News


మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎంపిక ఇలా కాదు..!

Monday 18th November 2019
personal-finance_main1574048334.png-29653

-డివిడెండ్‌ కంటే ఎస్‌డబ్ల్యూపీ మెరుగు
-ఫండ్స్‌ ఆస్తుల సైజు కంటే రాబడులు ముఖ్యం
-మంచి పనితీరు ఉంటే, వ్యయాలను పట్టించుకోనక్కర్లేదు
-ఫండ్స్‌లో రాబడులకు ఎన్నో జాగ్రత్తలు అవసరం

మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల వైపు నేడు ఎక్కువ మంది వేతన జీవులు మొగ్గు చూపుతున్నారు. దీర్ఘకాలంలో ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇవి అనుకూలమనే అవగాహన పెరుగుతోంది. అధిక రాబడులకు ఈక్విటీలు మెరుగైన సాధనంగా ఉండడంతో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లోకి ప్రతీ నెలా సగటున రూ.8,000 కోట్లపైనే సిప్‌ (క్రమానుగత పెట్టుబడులు) రూపంలో పెట్టుబడులు వస్తున్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎలా ఎంచుకోవాలనే ప్రాథమిక అవగాహన కొందరిలో ఉన్నప్పటికీ... ఎంపిక విషయంలో పట్టి పట్టి చూడకూడని, అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేని అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలియజేసే ప్రాఫిట్‌ కథనం ఇది. 
 జీవన శైలి, అవసరాలు, రిస్క్‌ తీసుకునే సామర్థ్యం ఇవన్నీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే, ఫండ్‌ పనితీరును కూడా ప్రామాణికంగా చూడాల్సి ఉంటుంది. నాణేనికి మరోవైపు అన్నట్టు ఫండ్స్‌లో పెట్టుబడులను ఈ అంశాలను పెద్దగా పట్టించుకోకుండా, ఇతర ముఖ్య అంశాలపై ఆధారపడడం మంచిదని నిపుణుల సూచన. 

డివిడెండ్‌ 
డివిడెండ్‌ అధికంగా ఇస్తున్నాయని ఫండ్స్‌ను ఎంచుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడూ ఒకే విధమైన డివిడెండ్‌ను పంపిణీ చేయాలన్న హామీ ఉండదు. కచ్చితంగా ఇంత మేర డివిడెండ్‌ ప్రకటించాలన్న నిబంధన కూడా లేదు. ఉదాహరణకు మార్కెట్లు పడిపోతే, సంబంధిత ఫండ్‌ డివిడెండ్‌ పంపకాన్ని తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. దీర్ఘకాలంలో సంపద సృష్టి కోసమే ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. కానీ, వస్తున్న లాభాన్ని ఎప్పటికప్పుడు డివిడెండ్‌ రూపంలో తీసేసుకోవడం మంచి ఆలోచన ఎంత మాత్రం కాదు. ఎందుకంటే లాభాన్ని తీసేసుకోవడం వల్ల పెట్టుబడి వృద్ధి చెందదు. పైగా ఇప్పుడు డివిడెండ్‌ పంపిణీపై ఈక్విటీ ఫండ్స్‌ అయితే 10 శాతం పన్ను పడుతోంది. అంటే ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభాలపై 10 శాతం పన్నుమాదిరిగానే. కనుక డివిడెండ్‌ ఇస్తున్న వాటిని ఎంపిక చేసుకోవడం సూచనీయం కాదు. దీనికి బదులు అవసరమైనప్పుడు కొన్ని యూనిట్లను విక్రయించి అవసరాలు తీర్చుకోవడమే మంచిది.
   డెట్‌ ఫండ్స్‌లో అయితే డివిడెండ్‌ కోసం చూడడం అన్నది ఏ మాత్రం సరికాదు. దీనికంటే క్రమానుగత ఉపసంహరణ (ఎస్‌డబ్ల్యూపీ) అన్నది మరింత సమర్థవంతమైన టూల్‌ అవుతుంది. ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ప్రతీ నెలా నిర్ణీత సంఖ్యలో యూనిట్లను ఉపసంహరించుకోవడం ద్వారా అవసరమైన మేర పొందొచ్చు. దీనివల్ల పన్ను పరంగా కలిసొస్తుంది. అదే డెట్‌ ఫండ్స్‌లో డివిడెండ్‌ ఆశిస్తే, డివిడెండ్‌ పంపిణీ పన్ను కింద 29.12 శాతం పడుతుంది. ఇన్వెస్టర్‌ ఆదాయం ఏ స్లాబ్‌లో ఉందన్నదానితో సంబంధం ఉండదు. కానీ, ఎస్‌డబ్ల్యూపీలో పెట్టుబడిపై ఆర్జించిన లాభం వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఏ పన్ను రేటులో ఉంటే ఆ మేరకు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌డబ్ల్యూపీలో ఉపసంహరించుకునేది కొద్ది మొత్తమే ఉంటుంది కనుక పన్ను భారం అంతగా ఏమీ ఉండదు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని డెట్‌ ఫండ్స్‌లో ఆర్జనకు ముడిపెట్టి సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉండడం మరో ప్రయోజనం. 

