News


తగిన ఫండ్‌ ఎలా ఎంచుకోవాలి ?

Monday 23rd December 2019
personal-finance_main1577071405.png-30366

(ధీరేంద్ర కుమార్‌ వ్యాల్యూ రీసెర్చ్‌)

ప్ర: నేను మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. నాకు తగిన ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి ?
-భారతి, విశాఖపట్టణం 
జ: ఒక వ్యక్తి ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం ఎలాంటి ఫండ్‌ను ఎంచుకోవాలి అనే విషయం  రకరకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ ఆదాయం, వ్యయాలు, ఇప్పటికే ఉన్న అప్పులు, భవిష్యత్తు అవసరాలు, ఆర్థిక లక్ష్యాలు, వయస్సు, మీపై ఆర్థికంగా ఆధారపడి ఉన్న వాళ్లు, మీరు నెలకు ఎంత మేర ఇన్వెస్ట్‌ చేయగలరు? ఎంత కాలం ఇన్వెస్ట్‌ చేస్తారు? మీరు ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తారా ...ఇలా రకరకాల అంశాలను మదింపు చేసుకొని ఏ ఫండ్‌ను ఇన్వెస్ట్‌ చేయాలో నిర్ణయం తీసుకోవాలి.  మీరు మ్యూచువల్‌ ఫండ్స్‌లో మొదటిసారిగా ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లయితే, ముందుగా అగ్రెసివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. నెలకు కొంత మొత్తాన్ని సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయాలి. ఇలా కనీసం రెండేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేస్తే, మీకు మార్కెట్‌ పట్ల, మార్కెట్లో చోటు చేసుకునే ఒడిదుడుకుల పట్ల, మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం.... తదితర అంశాల్లో ఒక స్పష్టత వస్తుంది. ఆ తర్వాత ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకొని దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయవచ్చు. మీ పోర్ట్‌ఫోలియోలో కనీసం ఒక మల్టీక్యాప్‌ ఫండ్‌ అయినా ఉండాలి. ఇక మీరు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లయితే, ఇ‍‍న్వె‍స్ట్‌మెంట్‌ కోసం ట్యాక్స్‌ సేవింగ్స్‌ ఫండ్‌ను ఎంచుకోండి. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ఎప్పుడూ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది.. ఎప్పుడూ పెద్ద మొత్తాల్లో ఒకేసారి ఏ ఫండ్‌లోనూ ఇన్వెస్ట్‌ చేయకూడదు. రెండోది. మార్కెట్‌ పతన సమయంలోనూ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించిన సిప్‌లను ఆపకూడదు. 

ప్ర: నా వయస్సు 58 సంవత్సరాలు. నేను గత కొంత కాలం వరకూ ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్స్‌(ఎఫ్‌ఎమ్‌పీ)ల్లో రెగ్యులర్‌గా ఇన్వెస్ట్‌ చేసేవాడిని. కానీ ఇటీవల కాలంలో ఎఫ్‌ఎమ్‌పీల పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. నేను ఇప్పుడు ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఈ వయస్సులో ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సమంజసమేనా  ?
-కిరణ్‌ కుమార్‌, తిరుపతి 
జ: ఈక్విటీ ఫండ్‌కు, ఫిక్స్‌డ్‌ మెచ్యురిటీ ఫండ్‌కు చాలా తేడా ఉంది. ఎఫ్‌ఎమ్‌పీ ప్రధానంగా ‍స్థిరాదాయ ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనం. పైగా దీనికి మూడేళ్ల లాక్‌-ఇన్‌ పీరియడ్‌ ఉంటుంది. దీనిని బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌తో పోల్చవచ్చు. అయితే బ్యాంక్‌ ఎఫ్‌డీతో పోల్చితే ఎఫ్‌ఎమ్‌పీలు ఒకింత అధిక రాబడులను ఇస్తాయి. పైగా పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇక ఎఫ్‌ఎమ్‌పీలతో పోల్చితే ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌ తమ నిధుల్లో మూడో వంతు ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఇంకో మూడో వంతు ఆర్బిటేజ్‌ సాధనాల్లో, మరో మూడో వంతు డెట్‌లోనూ ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఆర్బిట్రేజ్‌ సాధనాలు దాదాపు లిక్విడ్‌ ఫండ్స్‌లాగానే ఉంటాయి. మొత్తం మీద ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌ దాదాపు (పూర్తిగా కాదు) స్థిరదాయ సాధనాల లాగానే ఉంటాయి. అయినప్పటికీ, ఈ ఫండ్స్‌ రాబడుల్లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయి. ఈ ఫండ్స్‌ విలువల్లో హెచ్చుతగ్గులూ తప్పవు. అయితే ఫిక్స్‌డ్‌ మెచ్యురిటీ ఫండ్స్‌ రాబడుల కన్నా ఈక్విటీ సేవింగ్స్‌ రాబడులు అధికంగానే ఉంటాయనే చెప్పవచ్చు. మీరు ఇన్వెస్ట్‌ చేసే మొత్తం మరో మూడేళ్ల పాటు అవసరం లేని పక్షంలోనే మీరు ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్‌ను ఎంచుకోవడం మంచిది. 

