News


త్వరలో ఆదాయపు పన్ను చెల్లింపుదార్లకు శుభవార్త?

Tuesday 22nd October 2019
personal-finance_main1571739798.png-29056

  • కార్పొరేట్‌ పన్ను తగ్గింపు తరహాలో త్వరలో ప్రకటన వెలువడే అవకాశాలు
  • పన్ను స్లాబుల మార్పునకు కమిటీ సిఫార్సులు
  • దీపావళి సమయానికి ప్రభుత్వ ప్రకటన ఉండొచ్చన్న అంచనాలు

గత నెల కార్పొరేట్‌ పన్నును ప్రభుత్వం తగ్గించగానే, కార్పొరేట్‌ రంగానికి ముందస్తు దీపావళి వచ్చిందని అందరూ అభివర్ణించారు. నిజమైన దీపావళి మరికొద్ది రోజుల్లో ఉండగా ఈ దఫా వ్యక్తిగత ఆదాయపన్నుచెల్లింపుదారులకు కూడా ప్రభుత్వం అలాంటి బహుమానం ఇస్తుందన్న అంచనాలు పెరిగాయి. పలువురు ఆర్థికవేత్తలు కూడా వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గింపు ప్రకటించాల్సిఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఐటీలో సంస్కరణలపై ఏర్పాటు చేసిన అఖిలేశ్‌ రంజన్‌ టాస్క్‌ఫోర్స్‌ పన్ను స్లాబుల మార్పులపై పలు రికమండేషన్లు చేసింది. ఆగస్టులో ఈ  కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఇంతవరకు నివేదికలో అంశాలు బయటకు రాకున్నా, సంబంధిత వర్గాల ప్రకారం ఆదాయపన్ను మినహాయింపు బేస్‌ లెవల్‌ను 2.5 లక్షల రూపాయలుగానే ఉంచాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది. బేస్‌ లెవల్‌లో మార్పుల కన్నా కమిటీ పన్ను స్లాబుల్లో మార్పులపై ఎక్కువ ఫోకస్‌ పెట్టింది. పదిశాతం పన్ను స్లాబును రూ.10 లక్షల ఆదాయ పరిమితి వరకు పెంచాలని సూచించినట్లు తెలిసింది. ఇదే జరిగితే చాలామందికి ప్రయోజనం చేకూరుతుంది. దేశంలో రూ. 5-10 లక్షల మధ్య పన్ను ఆదాయం కలిగిన వారు దాదాపు 5.5 కోట్ల మంది ఉన్నట్లు సీబీడీటీ గణాంకాలు చెబుతున్నాయి. పై సిఫార్సు ఆమోదం పొందితే దాదాపు కోటిన్నర మంది 20 శాతం స్లాబ్‌ నుంచి 10 శాతం స్లాబ్‌లోకి మారతారు. 
చిన్నవాళ్లకు ప్రయోజనం లేదా?
కమిటీ సిఫార్సులు అమలు చేయడం వల్ల చిన్న ఆదాయ వర్గాలకు పెద్దగా ప్రయోజనం ఉండదు. కొత్త స్లాబుల వర్గీకరణ తదితరాలన్నీ ఐదు లక్షల రూపాయల ఆదాయం పైబడిన వాళ్లకే వర్తిస్తాయి. 87ఏ కింద ఐదు లక్షల రూపాయలలోపు పన్నుదారులకు ఇస్తున్న టాక్స్‌ రిబేటు మాత్రం కొనసాగించాలని కమిటీ సూచించింది. కమిటీ సిఫార్సులతో దాదాపు 10 లక్షల రూపాయలు అంతకుమించిన వార్షికాదాయం ఉన్నవాళ్లకు అధిక ప్రయోజనం చేకూరనుంది. ఉదాహరణకు పది లక్షల రూపాయల ఆదాయం ఉన్న వ్యక్తికి దాదాపు 34 శాతం మేర పన్ను తగ్గుతుంది. అంటే వీరు చెల్లించే రూ.1.06 లక్షల పన్ను రూ.70వేలకు దిగరానుంది. వార్షికాదాయం మరింత పెరిగే కొద్దీ ప్రయోజనం మరింత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు రూ. 22 లక్షల రూపాయల వార్షికాదాయం ఉన్న వ్యక్తి చెల్లించే పన్ను 36 శాతం తగ్గుతుంది. ప్రస్తుతం వీరు చెల్లించే రూ. 4.75 లక్షల బదులు రూ. 3 లక్షల పన్ను చెల్లించాల్సిఉంటుంది.


