News


బ్యాంకులపై ఆంక్షలు... డిపాజిట్లు భద్రమేనా..?

Monday 7th October 2019
personal-finance_main1570421338.png-28749

  • ఇటీవలే పీఎంసీ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు
  • ఒక ఖాతా నుంచి పరిమితంగా నగదు ఉపసంహరణ
  • ఆరు నెలల పాటు ఇదే పరిస్థితి
  • ఈ తరహా సందర్భాలపై అవగాహన తక్కువే
  • బ్యాంకు దివాలా తీస్తేనే డిపాజిట్‌పై బీమా
  • ఒక్కో కస్టమర్‌కు గరిష్టంగా రూ.లక్ష
  • తగిన జాగ్రత్తలతోనే ఖాతాదారులకు రక్షణ 

బ్యాంకుల్లో మన నగదు భద్రంగా ఉంటుందన్న భరోసాయే... వడ్డీ రాబడి తక్కువైనా కానీ ఇప్పటికీ చాలా మంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేయడానికి కారణం. కావాలనుకున్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా డిపాజిట్‌ను వెనక్కి తీసుకోవచ్చు. లిక్విడిటీ విషయంలో ఎటువంటి ఢోకా ఉండదు. ఈ వెసులుబాట్లే ఎఫ్‌డీల ఆదరణకు కారణమని చెప్పొచ్చు. కానీ, బ్యాంకు సంక్షోభంలో పడితే, మీ డిపాజిట్‌ పరిస్థితి ఏంటి..? మీ ఇష్టానికి అనుగుణంగా దానిని వెంటనే వెనక్కి తీసుకోలేరు.! బ్యాంకు పరిస్థితులు చక్కబడిన తర్వాతే తీసుకునేందుకు అనుమతిస్తామంటే..? తలచుకుంటేనే భయమేస్తోంది కదూ..! డిపాజిట్‌దారులకు ఉన్న రక్షణ కవచం ఏంటి? ఆర్‌బీఐకి ఉన్న అధికారాలు, పరిమితులు... ఇలాంటి వివరాలన్నీ మీ కోసం...

తాజాగా ముంబైకి చెందిన మహారాష్ట్ర అండ్‌ కోపరేటివ్‌ బ్యాంకులో అవకతవకల గురించి వార్తల్లో చూసే ఉంటారు. మొండి బాకీలను ఈ బ్యాంకు తక్కువ చేసి చూపించింది. ఈ బ్యాంకు మొత్తం రుణ పోర్ట్‌ఫోలియో రూ.8,800 కోట్లలో రూ.6,500 కోట్లను ఒక్క హెచ్‌డీఐఎల్‌ ఖాతాకు ఇవ్వడమే కాదు... దాన్ని ఆర్‌బీఐకి తెలియకుండా దాచిపెట్టింది. దీంతో ఆర్‌బీఐ రంగంలోకి దిగి బ్యాంకుపై ఆరు నెలల పాటు ఆంక్షలు అమల్లో పెట్టింది. ఒక్కో ఖాతా నుంచి కేవలం రూ.1,000 మాత్రమే వెనక్కి తీసుకునేందుకు అనుమతించింది. రెండు రోజుల తర్వాత రూ.10,000కు పెంచింది. వారం రోజుల తర్వాత తాజాగా రూ.25,000కు పెంచింది. దీంతో డిపాజిట్‌ దారుల్లో ఆందోళన ఒక్కసారిగా పెరిగిపోయింది. బ్యాంకు శాఖల వద్దకు చేరుకుని తమ డిపాజిట్లు వెనక్కిచ్చేయాలంటూ వారు డిమాండ్‌ చేయడం కూడా చూశాం. ఈ తరహా సందర్భాలు ఎదురైతే ఎంటన్న విషయమై ఖాతాదారులు, డిపాజిట్‌ దారుల్లో అవగాహన తక్కువే. రోజువారీ లావాదేవీలు నిర్వహించే వ్యాపారులు, స్వయం ఉపాధిలో ఉన్న వారికి ఈ తరహా పరిస్థితులు దిక్కుతోచనీయవు. కోపరేటివ్‌ బ్యాంకులతోపాటు వాణిజ్య బ్యాంకులపైనా ఆర్‌బీఐ ఈ విధమైన ఆంక్షలు విధించేందుకు అధికారాలు ఉంటాయి. 

