News


మూడేళ్ల కోసం ఏ డెట్‌ ఫండ్‌ బెటరు?

Monday 13th May 2019
personal-finance_main1557728296.png-25700

ప్ర:  దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేసే ఉద్దేశంతో కొన్ని ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)లను ప్రారంభించాను. నా పోర్ట్‌ఫోలియోలో డెట్‌ సాధనాలేవీ లేవు. డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ నిమిత్తం అగ్రెసివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌లో  ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా ?
-శేఖర్‌, విజయవాడ
జ: ఇది ఒక విధంగా మంచి నిర్ణయమే అని చెప్పవచ్చు. పైగా పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అయితే ఇలా చేయకుండా పూర్తి స్థిరాదాయ (డెట్‌) సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తేనే మేలు. సాధారణంగా మూడు ప్రయోజనాల కోసం డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాం. మొదటిది అత్యవసర నిధి కోసం.  మనకు ఆకస్మికంగా ఎదురయ్యే అత్యవసరాల కోసం కొంచెం సొమ్ములను ఏదైనా ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి. ఈ ఫండ్‌పై ఎలాంటి మార్కెట్‌ రిస్క్‌ ప్రభావం ఉండకూడదు. ఈ ఫండ్‌లో మీ అవసరాలను బట్టి రూ.25,000 నుంచి రూ. లక్ష వరకూ ఇన్వెస్ట్‌ చేయవచ్చు. మీకు చిన్న పిల్లలు ఉన్నా, మీ ఇంట్లో పెద్ద వయస్సు వ్యక్తులున్నా, ఈ అత్యవసర నిధి మొత్తాన్ని మరింతగా పెంచుకోవాలి.  రెండోది మీ పోర్ట్‌ఫోలియో రీబ్యాలన్స్‌ కోసం డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయాలి. మీ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కనీసం పది శాతం డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిది. ఇక మూడోది మీరు రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నా, లేకున్నా మీరు నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యం మరో రెండు, మూడు సంవత్సరాల్లో సాకారం కానున్నా, మీ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను డెట్‌ సాధనాల్లోకి బదిలీ చేసుకోవాలి. ఇలా చేస్తే మార్కెట్‌ రిస్క్‌ ప్రభావం పెద్దగా ఉండదు. ఈ మూడు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇన్వెస్టర్‌ డెట్‌ సాధనాల్లో ఎంతో కొంత ఇన్వెస్ట్‌ చేయడం తప్పనిసరి.  బాండ్లు, సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్, కమర్షియల్‌ పేపర్, డిబెంచర్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, నేషనల సేవింగ్స్‌ సర్టిఫికెట్స్‌ను డెట్‌ సాధనాలు లేదా స్థిరాదాయ సాధనాలుగా పరిగణిస్తారు. 

ప్ర: నేను కనీసం మూడేళ్ల పాటు డెట్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. మంచి డెట్‌ ఫండ్‌ను సూచించండి. అలాగే ఏడాది నుంచి మూడేళ్ల కాలానికి కూడా ఫండ్స్‌ను సూచించండి.
-సుధాకర్‌, హైదరాబాద్‌

జ: డెట్‌ ఫండ్‌లో నష్ట భయం తక్కువగా ఉంటుంది. రాబడులు కూడా తక్కువగా ఉంటాయి. మీరు మూడేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నారు కాబట్టి ఇన్‌కమ్‌ లేదా డైనమిక్‌ బాండ్‌ ఫండ్‌ను ఎంచుకోవచ్చు. ఈ కేటగిరీలో బిర్లా సన్‌లైఫ్‌ డైనమిక్‌ బాండ్‌ ఫండ్, ఫ్రాంక్లిన్‌ డైనమిక్‌ బాండ్, ఎస్‌బీఐ కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్‌లను పరిశీలించవచ్చు. ఏడాది నుంచి మూడేళ్ల కాలం... ఇలా స్వల్పకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, షార్ట్‌ టర్మ్‌ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. 

