News


విశ్రాంత జీవనానికి సోపానం

Monday 18th March 2019
personal-finance_main1552891707.png-24659

భారీ నిధి సమకూర్చుకోవాలి
ఉద్యోగం ఆరంభం నుంచే ఇందుకు ప్రణాళిక
ఎంచుకున్న సాధనాల్లో క్రమం తప్పకుండా పెట్టుబడులు
దాంతో భవిష్యత్తు అవసరాలకు తగినంత భద్రత
అందుబాటులో మ్యూచువల్‌ ఫండ్స్‌, ఈక్విటీ పెన్షన్‌ ఫండ్స్‌
యూనిట్‌ లింక్డ్‌ పెన్షన్‌ప్లాన్లు, పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌
ఒక్కో సాధనంలో భిన్న ప్రయోజనాలు

వేతన జీవులు అందరూ తాము రిటైర్మెంట్‌ తీసుకున్న తర్వాత నిశ్చింతగా జీవించేందుకు ముందుగానే ప్రణాళిక బద్ధంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఈ విషయమై ఇటీవలి సంవత్సరాల్లో అవగాహన విస్తృతం అవుతోంది. దీంతో రిటైర్మెంట్‌ సమయంలో అక్కరకు వచ్చే సాధనాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. అయితే, విశ్రాంత జీవితానికి క్రమం తప్పని పెట్టుబడులు ఎంతో కీలకం. ఇందుకోసం పాగా ప్రాచుర్యంలో ఉన్న సాధనాల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌, యూనిట్‌ లింక్డ్‌ పెన్షన్‌ ప్లాన్లు, నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌, ఈపీఎఫ్‌, పీపీఎఫ్‌, వీపీఎఫ్‌ ఉన్నాయి.  వీటిలోని లాభ, నష్టాలు తెలుసుకున్న తర్వాత తమ రిస్క్‌ ప్రొఫైల్‌కు అనుగుణంగా భిన్న సాధనాల మధ్య ఎంత పెట్టుబడుల కేటాయించాల్ని మొత్తాలపై ప్రణాళిక వేసుకోవాలి. ఆ తర్వాత క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేయడంతోపాటు, నిర్ణీత కాలానికి ఆ పెట్టుబడుల మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. ఇందుకు సంబంధించిన పెట్టుబడి సాధనాల వివరాలను తెలియజేసే కథనమే ఇది.

