News


మీ ‘పన్ను’ దారేది..?

Monday 10th February 2020
personal-finance_main1581309452.png-31645

  • ఐటీ: కొత్తదా.. పాతదా?
  • ఎవరికి ఏ పన్ను విధానం ప్రయోజనం...
  • రూ.10 లక్షల ఆదాయంపై ప్రస్తుత విధానమే లాభం
  • మినహాయింపులను పూర్తిగా వినియోగించుకోవాలి
  • దాంతో పన్ను బాధ్యత లేకుండా చూసుకోవచ్చు
  • సెక్షన్‌ 80సీ ఇన్వెస్ట్‌ చేయని వారికి
  • పన్ను ఆదా ప్రయోజనాలు క్లెయిమ్‌ చేసుకోని వారికి
  • నూతన పన్ను విధానం ప్రయోజనకరం
  • ఎవరికి ఏదన్నది వారి ఆర్థిక ప్రణాళిక ప్రకారమే నిర్ణయం

ఆదాయపన్ను రేట్లు తగ్గుతాయని ఆశగా ఎదురు చూసిన వారిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నూతన పన్ను రేట్లతో అయోమయంలో పడేశారు. ప్రస్తుత పన్ను విధానం లేదా నూతన పన్ను విధానంలో తమకు అనుకూలమైన విధానంలోనే రిటర్నులు దాఖలు చేసుకోవచ్చని ప్రకటించారు. రూ.15 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ఆదాయపన్నును కొంత మేరకు తగ్గిస్తూ నూతన పన్ను రేట్లను మంత్రి ప్రతిపాదించారు. అంటే ప్రస్తుతమున్న విధానంలోనే కొనసాగడం లేదా నూతన విధానానికి మారడం పన్ను చెల్లింపుదారుల అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది. మరి నూతన పన్ను విధానానికి మారిపోవాలా..? లేక ఇప్పుడున్న విధానంలోనే కొనసాగాలా..? అని ప్రశ్నిస్తే.. అది ఒక్కో వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. తమ ఆదాయాన్ని బట్టి దీనిపై నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. పాత, కొత్త విధానంలో పన్ను భారంపై అవగాహన కల్పించే ప్రాఫిట్‌ కథనం ఇది. 

రూ.15 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తి నూతన పన్ను విధానంలో రూ.78,000ను ఆదా చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి బడ్జెట్‌ సందర్భంగా ప్రకటించారు. ఇది నిజమే. కానీ, ఎవరికి ఈ ప్రయోజనం నిజంగా అంటే.. ఎటువంటి మినహాయింపులను క్లెయిమ్‌ చేసుకోని వారికే నూతన పన్ను విధానంతో ప్రయోజనమని క్లుప్తంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆదాయపన్ను విధానంలో ఎన్నో మినహాయింపులు(ఎగ్జంప్షన్‌), తగ్గింపులు(డిడక్షన్‌) ఉన్నాయి. అయితే, కొందరు కొన్ని రకాల మినహాయింపులనే వినియోగించుకుంటుంటే, కొందరు అయితే అస్సలు ఏ ప్రయోజనాన్ని కూడా వాడుకోకుండా రిటర్నులు ఫైల్‌ చేస్తున్నారు. ఇలా ఏ డిడక్షన్‌, ఎగ్జంప్షన్‌ వినియోగించుకోని వారికి నూతన పన్ను రేట్లు ప్రయోజనకరం. అలాగే, తీసివేతలు, మినహాయింపుల గందరగోళాన్ని అర్థం చేసుకోలేని వారు నూతన విధానానికి మారిపోవచ్చు. లేదు, చట్ట పరిధిలో అన్ని మినహాయింపులు, తగ్గింపులను ఉపయోగించుకుంటానంటే ప్రస్తుత విధానంలోనే ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. ‘‘ఇదొక మంచి నిర్ణయం. తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఇచ్చినట్టయింది’’ అని ట్యాక్స్‌స్పానర్‌ సహ వ్యవస్థాపకుడు సుధీర్‌ కౌశిక్‌ పేర్కొన్నారు. ‘‘హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌, సెక్షన్‌ 80సీ కింద మినహాయింపులు పొందుతున్న వారికి నూతన పన్ను విధానానికి మారిపోవడం ప్రయోజనం కరం కాదు’’ అని అశోక్‌ మహేశ్వరి అండ్‌ అసోసియేట్స్‌ ట్యాక్స్‌ లీడర్‌ అమిత్‌ మహేశ్వరి తెలిపారు.