నికర విలువ
స్టాక్స్‌లో పెట్టుబడుల పట్ల అవగాహన ఉన్న వారు అవే అంశాలను, మ్యూచువల్‌ ఫండ్స్‌కు అన్వయించడం సూచనీయం కాదు. స్టాక్స్‌లో 52 వారాల గరిష్ట, కనిష్ట ధరలను సాధారణంగా చూస్తుంటారు. కానీ, మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్ల నికర విలువ (ఎన్‌ఏవీ) 52 వారాల కనిష్ట స్థాయిలో ఉంటే, అది మంచి పెట్టుబడికి సంకేతంగా చూడడం తప్పిదమే కావచ్చు. ఎందుకంటే ఫండ్‌ మేనేజర్‌ ఎంచుకున్న స్టాక్స్‌ పనితీరు బాగాలేకపోయినా యూనిట్ల ఎన్‌ఏవీ పడిపోతుంది. కనుక  ఫండ్స్‌ కొనుగోలుకు దీన్ని సంకేతంగా చూడడం అన్నివేళలా సరికాదు. దీనికితోడు మార్కెట్లు పడిపోయినప్పుడు ఫండ్‌ మేనేజర్లు సరసమైన ధరల కంటే దిగొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ విధమైన అవకాశాలున్నాయేమో చూడాలి. దీనికి బదులు ఇప్పటికే మీ వద్ద ఉన్న ఫండ్‌ యూనిట్లను తక్కువ ధరల వద్ద మరిన్ని జోడించుకోవడంపై దృష్టి సారించొచ్చు. 

ఫండ్స్‌ సంస్థ తెలియక్కర్లేదు..
మనలో చాలా మందికి కొన్ని బ్యాంకులంటే ఎక్కువగా పరిచయం, అనుబంధం ఉండి ఉంటుంది. కనుక తెలిసిన బ్యాంకుల నిర్వహణలోని మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సరైనదని భావించే వారూ ఉన్నారు. కానీ, ఇది నిజం కానే కాదు. ఇటీవలి డెట్‌ ఫండ్‌ సంక్షోభంలో బ్యాంకుల మద్దతుగల ఎన్నో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు నష్టాలను ఎదుర్కొన్నాయి. పైగా వీటి ఈక్విటీ రాబడుల చరిత్ర కూడా అంత గొప్పగా లేదు. మ్యూచువల్‌ ఫండ్స్‌ ట్రాక్‌రికార్డుకు స్థిరత్వం ఎంతో అవసరం. ఫండ్‌ మేనేజర్‌ ట్రాక్‌ రికార్డు కూడా ఇక్కడ కీలకం అవుతుంది. 

ఫండ్‌ సైజు
ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు, సంబంధిత పథకం నిర్వహణలో ఉన్న ఆస్తులను ప్రత్యేకంగా చూడడం అవసరం లేదు. అదే డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో మాత్రం నిర్వహణ ఆస్తులను చూడడం అవసరం. ఎందుకంటే లిక్విడిటీ ఏ స్థాయిలో​ఉంటుందో తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈక్విటీ ఫండ్స్‌కు ఆస్తుల పరిమాణం ప్రతికూలంగా మారొచ్చు. ఉదాహరణకు స్మాల్‌క్యాప్‌ ఫండ్‌కు భారీ ఆస్తులు ఉంటే అది సానుకూలం కంటే ప్రతికూలమే అవుతుంది. ఇలా ఫండ్‌ సైజు చూసే వారు ఆస్తులను అద్భుతంగా నిర్వహించే చిన్న సైజు పథకాల్లో పెట్టుబడి అవకాశాలను కోల్పోవచ్చు. అందుకే ఓ పథకం ఎంపికకు స్థిరమైన రాబడుల చరిత్ర, పోటీ పథకాలతో పోల్చినప్పుడు ఇచ్చిన రాబడులు మెరుగ్గా ఉన్నాయా అన్నవి చూడాలి. అస్తుల పరిమాణాన్ని కాదు. 