ఆర్‌బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. అన్ని వాణిజ్య బ్యాంకులు, కోపరేటివ్‌ బ్యాంకులు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) బీమా కవరేజీ పరిధిలో ఉంటాయి. ప్రాథమిక సహకార సొసైటీలు మాత్రం దీని పరిధిలోకి రావు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం అన్ని కోపరేటివ్‌ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు తప్పనిసరిగా డీఐసీజీసీ కింద బీమా తీసుకోవాల్సి ఉంటుందని ‘మైమనీమంత్రా డాట్‌ ఇన్‌’ వ్యవస్థాపకుడు రాజ్‌ఖోస్లా తెలిపారు. ‘‘ప్రతీ డిపాజిట్‌ దారునికి గరిష్టంగా రూ. లక్ష బీమా ఉంటుంది. ఒకవేళ పీఎంసీ బ్యాంకు దివాలా తీస్తే అప్పుడు ఒక్కో డిపాజిట్‌ దారునికి గరిష్టంగా రూ.లక్ష లభిస్తుంది. సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాదారులు తమ డిపాజిట్లు పొందేందుకు మాత్రం చాలా సమయం తీసుకుంటుంది’’ అని ఖోస్లా వివరించారు. అసలు డిపాజిట్‌, దానిపై వడ్డీ సహా మొత్తం రూ.లక్ష పరిహారమే డీఐసీజీసీ ద్వారా లభిస్తుంది. పైగా ఒక్కో ఖాతాదారునికి సేవింగ్స్‌ బ్యాంకు డిపాజిట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఇలా పలు రూపాల్లో ఉన్నా కానీ దక్కే పరిహారం గరిష్టంగా రూ.లక్ష మాత్రమే. 

ఏ తరహా డిపాజిట్లకు రక్షణ...?
సేవింగ్స్‌, ఫిక్స్‌డ్‌, కరెంటు, రికరింగ్‌ డిపాజిట్లు అన్నీ కూడా డీఐసీజీసీ పరిధిలో బీమా కవరేజీ కిందకు వస్తాయి. కాకపోతే విదేశీ ప్రభుత్వాల డిపాజిట్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డిపాజిట్లు, ఇంటర్‌బ్యాంక్‌ డిపాజిట్లు, విదేశాల నుంచి స్వీకరించిన డిపాజిట్లు డీఐసీజీసీ పరిధిలోకి రావు. ఒకే బ్యాంకుకు సంబంధించి ఒకటికి మించిన శాఖల్లో ఒకే వ్యక్తికి వేర్వేరు డిపాజిట్లు ఉంటే..? అప్పుడు కూడా గరిష్టంగా రూ.లక్ష వరకే డీఐసీజీసీ కింద దక్కుతుంది. అదే వివిధ బ్యాంకుల్లో ఒకే వ్యక్తికి డిపాజిట్లు ఉంటే మాత్రం అప్పుడు ప్రతీ బ్యాంకులోని డిపాజిట్లపై గరిష్టంగా రూ.లక్ష పొందొచ్చు. ఉదాహరణకు ఎస్‌బీఐలో, పీఎన్‌బీలో ఒక వ్యక్తికి డిపాజిట్లు ఉంటే, అప్పుడు రెండు బ్యాంకుల్లోనూ బీమా కవరేజీ కింద గరిష్టంగా ఒక్కో రూ.లక్ష చొప్పున లభిస్తుంది. 

ఉమ్మడి ఖాతాలు అయితే...
ఒక్కరి పేరు మీద (సింగిల్‌) లేదా ఉమ్మడి ఖాతాల (జాయింట్‌) విషయంలో కవరేజీ మాత్రం వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు రవికి తన పేరుతో ఒక సేవింగ్స్‌ ఖాతా ఉంది. అలాగే, భార్య పేరుతోనూ రవికి జాయింట్‌ ఖాతా ఉందనుకోండి. బ్యాంకు దివాలా తీస్తే అప్పుడు డీఐసీజీసీ కింద రెండు ఖాతాలకూ బీమా కవరేజీ ఉంటుంది. 