ప్రస్తుత విధానంలో మినహాయింపులు ఇవి...

చాప్టర్‌ 6ఏ పరిధిలోని సెక్షన్‌ 80సీ, సెక్షన్‌ 80డీ, సెక్షన్‌ 80సీసీడీ మినహాయింపులు రూ.2,50,000ను పూర్తిగా వినియోగించుకున్నట్టు అయితే రూ.7,50,000 వరకు ఆదాయం ఉన్న వారు కూడా ప్రస్తుత విధానంలో రూపాయి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే, రుణంపై ఇంటిని కొనుగోలు చేసిన వారు చాప్టర్‌ 6ఏకు అదనంగా సెక్షన్‌ 24 కింద ఇంటి రుణానికి చేసే వడ్డీ చెల్లింపులు రూ.2,00,000పై, స్టాండర్డ్‌ డిడక్షన్‌ 50,000ను కూడా వినియోగించుకుంటే అప్పుడు మొత్తం రూ.10,00,000 ఆదాయం ఉన్నప్పటికీ చెల్లించాల్సిన పన్ను బాధ్యత సున్నాయే అవుతుంది. ఇక సెక్షన్‌ 80టీటీఏ కింద డిపాజిట్లపై వడ్డీ రూ.10,000 వరకు మినహాయింపు కూడా ఉంది. నూతన పన్ను విధానానికి మారితే జీవిత బీమా ప్రీమియం, వైద్య బీమా ప్రీమియం, ఇంటి రుణానికి చేసే వడ్డీ చెల్లింపులతోపాటు ఎల్‌టీఏ తరహా మినహాయింపులను కోల్పోవాల్సి వస్తుంది.  

 

ఒక్కసారి మారిపోతే..?
ప్రస్తుత విధానంలో కొనసాగొచ్చు లేదా నూతన విధానానికి మారిపోవచ్చన్న వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే, ఈ రెండింటిలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఏటేటా ఉంటుందా..? లేక ఒక్కసారి నూతన విధానానికి మారిపోతే అందులోనే మరుసటి ఏడాది నుంచి రిటర్నులు దాఖలు చేయాలా..? అన్న సందేహం రావచ్చు. ఏ విధానంలో రిటర్నులు దాఖలు చేయవచ్చన్నది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
‘‘వ్యక్తులు లేదా హిందూ అవిభాజ్య కుటుంబం ఎటువంటి వ్యాపార ఆదాయం లేకపోతే, గడిచిన ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయంపై రిటర్నులు ఏ విధానంలో దాఖలు చేయాలన్నది ఎంచుకునే ఆప్షన్‌ ఉంటుంది. ఇతర కేసుల్లో అయితే, ఒక్కసారి నూతన విధానానికి మారిపోతే ఆ తర్వాత నుంచి అదే విధానంలో కొనసాగాల్సి ఉంటుంది’’ అని బడ్జెట్‌ మెమొరాండం స్పష్టం చేస్తోంది. 
‘‘ప్రతీ ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు ఏ పన్ను విధానాన్ని అయినా ఎంచుకోవచ్చు. పన్ను మినహాయింపులు, తగ్గింపులతో రిటర్నులు దాఖలు చేయవచ్చు లేదా నూతన విధానంలో తక్కువ పన్ను రేట్ల ప్రకారం రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని షరతులు ఉన్నాయి. ఎటువంటి వ్యాపార ఆదాయం లేని వారు నూతన పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. ఒకవేళ వ్యాపార ఆదాయం ఉన్న వారు మినహాయింపులు, తగ్గింపులను వినియోగించుకుని ప్రస్తుత విధానంలో పన్ను రిటర్నులు దాఖలు చేసినట్టయితే అప్పుడు పాత విధానంలోనే కొనసాగినట్టవుతుంది. తర్వాతి సంవత్సరాల్లోనూ నూతన విధానానికి మారే అవకాశం ఉండదు’’ అని ట్యాక్స్‌మన్‌ డాట్‌ కామ్‌ డీజీఎం నవీన్‌ వాధ్వా తెలియజేశారు. 
‘‘వ్యాపార ఆదాయం లేని పన్ను చెల్లింపుదారుడు ప్రస్తుత విధానం లేక నూతన ప్రతిపాదిత విధానాన్ని ఎంచుకోవచ్చు. ఏది లాభదాయకమైతే దాన్ని ఎంచుకోవచ్చు. అయితే, వ్యాపార ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారునికి ఈ రెండింటిలో ఎందులో కొనసాగాలన్న ఆప్షన్‌ ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత దాన్ని మార్చుకోవడానికి కుదరదు. ఒకవేళ వ్యాపార ఆదాయం ఉన్న వారు భవిష్యత్తులో వ్యాపారం నుంచి తప్పుకుంటే అప్పుడు ప్రస్తుత, నూతన విధానంలో దేనిని అయినా ఎంపిక చేసుకోవచ్చు. అదే విధంగా ప్రస్తుతం ఎటువంటి వ్యాపార ఆదాయం లేకుండా, భవిష్యత్తులో వ్యాపార ఆదాయం పొందిన వారి పరిస్థితి ఏంటన్న దానిపై అధికారులు వివరణ ఇస్తే సౌలభ్యంగా ఉంటుంది’’ అని డెలాయిట్‌ ఇండియా పార్టనర్‌ దివ్య భవేజా తెలిపారు. 

