News


ఫండ్స్‌తో లాభాలు వస్తాయా ?

Monday 24th June 2019
personal-finance_main1561355793.png-26517

ప్ర: మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, లాభాలు వస్తాయా? పదేళ్లపాటు ఇన్వెస్ట్‌ చేస్తే, కనీసం బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కంటే ఎక్కువ వడ్డీనే వస్తుందా ? 
-పల్లవి, విశాఖపట్టణం 

జ: నాకు తెలిసినంత వరకూ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, మంచి రాబడులే పొందవచ్చు. ఏదైనా ఒక ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తే, మంచి లాభాలే ఆర్జించవచ్చు. రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు చేసుకోవడం, సొంత ఇల్లు కట్టుకోవడం, పిల్లల పై చదువుల కోసం డబ్బులు కూడబెట్టడం... ఇవన్నీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు. ఈ లక్ష్యాల సాధన కోసం చాలా మంది తమ సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు చేస్తూ ఉంటారు. ఇలా పొదుపు చేసే మొత్తాన్నే సిప్‌ల ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే రాబడులను పొందవచ్చు. మీరు ఉద్యోగి అయితే మీకు ఇంక్రిమెంట్‌ వచ్చినప్పుడల్లా, ఆ మేరకు సిప్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పెంచండి. కనీసం పదేళ్ల పాటు క్రమం తప్పకుండా సిప్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం, కనీసం ఏడాదికొక్కసారైనా సిప్‌ మొత్తాన్ని పెంచడం వంటి చర్యలు చేపడితే, మీరు చెప్పుకోదగ్గ స్థాయిలోనే సంపదను సమకూర్చుకోగలుగుతారు. మీరు ఇన్వెస్ట్‌ చేసే ఈక్విటీ ఫండ్‌ అంతంత మాత్రం పనితీరు కనబరిచినా సరే, మీరు మంచి రాబడులు పొందగలరు. 
ప్ర: నేనే ఇటీవలనే ఉద్యోగంలో చేరాను. నేను రిటైర్‌ కావడానికి మరో 30 ఏళ్ల సమయం ఉంది. రిటైర్మెంట్‌ నిధి కోసం ఇప్పటినుంచే ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న మొత్తాన్ని పూర్తిగా షేర్లలోనే పెట్టాలనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ? 
-సికిందర్‌, హైదరాబాద్‌ 

జ: ఒక విధంగా చెప్పాలంటే మీది సరైన నిర్ణయమే. అయితే స్టాక్‌ మార్కెట్లో ఒడిదుడుకులు తీవ్రంగా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే, స్టాక్‌ మార్కెట్‌...రోలర్‌  కోస్టర్‌ రైడ్‌ లాంటిది. మార్కెట్‌ పెరుగుతున్నప్పుడు మనకు ఎక్కడా లేని ఉత్సాహం వస్తూ ఉంటుంది. మార్కెట్‌ పడిపోతున్నప్పుడు నిరాశ, నిస్పృహలు ఆవరిస్తూ ఉంటాయి. అందుకని స్టాక్‌ మార్కెట్‌ ఇచ్చే ఇలాంటి షాక్‌లను తట్టుకోవడానికి కొంత మొత్తాన్ని స్థిరమైన ఆదాయం ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయాలి. రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ఇన్వెస్ట్‌ చేసే పోర్ట్‌ఫోలియోలో కూడా కనీసం 10-20 శాతం మేర మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాల్లో ఇన్వె‍స్ట్‌ చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల అవసరమైన సందర్భాల్లో మీ పోర్ట్‌ఫోలియోను రీబ్యాలన్స్‌ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఉదాహరణకు మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 80 శాతం ఈక్విటీలో, మరో 20 శాతం ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. మార్కెట్‌ బాగా పడిపోయిన సందర్భాల్లో మీ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ విలువ తగ్గుతుంది.  అప్పుడు ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసే మొత్తంలో కొంత భాగాన్ని ఈక్విటీలోకి మళ్లించవచ్చు. మార్కెట్‌ తక్కువలో ఉంటుంది కాబట్టి ఎక్కువ షేర్లు పొందవచ్చు. మార్కెట్‌ బాగా పెరుగుతున్నప్పుడు ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తగ్గించుకోవడమో, అదే స్థాయిలో కొనసాగించడమో చేయవచ్చు. స్టాక్‌ మార్కెట్లో వచ్చే ఆటు పోట్లను తట్టుకునేలా మీ పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకోవాలి. అయితే వరుసగా 30 ఏళ్లపాటు మార్కెట్లో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, తట్టుకోగలిగి ఉండేటట్లయితే, వంద శాతం ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేయడం సరైనదే. 

