News


మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులో తెలుగు ఇన్వెస్టర్లు ఎక్కడ...?

Thursday 25th July 2019
personal-finance_main1563993538.png-27292

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల (ఏఎంసీలు) నిర్వహణలోని ఆస్తులు జూన్‌లో 9.52 శాతం పెరిగి రూ.25.81 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తుల వాటా 42.3 శాతం. మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ (యాంఫి) వద్ద అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం... మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల్లో 41.8 శాతం వాటాతో మహారాష్ట్ర మరే రాష్ట్రానికీ అందనంత దూరంలో అగ్ర స్థానంలో ఉంది. ఆ తర్వాత న్యూఢిల్లీ 8.9 శాతం, కర్ణాటక 7.1 శాతం, గుజరాత్‌ 6.9 శాతం, పశ్చిమబెంగాల్‌ 5.3 శాతం, హర్యానా 4.9 శాతం, తమిళనాడు 4.7 శాతం, ఉత్తరప్రదేశ్‌ 4 శాతం, రాజస్థాన్‌ 1.7 శాతం వాటాతో వరుసగా తొమ్మిది స్థానాల్లో ఉన్నాయి.

 

ఇక పదో స్థానంలో ఉన్న తెలంగాణ వాటా 1.7 శాతంగా ఉంది. అంటే ఏఎంసీల వద్దనున్న అన్ని రకాల పెట్టుబడుల్లో తెలంగాణ ఇన్వెస్టర్ల వాటా 1.7 శాతం. తెలంగాణ తర్వాత 1.4 శాతం వాటాతో ఆంధ్రప్రవేశ్‌ 11వ స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్‌ 1.3 శాతం, పంజాబ్‌ 1.1 శాతం, కేరళ ఒక శాతం, ఒడిశా 0.9 శాతం, జార్ఖండ్‌ 0.8 శాతం, బిహార్‌ 0.7 శాతం, గోవా 0.7 శాతం, ఛత్తీస్‌గఢ్‌ 0.6 శాతం, అసోమ్‌ 0.5 శాతం వాటా కలిగి ఉన్నాయి. 

 

ఇక ఈ గణాంకాల్లోనూ ఆసక్తికరమైన అంశాలు ఏమిటంటే... ఏఎంసీల మొత్తం నిర్వహణ ఆస్తుల్లో జార్ఖండ్‌ వాటా కేవలం 0.8 శాతమే కాగా, ఇందులోనూ 74 శాతం పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోనివే. ఒక రాష్ట్రం నుంచి వచ్చే పెట్టుబడుల్లో అత్యధిక ఈక్విటీ వాటాతో జార్ఖండ్‌ ప్రథమ స్థానంలో ఉండడం ఆసక్తికరమైన అంశం. ఇక 0.7 శాతం నిర్వహణ ఆస్తుల వాటా కలిగిన బిహార్‌ రెండో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రం నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి వెళ్లిన పెట్టుబడుల్లో 73 శాతం ఈక్విటీలవే. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే... తెలంగాణ ఇన్వెస్టర్ల మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా 45 శాతంగా ఉంటే, ఆంధ్రప్రదేశ్‌ ఇన్వెస్టర్ల ఈక్విటీ వాటా మొత్తం పెట్టుబడుల్లో కాస్త మెరుగ్గా 58 శాతం మేర ఉండడం గమనార్హం.

 

ఈక్విటీ పథకాల్లోని మొత్తం పెట్టుబడుల్లో 88 శాతం రిటైల్‌, హెచ్‌ఎన్‌ఐ ఇన్వెస్టర్ల నుంచి వచ్చినవే. అదే లిక్విడ్‌, మనీ మార్కెట్‌ పథకాల్లో 85 శాతం పెట్టుబడులు ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల నుంచి వచ్చినవి. ‘‘చిన్న రాష్ట్రాల ఇన్వెస్టర్లు ఎక్కువ శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లే. వారి లక్ష్యాలు దీర్ఘకాలంతో కూడిన వివాహం, విద్య వంటివి. ఈక్విటీల్లో సిప్‌ ద్వారా దీర్ఘకాలం పాటు వారు కొనసాగగలరు’’ అని ముంబైకి చెందిన మ్యూచువల్‌ ఫండ్స్‌ డిస్ట్రిబ్యూటర్‌ చంద్రేష్‌ ప్రతాప్‌ తెలిపారు.You may be interested

స్వల్పంగా పెరిగిన చమురు..

Thursday 25th July 2019

గత సెషన్‌లో 1 శాతం మేర పడిపోయిన చమురు ధరలు గురువారం ట్రేడింగ్‌లో స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 6 సెంట్లు పెరిగి బ్యారెల్‌కు 63.24 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 12 సెంట్లు పెరిగి బ్యారెల్‌కు 55.99 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ చమురు డిమాండ్‌ ఆందోళనల నేపథ్యంలో గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 1 శాతం, డబ్యూటీ క్రూడ్‌ 1.6 శాతం నష్టపోయి ముగిశాయి. అమెరికా, యూరోప్‌

11,200 వరకు పతనం..!

Thursday 25th July 2019

నిఫ్టీ బుధవారం 11,300కు దిగువన క్లోజయింది. నిజానికి 11,300 అన్నది కీలకమైన మద్దతు స్థాయి. 200 రోజుల ఎక్స్‌పొనెన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ అక్కడే ఉంది. దీనిని కోల్పోవడంతో రానున్న సెషన్లలో నిఫ్టీ ఇంకా నష్టపోవచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.    ‘‘స్వల్ప కాలిక ఆసిల్లేటర్స్‌ అమ్మకాల ఒరవడిలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇండెక్స్‌ తన మద్దతు స్థాయి అయిన 11,130-11,260 శ్రేణిలో ట్రేడ్‌ కావచ్చు’’ అని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ అరుణ్‌ కుమార్‌

Most from this category