఎంచుకోవచ్చు. నిపుణులు సాధారణంగా ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌, బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్స్‌ను ఈ విభాగంలో సూచిస్తుంటారు. 

ఆస్తుల కొనుగోలుకు తొందరెందుకు..?
ఆర్థిక సంక్షోభ సమయాల్లో బిల్డర్లు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు మంచి ఆఫర్లతో కొనుగోలుదారులను ఊరించే కార్యక్రమాలు చేస్తుంటాయి. గతేడాది దేశంలోని పట్టణాల్లో హౌసింగ్‌ మార్కెట్‌ పనితీరు ఏమంత ఆశాజనకంగా లేదు. ప్రధాన పట్టణాల్లో నివాసిత గృహాల ధరలు పడిపోవడం లేదా నామమాత్రంగా పెరగడం జరిగింది. మరికొన్ని త్రైమాసికాల పాటు ఈ పరిస్థితి మారకపోవచ్చన్నది నిపుణుల అంచనా. పరిస్థితి ఇదే మాదిరిగా ఉంటే, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో నిర్మాణం పూర్తయిన యూనిట్లు అమ్ముడుపోవడానికి ఎంతలేదన్నా మూడేళ్లు సమయం పడుతుందని నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక చెబుతోంది. ముంబై, బెంగళూరులో మిగిలిపోయిన యూనిట్లు అమ్ముడవడానికి రెండేళ్లు తీసుకుంటుందట. కనుక ప్రాపర్టీపై ఇన్వెస్ట్‌ చేయదలిచిన వారు కొంత సమయం పాటు వేచి చూడొచ్చంటున్నారు. తక్షణం ఉండడానికి అయితే కొనుగోలు చేసుకోవచ్చని, పెట్టుబడుల కోసం అయితే ఆగొచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే వేచి చూడడం వల్ల మంచి అవకాశాలు లభిస్తాయంటున్నారు. ఉదాహరణకు వచ్చే కొన్నేళ్ల పాటు ఏటా 5 శాతం పెట్టుబడుల వృద్ధిని చూపించే ప్రాపర్టీ కోసం రుణం తీసుకుంటే దానిపై మీరు 8-9 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. 

పెట్టుబడుల వైవిధ్యం...
పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే విభాగంలో ఇన్వెస్ట్‌ చేయడం అన్నది ఎప్పుడూ సరికాదు. రిస్క్‌ తగ్గించుకోవాలంటే పెట్టుబడులను భిన్న సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయాలి. అనిశ్చిత సమయాల్లో ఇన్వెస్టర్లు బంగారాన్ని ఆశ్రయిస్తుంటారు. ఇటీవల బంగారం ధరలు పెరగడాన్ని చూస్తూనే ఉన్నాం. అందుకే ఇన్వెస్టర్లు తమ మొత్తం పెట్టుబడుల్లో 10-15 శాతం వరకు బంగారంపై ఇన్వెస్ట్‌ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. అయితే, పెట్టుబడుల కోసం భౌతిక బంగారం కొనడానికి దూరంగా ఉండాలి. సౌర్వభౌమ బంగారం బాండ్లు లేదా బంగారం ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయడం అనుకూలం. ఎందుకంటే భద్రతతోపాటు అవసరమైనప్పుడు మార్కెట్‌ ధరకు విక్రయించి నగదుగా మార్చుకోవడం వీటిల్లో సులభం. ఇక పెట్టుబడుల్లో వైవిధ్యం కోసం విదేశీ ఈక్విటీల్లోనూ ఇన్వెస్ట్‌ చేసుకోవడం మరో మార్గం. ముఖ్యంగా అమెరికా స్టాక్స్‌. అమెరికా ఈ‍క్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసే ఫండ్స్‌ పథకాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల భౌగోళికంగా పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా చూసుకోవచ్చు. అంతర్గత అంశాలతో మన మార్కెట్లు పడిపోతే, అదే సమయంలో యూఎస్‌ మార్కెట్లు రాణించే అవకాశం లేకపోలేదు కదా.? ఇక కరెన్సీ పరంగా వైవిధ్యం కూడా ఈ పెట్టుబడుల రూపంలో కలిసొస్తుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోతున్న సంగతి తెలిసిందే. దీర్ఘకాలంలోనూ ఇదే కొనసాగుతుందని అంచనా. దీనివల్ల అమెరికా ఈక్విటీల్లో పెట్టుబడులపై అదనపు రాబడులు అందుకునేందుకు వీలుంటుంది. 