ప్ర: నా వయస్సు 33 సంవత్సరాలు. నాకు నిలకడైన ఆదాయ మార్గాలే ఉన్నాయి. నేను ఒక మోస్తరు నుంచి అధిక నష్టభయాన్ని భరించగలను. నెలకు రూ.30,000 వరకూ ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి. 
-ఆంటోని, హైదరాబాద్‌ 

జ: నష్ట భయం అనేది పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు స్టాక్‌ మార్కెట్‌ పెరుగుతున్నప్పుడు, ఎంత రిస్క్‌అయినా భరించవచ్చులే అని అనిపిస్తూ ఉంటుంది. అదే మార్కెట్‌ పతనమవుతున్నప్పుడు, స్వల్ప నష్టభయాన్ని కూడా భరించలేం అని అనిపిస్తూ ఉంటుంది. ఇక మీ విషయానికొస్తే, నష్టభయం కంటే కూడా రెండు ముఖ్యమైన విషయాలను మీరు పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది మీరు ఎంతం కాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారు. అంటే పది అంతకు మించిన సంవత్సరాలు ఇన్వెస్ట్‌ చేసేటట్లయితే, అధిక నష్టభయాన్ని భరించవచ్చు. అప్పుడు నష్టభయం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు.  అదే మీరు మూడేళ్ల కాలానికే ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారనుకోండి. అప్పుడు నష్టభయమే కీలకం అవుతుంది. అప్పుడు దీనినే దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్‌మెంట్‌ నిర్ణయాలు తీసుకోవాలి. రెండవది ఇన్వెస్ట్‌మెంట్‌ అనుభవాలు. మార్కెట్‌ సంబంధిత మీ సొంత ఇన్వెస్ట్‌మెంట్‌ అనుభవాలు కీలకం. ఇతర ఇన్వెస్టర్ల తప్పులు, ఇలాంటి కాలమ్స్‌లో వచ్చే వ్యాసాల వల్ల కంటే కూడా మీ సొంత ఇన్వెస్ట్‌మెంట్‌ అనుభవాల ఆధారంగా మీరు నేర్చుకునేదే ఎక్కువగా ఉంటుంది. ఇక మీరు నెలకు రూ.30,000 ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ముందుగా హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ను ఎంచుకోండి. ఈ ఫండ్‌లో నెలకు కొంత మొత్తం చొప్పున సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయండి. ఫండ్‌ పనితీరు గురించి కనీసం ఏడాది పాటు పట్టించుకోవద్దు. పనితీరు ఎలా ఉన్నా ఈ ఫండ్‌లో రెండేళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించండి. ఈ రెండేళ్ల కాలంలో మీకు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఫండ్స్‌ పనితీరు, మార్కెట్‌ గమనం తదితర అంశాల పట్ల ఒక అవగాహన వస్తుంది. అప్పుడు ఏదైనా ఒక మంచి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ను ఎంచుకోండి, దాంట్లో సిప్‌ల ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించండి. 



You may be interested

ఈ షేర్లు కొనొచ్చు

Monday 24th June 2019

బజాజ్‌ ఆటో   :     కొనొచ్చు  బ్రోకరేజ్‌ సం‍స్థ: అరిహంత్‌ క్యాపిటల్‌ ప్రస్తుత ధర: రూ.2,873 టార్గెట్‌ ధర: రూ.3,631 ఎందుకంటే:- పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, బజాజ్‌ ఆటో కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో చెప్పుకోదగ్గ  ఆర్థిక ఫలితాలే సాధించింది. ఎగుమతుల దన్నుతో కంపెనీ నికర అమ్మకాలు 9 శాతం వృద్ధితో రూ.7,450 కోట్లకు చేరాయి. సీటీ100, ప్లాటినా బైక్‌ ధరల సవరణ కొనసాగుతుండటంతో స్థూల మార్జిన్లు 3 శాతమే వృద్ధి చెంది

సెన్సెక్స్ నిరోధశ్రేణి 39,435-39,620 పాయింట్లు

Monday 24th June 2019

అమెరికా....వివిధ దేశాలతో జరుపుతున్న వాణిజ్య యుద్ధాలు, తాజాగా అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.  ఈ అంశానికి తోడు మన దగ్గర ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ సంక్షోభం, కార్పొరేట్ డిఫాల్ట్లులు, కార్పొరేట్ దుర్వినియోగాలతో దేశీయ సూచీలు గరిష్ట స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. కానీ, మరో రెండు వారాల్లో కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంట్ ముందుకు రానున్న నేపథ్యంలో బడ్జెట్ ర్యాలీకి బీజం పడుతుందో ?

Most from this category