News


వేల్యూ ఫండ్స్‌ను కొనసాగించవచ్చా ?

Monday 9th December 2019
personal-finance_main1575861238.png-30121

ధీరేంద్ర కుమార్‌ (వ్యాల్యూ రీసెర్చ్‌ సీఈవో)

ప్ర: నేను సీనియర్‌ సిటిజెన్‌ను. గత ఏడాది కాలం నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)మార్గంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో టాటా డిజిటల్‌ ఇండియా ఫండ్‌, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ డిజిటల్‌ ఇండియా ఫండ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ టెక్నాలజీ ఫండ్‌, ఫ్రాంక్లిన్‌ ఇండియా టెక్నాలజీ ఫండ్‌, యాక్సిస్‌ బ్లూచిప్‌ ఫండ్‌లు ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొనసాగించదగ్గ ఫండ్స్‌ ఏవి ? 
-రవీందర్‌, కాకినాడ 

జ: మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న మొత్తం ఐదు ఫండ్స్‌ల్లో నాలుగు ఫండ్స్‌ టెక్నాలజీ ఫండ్సే ఉన్నాయి. డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు పొందాలంటే పోర్ట్‌ఫోలియోలో ఒక టెక్నాలజీ ఫండ్‌ ఉంటే సరిపోతుంది. కానీ మీ పోర్ట్‌ఫోలియోలో ఏకంగా నాలుగు టెక్నాలజీ ఫండ్స్‌ ఉన్నాయి. ఇది సరైన ఇన్వెస్ట్‌మెంట్‌ వ్యూహం కాదు. ముఖ్యంగా మీలాంటి సీనియర్‌ సిటిజన్‌కు ఇది పూర్తిగా సరైనది కాదు. మీలాంటి వాళ్లకు నిలకడైన ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉండాలి. దీని కోసం హైబ్రిడ్‌ ఫండ్‌ను గానీ, మల్టీ క్యాప్‌ ఫండ్‌ను గానీ ఎంచుకోవాలి. అయితే గత రెండేళ్లుగా టెక్నాలజీ/డిజిటల్‌ ఫండ్స్‌ మంచి రాబడులను ఇచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఇతర ఫండ్స్‌తో పోల్చితే టెక్నాలజీ ఫండ్సే మెరుగని అనిపిస్తూ ఉండొచ్చు. ఈ విషయంలో ఇప్పుడు మీరు అదృష్టవంతులు. అలాగని ఎప్పుడూ ఇదే అదృష్టం కొనసాగుతుందని చెప్పలేం. అందుకని నాలుగు టెక్నాలజీ ఫండ్స్‌ను ఒకటికి తగ్గించుకోండి. యాక్సిస్‌ బ్లూచిప్‌ ఫండ్‌ను కొనసాగించవచ్చు. మరో హైబ్రిడ్‌ ఫండ్‌ను గానీ, మల్టీ క్యాప్‌ ఫండ్‌ను గానీ మీ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోండి. 

ప్ర: నేను రిటైరవ్వడానికి మరో 13 ఏళ్ల సమయం ఉంది. రిటైర్మెంట్‌ అవసరాల కోసం కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో నెలకు కొంత మొత్తం సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో ఐదు మల్టీ-క్యాప్‌ ఫండ్స్‌ ఉన్నాయి. ఇవి కాకుండా రెండు వేల్యూ ఫండ్స్‌-క్వాంటమ్‌ ఇండియా వేల్యూ ఫండ్‌, ఐసీఐసీఐ ప్రు వేల్యూ డిస్కవరీ ఫండ్స్‌ కూడా ఉన్నాయి. మల్టీ క్యాప్‌ ఫండ్స్‌ పనితీరు సంతృప్తికరంగా ఉన్నా, ఈ వేల్యూ ఫండ్స్‌ పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. వీటిల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించవచ్చా ?
-సుచిత్ర, హైదరాబాద్‌  
జ: మీరు రిటైరవ్వడానికి మరో 13 ఏళ్ల సమయం ఉంది. అంటే మీరు మరో 13 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయగలరు. కాబట్టి ఈ వేల్యూ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించవచ్చు. ఈ ఫండ్స్‌ పనితీరు ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉండొచ్చు కానీ మరీ తీసికట్టుగా ఏమీ లేదనే చెప్పవచ్చు. ఈ ఫండ్స్‌ల్లో 13 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగిస్తే, కనీసం రెండు మార్కెట్‌ సైకిల్స్‌ను ఈ ఫండ్స్‌ చూస్తాయి. ఈ కాలంలో ఈ ఫండ్స్‌ పనితీరు మెరుగు పడే అవకాశాలే అధికంగా ఉన్నాయి. మార్కెట్‌ నష్టాల్లో ఉన్నప్పుడు ఈ ఫండ్స్‌ మరీ అంతగా నష్టపోకుండా ఉండటం, మీ పోర్ట్‌ఫోలియోకు ఒకింత స్థిరత్వం ఇచ్చి ఉండటం మీరు గమనించే ఉండాలి. మల్టీ క్యాప్‌ ఫండ్స్‌తో పాటు వేల్యూ ఫండ్స్‌ ఉండటం వల్ల మీ పోర్ట్‌ఫోలియో.. డైవర్సిఫికేషన్‌ పరంగా చూస్తే, మంచి స్థితిలోనే ఉందని చెప్పవచ్చు. ఐసీఐసీఐ ప్రు వేల్యూ డిస్కవరీ ఫండ్‌ పనితీరు ఒకింత నిరాశమయంగా ఉన్నప్పటికీ, 13 ఏళ్ల కాలంలో ఈ ఫండ్‌ పుంజుకొని మంచి రాబడులు ఇచ్చే అవకాశాలే అధికంగా ఉన్నాయి. మరోవైపు ఈ ఫండ్‌ పోర్ట్‌ఫోలియో పటిష్టంగానే ఉంది. నాణ్యత గల షేర్లే ఈ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. ఎలాంటి అనుమానాలు లేకుండా ఈ వేల్యూ ఫండ్స్‌ల్లో మీ సిప్‌లను కొనసాగించండి. 