ఏ విధానంలో ఎంత భారం

  • రూ.7.5 లక్షలు ఆదాయం ఉన్న వారు

- స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50,000, సెక్షన్‌ 80సీ సాధనాల్లో రూ.1,50,000 పెట్టుబడులతోపాటు ఎన్‌పీఎస్‌ (రిటైర్మెంట్‌ సాధనం)లో అదనంగా రూ.50,000ను ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మొత్తం రూ.2,50,000 ఆదాయంపై మినహాయింపులు పొందొచ్చు. ఎన్‌పీఎస్‌ లేకపోతే సెక్షన్‌ 80డీ కింద తన కుటుంబానికి, తన తల్లిదండ్రులకు చెల్లిస్తున్న వైద్య బీమా ప్రీమియంను మినహాయింపుగా చూపించుకున్నా సరిపోతుంది. మొత్తం ఆదాయం రూ.7,50,000 నుంచి మినహాయింపులు రూ.2.5 లక్షలను తీసివేయగా మిగిలిన పన్ను వర్తించే ఆదాయం రూ.5,00,000 అవుతుంది. పన్ను వర్తించే ఆదాయం మినహాయింపుల తర్వాత రూ.5లక్షలు దాటనందున సెక్షన్‌ 87ఏ కింద పన్ను చెల్లించకుండా రిబేటు పొందొచ్చు.
- నూతన విధానంలో ఈ మినహాయింపులు ఏవీ లేవు కనుక.. మొదటి రూ.2,50,001-5,00,000పై 5 శాతం కింద రూ.12,500, తర్వాతి రూ.2.5 లక్షలపై 10 శాతం పన్ను రేటు ప్రకారం రూ.25,000.. మొత్తం రూ.37,500 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 
- ఒకవేళ పాత విధానంలోనే కొనసాగుతూ కొన్ని మినహాయింపులనే క్లెయిమ్‌ చేసుకునేట్టు అయితే.. ఉదాహరణకు ఎన్‌పీఎస్‌లో ఇ‍న్వెస్ట్‌ చేయని వారు, సెక్షన్‌ 80సీ కింద రూ.150,000, స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50,000, సెక్షన్‌ 80డీ కింద వైద్య బీమా ప్రీమియంను మినహాయింపులుగా చూపించుకోవచ్చు. అలా రూ.2,00,000ను మినహాయింపుగా చూపించుకున్నారనుకుంటే.. మిగిలిన రూ.50,000పై ప్రస్తుత విధానంలో 20 శాతం పన్ను రేటు ప్రకారం రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చూసినప్పుడు ప్రస్తుత విధానంలోనే కొనసాగడం నయం.
- ఒకవేళ సెక్షన్‌ 80సీ కింద కేవలం రూ.1,00,000 మాత్రమే వినియోగించుకుని, స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50,000ను కూడా క్లెయిమ్‌ చేసుకుంటే అప్పుడు పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ.1,00,000 అవుతుంది. దీనిపై 20 శాతం అంటే రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా కూడా ప్రయోజనమే. 
- వేతన జీవులకు పీపీఎఫ్‌ ఉంటుంది. దీనికితోడు జీవిత బీమా ప్రీమియం, పిల్లల ట్యూషన్‌ ఫీజులు, పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ, సుకన్య సమృద్ధి యోజన ఈ తరహా పెట్టుబడుల్లో కొన్ని తప్పనిసరిగా ఉంటాయి. ఎంతలేదన్నా సెక్షన్‌ 80సీ కింద కనీసం రూ.50,000వరకు పెట్టుబడులు ఉంటాయి. దీనికి స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50,000 కలుపుకోవచ్చు. అలాగే, వైద్య బీమా ప్రీమియం కూడా రూ.12,000 వరకు చెల్లిస్తున్న వారు చాలా మందే ఉంటారు.  ఈ విధంగా చూస్తే కనీస మినహాయింపులు రూ.1,00,000-1,50,000 వరకు ఎక్కువ మందికి ఉంటుంటాయి. వీరికి ప్రస్తుత విధానమే లాభకరం.