సర్‌చార్జీ కొనసాగేనా..
సూపర్‌ రిచ్‌పై విధించే సర్‌చార్జీని తాత్కాలిక ఆదాయ వనరుగా మాత్రమే ఉపయోగించుకోవాలని, దీర్ఘకాలం కొనసాగించవద్దని కమిటీ సూచించింది. ఇప్పటివరకు ప్రభుత్వాలు ఈ సర్‌చార్జీని అదనపు ఆదాయవనరుగా భావించి ప్రతియేటా పెంచడమో, పొడిగించడమో చేస్తున్నాయి. ఇది క్రమంగా ఆదాయ వర్గాల్లో అసంతృప్తిని, పన్నుఎగవేతలను ప్రోత్సహిస్తుందని నిపుణుల సైతం హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం రూ. 6 కోట్ల ఆదాయం ఉన్న వాళ్లు ఏటా రూ. 2.53 కోట్ల పన్ను చెల్లించాల్సిఉంది. ఇందులో సర్‌చార్జీ వాటా రూ. 65 లక్షలు. దేశంలో రూ. 5 కోట్ల పైన ఆదాయం ప్రకటించి పన్ను చెల్లించేవాళ్లు దాదాపు 2850 మంది ఉన్నారు. సర్‌చార్జీ తొలగింపు వీరికి ఉపశమనం కలిగిస్తుంది. దీంతో పాటు  ఇప్పటివరకు ఉన్న మూడు స్లాబులను పెంచి నాలుగో స్లాబును తీసుకురావాలని కమిటీ సూచించింది. నాలుగో స్లాబులో రూ. 2కోట్ల ఆదాయంపైన ఉన్నవాళ్లను చేరుస్తారు. ఈ స్లాబులో 35 శాతం పన్ను వర్తిస్తుంది. దీనికి 25 శాతం సర్‌చార్జీ, 4 శాతం సెస్సు కలిపితే రూ.2-5 కోట్ల వార్షికాదాయ వర్గాలపై పన్ను 39 శాతానికి చేరనుంది. 
ప్రభుత్వాదాయానికి గండి?
తాజా సిఫార్సులన్నీ అమలు చేస్తే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుందని అంచనాలున్నాయి. కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపుతోనే దాదాపు రూ. 1.45 లక్షల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోనుంది. ఇప్పుడీ మార్పులన్నీ చేస్తే మరో 1.75 లక్షల కోట్ల రూపాయల మేర ప్రభుత్వాదాయానికి తరుగు వస్తుందనది బోఫాఎంఎల్‌ అంచనా వేసింది. ఇందులో లక్ష కోట్ల రూపాయలను కేంద్రం, 75వేల కోట్ల రూపాయలను రాష్ట్రాలు భరించాల్సిఉంటుంది. ఇప్పటికైతే ఈ మార్పుల అమలుపై పన్ను శాఖ వర్గాలు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. కానీ ప్రజల్లో మాత్రం పన్ను నిర్మాణంలో మార్పులు తప్పవనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మార్పులతో పాటు డివిడెండు డిస్ట్రిబ్యూషన్‌ టాక్స్‌ (డీడీటీ) ఎత్తివేత కూడా సంభవిస్తే పన్ను చెల్లింపుదారులకు నిజంగా దీపావళి వస్తుందని ఎకనమిస్టుల అభిప్రాయం. 



You may be interested

ఐటీ షేర్లకు ‘‘ఇన్ఫీ’’ దెబ్బ

Tuesday 22nd October 2019

ఇన్ఫోసిన్‌ నష్టాల సెగలు తన సహచర ఐటీ షేర్లను తాకాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ దాదాపు శాతం నష్టపోయింది. కంపెనీ యాజమాన్యం ఆదాయం, లాభాలను పెంచి చూపుతందని విజిల్‌బ్లోయర్‌ ఫిర్యాదుతో నేడు ఇన్ఫోసిస్‌ షేర్లు 16శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. ఇన్ఫీ షేర్ల భారీ పతనంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 4.75 శాతం క్షీణించి 14,685.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని

జోరుగా ఫైనాన్షియల్‌ షేర్ల ర్యాలీ

Tuesday 22nd October 2019

గత ఆరునెలలుగా నష్టాలను చవిచూస్తున్న ఆర్థిక రంగ షేర్లు మంగళవారం భారీగా లాభాల్ని ఆర్జిస్తున్నాయి. వచ్చే ఆర్‌బీఐ సమావేశంలో నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు ఊరట కలిగించే అంశాలను ప్రకటించవచ్చనే అంచనాలు ఈ షేర్లకు డిమాండ్‌ పెంచుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక రంగ షేర్ల ర్యాలీ కారణంగా ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫైనాన్షియల్‌ ఇండెక్స్‌ 2శాతం పెరిగింది. ఇండెక్స్‌ అత్యధికంగా ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ సర్వీసెస్‌

Most from this category