News


బీమాలో తప్పు చేయొద్దు..!

Monday 30th September 2019
personal-finance_main1569815572.png-28614

 • జీవిత బీమాకు అసలైన అర్థం టర్మ్‌ పాలసీలే
 • గడువు తీరిన తర్వాత ప్రయోజనాలు ఆశించొద్దు
 • పాలసీ సమయంలో ‍ప్రయోజనాలే ముఖ్యం
 • ఆర్థిక ప్రణాళికలో బీమా ఒక సాధనం
 • పెట్టుబడికి బీమా అనుకూల సాధనం కాదు
 • పన్ను ఆదాకూ దీన్నో సాధనంగా చూడొద్దు

‘‘ఇదొక పెట్టుబడి సాధనం. దీనిపై వార్షికంగా 12 శాతం చొప్పున ఆదాయం క్రమం తప్పకుండా పొందొచ్చు’’ ఈ తరహా ఆకర్షణీయమైన ప్రకటనలు బీమా ఏజెంట్లు వినిపిస్తే మీరొక సారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఇలా చెప్పినప్పుడు అసలు ఆ పెట్టుబడి సాధనం ఏమిటని మీరు ప్రశ్నించారనుకోండి... అదొక ఇన్సూరెన్స్‌ పాలసీ అని, అందులో ఉన్న ఫీచర్లు ఇవంటూ మరిన్ని వివరాలు చెప్పే ప్రయత్నం చేయవచ్చు. అలా చెబుతున్నారంటే అది యులిప్‌ పాలసీయే అయి ఉంటుంది. బీమా పాలసీలు తీసుకుంటున్న వారిని గమనిస్తే... ఎక్కువ మంది తమ అవసరాలను తీర్చేది అయి ఉండడం లేదని ఎన్నో సర్వేలు చెబతున్నాయి. ఆర్థిక ప్రణాళిక పక్కాగా ఉండాలంటే, తమకు తగినంత బీమా రక్షణ ఉండాలన్న విషయాన్ని మరవొద్దు. జీవిత బీమా లేదా వైద్య బీమా, మరే ఇతర బీమా అయినా కానీ తగినంత బీమా కవరేజీ ఉండడం అవసరం. అదే సమయంలో అవసరం లేని బీమా ఉత్పత్తులతో మీ ఆర్థిక ప్రణాళిక భారంగా మారకుండా చూసుకోవాలి. బీమా పాలసీలకు సంబంధించి పక్కదోవ పట్టించే అంశాలను మీ దృష్టికి తీసుకురావడమే ఈ కథనం ఉద్దేశ్యం.  

టర్మ్‌ ప్లాన్లు వేస్ట్‌?
బీమా ఏజెంట్లు ప్రాథమికంగా తమకు కమీషన్‌ ఎక్కువగా లభించే పాలసీల విక్రయంపైనే ఆసక్తి చూపిస్తుంటారు. దాంతో టర్మ్‌ ప్లాన్‌ కొనుగోలు చేసే వారిని తప్పుదోవ పట్టించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. వీటికి బదులు యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలు (యులిప్‌ల) లేదంటే సంప్రదాయ ఎండోమెంట్‌ పాలసీలను తీసుకునే దిశగా మంచి రాబడి వివరాలతో ప్రదర్శన ఇస్తుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే... టర్మ్‌ ప్లాన్‌ అన్నది అచ్చమైన బీమా కవరేజీకి సంబంధించి కచ్చితమైన పాలసీ. అనుకోని ప్రమాదంతో పాలసీదారు ప్రాణం కోల్పోతే, అతను లేదా ఆమెపై ఆధారపడిన వారు ఆర్థిక ఇబ్బందులు పడకుండా తగినంత పరిహారం లభించాలంటే అది టర్మ్‌ప్లాన్‌లోనే సాధ్యపడుతుంది. ఎందుకంటే భరించేంత ప్రీమియంతో అధిక బీమా కవరేజీ టర్మ్‌ ప్లాన్‌లోనే లభిస్తుంది. జీవిత బీమా తీసుకోవాలంటే అందుకు టర్మ్‌ ప్లాన్‌ను మించినది లేదని పాలసీఎక్స్‌ డాట్‌ కామ్‌సీఈవో నావల్‌ గోయల్‌ పేర్కొన్నారు. తక్కువ ప్రీమియానికి అధిక రక్షణ ఇచ్చే విధంగా ఉంటాయి. అయితే, పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు పాలసీదారులు జీవించి ఉంటే ఆ తర్వాత ఆ పాలసీపై ఎటువంటి ప్రయోజనం లభించదు. కానీ, బీమా అంటే మరణంపై కవరేజీని తీసుకోవడం. చెల్లించిన ‍ప్రీమియాన్ని తిరిగి పొందడం కాదని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు టర్మ్‌ ప్లాన్‌లో మీరు తీసుకోదలిచిన బీమా కవరేజీకి ప్రీమియం రూ.10వేలు ఉంటే, అదే యులిప్‌ పాలసీలో రూ.30వేలు చెల్లించాల్సి ఉంటుంది. యులిప్‌ పాలసీ అంటే మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్‌తో ముడిపడిన బీమా పథకం. దీన్ని తీసుకోవడానికి బదులు రూ.10వేల ప్రీమియంతో టర్మ్‌ ప్లాన్‌ తీసుకుని, మిగిలిన రూ.20వేలను స్వయంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