వ్యయ భారం
ఎక్స్‌పెన్స్‌ రేషియో... ఓ  మ్యూచువల్‌ ఫండ్‌ పథకం తాను నిర్వహించే పెట్టుబడులపై అన్ని రకాల చార్జీలను కలుపుకుని ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే దానిని టోటల్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియోగా చెబుతారు. ఫండ్స్‌ పథకాల ఎంపికకు చూసే అంశాల్లో ఇది కూడా ఒకటి. ఈ చార్జీలను ప్రతీ రోజూ ఏఎంసీలు ఫండ్స్‌ యూనిట్ల ఎన్‌ఏవీ నుంచి మినహాయించుకుంటాయి. అంటే కనిపించే ఎన్‌ఏవీ ఖర్చులు మినహాయించుకున్న అనంతర విలువ అని తెలుసుకోవాలి. అయితే, అన్ని వేళలా ఈ ఎక్స్‌పెన్స్‌ రేషియోపై అంతగా ఆధారపడక్కర్లేదు. బెంచ్‌మార్క్‌, పోటీ పథకాల కంటే మెరుగైన పనితీరు చూపిస్తుంటే, అటువంటి పథకాల్లో ఎక్స్‌పెన్స్‌ రేషియో పట్ల అంత సున్నితంగా ఉండాల్సిన అవసరం లేదు. డెట్‌ ఫండ్స్‌లో రాబడులు ఎక్కువగా లేకపోతే, అప్పుడు ఎక్స్‌పెన్స్‌ రేషియో రాబడులపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అయితే, ఫండ్‌ నాణ్యత, రిస్క్‌ ఆధారిత రాబడుల రేషియో అన్నవి ఎక్స్‌పెన్స్‌ రేషియో కంటే ముఖ్యమైనవిగా గుర్తించాలి. ఈక్విటీ ఫండ్స్‌లో ఏడాది కాల పాయింట్‌ టు పాయింట్‌ రాబడులు అన్నవి రాబడుల పనితీరుకు ప్రామాణికంగా చూడక్కర్లేదు. ఉదాహరణకు ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఈక్విటీ పథకం 2016లో పనితీరు పరంగా నంబర్‌ 1 స్థానంలో ఉంది. కానీ, మరుసటి ఏడాది మూడో స్థానానికి వెళ్లింది. ఒకే తరహా పనితీరు తర్వాతి సంవత్సరంలోనూ నమోదు చేయడం అన్నది కష్టమే. అందుకే పనితీరు పరంగా స్థిరత్వాన్ని చూడడం అవసరం. 



You may be interested

పాజిటివ్‌ ప్రారంభం

Monday 18th November 2019

ప్రపంచ మార్కెట్ల సాంకేతిక సంకేతాలకు అనుగుణంగా సోమవారం భారత్‌ స్టాక్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 72 పాయింట్ల లాభంతో 40,428 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,915 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో జీ టెలిఫిల్మ్‌ 3.5 శాతం పెరగ్గా, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, జీ టెలిఫిల్మ్‌లు 1.5 శాతం లాభపడ్డాయి. మరోవైపు గెయిల్‌, మహింద్రా, ఇన్‌ఫ్రాటెల్‌లు 1 శాతం వరకూ

40,030 పాయింట్ల మద్దతు సెన్సెక్స్‌కు కీలకం

Monday 18th November 2019

కొద్ది నెలలుగా అమెరికా మార్కెట్‌ను ముందుకు నడిపిస్తున్న యాపిల్, ఫేస్‌బుక్, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్‌ వంటి షేర్ల సాయంతోనే ఆ దేశపు మార్కెట్లు సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. మరోవైపు ట్రేడ్‌ డీల్‌ పట్ల అనుమానాలు, వృద్ధి మందగించడం, స్వదేశీ కరెన్సీలు పతనంకావడం వంటి అంశాలతో భారత్‌తో సహా పలు వర్థమాన మార్కెట్లు, యూరప్‌ సూచీల అప్‌ట్రెండ్‌ గతవారం హఠాత్తుగా ఆగిపోయింది. మరో ఒకటి, రెండు వారాలు ర్యాలీ నిలిచిపోతే,,,ఈ సంవత్సరాంతంలో కరెక్షన్‌

Most from this category