  • రూ.10 లక్షల ఆదాయం ఉన్న వారు

- వీరు కూడా స్టాండర్డ్‌ డిడక్షన్‌, సెక్షన్‌ 80సీ, 80సీసీడీ కింద పూర్తిగా రూ.3,00,000ను వినియోగించుకుంటే అప్పుడు రూ.2,00,000 మొత్తంపై ప్రస్తుత విధానంలో 20 శాతం కింద రూ.40,000 పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ గృహ రుణం తీసుకుని వడ్డీ చెల్లిస్తుంటే ఆ విధంగా మరో రూ.2,00,000పైనా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. దీంతో నికరంగా చెల్లించాల్సిన పన్ను సున్నాయే అవుతుంది. ఇప్పటి వరకు ఇల్లు సమకూర్చుకోని వారు రుణంపై ఇంటిని తీసుకోవడం ద్వారా ఈ ఆదాయ వర్గాల వారు ఏటా రూ.40,000 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. 
- అదే నూతన విధానంలో రూ.2,50,001-5,00,000పై 5 శాతం కింద రూ.12,500, 5,00,001-7,50,000 ఆదాయంపై 10 శాతం ప్రకారం రూ.25,000వేలు, తర్వాత రూ.2,50,000పై 15 శాతం పన్ను రేటు ప్రకారం రూ.37,500 మొత్తం రూ.75,000 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 
- ప్రస్తుత విధానంలో కనీసం సెక్షన్‌ 80సీ, 80సీసీడీ, 80డీ, స్టాండర్డ్‌ డిడక్షన్‌లు వినియోగించుకున్నా నూతన విధానంతో పోలిస్తే తక్కువ పన్ను చెల్లిస్తే సరిపోతుంది. 
- ఒకవేళ ప్రస్తుత విధానంలో ఏ మినహాయింపులను క్లెయిమ్‌ చేసుకోని వారు, అదే సమయంలో సెక్షన్‌ 80సీలో కేవలం రూ.లక్ష వరకు ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టయితే అప్పుడు వీరు రూ.4,00,000పై ప్రస్తుత విధానంలోనే 20 శాతం పన్ను రేటుపై రూ.80,000 చెల్లించాల్సి వస్తుంది. కనుక వీరు నూతన విధానానికి మారిపోవడం మంచిది.
-  ఒకవేళ ఇంటి రుణం లేని వారికి హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. కనుక దాన్ని పరిగణనలోకి తీసుకుని చూడాలి. హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్‌కు మూడు విధానాలున్నాయి. వేతనంలో భాగంగా ఉద్యోగి పొందుతున్న వాస్తవ హెచ్‌ఆర్‌ఏ మొత్తం.. లేదా మెట్రోల్లో నివసించే వారి మూల వేతనంలో 50 శాతం, అదే నాన్‌ మెట్రో ప్రాంతాల్లోని వారి మూల వేతనంలో 40 శాతం.. లేదా మీరు వార్షికంగా చెల్లించిన అద్దె నుంచి మీ వార్షిక వేతనంలో 10 శాతాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం. ఈ మూడింటింలో ఏది తక్కువ అయితే ఆ మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు.
- 10 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారు ఇక్కడ ఇచ్చిన టేబుల్స్‌ ప్రకారం తమ పెట్టుబడులను అన్నింటినీ లిస్ట్‌ చేసుకుని, మినహాయింపులను పరిగణనలోకి తీసుకుని అప్పుడు ఏ విధానంలో రిటర్నులు దాఖలు చేయాలన్నది నిర్ణయించుకోవచ్చు. 

