News


మ్యూచువల్‌ ఫండ్స్‌పై మరిన్ని నిబంధనలు...

Friday 28th June 2019
Markets_main1561709802.png-26656

  • లిక్విడిటీ సంక్షోభం నేపథ్యంలో సెబీ నిర్ణయాలు 
  • యథాతథ ఒప్పందాలు వద్దు
  • లిక్విడ్‌ స్కీమ్స్‌పై ఆంక్షలు 
  • అధిక ఓటింగ్‌ హక్కులున్న డీవీఆర్‌షేర్లు జారీ 
  • టెక్నాలజీ కంపెనీలకే ఈ వెసులుబాటు 
  • సెబీ నిర్ణయాలతో మరింత పారదర్శకత అంటున్న నిపుణులు 

ముంబై: కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ కంపెనీల్లో ఇటీవల తలెత్తిన లిక్విడిటీ సంక్షోభం నేపథ్యంలో మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకుంది. గురువారం జరిగిన బోర్డ్‌ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలను సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి వెల్లడించారు. ప్రమోటర్ల షేర్లు తనఖాగా రుణాలిచ్చిన మ్యూచువల్‌ ఫండ్స్‌, ఆయా కంపెనీలతో యథాతథ ఒప్పందాలు కుదుర్చుకోకూడదని, ఒక మ్యూచువల్‌ ఫండ్‌ మొత్తం ఆస్తుల్లో లిక్విడ్‌ ఫండ్స్‌ 20 శాతానికి(గతంలో ఈ పరిమితి 25 శాతంగా ఉంది) మించకూడదని  నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. గత నాలుగు-ఐదేళ్లలో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల నిర్వహణ ఆస్తులు కనీసం నాలుగు రెట్లు పెరిగాయని, ఇన్వెస్టర్ల విశ్వాసం మరింత పెంచడం కోసం ఈ కఠిన ని‍ర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. అంతే కాకుండా అధిక ఓటింగ్‌ రైట్స్‌ ఉన్న డీవీఆర్‌ షేర్ల జారీకి సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించామని పేర్కొన్నారు.  ప్రమోటర్లు తనఖా పెట్టిన షేర్లకు సంబంధించిన వివరాల వెల్లడి నిబంధనలను మరింత కఠినతరం చేశామని వివరించారు. రాయల్టీ చెల్లింపులకు సంబంధించిన లిస్టింగ్‌, వెల్లడి నిబంధనలు, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు సంబంధించిన నిబంధనల్లో సవరణలు చేశామని తెలిపారు. ఇక ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు సంబంధించి ప్రతి త్రైమాసిక కాలం చివర, ఆర్థిక ఫలితాలు వెలువడిన రెండు రోజుల వరకూ ట్రేడింగ్‌ విండో క్లోజర్‌ కొనసాగుతుంది. మరిన్ని వివరాలు...

 

యథాతథ ఒప్పందాలు వద్దు...
ప్రమోటర్ల షేర్లు తనఖాగా రుణాలిచ్చిన మ్యూచువల్‌ ఫండ్స్‌, ఆయా కంపెనీలతో యథాతథ ఒప్పందాలు కుదుర్చుకోకూడదు. ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్న మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలపై సెబీ చర్యలు తీసుకోవచ్చు. మ్యూచువల్‌ ఫండ్‌ సం‍స్థకు చెందిన లిక్విడ్‌ స్కీమ్స్‌లో ఆ సంస్థ పెట్టుబడులు కనీసం 20 శాతం వరకూ నగదు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు వంటి లిక్విడ్‌ అసెట్స్‌లో ఉండాలి. ఇక లిస్టైన నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లు(ఎన్‌సీడీ)లలో మాత్రమే మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వె‍స్ట్‌ చేయాలి. 