మ్యూచువల్‌ ఫండ్స్‌, రిటైర్మెంట్‌ పథకాలు
రిటైర్మెంట్‌ జీవనానికి నిధి సమకూర్చుకునేందుకు మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారికి డైవర్సిఫైడ్‌ ఈక్విటీ పథకాలు సరైన ఎంపిక అవుతుంది. లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, మల్టీక్యాప్‌, స్మాల్‌క్యాప్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఇలా ఎన్నో రకాల పథకాలు ఉన్నాయి. గడిచిన పదేళ్ల కాలంలో మార్కెట్లలో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నప్పటికీ ఈ విభాగాల్లోని పథకాలు వార్షికంగా 16-21 శాతం మధ్య రాబడులను ఇచ్చాయి. ఇదే కాలంలో సెన్సెక్స్‌ టీఆర్‌ఐ (టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌) రాబడులు 17.8 శాతంగా ఉన్నాయి. 25 ఏళ్ల కాలంలో చూసుకుంటే సెన్సెక్స్‌ వార్షిక రాబడులు 11 శాతంగా ఉన్నాయి. ఇదే కాలంలో టాప్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ వార్షికంగా 19 శాతం ప్రతిఫలాన్ని ఇచ్చాయి. కాకపోతే సెబీ ఇటీవలి కాలంలో పథకాల పునర్వ్యస్థీకరణకు చేసిన మార్పులు, గత ఏడాది కాలంలో మార్కెట్ల పనితీరు నత్తనడకనే ఉండడం వంటి అంశాలతో లార్జ్‌క్యాప్‌ పథకాల పనితీరు బెంచ్‌మార్క్‌కు అనుగుణంగా లేదు. కనుక మిడ్‌, స్మాల్‌క్యాప్‌ విభాగంలో యాక్టివ్‌ పథకాలు దీర్ఘకాలంలో మంచి పనితీరు చూపించగలవు. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లడం, నిర్ణీత కాలానికోసారి పోర్ట్‌ఫోలియో రీబ్యాలన్స్‌ చేసుకోవడం, పనితీరు ఆశించిన మేర లేని పథకాల నుంచి వైదొలగి, వాటి స్థానంలో వేరే వాటిని ఎంచుకోవడం చేస్తుండాలి. నిర్ణీత లక్ష్యానికి సమయం దగ్గర పడుతుంటే ఈక్విటీల నుంచి వైదొలిగి సురక్షిత సాధనాల్లోకి పెట్టుబడులు మళ్లించుకోవాలి. ఇందుకోసం అధిక నాణ్యత కలిగిన డెట్‌ ఫండ్స్‌, బ్యాంకు ఎఫ్‌డీలు పనికొస్తాయి. 
సాధారణ ఈక్విటీ పథకాలకు అదనంగా ప్రత్యేకించి రిటైర్మెంట్‌ అవసరాల కోసం రిటైర్మెంట్‌ ప్లాన్లు ఉన్నాయి. ఫ్రాంక్లిన్‌ ఇండియా పెన్షన్‌, యూటీఐ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ పెన్షన్‌ ఈ విభాగంలోనివే. వీటిల్లో పెట్టుబడులకు సెక్షన్‌ 80సీ కింద ఆదాయపన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. ఇక టాటా, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ కూడా పథకాలను ప్రవేశపెట్టాయి. ఇందులో టాటా రిటైర్మెంట్‌ పథకానికి మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. ప్రొగ్రెసివ్‌, మోడరేట్‌ పేరుతో నడిచే రెండు ఈక్విటీ పథకాల్లోనూ ఐదేళ్ల కాలంలో రాబడులు 18 శాతం స్థాయిలో ఉన్నాయి. బెంచ్‌మార్క్‌ కంటే ఈ పథకం ఎక్కవే రాబడులు తెచ్చిపెట్టింది. యూటీఐ రిటైర్మెంట్‌, ఫ్రాంక్లిన్‌ పెన్షన్‌ అన్నవి డెట్‌తో కూడిన బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌. డెట్‌కు, ఈక్విటీలకు 40:60 నిష్పత్తిలో పెట్టుబడులను కేటాయిస్తాయి. ఈ రెండు పథకాలు గత ఐదేళ్ల కాలంలో వార్షికంగా 10-11 శాతం రాబడులను ఇచ్చాయి. ఈ పథకాలన్నీ కూడా నెలవారీగా తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో వివరాలను ఇన్వెస్టర్లకు వెల్లడిస్తుంటాయి. ఇండెక్స్‌ ఫండ్స్‌ 1-1.5 శాతం స్థాయిలో చార్జ్‌ చేస్తుంటే, ఈటీఎఫ్‌ల్లో ఎక్స్‌పెన్స్‌ రేషియో 0.5 శాతంగా ఉంటోంది. యాక్టివ్‌గా నడిచే ఈక్విటీ ఫండ్స్‌ మాత్రం 1.6-2.7 శాతం మధ్య చార్జీలను రాబడుతున్నాయి. రిటైర్మెంట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఎక్స్‌పెన్స్‌ రేషియో 2.3-2.8 శాతం మధ్య ఉంది. ఇక డైరెక్ట్‌ ప్లాన్ల ద్వారా ఇన్వెస్ట్‌ చేసుకుంటే అర శాతం వరకు ఎక్స్‌పెన్స్‌ రేషియో భారం తగ్గుతుంది. 

పన్ను వివరాలు
ఫ్రాంక్లిన్‌ ఇండియా పెన్షన్‌, యూటీఐ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ పెన్షన్‌ ప్లాన్లు రెండింటిలోనూ పెట్టుబడులకు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఈ ఫండ్స్‌లో తొలుత పెట్టుబడి చేసేటప్పుడు మినహాయింపు లభిస్తుంది కానీ...వాటిపై వచ్చే రాబడులపై పన్ను వుంటుంది.  ఈ రెండూ డెట్‌తో కూడిన హైబ్రిడ్‌ ఫండ్స్‌. మూడేళ్లకు మించి పెట్టుబడులు కొనసాగిస్తే రాబడులపై 20 శాతం పన్ను రేటు చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే ఈ రాబడులకు ఇండెక్సేషన్‌ (ద్రవ్యోల్బణం మినహాయింపు) ప్రయోజనం ఉంటుంది. మూడేళ్లలోపు వైదొలిగితే ఆ మొత్తాన్ని వార్షిక ఆదాయానికి కలిపి చూపించుకోవాలి. అదే ఈక్విటీ పథకాలు అయితే ఏడాది దాటిన తర్వాత రాబడులపై 10 శాతం క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ ఉంటుంది. ఏడాదిలోపు అయితే 15 శాతం పన్ను పడుతుంది. రిటైర్మెంట్‌ తర్వాత సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ ఎంచుకోవడం ద్వారా ‍ప్రతీ నెలా తమ అవసరాలకు సరిపడా వెనక్కి తీసుకోవచ్చు. దీంతో పన్ను భారం అంతగా ఉండదు. 

నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) 
విశ్రాంత జీవనానికి అందుబాటులో ఉన్న పెట్టుబడి సాధనాల్లో అత్యంత ముఖ్యమైనది ఎన్‌పీఎస్‌. ఈక్విటీ, ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్‌ బాండ్ల సమతూకంతో పలు రకాల పెట్టుబడి ఆప్షన్లు ఎన్‌పీఎస్‌లో ఉన్నాయి. ఎనిమిది ఫండ్‌ మేనేజర్లలో ఇన్వెస్టర్లు తమకు నచ్చిన సంస్థను ఎంచుకోవచ్చు. వీటిల్లో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, యూటీఐ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, కోటక్‌ మెరుగ్గా ఉన్నాయి. బిర్లా సన్‌లైఫ్‌ మినహా మిగిలిన ఫండ్‌ సంస్థలు ఎన్‌పీఎస్‌లు ఏ మేరకు రాబడులను ఇచ్చాయన్నదానిపై ఐదేళ్ల ట్రాక్‌ రికార్డు అందుబాటులో ఉంది. ఆ వివరాలను పరిశీలించి అనువైన దానిని ఎంచుకోవచ్చు. వార్షికంగా కనీసం రూ.1,000ను ఇన్వెస్ట్‌ చేయాలి. గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. ఈక్విటీలకు గరిష్టంగా 75 శాతాన్నే యాక్టివ్‌ చాయిస్‌ కింద ఎంచుకోవచ్చు. మిగిలిన 25 శాతాన్ని తప్పనిసరిగా కార్పొరేట్‌ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలకు కేటాయించుకోవాల్సి ఉంటుంది. 50 ఏళ్ల వయసు దాటితే యాక్టివ్‌ చాయిస్‌ చందాదారులు ఈక్విటీలకు కేటాయింపులను క్రమంగా 50 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుంది. అదే ఆటో చాయిస్‌లో అయితే ఎన్‌పీఎస్‌ చందాదారుని వయసు ఆధారంగా ఈక్విటీలకు పెట్టుబడుల రేషియో మారుతూ ఉంటుంది. ఉదాహరణకు 40 ఏళ్ల వ్యక్తి అయితే, 100 సంవత్సరాల కాలంలో 40 ఏళ్లను తీసివేయగా, మిగులు 60 శాతం ఉంటుంది కనుక ఈ విధానం ప్రాతిపదికన ఆటో చాయిస్‌లో ఈక్విటీలకు 60 శాతం డెట్‌సాధనాలకు 40 శాతం ఫండ్‌ మేనేజర్లే కేటాయింపులు చేస్తారు. ఈక్విటీల్లోనూ ఇండెక్స్‌ ఫండ్స్‌, సెన్సెక్స్‌, నిఫ్టీ 50, నిఫ్టీ 100 స్టాక్స్‌లోనే ఫండ్స్‌ సంస్థలు ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరి. గడిచిన ఐదేళ్ల కాలంలో ఈక్విటీతో కూడిన పెట్టుబడి ఆప్షన్‌ కింద ఫండ్స్‌ మేనేజింగ్‌ సంస్థలు వార్షికంగా 11-13 శాతం మధ్య రాబడులను ఇచ్చాయి. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, కోటక్‌, యూటీఐ 12 శాతానికి పైబడి రాబడులను ఇచ్చాయి. గిల్ట్‌ విభాగంలో పెట్టుబడులపై ఇవి గత ఐదేళ్ల కాలంలో వార్షికంగా 10-11 శాతం మేర రాబడులు తెచ్చి పెట్టాయి. కార్పొరేట్‌ బాండ్స్‌ విభాగంలో రాబడులు 9-10 శాతం మధ్య ఉన్నాయి. 

