News


అప్పు చేసి ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయొచ్చా ?

Monday 4th November 2019
personal-finance_main1572837887.png-29315

(ధీరేంద్ర కుమార్‌, వాల్యూ రీసెర్చ్‌ సీఈవో)

ప్ర: నా వయస్సు 36 సంవత్సరాలు. తాతల నాటి ఆస్తి కేసు ఒక కొలిక్కి వచ్చి నా వాటాగా రూ.36 లక్షలు వచ్చాయి. ఈ డబ్బులను గృహ రుణం తీర్చడానికి వినియోగించాలా ?లేక రిటైర్మెంట్‌ అవసరాల కోసం ఈక్విటీ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయాలా ? తగిన సలహా ఇవ్వండి.
- వంశీ, హైదరాబాద్‌
జ: ఈ డబ్బులను ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తేనే మంచిది. ఎవరైనా సరే తమ జీవితంలో అస్సలు అప్పు చేయకూడదు. అయితే గృహ రుణం దీనికి మినహాయింపు. ఇల్లు సమకూర్చుకోవడానికైతే అప్పు చేయవచ్చు. ఇంటికోసం తప్ప మరేదాని కోసమైనా అప్పు చేయడమనేది నా దృష్టితో తప్పే. ఇంటి కోసం గృహ రుణం తీసుకుంటే మనకు రెండు ప్రయోజనాలు లభిస్తాయి. ఒకటి తక్కువ వడ్డీరేటుకే రుణం లభిస్తుంది. పన్ను ప్రయోజనాలు దక్కడం రెండో ప్రయోజనం. అందుకే ఇంటి కోసం రుణం తీసుకోవడం సమర్థనీయం. అయితే గృహ రుణం విషయంలో రెండు అంశాలను గమనించాలి. రుణం తీసుకున్న ఇంటిలోనే మనం నివసించాలి. ఫలితంగా మనకు అద్దె ఆదా అవుతుంది. ఇన్వెస్ట్‌మెంట్‌ ఉద్దేశంతో రుణం తీసుకొని ఇంటిని కొనకూడదు. ఇన్వెస్ట్‌మెంట్‌ ఉద్దేశంతో ఇల్లు కొనుగోలు చేసి, దానిని అద్దెకిచ్చారనుకోండి. వచ్చే అద్దె డబ్బులు కన్నా మీరు చెల్లించే వడ్డీ డబ్బులే అధికంగా ఉంటాయని గమనించండి. ఇప్పుడు కొన్న ఇంటి విలువ భవిష్యత్తులో పెరుగుతుందని, ఆ మేరకు అది ప్రయోజనకరమేనన్న వాదన ఒకటి ఉంది. ఇది కొంత వరకూ నిజమే అయినా, అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే మనం అంచనా వేయలేం. మన అంచనాలకు అతీతమైన విషయాలు (సరఫరాలు పెరగడం, ప్రభుత్వం ఏమైనా నిబంధనలు తేవడం)ఎన్నో ఉంటాయి. మరోవైపు రియల్‌ ఎస్టేట్‌ ఒక ఇన్వెస్ట్‌మెంట్‌ అనే భావించే వాళ్లు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. గతంలో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వేరు. ఇప్పుడున్న రియల్‌ ఎస్టేట్‌ వేరు. గతంలో ఒకరు రూ.5 లక్షలకు కొనుగోలు చేసిన స్థలం విలువ ఇప్పుడు రూ. 5 కోట్లకు పెరిగిందని కథలు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి దాదాపు లేదని చెప్పవచ్చు. ఇక గృహ రుణానికి సంబంధించిన ఈఎమ్‌ఐ (నెలవారీ వాయిదా) మీ నెల జీతంలో మూడో వంతుకు మించకుండా ఉండాలి. ఇక మీ విషయానికి వస్తే, కోర్టు కేసు గెలవడం ద్వారా వచ్చిన  మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయండి. మీ దగ్గరున్న మొత్తాన్ని 2-3 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేసేలా సమాన భాగాలు చేయండి. ఏదైనా మంచి ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకోండి. నెలకు కొంత మొత్తం చొప్పున సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయండి.