ప్ర:  సాధారణంగా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ వివిధ రంగాలకు చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి కదా ! వివిధ రంగాల కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఆ యా రంగాల్లోని రిస్క్‌లు ఆయా కంపెనీలపై బాగానే ప్రభావం చూపుతాయి కదా! అలాంటప్పుడు  ఈక్విటీ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం సరైనదేనా ? అసలు ఈక్విటీ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు అసలు ఎలాంటి విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి ?
-జావేద్‌, విజయవాడ 
జ: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ వివిధ రంగాలకు చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. అయితే ఒక ఫండ్‌ ఏ రంగాల కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసిందనే విషయం ప్రధానాంశంగా ఫండ్స్‌కు సంబంధించిన ఇన్వెస్ట్‌మెంట్‌ నిర్ణయాలు తీసుకోకూడదు. గతంలో ఒక ఫండ్‌ పనితీరు ఎలా ఉంది అనే విషయాన్నే పరిగణనలోకి తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి. మార్కెట్‌ పెరుగుతున్నప్పుడు, అలాగే మార్కెట్‌ పతన బాటలో ఉన్నప్పుడూ సదరు ఫండ్‌ పనితీరు ఎలా ఉంది అనే విషయం కీలకం. అలాగే సదరు ఫండ్‌ను నిర్వహిస్తున్న ఫండ్‌ మేనేజర్‌ ట్రాక్‌ రికార్డ్‌ ఎలా ఉంది? దీర్ఘకాలం పాటు అతని పనితీరు సవ్యంగానే ఉందా ?అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. చాలా ఈక్విటీ ఫండ్స్‌ పోర్ట్‌ఫోలియోలు దాదాపు ఒకేలాగా ఉన్నప్పటికీ, వాటి రాబడుల్లో మాత్రం తేడా ఉండొచ్చు.  అందుకని ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు సదరు ఫండ్‌ పోర్ట్‌ఫోలియోనే కీలకంగా చూడకూడదు. ఆ ఫండ్‌ పనితీరును కూడా మదింపు చేయాలి. 

 



You may be interested

‘మనీ’ మాట.. బంగారు బాట

Monday 9th December 2019

చిన్న నాటి నుంచే సరైన దిశగా అడుగులు ద్రవ్య నిర్వహణ, ఖర్చులు, పొదుపు, ఇన్వెస్టింగ్‌ నేర్పాలి తల్లిదండ్రుల్లో తగిన అవగాహన అవసరం పిల్లలతో చర్చించడం మంచి అలవాటు డబ్బుకు వారిని దూరం పెట్టడం మంచేమీ కాదు చిన్నారులకు ఎన్నో విషయాలు నేర్పుతాం. కానీ, డబ్బు (మనీ) దగ్గరకొచ్చేసరికి వారిని దూరం పెడతాం. ఆదాయం, పొదుపు, పెట్టుబడులు.. ఇవేవీ వారికి అంత చిన్న వయసులో అవసరం లేదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. కానీ, చిన్న వయసులోనే కదా వారికి

భారత్‌లో వృద్ధి మాంద్యం..

Monday 9th December 2019

భారత్‌లో వృద్ధి మాంద్యం.. అధికారాలన్నీ పీఎంవోలోనే కేంద్రీకృతం దేశానికి ఇది శ్రేయస్కరం కాదు విమర్శిస్తే రాజకీయ దురుద్దేశాలు అంటగట్టొద్దు ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ న్యూఢిల్లీ: పాలనాధికారాలన్నీ ప్రధాని కార్యాలయంలోనే కేంద్రీకృతమై ఉన్నాయని, మంత్రులంతా నిమిత్తమాత్రులుగానే ఉంటున్నారని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి పాలనతో ఎకానమీ తీవ్ర రుగ్మతలతో సతమతమవుతోందని .. దేశం "వృద్ధి మాంద్యం" పరిస్థితుల్లో చిక్కుకుందని పేర్కొన్నారు. ఒక వార్తాపత్రికకు రాసిన వ్యాసంలో ఆయన ఈ విషయాలు

Most from this category