 పాక్షిక ఉపసంహరణలకు అనుమతి
కొన్ని రకాల ఆనారోగ్యాలతో ఆస్పత్రి పాలైతే, పిల్లల విద్యావసరాలు, ఇంటి ఒకనుగోలు సమయాల్లో పాక్షిక ఉపసంహరణలకు ఎన్‌పీఎస్‌ పథకంలో అనుమతి ఉంది. ఎన్‌పీఎస్‌ ఫండ్‌ మేనేజర్లు నెలవారీగా, కొన్ని సందర్భాల్లో అర్ధ సంవత్సరానికోసారి పోర్ట్‌ఫోలియో వివరాలను వెల్లడిస్తుంటాయి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ ఎన్‌పీఎస్‌ను ప్రారంభించుకోవచ్చు. ఖాతా ప్రారంభ చార్జీ కింద రూ. 40 చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక నిర్వహణ ఫీజు కింద ఎన్‌ఎస్‌డీఎల్‌కు రూ. 95 చెల్లించాలి. వీటికి అదనంగా ప్రతీ లావాదేవీపై రూ.3.75 చార్జీ ఉంటుంది. కార్వీ సంస్థ తక్కువ చార్జీలను వసూలు చేస్తోంది. ఇంకా పాయింట్‌ ఆప్‌ ప్రెజెన్స్‌ (డిస్ట్రిబ్యూటర్‌కు చెల్లించేది) చార్జీ పేరుతో ప్రారంభంలో రూ.200 చార్జీ చెల్లించుకోవాలి. అంతేకాదు, ఇక ఆ తర్వాత చేసే అన్ని పెట్టుబడులపై 0.25 శాతం కమీషన్‌ కూడా డిస్ట్రిబ్యూటర్‌కు వెళుతుంది. ఈఎన్‌పీఎస్‌ ద్వారా పెట్టుబడి పెడితే అప్పుడు పాయింట్‌ ఆఫ్‌ ప్రెజెన్స్‌కు కేవలం 0.1 శాతమే కమీషన్‌ వెళుతుంది. కనుక ఆన్‌లైన్‌లో నేరుగా ఎన్‌పీఎస్‌ సైట్‌ ద్వారా చందాలు చేసుకోవడం ద్వారా ఆదా చేసుకోవచ్చు. అలాగే, ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఫీజు కూడా వార్షికంగా 0.01 శాతమే పడుతుంది. ఆదాయపన్ను ప్రయోజనాలు ఎన్‌పీఎస్‌కు అదనంగా ఉన్నాయి. సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల పెట్టుబడుల తర్వాత కూడా మరో రూ.50,000 మొత్తంపై పన్ను మినహాయింపును సెక్షన్‌ 80సీసీడీ కింద ఎన్‌పీఎస్‌లో పెట్టుబడుల ద్వారా పొందే అవకాశం ఉంది. ఎన్‌పీఎస్‌లో రూ.2 లక్షలు ఇన్వెస్ట్‌ చేసినా మొత్తం సెక్షన్‌ 80సీ, సీసీడీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. 60 ఏళ్ల తర్వాత మొత్తం నిధిలో 60 శాతాన్ని పన్ను లేకుండా వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన 40 శాతాన్ని పెన్షన్‌ యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి. 