ప్ర: నేను ఇటీవలనే ఒక జీవిత బీమా పాలసీ తీసుకున్నాను. దీనికి కొన్ని రైడర్స్‌ తీసుకుంటే మంచిదని స్నేహితులంటున్నారు. ఏ ఏ రైడర్స్‌ తీసుకోవాలి ?
-కరీముల్లా, హైదరాబాద్‌
జ: అదనపు ప్రయోజనాలు పొందడం కోసం రైడర్స్‌ తీసుకుంటే బీమా కవరేజ్‌ను పెంచుకోవచ్చు. రైడర్స్‌ తీసుకోవడం వల్ల మీరు చెల్లించే ప్రీమియమ్‌ పెరిగినప్పటికీ, బీమా కవరేజ్‌ పెరుగుతుంది. కాబట్టి తీసుకోవచ్చు. ఇలా తీసుకునే జీవిత బీమా రైడర్స్‌కు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80 సీ కింద పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. (సెక్షన్‌ 80 సి కింద మొత్తం పన్ను ప్రయోజనాలు రూ. లక్షన్నర వరకూ మాత్రమే వర్తిసాయి). ఇక అన్ని రకాల బీమా పాలసీలకు-ఎండోమెంట్‌, మనీ బ్యాంక్‌, హోల్‌ లైఫ్‌, యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌లకు కూడా రైడర్స్‌ను జత చేసుకోవచ్చు. యాక్సిడెంటల్‌ డెత్‌ బెనిఫిట్‌, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ బెనిఫిట్‌, వేవర్‌ ఆఫ్‌ ప్రీమియమ్‌, గ్యారంటీడ్‌ ఇన్సూరబిలిటీ, డిసెబిలిటీ ఇన్‌కమ్‌... ఇలా రకరకాల రైడర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు చెల్లించే ప్రీమియమ్‌లో 5-10 శాతం మేర రైడర్‌ వ్యయం ఉంటుంది. అయితే మీ ప్రీమియమ్‌లో 30 శాతం మించకుండా మాత్రమే రైడర్లు ఉండేలా జాగ్రత్త పడండి. చాలా రైడర్లు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఏ రైడర్‌ను తీసుకోవాలో కొంత గందరగోళం ఉంటుంది. మరోవైపు కమీషన్‌ అధికంగా వస్తుంది కాబట్టి బీమా ఏజెంట్లు వీలైనన్ని రైడర్లు అంటగట్టటానికి ప్రయత్నిస్తారు. అందుకని మీకు అవసరమైన రైడర్‌నే ఎంచుకోండి. 



You may be interested

నేడు ఫ్లాట్‌ ఓపెనింగ్‌ ?

Monday 23rd December 2019

నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 7 పాయింట్ల స్వల్ప నష్టంతో 12,285 పాయింట్ల వద్ద కదులుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్లలో ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ​వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు మరోసారి చరిత్రాత్మక గరిష్టాల వద్ద ముగిశాయి. అమెరికా, చైనా మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న వాణిజ్య వివాద పరిష్కారానికి ప్రాథమిక దశ

ఈ వారం స్టాక్‌ రికమెండేషన్లు

Monday 23rd December 2019

ఓల్టాస్‌        కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ ప్రస్తుత ధర: రూ.650 టార్గెట్‌ ధర: రూ.765 ఎందుకంటే: అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం ఈ కంపెనీకి ప్రయోజనం కలిగించనున్నది. అమెరికా ఆంక్షల కారణంగా చైనాలో యూసీపీ(యూనిటరీ కూలింగ్‌ ప్రొడక్ట్‌)ల నిల్వలు భారీగా  పేరుకుపోయాయి. ఇప్పుడు ఆంక్షలు తొలగిపోవడంతో ఈ నిల్వలు తగ్గించుకోవడానికి చైనా కంపెనీలు భారీగా డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తాయని, ఈ డిస్కౌంట్ల కారణంగా  యూసీపీ విభాగం నిర్వహణ లాభ మార్జిన్లు పెరుగుతాయని

Most from this category