కొత్త ‘డీవీఆర్‌’ నిబంధనలు...
టెక్నాలజీ కంపెనీలు జారీ చేసే డీవీఆర్‌(డిఫరెన్షియల్‌ ఓటింగ్‌ రైట్స్‌)షేర్లకు సంబంధించి కొత్త నిబంధనలు వచ్చే నెల 1 నుంచి  అమల్లోకి వస్తాయి.  ఫలితంగా ఈ టెక్నాలజీ కంపెనీలు సులభంగా ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు రావచ్చు.  కొత్త డీవీఆర్‌ నిబంధనలు టెక్నాలజీ కంపెనీలకే వర్తిస్తాయి. టెక్నాలజీ, ఐటీ, మేధోపరమైన హక్కులు, డేటా ఎనలిటిక్స్‌, బయో టెక్నాలజీ, నానో-టెక్నాలజీ సంబంధిత ఉత్పత్తులు, సేవలందించే టెక్నాలజీ కంపెనీలకే ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.  
టెక్నాలజీ కంపెనీలు ఓటింగ్‌ హక్కులు అధికంగా ఉండే (ఎస్‌ఆర్‌-సుపీరియర్‌ ఓటింగ్‌ రైట్స్‌) డీవీఆర్‌ షేర్లను జారీ చేసినా, సాధారణ ఈక్విటీ షేర్లతో కూడిన ఐపీఓకు రావచ్చు.
-ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో ఉన్న ప్రమోటర్లు/వ్యవస్థాపకులకే ఎస్‌ఆర్‌ డీవీఆర్‌ షేర్లను జారీ చేయాల్సి ఉంటుంది. ఐపీఓ పత్రాలు సెబీకి సమర్పించే కనీసం ఆరు నెలలకు ముందే ఎస్‌ఆర్‌ డీవీఆర్‌లను జారీ చేయాల్సి ఉంటుంది. 
-ఎస్‌ఆర్‌ డీవీఆర్‌లకు ఓటింగ్‌ హక్కులు కనీసంగా 2:1  నిష్పత్తి నుంచి గరిష్టంగా 10:1 నిష్పత్తిగా ఉంటాయి. సాధారణ షేర్లతో పోల్చితే, ఎస్‌ఆర్‌షేర్ల ఓటింగ్‌ హక్కులు 74 శాతానికి మించకూడదు. 
-కంపెనీ ఐపీఓకు వచ్చన తర్వాతనే ఎస్‌ఆర్‌ డీవీఆర్‌లను స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయాల్సి ఉంటుంది. 
-ఎస్‌ఆర్‌ డీవీఆర్‌ షేర్లు, సాధారణ ఈక్విటీ షేర్లు ఒక్క ఓటింగ్‌ హక్కు విషయంలో తప్ప మిగిలిన అన్ని అంశాల్లో (డివిడెండ్‌లు, ఇతర అంశాల విషయంలో )దాదాపు ఒకేలాగా ఉంటాయి.
-ఎస్‌ఆర్‌ డీవీఆర్‌ షేర్లను జారీచేసిన కంపెనీ ఇంకా ఐపీఓకు రాకపోతే, ఎస్‌ఆర్‌ షేర్లను సాధారణ ఈక్విటీ షేర్లలాగానే పరిగణిస్తారు. వీటికి అధిక ఓటింగ్‌ హక్కులు ఉండవు. 

మరింత కఠినంగా షేర్ల తనఖా వెల్లడి నిబంధనలు..
 ప్రమోటర్లు తనఖా పెట్టిన షేర్లకు సంబంధించిన వివరాల వెల్లడి నిబంధనలను మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ కఠినతరం చేసింది ప్రమోటర్లు తనఖా పెట్టిన షేర్ల మొత్తం కంపెనీ ఈక్విటీ మూలధనంలో 20 శాతానికి మించిన పక్షంలో షేర్ల తనఖా పెట్టటానికి గల కారణాలను ప్రమోటర్లు వెల్లడించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తనఖా విషయాన్ని ఆడిట్‌ సంస్థలకు ఆయా కంపెనీలు తెలియజేయాల్సి ఉంటుంది. షేర్ల తనఖా విషయమై సెబీ తాజా నిబంధనలు పారదర్శకతను మరింతగా పెంచుతాయని నిపుణులంటున్నారు.



You may be interested

వృద్ధికి మరింత కలసి పనిచేయాలి

Friday 28th June 2019

ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు కొనసాగించాలి ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వ్యాఖ్యలు ముంబై: నిదానించిన దేశ జీడీపీ వృద్ధి రేటుకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ మరింత సన్నిహితంగా కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అభిప్రాయపడ్డారు. వినియోగం, ప్రైవేటు పెట్టుబడులు తగ్గిపోవడం ద్రవ్య గణాంకాలపై ఒత్తిళ్లకు దారి తీస్తున్నట్టు ద్వైవార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదికలో గవర్నర్‌ పేర్కొన్నారు. ప్రైవేటు పెట్టుబడుల పునరుద్ధరణకు ఉమ్మడి చర్యలు అవసరమని, ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను

ఫుడ్‌ ప్యాకెట్లపై ‘రెడ్‌ సిగ్నల్‌’

Friday 28th June 2019

అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉంటే ఎర్ర కోడ్‌  కొత్త లేబులింగ్‌, డిస్‌ప్లే నిబంధనలు అమల్లోకి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు న్యూఢిల్లీ: మీరు ప్యాకేజ్డ్‌ ఆహార ఉత్పత్తులు తింటారా? ఒకవేళ వాటి ముందు భాగంలోనే ఎర్ర రంగు కోడ్‌ కనిపించిందనుకోండి!! అందులో అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర పరిమాణాలున్నాయని భావించాల్సిందే!!. ఎందుకంటే ఆహార భద్రత, ప్రమాణాల విభాగం (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) తాజాగా నూతన లేబులింగ్‌, డిస్‌ప్లే నిబంధనలను ప్రతిపాదించింది. వీటి ప్రకారం అధిక పరిమాణంలో ఫ్యాట్‌, చక్కెర,

Most from this category