అత్యవసర నిధిని మరవద్దు...
ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితుల్లో ఆదుకునేందుకు అత్యవసర నిధి చాలా కీలకమే అవుతుంది. వైద్య ఖర్చులు లేదా ఆర్థిక అత్యవసర పరిస్థితుల కోసం సన్నద్ధం కావడం అన్నది ఆర్థిక ప్రణాళికలో మొదటి మెట్టుగా ఉండాలి. సంక్షోభ సమయాల్లో ఈ తరహా ఫండ్‌ అనివార్యమవుతుంది. కనీసం ఆరు నెలలకు అన్ని అవసరాలకు సరిపడా అత్యవసర నిధి ఉంచుకోవాలన్నది సాధారణంగా సూచించే సూత్రం. కొంత మంది నిపుణులు అయితే 9-12 నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధి ఉండాలంటారు. మీ ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులు, రుణ చెల్లింపులు అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఎంత మొత్తం అన్నది నిర్ణయం అవుతుంది. కుటుంబమంతటికీ ఒక్కరే ఆధారం అయితే కనీసం 9-12 నెలల అవసరాలకు సరిపడే విధంగా ఉండాలి. స్కూలు ఫీజులు, గ్రోసరీ, ఔషధాలు, యుటిలిటీ బిల్లుల కోసం అదనంగా పక్కన పెట్టుకోవాలి. ఈ అత్యవసర నిధిని లిక్విడ్‌ ఫండ్స్‌లో ఉంచుకోవడం మంచిది. అవసరమైనప్పుడు వెంటనే వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, మూడు నెలల అవసరాలకు సరిపడే మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకుని.. మిగిలినది దీర్ఘకాలిక డెట్‌ సాధనాల్లోనూ ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. దీనివల్ల అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. 

ఖర్చులకు కళ్లెం...
ఆర్థిక మందగమనం, సంక్షోభ సమయాల్లో మీ ఖర్చులను తప్పకుండా ఓ సారి సమీక్షించుకోవాల్సిందే. విచ్చలవిడి ఖర్చులను తగ్గించుకోవాలి. విలాస వస్తువుల కోనుగోళ్లను వాయిదా వేసుకోవాలి. రెస్టారెంట్లకు వెళ్లి చేసే భారీ ఖర్చులను కూడా తగ్గించుకోవాలి. కారు, ఇల్లు, హాలీడే ట్రిప్‌లను సైతం కొంత కాలం పాటు వాయిదా వేసుకోవడం మంచిదే. భవిష్యత్తులో వచ్చే ఆదాయంపై నమ్మకంతో రుణాలు తీసుకుని ఖర్చు చేయడం సరికాదు. వార్షిక బోనస్‌లు, వేతన పెంపులయినా సరే, పెరగక ముందు అంచనాలతో ఖర్చులను పెంచుకోవద్దు. త్వరలో బోనస్‌ వస్తుందని క్రెడిట్‌ కార్డుతో పెద్ద బిల్లే చేశారనుకోండి... ఆ తర్వాత ఉద్యోగం కోల్పోతే పరిస్థితి ఏంటి? బోనస్‌ను నిలిపివేస్తే ఏమవుతుంది?.. నిలకడైన, ఉద్యోగ రక్షణ ఉన్నవారు అయితే తమకు వస్తున్న ఆదాయం పరిధిలోనే ఖర్చులు ఉండేలా జాగ్రత్తపడడం అవసరం. 