సిప్‌లు, ఈసీఎస్‌ల పరిస్థితి..?
బ్యాంకు సంక్షోభంలో పడి ఆర్‌బీఐ ఆంక్షలు అమల్లోకి వస్తే... అప్పటికే మీ ఖాతా నుంచి రిజిస్టర్‌ అయి ఉన్న ఈసీఎస్‌లు, సిప్‌లు ఆగిపోయినట్టే. వాటికి సంబంధించిన మొత్తాలను మీ ఖాతా నుంచి డెబిట్‌ కావని రాజ్‌ఖోస్లా తెలిపారు. కనుక మీరు మరో ఖాతా నుంచి సిప్‌, ఈఎంఐలకు సంబంధించి ఈసీఎస్‌ ఇన్‌స్ట్రక్షన్‌ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. 

ముందు జాగ్రత్తలే కాపాడతాయి...
పీఎంసీ బ్యాంకు అనుభవం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే కోపరేటివ్‌ బ్యాంకులు అధిక వడ్డీని ఆఫర్‌ చేస్తుంటాయి. అంటే రిస్క్‌ కొంచెం ఎక్కువే ఉంటుందని అర్థం చేసుకోవాలి. వీటిని ఆర్‌బీఐతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పర్యవేక్షిస్తుంటాయి. ‘‘కోపరేటివ్‌ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వరంగ, ప్రైవేటు బ్యాంకుల విషయంలో నిబంధనల పరంగా ఆర్‌బీఐ మరింత కఠినంగా వ్యవహరిస్తుంటుంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో మోసం వెలుగులోకి వచ్చినప్పుడు ఆర్‌బీఐ కఠినంగానే వ్యవహరించింది. కనుక వ్యక్తులు ఒకే బ్యాంకులో ఎక్కువ మొత్తం డిపాజిట్‌ చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే ఆర్‌బీఐ ఆంక్షలతో నిధులు పొందలేని పరిస్థితి ఎదురవుతుంది’’అని ఖోస్లా సూచించారు. బ్యాంకు కస్టమర్లు తమ బ్యాంకుల ఆరోగ్య పరిస్థితులపై ఒక కన్నేసి ఉంచడం ఎంతో అవసరమని తాజా పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా కోపరేటివ్‌ బ్యాంకు కస్టమర్లు అయితే ఇది ఇంకా అవసరం. బ్యాంకుకు సంబంధించి ఆస్తులపై రాబడులు (ఆర్‌వోఏ), నికర ఎన్‌పీఏల రేషియోను గమనించడం ద్వారా ఆ బ్యాంకు ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా సామాన్యులు అయినా కానీ, వ్యాపారులు అయినా కానీ ఒకే ఖాతాపై ఆధారపడకుండా, వేర్వేరు బ్యాంకుల్లో కనీసం రెండు ఖాతాల పరిధిలో తమ డిపాజిట్లను వేరు చేసుకోవడం ద్వారా ఈ తరహా సంక్షోభ పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా చూసుకోవచ్చు. 



You may be interested

నష్టాల్లో చమరు

Monday 7th October 2019

అంతర్జాతీయ చమురు డిమాండ్‌ ఆందోళనలు వెంటాడుతుండడంతో చమురు ధరలు సోమవారం కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఉదయం 9.36 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.43 శాతం నష్టపోయి బారెల్‌ 58.12 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.27 శాతం నష్టపోయి 52.67 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ వారం చివరిలో వాషింగ్టన్‌లో యుఎస్‌-చైనా ప్రతినిధుల మధ్య జరగనున్న వాణిజ్య చర్చలపై ఇన్వెస్టర్ల దృష్ఠి మరలింది. కాగా యుఎస్‌, చైనా తయారిరంగం పనితీరు

ఐసీఐసీఐ లైఫ్‌తో ఎయిర్‌టెల్‌ బ్యాంక్‌ జట్టు

Monday 7th October 2019

ప్రైవేట్‌ రంగ జీవిత బీమా సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తాజాగా ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకుతో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం ఐసీఐసీఐ ప్రూ లైఫ్‌ జీవిత బీమా పాలసీలతో పాటు ఇతరత్రా పొదుపు పథకాలను కూడా ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాదారులు సులభతరంగా పొందేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. చౌక ప్రీమియంలతో మెరుగైన పథకాలను అందించడం, టెక్నాలజీని వినియోగించుకుని కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయడంపై దృష్టి

Most from this category