ప్ర: నేను గత కొన్నేళ్లుగా మిరా అసెట్‌ ఇండియా ఈక్విటీ ఫండ్‌లో సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఫండ్‌ పునఃవర్గీకరణ కారణంగా ఈ ఫండ్‌ మల్టీ–క్యాప్‌ ఫండ్‌ నుంచి లార్జ్‌క్యాప్‌ ఫండ్‌గా మారింది. ఈ మార్పు నేపథ్యంలో ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించమంటారా ? మానేయమంటారా ? తగిన సలహా ఇవ్వండి.
-దినేశ్‌, వరంగల్‌ 
జ: మిరా అసెట్‌ ఇండియా ఈక్విటీ ఫండ్‌ను సదరు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ మిడ్‌క్యాప్‌ నుంచి లార్జ్‌క్యాప్‌గా మార్పు చేసింది. అయినప్పటికీ,  మీరు ఈ ఫండ్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించవచ్చు. ఈ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోను పరిశీలిస్తే, ఇది లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌ననే చెప్పవచ్చు.  పునఃవర్గీకరణ కారణంగా లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌గా మారడంతో ఈ ఫండ్‌ తప్పనిసరిగా లార్జ్‌ క్యాప్‌ కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా సదరు ఫండ్‌ మేనేజర్‌కు ఉండే మదుపు స్వేచ్ఛ ఒకింత తగ్గుతుంది. ఇది రాబడులపై స్వల్పంగానే ప్రభావం చూపించవచ్చు. మీరు ఆందోళన చెందాల్సిన పని ఏమీ లేదు. మిరా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఇప్పటికే మరో మల్టీ–క్యాప్‌ ఈక్విటీ ఫండ్‌ను అందుబాటులోకి తెచ్చింది. కావాలనుకుంటే ఈ కొత్త ఫండ్‌లో కూడా మీరు ఇన్వెస్ట్‌ చేయవచ్చు. లేదా మిరా అసెట్‌ ఇండియా ఈక్విటీ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈ కొత్త మల్టీ-క్యాప్‌ ఈక్విటీ ఫండ్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. 

ప్ర: నేను గత కొంత కాలంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో మూడు ఫండ్స్‌ ఉన్నాయి. మోతిలాల్‌ ఓస్వాల్‌ మల్టీక్యాప్‌ 35, ఎస్‌బీఐ మ్యాగ్నమ్‌ మల్టీక్యాప్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఈక్విటీ ఫండ్స్‌ ఉన్నాయి. ఇప్పుడు నా జీతం రూ.3,000 మేర పెరిగింది.  ఈ మొత్తాన్ని కూడా ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఇవి సరిపోతాయా ? కొత్త ఫండ్స్‌ను జత చేయమంటారా ? 
-ఖలీల్‌, కరీంనగర్‌ 
జ: మీ పోర్ట్‌ఫోలియో సమతూకంగానే ఉంది. విభిన్నమైన ఫండ్స్‌తో డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు మీకు బాగానే లభిస్తాయి. మీరు కొత్తగా మరో æఫండ్‌ను మీ పోర్ట్‌ఫోలియోకు జత చేయాల్సిన అవసరం లేదు. మీ పోర్ట్‌ఫోలియో ఫండ్స్‌లో కొన్ని మంచి పనితీరు కనబరిచినా, మరికొన్ని అంతంత మాత్రం పనితీరే చూపించవచ్చు. మార్కెట్‌ పతనబాటలో ఉన్నప్పుడు కూడా ఈ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. You may be interested

ఐటీసీని మలిచిన శిల్పి

Monday 13th May 2019

ఇంటింటికీ ఐటీసీని చేర్చిన వైసీ దేవేశ్వర్‌ ఆయన సారథ్యంలో బహుముఖ కంపెనీగా పటిష్టం దేశవ్యాప్తంగా 60 లక్షల మందికి ఉపాధి తొలుత చేరిన కంపెనీకే నాయకుడయ్యారు 23 ఏళ్ల పాటు చైర్మన్‌గా ఐటీసీ భారీ విస్తరణ 72వ ఏట కేన్సర్‌తో దేశాన్ని వీడి దిగంతాలకు సాధారణ ఉద్యోగిగా చేరిన ఓ వ్యక్తి తనకు ఉపాధినిచ్చిన కంపెనీకి కొత్త జీవాన్నిచ్చారు. చిన్న చెట్టును మర్రిమానును చేశారు. కేవలం సిగరెట్లను అమ్ముకునే ఓ కంపెనీని, ఆహార ఉత్పత్తులు, స్టేషనరీ, అగ్రి, తదితర

నిఫ్టీ 11,350 దాటకపోతే...200 డీఎంఏ వైపు ప్రయాణం

Monday 13th May 2019

 అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరవచ్చన్న అంచనాలు బలంగా నెలకొన్న సమయంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హఠాత్తుగా చైనాపై టారీఫ్‌ల పెంపునకు ఉత్తర్వులు జారీచేయడం, అందుకు ప్రతిచర్యలు చేపడతామంటూ చైనా హెచ్చరించడం వెంటవెంటనే జరిగిపోయాయి. దాంతో గత వారం ప్రపంచ మార్కెట్లు ఉక్కిరిబిక్కిరి అయిపోయాయి. కాకపోతే ఇతర ప్రధాన మార్కెట్లో చిన్న షార్ట్‌ కవరింగ్‌ ర్యాలీలు వచ్చినప్పటికీ, ఇండియా సూచీలు మాత్రం అదేపనిగా వారమంతా పడిపోయాయి. ఇక్కడి లోక్‌సభ ఎన్నికల

Most from this category