కుటుంబానికి వైద్య బీమా
ఖర్చులను తగ్గించుకునేందుకని వైద్య బీమా తీసుకోకపోవడం పెద్ద తప్పిదమే అవుతుంది. ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో మీ కుటుంబానికి వైద్య బీమా రక్షణ ఉండడం కచ్చితంగా అవసరం. మీరు పనిచేసే చోట గ్రూపు హెల్త్‌ పాలసీ ఉన్నప్పటికీ విడిగా ఒక ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఉద్యోగం చేసే చోట ఇచ్చే గ్రూపు హెల్త్‌ పాలసీలు ఆ సంస్థలో పనిచేస్తున్నంత వరకే. ఉన్నట్టుండి ఉద్యోగం నష్టపోతే మీరు తీసుకున్న బీమా పాలసీ ఆదుకుంటుంది. కుటుంబానికి కనీసం రూ.5 లక్షల కవరేజీ అయినా ఉండాలి. 40 ఏళ్ల వయసున్న వ్యక్తి, అతని జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలకు వార్షిక బీమా ప్రీమియం సుమారుగా రూ.15,000 వరకు ఉంటుంది. ఇంతకంటే తక్కువకు, ఎక్కువకు ఆఫర్‌ చేసే కంపెనీలు కూడా ఉన్నాయి.  

రుణాలు తీసుకుంటే...
రుణాలు తీసుకుని ఉన్న వారికి సంక్షోభ సమయాలు పరీక్ష వంటివి. కార్పొరేట్‌ సంస్థల మాదిరిగా వ్యక్తులు తమ రుణాలను రీ షెడ్యూల్‌ చేసుకోవడం అంత సులభం కాదు. కారు రుణం, ఇంటి రుణం విషయంలో సకాలంలో ఈఎంఐలు చెల్లించకపోతే బ్యాంకులు తొందరపడి వాటిని విక్రయించవు. కనుక బ్యాంకులను సంప్రదించి వాస్తవిక కారణాలు తెలియజేసి, రీషెడ్యూల్‌ చేయాలని కోరడం తప్పేమీ కాదు. రుణ కాల వ్యవధిని పొడిగిస్తే వడ్డీ భారం అధికమవుతుందని మర్చిపోవద్దు. అయితే, రుణాలకు చెల్లింపులు చేయకుండా, బ్యాంకు నుంచి కాల్స్‌ వస్తే స్పందించకుండా ఉండడం చేయవద్దు. అది మీ క్రెడిట్‌ స్కోరును దెబ్బతీస్తుంది.

తొందరొద్దు...
ఆర్థిక మందగమనం వంటి పరిస్థితుల్లో ఉద్యోగం మారే విషయమై కాస్త ఆచితూచి వ్యవహరించాలి. ఆవేశంతో ఉద్యోగం మానేయడం, సంస్థను మార్చేయడం నష్టానికి దారి తీయవచ్చు. ఎందుకంటే ఎన్నో స్టార్టప్‌లు, కొత్త కంపెనీలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. కనుక ఉద్యోగం మారాలనుకుంటే ముందే తగినంత అధ్యయనం చేయాలి. నూతన సంస్థ ఆర్థికంగా బలమైనదా, కాదా అని తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. You may be interested

వడ్డీరేట్ల కోత అంచనాలతో పెరిగిన పసిడి

Monday 9th September 2019

వడ్డీరేట్ల కోత అంచనాలు పెరగడంతో సోమవారం పసిడి ధర లాభాల బాట పట్టింది. ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు పెరిగి 1,520 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా ఎగుమతుల తిరోగమనం కారణంగా ఆగస్టులో చైనా ఎగుమతులు పడిపోయాయి. యూరోజోన్‌ బ్రిగ్జిట్‌ సంక్షోభం కొనసాగుతుండటం, అమెరికాలో ఉద్యోగ వృద్ధి ఆగస్టులో ఊహించిన దానికంటే మందగించింది. చైనాతో వాణిజ్య వివాదాలు పరిష్కరించడానికి కొన్ని ఏళ్లు పట్టవచ్చని వైట్ హౌస్ ఆర్థిక సలహాదారు

జీవీకేకు వ్యతిరేకంగా బోంబే హైకోర్టులో అదానీ పిటిషన్‌

Monday 9th September 2019

ముంబై: జీవీకే గ్రూపు నిర్వహణలోని ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (ఎంఐఏఎల్‌)కు వ్యతిరేకంగా అదానీ గ్రూపు బోంబై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఎంఐఏఎల్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన బిడ్‌వెస్ట్‌కు 13.5 శాతం వాటా ఉంది. ఈ వాటాను అదానీ గ్రూపునకు చెందిన మారిషస్‌ కంపెనీకి విక్రయించేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ డీల్‌ విలువ రూ.1,248 కోట్లు. దీన్ని అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని అదానీ గ్రూపు తన పిటిషన్‌లో

Most from this category