పన్ను ఆదాకు మంచి సాధనం...?
ఏజెంట్లు లేదా బీమా పాలసీల విక్రయదారులు చెప్పు ఆకర్షణీయమైన వివరాల్లో పన్ను ఆదా కూడా ఒకటి. ఫలానా పాలసీ తీసుకుంటే ఎంతో పన్ను ఆదా చేసుకోవచ్చని కూడా చెబుతుంటారు. ప్రీమియం చెల్లింపులపై సెక్షన్‌ 80సీ కింద పన్ను ఆదా చేసుకోవచ్చని, గడువు తీరిన తర్వాత లేదా మరణంపై వచ్చే పరిహారంపై కూడా పన్ను ఉండదని వివరిస్తుంటారు. నిజానికి జీవిత బీమా పాలసీ కూడా పన్ను ఆదా ప్రయోజనం కల్పించే సాధనాల్లో ఒకటి. అయితే, పన్ను ఆదా కోసం ఉద్దేశించిన సాధనం కాదు. ఇది బీమా రక్షణకు ఉద్దేశించినదిగా ముందు గుర్తుంచుకోవాలి. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను ఆదా కల్పించే పెట్టుబడి సాధనాలు ఎన్నో ఉన్నాయి. ఈపీఎఫ్‌, పీపీఎఫ్‌, పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌ వంటివి ఎన్నో అందుబాటులో ఉన్నాయి. పన్ను ఆదా కోసమే అయితే వీటిని పరిశీలించొచ్చు కానీ, బీమా కాదు. ఎవరికి వారు వారి ఆర్థిక ప్రణాళికకు అనుకూలమైన సాధనాలను ఎంచుకోవడం వారి విజయానికి కీలకం. కనుక పాలసీ తీసుకునే ముందు వీటన్నింటినీ పరిశీలనలోకి తీసుకోవాలి. 