నోట్‌:
నూతన విధానంలోనూ ఎన్‌పీఎస్‌పై పన్ను ఆదా చేసుకునే ఒక అవకాశాన్ని కొనసాగించారు. అది వ్యక్తిగతంగా ఎన్‌పీఎస్‌లో చేసే పెట్టుబడులు కాకుండా.. ఉద్యోగుల తరఫున కంపెనీలు ఎన్‌పీఎస్‌కు జమ చేసే చందాలకు సెక్షన్‌ 80సీసీడీ (2) కింద పన్ను ఆదా ప్రయోజనం వర్తిస్తుంది. మూలవేతనం, కరువు భత్యం (డీఏ)పై వార్షికంగా 10 శాతం ఎన్‌పీఎస్‌ చందాలపై పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు వార్షిక మూలవేతనం, కరువు భత్యం రూ.5 లక్షలు ఉందనుకుంటే ఇందులో 10 శాతం రూ.50,000పై పన్ను చెల్లించక్కర్లేదు. ఎన్‌పీఎస్‌ అయినా లేదా ఈపీఎఫ్‌ అయినా ఉద్యోగ సంస్థ చేసే చందాలకు ఇదే వర్తిస్తుంది. ఒకవేళ ఒక ఉద్యోగి తరఫున సంస్థ వార్షికంగా రూ.7.5 లక్షలకు మించి జమ చేస్తే అప్పుడు పన్ను పడుతుంది.  