ప్ర: నేను కొంత మొత్తాన్ని పర్సనల్‌ లోన్‌గా తీసుకుని, ఆ డబ్బులతో షేర్లను కొనుగోలు చేయాలనుకుంటున్నాను. కొంత మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో కూడా ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా ?
- కిరణ్‌, విశాఖపట్టణం 
జ: పర్సనల్‌ లోన్‌ తీసుకొని, ఆ డబ్బులను షేర్లలో, మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడమనేది సరైన నిర్ణయం కాదు. అంతేకాకుండా అపాయకరమైన నిర్ణయం అని కూడా చెప్పవచ్చు. పర్సనల్‌ లోన్‌ తీసుకొని మీరు షేర్లలో ఇన్వెస్ట్‌ చేసి మంచి లాభాలు సాధించారనుకోండి. మీ అంచనాలు సక్సెస్‌ అయి మీరు మంచి స్పెక్యులేటర్‌ అవుతారు. ఒకవేళ మీకు నష్టాలు వచ్చాయనుకోండి. మీకు కష్టాలు తప్పవు. పర్సనల్‌ లోన్‌పై వడ్డీ చెల్లించడంతో పాటు మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ విలువను కూడా కోల్పోతారు. మార్కెట్‌ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ అంచనా వేయలేరు. కాబట్టి పర్సనల్‌ లోన్‌ సొమ్ములను ఎప్పుడూ షేర్లలో ఇన్వెస్ట్‌ చేయకూడదు. అప్పు చేసి డబ్బులు తేవడమనేది, ఆటోని  అద్దెకు తీసుకోవడం లాంటిది. మీటర్‌ తిరుగుతున్నంత సేపు మీరు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అలాగే ఎంత తక్కువ వడ్డీరేటుకు అప్పు తెచ్చినా, వడ్డీ ఎంతో కొంత చెల్లించాల్సి ఉంటుంది కదా ! 12 శాతం వడ్డీకి అప్పు తెచ్చి 15 శాతం రాబడులు వచ్చే దాంట్లో ఇన్వెస్ట్‌ చేస్తే, 3 శాతం లాభమని, మనది కాని సొమ్ములపై ఈ మాత్రం లాభం సాధించడం మంచిదే కదా అని కొందరు లాజిక్‌ చెప్తారు. పరిస్థితులు బాగా ఉన్నప్పుడు ఈ లాజిక్‌లు బాగానే ఉంటాయి. ఒక వేళ మార్కెట్‌ మరింతగా తగ్గిందనుకోండి. అప్పుడు మనకు 15 శాతం రాబడులు కాదు కదా, 10 శాతం రాబడులు కూడా రావు. ఒకవేళ మార్కెట్‌ మరింతగా పడిపోయి, మనకు రాబడులు బదులు నష్టాలు వచ్చాయనుకోండి. అప్పుడు మనకు వడ్డీ భారం, నష్టాల భారం రెండూ తప్పవు. అందుకని ఎప్పుడూ అప్పు చేసి షేర్లలో, ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయకండి. మీకు నెలకు వచ్చే ఆదాయంలో కనీసం 10-20 శాతం మేర పొదుపు చేయండి. ఏదైనా మంచి ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకొని ఈ మొత్తాన్ని సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయండి. ఏడాదికొక్కసారైనా, మీ ఫండ్‌ పనితీరును మదింపు చేస్తూ ఉండండి. You may be interested

డిసెంబర్‌ ఆఖరుకల్లా నిధుల సమీకరణ

Monday 4th November 2019

రూ. 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులపై  యస్‌ బ్యాంక్ ప్రణాళిక కొత్త ఇన్వెస్టర్లకు బోర్డులో స్థానం కల్పించే యోచన 33 శాతం వాటాలకు అవకాశం ముంబై: నిధుల వేటలో ఉన్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్.. ప్రతిపాదిత రూ. 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,462 కోట్లు) పెట్టుబడుల సమీకరణ ప్రక్రియను డిసెంబర్‌ ఆఖరునాటికల్లా పూర్తి యోచిస్తోంది. అలాగే, కొత్త ఇన్వెస్టర్లకు బోర్డులో కూడా స్థానం కల్పించాలని భావిస్తోంది. నిధుల సమీకరణ కోసం పలువురు

ఈ వారం రికమెండేషన్లు

Monday 4th November 2019

ఎస్‌బీఐ    కొనచ్చు  బ్రోకరేజ్‌ సంస్థ:- ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌  ప్రస్తుత ధర:- రూ.313 టార్గెట్‌ ధర:- రూ.390 ఎందుకంటే:- దేశంలో అతి పెద్ద వాణిజ్య బ్యాంక్‌ ఇదే. ఈ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్‌ సైజు రూ.36 లక్షల కోట్లుగా, మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2.5 లక్షల కోట్లుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 22 వేల బ్రాంచ్‌లతో 43 కోట్లకు పైగా ఖాతాదారులకు సేవలందిస్తోంది. యోనో యాప్‌తో డిజిటల్‌ స్పేస్‌లోనూ జోరు చూపిస్తోంది. గత రెండేళ్లుగా మార్జిన్లు అధికంగా

Most from this category