బ్యాంకు ఎఫ్‌డీల కంటే బెటర్‌..?
ఎండోమెంట్‌ పాలసీలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మాదిరే రాబడులతోపాటు బీమా రక్షణనిస్తాయని బీమా ఏజెంట్లు చెబుతుంటారు. రాబడుల గణాంకాలతో సహా ఆకర్షణీయంగా ప్రయోజనాల గురించి వివరించే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని బ్యాంకులు అయితే, తాము ఒప్పందం చేసుకున్న బీమా ఉత్పత్తుల యులిప్‌ పాలసీలను ఖాతాదారులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ఎండోమెంట్‌ పాలసీలు బీమా రక్షణ, పన్ను ఆదాతో పాటు చక్కని రాబడులను ఇస్తాయన్న డిస్ట్రిబ్యూటర్లు, ఏజెంట్ల మాటలను ఆకర్షితులై పాలసీలను తీసుకోవద్దు. రాబడులపై బ్యాంకు ఎఫ్‌డీల్లో టీడీఎస్‌ ఉంటుందని, బీమా పాలసీల్లో ఇది ఉండదని, కనుక బీమా పాలసీలు మంచి పెట్టుబడి సాధనాలని వివరించే వారూ ఉన్నారు. నిజానికి బీమా ఉత్పత్తుల్లో పలు రకాల చార్జీలు ఉంటాయి. కాల వ్యవధి తీరిన తర్వాత నిర్ణీత ప్రయోజనాలను అందిస్తాయి. అదే సమయంలో పాలసీ కాల ‍వ్యవధి సమయంలో మరణిస్తే బీమా పరిహారాన్ని చెల్లిస్తాయి. అంతేకానీ రాబడులను పంచవు. కానీ, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై రాబడుల విషయంలో స్పష్టత ఉంటుంది. ఇక బీమా పాలసీలు, ఎఫ్‌డీల్లో పెట్టుబడుల రక్షణ భిన్నంగా ఉంటుంది. కనుక బీమా అవసరం, పెట్టుబడుల ప్రాధాన్యం, మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉత్పత్తి ఎంపిక ఉండాలి. 

యులిప్‌లు మ్యూచువల్‌ ఫండ్స్‌ కంటే నయం?
యూనిట్‌ ఆధారిత బీమా పాలసీ (యులిప​) బీమా రక్షణతోపాటు, అదనంగా మార్కెట్‌ ఆధారిత రాబడులను కూడా ఇస్తుందని బీమా ఏజెంట్లు చెప్పొచ్చు. అలాగే, మ్యూచువల్‌ పండ్స్‌లో అయితే రాబడులు మార్కెట్‌ ఆధారితం కనుక రిస్క్‌ ఉంటుందని, బీమా మాత్రం లభించదని కూడా చెప్పే అవకాశం లేకపోలేదు. యులిప్‌లు అటు బీమా రక్షణతోపాటుగా పెట్టుబడుల విషయంలోనూ ఎంతో స్వేచ్ఛ ఉంటుందని, రాబడుల విషయంలో సంతృప్తి అనిపించకపోతే, ఎటువంటి అదనపు చార్జీలు లేకుండానే పెట్టుబడి ఆప్షన్లను మార్చుకోవచ్చన్నది నిజమే కావచ్చు. అయితే, మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోనూ దీర్ఘకాలంలో అద్భుత రాబడులను ఇచ్చినవి వందల సంఖ్యలో ఉన్నాయనేది మర్చిపోవద్దు. యులిప్‌ అయితే, చెల్లించిన ప్రీమియంలో కొంత భాగం మార్కె్ట్లో పెట్టుబడులకు వెళుతుంది. మిగిలినదంతా పాలసీదారులు మరణానికి గురైతే పరిహారం చెల్లించేందుకు గాను, మోర్టాలిటీ చార్జీల కింద మినహాయించుకుంటాయి. దీంతో నిజానికి యులిప్‌లలో అటు అచ్చమైన పెట్టుబడులు కాకుండా, ఇటు అచ్చమైన బీమా రక్షణ కాకుండా ఉంటుంది. ఇక పాలసీ సరెండర్‌ చార్జీలు ఎక్కువగా ఉంటాయి. ఫండ్‌ నిర్వహణ చార్జీలు, అలోకేషన్‌ చార్జీలు తదితర చార్జీల పరంగా పారదర్శకత తక్కువ. 

