News


గృహ రుణంలో మీ ఎంపిక ఏది?

Monday 4th November 2019
personal-finance_main1572839074.png-29319

  • ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ రేటుకు మారుతున్న బ్యాంకులు-
  • రెపో ఆధారిత రుణాలకు అధిక ప్రాధాన్యం
  • వీటిల్లో పారదర్శకత పాళ్లు కాస్త ఎక్కువే
  • గతంలో ఎంసీఎల్‌ఆర్‌, బేసు రేటు ఆధారంగా రుణాలు
  • నూతన విధానంలో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనం అధికం
  •  మారే ముందు చూడాల్సిన అంశాలు ఎన్నో..


గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఇప్పుడు బాగా దిగొచ్చాయి. ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ రేట్లతో గృహ రుణ రేట్లను అనుసంధానించాలన్న ఆర్‌బీఐ ఆదేశాలకు లోబడి బ్యాంకులు రెపో రేటుతో అనుసంధానమైన గృహ రుణ పథకాలను కూడా ప్రవేశపెడుతున్నాయి. ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ రేట్లలో రెపో రేటు కూడా ఒకటి. ఈ విధానంలో ఆర్‌బీఐ రేట్ల సవరణ ప్రభావం వెంటనే గృహ రుణ రేట్లపై ప్రతిఫలిస్తుంది. ఇతర ఏ బెంచ్‌ మార్క్‌ విధానంతో చూసినా, ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ ఆధారిత రేట్లు పారదర్శకంగా, సౌకర్యంగా ఉంటాయన్నది నిపుణుల అభిప్రాయం. కనుక గృహ రుణాలు తీసుకునే వారికి నూతన విధానంపై అవగాహన కల్పించే కథనమే ఇది. 

కారణాలు..
ఆర్‌బీఐ రుణాలపై వడ్డీ రేట్లకు సంబంధించి పలు బెంచ్‌మార్కింగ్‌ విధానాలను గత కొన్నేళ్ల కాలంలో ప్రవేశపెట్టింది. ఇందులో ప్రైమ్‌ లెండింగ్‌ రేటు (పీఎల్‌ఆర్‌), బెంచ్‌ మార్క్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటు (బీపీఎల్‌ఆర్‌), బేస్‌రేటు, మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు (ఎంసీఎల్‌ఆర్‌).. ఇవన్నీ బెంచ్‌ మార్క్‌ విధానాలే. ఆర్‌బీఐ కీలక రేట్లను సవరించినప్పుడు బ్యాంకులు కూడా వెంటనే తమ బెంచ్‌ మార్క్‌ రేట్లను సవరించడం ద్వారానే అసలు ప్రయోజనం నెరవేరుతుంది. అయితే, ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించినా కానీ, బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని పూర్తి స్థాయిలో బదిలీ చేయడం లేదు. ఫలితమే ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ రేట్ల ఆధారంగా గృహ, రిటైల్‌ రుణాలు మంజూరు చేయాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించాల్సి వచ్చింది. ‘‘బ్యాంకుల రుణ రేట్లపై ఆర్‌బీఐ నియంత్రణలు తొలగించి 20 ఏళ్లు దాటిపోయింది. అయితే, రేట్ల సవరణ అన్నది సాఫీగా బదిలీ చేయడం ఇప్పటికీ ఆందోళన కలిగించే అంశంగానే ఉండిపోయింది’’ అని ఆర్‌బీఐ అంతర్గత అధ్యయన బృందం నివేదికలో పేర్కొనడం గమనార్హం. ఇంటర్నల్‌ బెంచ్‌ మార్క్‌ రేట్లు అయిన.. బేస్‌ రేటు, ఎంసీఎల్‌ఆర్‌ విధానాల్లో మానిటరీ పాలసీ విధానం సరిగ్గా బదిలీ జరగలేదని ఈ బృందం అభిప్రాయపడింది. దీంతో ఈ లోపాన్ని అధిగమించేందుకు గాను ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేటు విధానాన్ని సూచించింది.  