యూనిట్‌లింక్డ్‌ ప్లాన్లు
ఈక్విటీ ఆధారిత పెన్షన్‌ ప్లాన్లు కూడా ఉన్నాయి. వీటిని బీమా సంస్థలు ఆఫర్‌ చేస్తుంటాయి. బజాజ్‌ అలియాంజ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, ఎస్‌బీఐ లైఫ్‌ పెన్షన్లను ప్లాన్లను అందిస్తున్నాయి. బీమా సంస్థలు తాము నిర్వహించే ఈక్విటీ, డెట్‌ లేదా హైబ్రిడ్‌ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. రాబడులకు హామీ ఉండదు. మార్కెట్‌ పనితీరు ఆధారంగానే ఉంటాయి. గడిచిన మూడేళ్ల కాలంలో వార్షిక రాబడులు ఎంచుకున్న పథకాలను బట్టి 6.5-14.1 శాతం మధ్య ఉన్నాయి. ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడులు 7.3-12.6 శాతంగా ఉన్నాయి. ఎటువంటి చార్జీలను మినహాయించకముందు రాబడుల వివరాలు ఇవి. రాబడులు ఆశించిన విధంగా లేకపోతే భిన్న ఆప్షన్ల మధ్య పెట్టుబడులను మార్చుకునే అవకాశాన్ని బీమా సంస్థలు ఈ పథకాల్లో అనుమతిస్తున్నాయి. రిటైర్మెంట్‌ ప్లాన్‌ గడువు ముగిసిన తర్వాత సమకూరిన నిధిలో మూడింట రెండొతులను పెన్షన్‌ యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేయడం తప్పనిసరి. ఒక వంతును వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. 
యూనిట్‌ లింక్డ్‌ పెన్షన్‌ ప్లాన్లు ప్రతీ నెలా పోర్ట్‌ఫోలియో వివరాలను వెల్లడిస్తుంటాయి. కాకపోతే ఈ పాలసీల్లో బీమా కూడా ఉంటుంది కనుక అదనపు చార్జీల భారాన్ని మోయాల్సి వస్తుంది. యూనిట్‌ లింక్డ్‌ప్లాన్‌ ఎందులో అయినా పెట్టుబడులు, బీమా కలగలసి ఉంటాయి. దీంతో మోర్టాలిటీ చార్జీలు, పాలసీ అడ్మినిస్ట్రేషన్‌ చార్జీలు, ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ చార్జీలు, ప్రీమియం అలోకేషన్‌ చార్జీలు ఇలా రకరకాల రూపంలో చార్జీల భారం ఉంటుంది. ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ చార్జీ 1-1.35 శాతం వరకు ఉంటుంది. పాలసీ అడ్మినిస్ట్రేషన్‌ ఎక్స్‌పెన్స్‌ 0.3-0.4గా ఉంటుంది. వార్షిక ప్రీమియానికి బీమా మొత్తం కనీసం 10 రెట్లు ఉంటే, పన్ను మినహాయింపు లభిస్తుంది. సెక్షన్‌ 80సీ కింద ప్రీమియానికి పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే, ఉపసంహరణ సమయంలో ఒక వంతుకు పన్ను ఉండదు. మిగిలిన రెండొంతులను యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. 

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) 
దీర్ఘకాలిక లక్ష్యాల కోసం అందుబాటులో ఉన్న సురక్షిత పెట్టుబడి సాధనాల్లో పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) ఒకటి. ఇందులో పెట్టుబడులకు హామీ ఉంటుంది. ప్రస్తుత వడ్డీ రేటు 8 శాతం. ప్రతీ త్రైమాసికానికి వడ్డీ రేట్లను కేంద్రం సవరిస్తుంటుంది. దీనికి అదనంగా పన్ను మినహాయింపులు (పెట్టుబడులపై, రాబడులు, ఉపసంహరణలపైనా) ఉన్నందున ఇది ప్రతి ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో ఉండాల్సిన సాధనం. ఇది డెట్‌ సాధనం. వ్యవధి 15 ఏళ్లు. ఆ తర్వాత కావాలంటే వ్యవధిని ఐదేళ్లు పెంచుకోవచ్చు. కనుక దీర్ఘకాలిక అవసరాల కోసం తగిన ఎంపిక అవుతుంది. ఏడాదిలో కనీసం 500 ఇన్వెస్ట్‌ చేసినా సరిపోతుంది. గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల పెట్టుబడులకే పన్ను మినహాయింపు లభిస్తుంది. మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌ చెల్లించిన ఆర్థిక సంవత్సరం చివరి నుంచి 15 ఏళ్ల కాల వ్యవధి అమల్లోకి వస్తుంది. ఉదాహరణకు 2018 అక్టోబర్‌లో మొదటి వాయిదా కట్టారనుకోండి. అప్పుడు 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2034 ఏప్రిల్‌1 వరకు కాల వ్యవధి అమలవుతుంది. మూడు నుంచి ఆరో ఏట వరకు రుణం తీసుకోవచ్చు. రుణం తీసుకోవడానికి రెండేళ్ల ముందు నాటికి ఉన్న బ్యాలన్స్‌లో 25 శాతాన్ని రుణంగా ఇస్తారు. తిరిగి మూడేళ్ల కాలంలో రుణాన్ని తీర్చివేయాలి. ఏడో ఏట నుంచి పాక్షిక ఉపసంహరణలకు అనుమతి ఉంటుంది. 
పీపీఎఫ్‌లో పెట్టుబడులు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ1.5 లక్షలపై సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. అలాగే, పెట్టుబడులపై వడ్డీ, చివర్లో ఉపసంహరణల మొత్తం మీదా పన్ను ఉండదు. దీంతో 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి వాస్తవంగా గిట్టుబాటయ్యే వడ్డీ 11.9 శాతంగా అంచనా వేసుకోవచ్చు. కనుక అధిక పన్ను శ్లాబుల్లోని వారికి పీపీఎఫ్‌ ఎంతో ఆకర్షణీయమైన సాధనం అవుతుంది. 