ఆర్థిక లక్ష్యాలకు అద్భుత సాధనం?
ఆర్థిక లక్ష్యాలకు బీమా పాలసీలు అద్భుత సాధనాలనే విషయంలో ప్రతి ఒక్కరికీ స్పష్టత అవసరం. ఎందుకంటే దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు బీమా పాలసీలను పెట్టుబడి సాధనాలుగా చూస్తే అది పొరపాటులో కాలేసినట్టే అవుతుంది. బీమా పాలసీలన్నవి మీ ఆర్థిక లక్ష్యాలకు కవరేజీనిచ్చే సాధనం వరకే పరిమితం. అంతేకానీ, మీ ఆర్థిక అవసరాలను పాలసీలు అచ్చంగా తీర్చలేవు. అందుకు మీ రిస్క్‌కు తగ్గ పెట్టుబడి సాధనాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్‌ చైల్డ్‌ ప్లాన్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ రెండూ మీ పిల్లల భవిష్యత్తు విద్యా అవసరాలకు ఉపయోగపడతాయి. కానీ, మంచి పనితీరు, పరిశోధనా టీమ్‌ కలిగిన మ్యూచువల్‌ ఫండ్‌ సాధనం బీమాతో కూడిన పెట్టుబడి సాధనం కంటే అధిక రాబడులను ఇస్తుందనడంలో సందేహం లేదు. ‘‘బీమాను కొనుగోలు చేసే వారు ఏజెంట్‌ను కలవడానికి ముందే కొంత సాధన చేయాలి. తప్పుడు బీమా పథకంలో ఇరుక్కుపోకుండా ఉండాలంటే తగినంత అవగాహన ఉండాలి. ఏజెంట్లు చెప్పే భారీ మొత్తాలు, హామీల ఆకర్షణలో పడిపోవద్దు’’ అని అలంకిత్‌ లిమిటెడ్‌ ఎండీ అంకిత్‌ అగర్వాల్‌ సూచించారు. 

 • పన్ను ఆదా కోసం ఆర్థిక సంవత్సరం చివర్లో బీమా పాలసీ తీసుకోవడం, ఆ తర్వాత అది తనకు తగినది కాదని తదుపరి ఆర్థిక సంవత్సరం రెన్యువల్‌ చేసుకోకుండా వదిలేయడం సరికాదు.
 • మార్కెట్‌ లింక్డ్‌ తరహా యులిప్‌ పాలసీలపై రాబడుల విషయంలో స్పష్టత ఉండదు. వీటిని బ్యాంకు ఎఫ్‌డీలతో పోల్చి చూడకూడదు
 • యులిప్‌ పాలసీల్లో మోర్టాలిటీ చార్జీల పేరుతో వసూలు చేసే చార్జీ కారణంగా ఇన్వెస్టర్ల రాబడులు చాలా వరకు తగ్గిపోతాయి. 
 • బీమా, పెట్టుబడితో కూడిన పథకాల్లో రాబడులు, బీమా కవరేజీ తగినంత ఉండవు.
 • టర్మ్‌ కవర్‌లో తగినంత బీమా రక్షణను తక్కువ ప్రీమియానికే పొందే అవకాశం ఉంటుంది. You may be interested

పెట్టుబడులపై రాబడితోపాటు బీమా

Monday 30th September 2019

  యూటీఐ యులిప్‌ పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్‌ ఎవరైనా కానీ ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తట్టుకుని, దీర్ఘకాలంలో అధిక రాబడులు సమకూర్చుకోవాలన్న లక్ష్యంతోనే ఉంటారు. అయితే, ఇటీవలి కాలంలో ఈక్విటీ మార్కెట్లు ఎంతో అస్థిరతంగా మారాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రిస్క్‌ తీసుకోలేని ఇన్వెస్టర్లు ఈ తరహా ఆటుపోట్ల నుంచి రక్షణకు బ్యాలన్స్‌డ్‌ లేదా హైబ్రిడ్‌ డెట్‌ ఫండ్స్‌ను పెట్టుబడుల కోసం పరిశీలించొచ్చు. ఇవి స్థిరమైన రాబడులను ఇస్తాయి.

నష్టాలతో ప్రారంభం

Monday 30th September 2019

సోమవారం భారత్‌ స్టాక్‌ సూచీలు నష్టాలతో ఆరంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 50 పాయింట్ల నష్టంతో 38,760 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 21 పాయింట్ల గ్యాప్‌డౌన్‌తో 11,491 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

Most from this category