ఆర్‌బీఐ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం మీద 135 బేసిస్‌ పాయింట్ల వరకు రెపో రేటును తగ్గించింది. కానీ బ్యాంకులు రుణాలపై తగ్గించింది మాత్రం 35 బేసిస్‌ పాయింట్లు మించలేదు. అక్టోబర్‌ 4 నాటి సమీక్షలో ఆర్‌బీఐ ఈ అంశాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంది. మానిటరీ విధాన బదిలీ అన్నది ఇప్పటికీ అసంపూర్ణంగా, అస్థిరంగా ఉందంటూ ఆర్‌బీఐ ఎంపీసీ పేర్కొంది. ఈ పరిస్థితులను చూసిన తర్వాతే బ్యాంకులు రుణాల విషయంలో ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ రేట్లకు మళ్లాలని ఆర్‌బీఐ ఆదేశించింది. అయితే నూతన విధానం నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు నియంత్రణలోని సంస్థలకు వర్తించదు. దీని ప్రకారం బ్యాంకులు.. రెపో రేటు, 3 లేదా 6 నెలల ట్రెజరీ బిల్లులు, ఎఫ్‌బీఐఎల్‌ పేర్కొన్న ఏదేనీ ఇతర బెంచ్‌ మార్క్‌ రేటుకు మళ్లే అవకాశం ఉంటుంది. అయితే చాలా బ్యాంకులు రెపో రేటునే తమ బెంచ్‌ మార్క్‌ రేటుగా ఆచరణలోకి తీసుకుంటున్నాయి. ‘‘రెపో రేటు స్థిరంగా ఉంటుంది. అందుకే చాలా బ్యాంకులు తమ ఫ్లోరింగ్‌ రేటు రుణాలను రెపో రేటుకు అనుసంధానిస్తున్నాయి’’అని ఎస్‌బీఐ ముఖ్య ఆర్థికవేత్త సౌమ్యకాంతి ఘోష్‌ పేర్కొన్నారు. ‘‘రెపో రేటుకు అనుసంధానించడం వల్ల రుణాల రేట్లను ఆర్‌బీఐ నడిపించనుంది. రెపో రేటు అన్నది ట్రెజరీ బిల్లులతో పోలిస్తే వ్యక్తులు అర్థం చేసుకునేందుకు సులభంగా ఉంటుంది. పారదర్శకత పరంగా ఇదో ప్లస్‌ పాయింట్‌’’ అని మోర్ట్‌గేజ్‌ వరల్డ్‌ వ్యవస్థాపకుడు విపుల్‌ పటేల్‌ పేర్కొన్నారు. 

ప్రయోజనాలు...
రెపో ఆధారిత రుణ రేట్ల విధానంలో.. ఆర్‌బీఐ రెపో రేటుకు అదనంగా బ్యాంకులు తమ పరిధిలో నిర్ణయించిన స్ప్రెడ్‌ కలసి వడ్డీ రేటుగా ఉంటుంది. ‘‘రెపో రేటు, నిర్వహణ వ్యయం, క్రెడిట్‌ రిస్క్‌ ప్రీమియం కలసి రుణాలపై వడ్డీ రేటుగా ఉంటుందని సౌమ్యకాంతి ఘోష్‌ వివరించారు. బ్యాంకులు ప్రతీ మూడు నెలలకొకసారి ఈ విధానంలో రేట్లను సవరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎస్‌బీఐ రెపో ఆధారిత రుణ రేట్లలో స్ప్రెడ్‌ 265 బేసిస్‌ పాయింట్లుగా ఉంది. ఇది కూడా రూ.30లక్షల వరకు రుణాలపైనే. దీనికి అదనంగా 15 బేసిస్‌ పాయింట్ల మేర క్రెడిట్‌ రిస్క్‌ ప్రీమియం కూడా ఉంటుంది. రుణ గ్రహీత ఆదాయ మూలాలను బట్టి (వేతన జీవులు లేదా వృత్తి నిపుణులు లేదా ఇతరులు), వారు తీసుకునే రుణం, అంతర్గత రిస్క్‌ గ్రేడింగ్‌ అంశాల ఆధారంగా క్రెడిట్‌ రిస్క్‌ స్ప్రెడ్‌లో 75 బేసిస్‌ పాయింట్ల వరకు అంతరం ఉండొచ్చు. 

ఎంచుకోవడం సులభమేనా?
ఇప్పుడు చాలా బ్యాంకుల్లో రుణాలపై వడ్డీ రేట్లు ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ ఆధారంగా ఉన్న నేపథ్యంలో... రుణం ఏ బ్యాంకు నుంచి తీసుకున్నా ఒకటేనని అనుకుంటున్నారా..? కాదు. ఎందుకంటే బ్యాంకులు వసూలు చేసే స్ప్రెడ్‌లో వ్యత్యాసం ఉంటుంది. ఏ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలనే విషయంలో ఇది కీలకమైన అంశం అవుతుంది. రెపో రేటుపై తక్కువ స్ప్రెడ్‌ను వసూలు చేసే బ్యాంకు నుంచే తీసుకోవడం మంచిదని పైసా బజార్‌ హోమ్‌లోన్స్‌ విబాగం హెడ్‌ రతన్‌ చౌదరి సూచించారు. ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంకు, సిండికేట్‌ బ్యాంకులు అయితే బేస్‌ స్ప్రెడ్‌పై క్రెడిట్‌ రిస్క్‌ ప్రీమియం ఎంతన్నది నిర్దేశించాయి. అదే ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, సిటీ బ్యాంకులు ఇంకా ఆ పని చేయలేదు. అన్ని బ్యాంకులకు సంబంధించి క్రెడిట్‌ రిస్క్‌ కాంపోనెంట్‌ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రుణ ఒప్పందంపై సంతకాలు పెట్టే ముందు రుణ గ‍్రహీతలు ఈ విషయమై విచారించాలి. లేదా స్పష్టత వచ్చే వరకు రుణం కోసం ఆగితే నయం’’ అని విపుల్‌ పటేల్‌ సూచించారు. 