ఎంప్లాయీ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌)
అన్ని రకాల డెట్‌ సాధనాల్లో అధిక రాబడులను ఇస్తున్న సాధనం ఇది. పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్స్‌ కంటే ఎక్కువగానే ఈపీఎఫ్‌ చందాలపై వడ్డీ రేటును నిర్ణయించడం జరుగుతోంది. ఇందులో పెట్టుబడులు, రాబడులకు ప్రభుత్వ హామీ ఉంటుంది. ఇటీవలే 2018-19 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటును నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉద్యోగి వేతనం (బేసిక్‌, డీఏ కలిపిన మొత్తం)లో 12 శాతాన్ని మినహాయించి ఈపీఎఫ్‌, ఈపీఎస్‌కు జమ చేయడం జరుగుతుంది. అలాగే, ఇంతే మొత్తాన్ని ఉద్యోగి తరఫున సంస్థ కూడా చెల్లిస్తుంది. పనిచేసే సం‍స్థను మారిపోయి, మరో ఉద్యోగంలో చేరినా ఈపీఎఫ్‌ను కొనసాగించుకోవచ్చు. దీనికి అదనంగా ఉద్యోగి తన బేసిక్‌, డీఏ మొత్తంలో  100 శాతాన్ని వీపీఎఫ్‌ (వాలెంటరీ ప్రావిడెంట్‌ ఫండ్‌) రూపంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. దీనికి కూడా ఈపీఎఫ్‌ వడ్డీ రేటే అమలవుతుంది. పన్ను ప్రయోజనాలు ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌కు సమానంగా వర్తిస్తాయి. పెట్టుబడులపై సెక్షన్‌ 80సీ కింద మినహాయింపులు పొందొచ్చు. రాబడులు, ఉపసంహరణలకూ పన్ను లేదు. You may be interested

పసిడి భవితపై ‘ఫెడ్‌’ రేటు ప్రభావం

Monday 18th March 2019

అమెరికా ఆర్థిక పరిస్థితి, కీలక వడ్డీ రేట్లపై (ప్రస్తుతం 2.25 నుంచి 2.50 శాతం శ్రేణి) బుధవారం (20వ తేదీ) ఫెడరల్ రిజర్వ్ పరపతి సమీక్షా కమిటీ తీసుకునే నిర్ణయంపై పసిడి సమీప భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ కమోడిటీ మార్కెట్‌- నైమెక్స్‌లో ఔన్స్‌ (31.1గ్రా) 1,200 డాలర్ల  నుంచి ప్రారంభమైన పసిడి తాజా ర్యాలీకి 1,346 డాలర్ల వద్ద తీవ్ర నిరోధం ఎదురయిన సంగతి

పదిరోజుల్లో భారీ షార్ట్‌కవరింగ్‌?!

Monday 18th March 2019

ఈక్విటీ 99 అంచనా దేశీ మార్కెట్లో భారీ షార్ట్‌ పొజిషన్లు పోగయి ఉన్నాయని ఈక్విటీ 99 ప్రతినిధి సుమిత్‌ బిల్‌గయాన్‌ చెప్పారు. ఆర్థిక సంవత్సరం త్వరలో ముగిసిపోతున్న నేపథ్యంలో మరో పది రోజుల్లో భారీ షార్ట్‌ కవరింగ్‌ చూడవచ్చని అంచనా వేశారు. ఎంఎఫ్‌లు తమ ఎన్‌ఏవిల విలవ పెంచి చూపడానికి యత్నిస్తాయని, అందువల్ల మార్కెట్లో ర్యాలీ ఉంటుందని చెప్పారు. ఇన్వెస్టర్లు ప్రతి పతనాన్ని ఒక అవకాశంగా మలచుకోవాలని సూచించారు. నిఫ్టీకి ప్రస్తుతం

Most from this category