ఇవి గుర్తుంచుకోండి..
- ప్రస్తుత, నూతన ఆదాయపన్ను విధానాల్లో ఒకరికి ఏది సరిపోతుందన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాల్సిన అంశం. తమ దీర్ఘకాల లక్ష్యాలు, వాటికి చేస్తున్న పెట్టుబడులు, తమ వయసు, తాము చేసే పెట్టుబడుల్లో వేటికి పన్ను మినహాయింపులు ఉన్నాయి? ఇత్యాది అంశాలన్నీ కూడా ఏ పన్ను విధానంలో రిటర్నులు దాఖలు చేయాలన్నది నిర్ణయించుకోవడానికి దోహదపడతాయి. 
- అవివాహితులైన యువతీ, యువకులు, పెట్టుబడుల పట్ల అంతగా ఆసక్తి లేని వారికి నూతన విధానం సౌకర్యంగా అనిపిస్తుంది. కాకపోతే ప్రస్తుత విధానంతో పోలిస్తే వాస్తవంగా చెల్లించాల్సిన పన్ను పెరుగుతుంది.
- ఎంత చిన్న వయసులో ఉన్నా కానీ, భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునే చక్కని సమయం ఇదేనన్నది మర్చిపోకూడదు. జీవితంలో ఎంత ముందుగా ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రారంభిస్తే, పెట్టుబడులకు అంత సుదీర్ఘ సమయం ఉంటుంది. దాంతో మీ పెట్టుబడి కాంపౌండింగ్‌ మహిమతో ఇతోధికంగా వృద్ధి చెంది సంపదగా మారుతుంది. కనుక ముందుగానే పెట్టుబడులు ప్రారంభించి, పన్ను ఆదా చేసుకోవడం మంచి ఆలోచనే అవుతుంది.  
- ఆర్థిక ప్రణాళికకు అనుగుణంగా క్రమబద్ధమైన అడుగులు వేసే వారు, పన్ను ఆదా కోసం పెట్టుబడులు చేస్తున్న వారు, రూ.10 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారికి ప్రస్తుత విధానం ఎంతో లాభదాయకం.
- రెండు రకాల పన్ను విధానాలు అందుబాటులోకి వచ్చాయి కనుక గతంతో పోలిస్తే ఆర్థిక ప్రణాళికకు ఇప్పుడు మరింత ప్రాధాన్యం ఏర్పడిందని, ప్రతి ఒక్కరు తప్పకుండా ఆర్థిక ప్రణాళికను రూపొందించుకుని అడుగులు వేయాలన్నది నిపుణుల సూచన. ఇందుకోసం ఫైనాన్షియల్‌ ప్లానర్లు లేదా వెల్త్‌ అడ్వైజర్ల సాయం తీసుకోవచ్చు.
- వ్యాపార ఆదాయం లేని వేతన జీవులు రెండు విధానాల్లో తమకు అనుకూలమైన దానిలో రిటర్నులు దాఖలు చేసుకునే స్వేచ్ఛ ప్రతీ ఏడాది ఉంటుంది. ఒకవేళ వ్యాపార ఆదాయం కూడా ఉంటే ఒక్కసారి ఒక విధానాన్ని ఎంచుకుంటే ఇకపై ఆ విధానంలోనే కొనసాగాల్సి ఉంటుంది.
- ఆదాయపన్ను ఈ ఫైలింగ్‌ పోర్టల్‌లో రిటర్నులు ఫైల్‌ చేసే సమయంలోనే రెండు ఐచ్ఛికాలు కనిపిస్తాయి. అంటే ప్రస్తుత, నూతన విధానం అనమాట. ఈ రెండింటిలో తాము కోరుకున్నది సెలక్ట్‌ చేసుకోవాలి. నూతన, ప్రస్తుత విధానంలోనూ కొన్ని వివరాలు ముందుగా నింపి ఉంటాయి. వాటిని సరిచూసుకుని, మిగిలిన వివరాలు సమర్పించి సబ్‌మిట్‌ చేయాల్సి. 

 



You may be interested

నిఫ్టీలో షార్ట్‌ స్ట్రాడిల్‌ వ్యూహం!

Monday 10th February 2020

ఎఫ్‌అండ్‌ఓ నిపుణుల సూచన ఈవారం పరిమిత శ్రేణిలో నిఫ్టీ కదలాడే ఛాన్సున్నందున షార్ట్‌స్ట్రాడిల్‌ వ్యూహం అవలంబించాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యూహంలో ఫిబ్రవరి 13న ఎక్స్‌పైరీ అయ్యే 12100 నిఫ్టీ కాల్‌ ఒకటి, పుట్‌ ఒకటి విక్రయిస్తారు. నిఫ్టీకి 12000 పాయింట్ల వద్ద బలమైన మద్దతు, 12200 పాయింట్ల వద్ద బలమైన నిరోధం ఉన్నందున ఈ వ్యూహం మంచి ఫలితాన్నిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ ఈ రేంజ్‌ను దాటితే మాత్రం వ్యూహంలో నష్టం

ఆటుపోట్ల మార్కెట్లో ఇవే బెటర్‌!

Monday 10th February 2020

దేశీయ మార్కెట్లు గతవారం ఆరంభంలో చూపిన జోరును కొనసాగించలేకపోతున్నాయి. ఈ వారం ఆరంభంలో సూచీలు దాదాపు అరశాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. చైనా కరోనా భయాలు, ఆర్థిక మందగమన భయాలు.. మార్కెట్‌ను దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా స్థిర ప్రదర్శన చూపే క్వాలిటీ స్టాకులను నమ్ముకోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో మంచి రాబడులు ఇచ్చిన ట్రాక్‌ రికార్డు ఉండి, నాణ్యమైన మేనేజ్‌మెంట్‌ ఉన్న కంపెనీల షేర్లపై దృష్టి పెట్టడం

Most from this category