News


ఇప్పుడే ఉద్యోగం.. అప్పుడే పొదుపా ?

Monday 20th May 2019
personal-finance_main1558342710.png-25843

ప్ర: నేను కొంత కాలంగా ఎల్‌ అండ్‌టీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌లో సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇతర మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌తో పోల్చితే ఈ ఫండ్‌ పనితీరు ఏమంత బాగా లేదు. అదే మూడేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం పర్వాలేదనే స్థాయిలో ఉంది. ఈ ఫండ్‌లో సిప్‌లను కొనసాగించమంటారా? ఆపేసి, వేరే మిడ్‌క్యాప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ మొదలు పెట్టమంటారా ?
-రాకేశ్‌, విజయవాడ 
జ: గత ఏడాది కాలంగా మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌కు కష్టకాలమేనని చెప్పవచ్చు. అందుకే ఎల్‌ అండ్‌ టీ మిడ్‌ క్యాప్‌ ఫండ్‌ మీరు ఆశించిన పనితీరును కనబరచడం లేదు. అయితే ఈ ఫండ్‌ పనితీరు మరీ తీసికట్టుగా ఏమీ లేదు. ఇలాంటి మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు రెండు విషయాలను గుర్తుంచుకోవాలి. ఎంత కాలం ఇన్వెస్ట్‌ చేయడం అనేది మొదటి అంశం. మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఎంత కాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. ఇక రెండో అంశం. మార్కెట్‌ క్షీణించినపుడు కూడా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించడం. అసలు అధ్వాన కాలంలో ఇన్వెస్ట్‌ చేస్తేనే మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ నుంచి మంచి రాబడులు పొందవచ్చు. మార్కెట్‌ పెరగడం, ఆ తర్వాత తగ్గడం, మళ్లీ పెరగడం, మళ్లీ తగ్గడం... ఇదంతా ఒక సైకిల్‌.  స్టాక్‌ మార్కెట్‌ సైకిల్స్‌కు అనుగుణంగా మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ పనితీరు కూడా ఉంటుంది. మార్కెట్‌ బావున్నప్పుడు వీటి పనితీరు బాగా ఉంటుంది. మార్కెట్‌ పడిపోయినపుడు వాటి పనితీరు కూడా బాగోదు. మార్కెట్‌ పడిపోతున్నప్పుడు, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ పనితీరు మరింత అధ్వానంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఈ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగిస్తే, మార్కెట్‌ పుంజుకున్నప్పుడు, రాబడులు చెప్పుకోదగిన స్థాయిలో ఉంటాయి.  పోర్ట్‌ఫోలియో పరంగా చూసినా కూడా ఎల్‌ అండ్‌ టీ మిడ్‌ క్యాప్ ఫండ్‌ అబౌ యావరేజ్‌ ఫండ్‌ అనే చెప్పవచ్చు. ఈ ఫండ్‌లో మీ ఇన్వె‍స్ట్‌మెంట్స్‌ను నిరంభ్యతరంగా కొనసాగించండి. 

ప్ర: మ్యూచువల్‌ ఫండ్స్‌ చెల్లించే డివిడెండ్లపై పన్ను భారం ఎలా ఉంటుంది. ఈ డివిడెండ్లను మూలధన లాభాలుగా పరిగణించాలా ?లేక వడ్డీ ఆదాయంగా భావించాలా? అలాగే మూడేళ్లకు మించిన ఎఫ్‌ఎమ్‌పీ(ఫిక్స్‌డ్‌ మెచ్యురిటీ ప్లాన్‌)లపై వచ్చే ఆదాయంపై పన్నులు ఎలా ఉంటాయి ? 
-శ్రీలత, విశాఖపట్టణం 
జ: మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీరు పొందే డివిడెండ్‌లపై ఎలాంటి పన్ను భారం ఉండదు. డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ (డీడీటీ)ను మినహాయించగా మిగిలిన మొత్తాన్ని మీకు డివిడెండ్‌గా చెల్లిస్తారు. గతంలో డెట్‌ ఫండ్స్‌పై మాత్రమే ఈ డీడీటీ ఉండేది. డెట్‌ ఫండ్స్‌పై డీడీటీ 28 శాతం మేర ఉండేది. ప్రస్తుతం ఈక్విటీ ఫండ్స్‌పై డీడీటీ 10 శాతం మేర ఉంది. ఏదైనా ఈక్విటీ ఫండ్‌ మీకు 10 శాతం డివిడెండ్‌ ఇచ్చిందనుకోండి. ఆ ఫండ్‌ ఎన్‌ఏవీ(నెట్‌ అసెట్‌ వేల్యూ) 10 శాతం మించి తగ్గుతుంది. దాదాపు 11 శాతం మేర తగ్గవచ్చు. అందుకని మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి డివిడెండ్‌ ప్లాన్‌లు ఎంచుకోవద్దని సూచిస్తాం. ఇక మూడేళ్లకు మించిన ఎఫ్‌ఎమ్‌పీలపై వచ్చిన లాభాలపై మాత్రమే 20 శాతం మేర పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇండెక్సేషన్‌ ప్రయోజనాలు మీకు లభిస్తాయి. 