ఇప్పటికే రుణాలు తీసుకుంటే...
ఇప్పటికే ఎంసీఎల్‌ఆర్‌ విధానంలో రుణాలు తీసుకున్న వారు లేదా బేస్‌ రేటు ఆధారిత రుణం పొందిన వారు.. పరిపాలన లేదా న్యాయపరమైన చార్జీలను చెల్లించడం ద్వారా ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ అనుసంధానిత రుణ రేట్లకు మారిపోయే అవకాశం కూడా ఉంది. గతంలో ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ రుణ గ్రహీతలు 0.25 శాతం కన్వర్షన్‌ ఫీజు (మార్పిడి ఫీజు)ను బకాయి ఉన్న రుణం మొత్తంపై చెల్లించేట్టు అయితే బదిలీకి అనుమతించేది. రెపో అనుసంధానిత గృహ రుణ రేట్లకు సంబంధించి చార్జీలను బ్యాంకులు ఇంకా విడుదల చేయాల్సి ఉంది. బ్యాంకులు ఒక్కసారి ఈ చార్జీలను నిర్ణయించిన తర్వాత ఇప్పటికే రుణాలు తీసుకుని ఉన్న వారు, నూతన విధానంలోకి మళ్లడం వల్ల కలిగే ప్రయోజనాలను బేరీజు వేసుకోవచ్చు. అలాగే, ప్రస్తుత బ్యాంకు నుంచి మరో బ్యాంకులో రెపో ఆధారిత రుణ రేట్లకు మళ్లాలన్నా... రెండింటి మధ్య రేట్ల పరంగా అంతరం, మిగిలి ఉన్న కాలం, తనకు మిగిలేదెంత తదితర అంశాలను సమీక్షించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఇలా మారడం వల్ల కనీసం 35 బేసిస్‌ పాయింట్ల మేర (0.35 శాతం) అయినా మిగిలేట్టు అయితే, అప్పుడు మారడం ప్రయోజనకరమేనని పటేల్‌ సూచించారు. 
 You may be interested

ఇంటి ముందుకే బ్యాంక్‌ సేవలు!

Monday 4th November 2019

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నుంచీ డోర్‌ స్టెప్‌ సేవలు సీనియర్‌ సిటీజన్స్, వికలాంగులకు మాత్రమే ఉచితం డిపాజిట్స్, చెక్‌ బుక్స్, డ్రాఫ్ట్, ఫామ్‌-16 వంటివెన్నో.. నగదు లావాదేవీల్లో జాగ్రత్త: నిపుణులు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బ్యాంక్‌ సేవలు మీ ఇంటి ముందుకొచ్చేశాయి. కొన్నాళ్లుగా ప్రైవేట్‌ బ్యాంక్‌లు మాత్రమే అందిస్తున్న డోర్‌ స్టెప్‌ బ్యాంకింగ్‌ సేవలను అందించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లూ సిద్ధమయ్యాయి.  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 2017లో వృద్ధులకు, బ్యాంక్‌ శాఖలకు రాలేని పరిస్థితుల్లో

ఐపీఓకు సౌదీ అరామ్‌కో

Monday 4th November 2019

లాంఛనంగా ప్రకటించిన కంపెనీ  ఈ నెల 9న మరిన్ని వివరాలు డిసెంబర్‌లో స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌  దహ్రన్‌(సౌదీ అరేబియా):- సౌదీ అరేబియాకు చెందిన చమురు దిగ్గజం సౌదీ ఆరామ్‌కో కంపెనీ ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) వివరాలను ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన ఈ కంపెనీ 2016లోనే ఐపీఓకు వచ్చే ప్రయత్నాలు చేసింది. వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ ఐపీఓ ఎట్టకేలకు ఈ నెలలో సాకారమవుతోంది.  బుక్‌ బిల్డింగ్‌ విధానంలో

Most from this category