ప్ర: నాకు బీ.టెక్‌ అయిపోగానే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో మంచి జీతం వచ్చే ఉద్యోగమే వచ్చింది. ఏడాది దాటినా నేను ఏమీ మిగుల్చుకోలేకపోయాను. ఫ్రెండ్స్‌తో పార్టీలు, పబ్‌లు, సినిమాలు, టూర్లు, షికార్లతోనే జీతం డబ్బులన్నీ ఖర్చయిపోయాయి.  మా నాన్నగారేమో డబ్బులు వృధా చేయవద్దు, ఇప్పటినుంచే పొదుపు చేయాలని తెగ క్లాస్‌లు పీకుతున్నారు. 30 ఏళ్ల నుంచి పొదుపు చేస్తే, సరిపోతుంది కదా ! 
-బాలు, హైదరాబాద్‌
జ: సాధారణంగా మనకు ఆదాయ వనరు(వ్యాపారమో/ఉద్యోగమో) ఒక్కటే ఉంటుంది. కానీ అవసరాలు అపారంగా ఉంటాయి. తక్షణ, మధ్యకాలిక, దీర్ఘకాలిక అవసరాలు ఇలా రకరకాలుగా ఉంటాయి. ఒకటి తీరిపోగానే, మరొకటి రెడీగా ఉంటుంది. ఇలా మన జీతం మొత్తం ఖర్చయిపోతూ ఉంటుంది. అందుకని పొదుపు చేయడమే ప్రధానం కాకుండా దీర్ఘకాలంలో సంపదను సృష్టించేలా మదుపు చేయడం ముఖ్యం. ఇలాంటి మదుపు ఎంత చిన్న వయస్సులో ప్రారంభిస్తే అంత మంచిది. మరోవైపు చిన్న వయస్సులో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఎక్కువ కాలం, ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్‌ చేయగలుగుతాం. దీనికి చక్రవడ్డీ ప్రయోజనాలు జతకలిస్తే, మీకు మంచి రాబడులు వస్తాయి. పైగా చి‍న్న వయస్సులోనే ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ పరంగా చేసే తప్పులను త్వరగా తెలుసుకోగలుగుతారు. దిద్దుకోగలుగుతారు. మీ జీతంలో కొంత మొత్తాన్నే విలాసాల కోసం ఖర్చు పెట్టుకోండి. కనీసం 30 శాతం అయినా ఇన్వెస్ట్‌ చేయండి. మూడేళ్ల లోపు అవసరాల కోసం డెట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో, ఐదేళ్లు, ఆ తర్వాతి అవసరాల కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయండి. మీది చిన్న వయస్సే కాబట్టి, రిస్క్‌ భరించగలరు అందుచేత, షేర్లలో ఇన్వెస్ట్‌ చేయండి. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలనే యావతో టిప్స్‌పై ఆధారపడకుండా, ఫండమెంటల్స్‌ పరిశీలించి షేర్లలో ఇన్వెస్ట్‌ చేయండి. 

 You may be interested

వాణిజ్యపోరులో మరీ దూరం వెళ్లొద్దు

Monday 20th May 2019

అమెరికాకు చైనా స్పష్టీకరణ బీజింగ్‌: ఇరుదేశాల వాణిజ్యానికి సంబంధించి చైనాకు వ్యతిరేకంగా నష్టం కలిగించే చర్యల విషయంలో మరీ దూరం వెళ్లిపోవద్దని, పరస్పర సహకారం ద్వారానే ఇరు దేశాలూ ప్రయోజనం పొందగలవని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌పాంపియోకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ హితవు పలికారు. శనివారం పాంపియోతో టెలిఫోన్‌లో మాట్లాడారు. అమెరికన్‌ కంపెనీలు విదేశీ తయారీ టెలికం ఎక్విప్‌మెంట్‌ను వినియోగించొద్దని, వీటివల్ల దేశ భద్రతకు ముప్పు అంటూ నిషేధిస్తూ అమెరికా

తక్షణ నిరోధం 38,600...మద్దతు 37415

Monday 20th May 2019

 అమెరికా-చైనాల మధ్య వాణిజ్యపోరు తీవ్రతరంకావడంతో ప్రపంచ మార్కెట్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలోనే భారత్‌లో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్‌ ఆదివారంనాడు వెలువడ్డాయి. అత్యధిక శాతం ఎగ్జిట్‌పోల్స్‌...అధికార ఎన్‌డీఏనే తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చన్న అంచనాలు వెలువరించడంతో ఈ సోమవారం మన మార్కెట్‌ గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యే ఛాన్సుంది. కానీ 23న వెలువడే వాస్తవ ఎన్నికల ఫలితాలు ఏమాత్రం మార్కెట్‌ అంచనాల్ని చేరలేకపోయినా, పెద్ద పతనం సంభవించే ‍ప్రమాదం కూడా వుంటుంది. ఎన్నికల ఫలితాలు

Most from this category