News


వ్యక్తుల ఐటీ గరిష్ఠ శ్లాబు తగ్గాలి

Thursday 13th June 2019
news_main1560407990.png-26270

  • 25 శాతానికి తగ్గించాలన్న పీహెచ్‌డీసీసీఐ

న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపు పన్ను గరిష్ట స్థాయి శ్లాబుని ప్రస్తుత 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) బుధవారం కేంద్రాన్ని కోరింది. ఈ నిర్ణయం వల్ల వ్యక్తుల వద్ద అదనపు డబ్బు ఉంటుందని, ఇది వ్యయాల పెంపునకు, తద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ పెరుగుదలకు దోహదపడుతుందని విశ్లేషించింది. జూలై 5వ తేదీ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, వివిధ వర్గాల నుంచి బడ్జెట్‌ ముందస్తు సూచనలు, సలహాలు స్వీకరిస్తున్న నేపథ్యంలో పీహెచ్‌డీసీసీఐ తాజా సలహా ఇచ్చింది. వ్యవస్థలో నగదు లభ్యత (లిక్విడిటీ) పెంపు, ఉపాధి కల్పన, ఎగుమతులకు తక్కువ రేటుకు రుణాలు, కార్మిక సంస్కరణలు ప్రస్తుతం అవసరమని ఆయా చర్యలు వృద్ధి పురోగతికి దోహదపడతాని పారిశ్రామిక సంస్థ పేర్కొంది. 
సీఆర్‌ఆర్‌, ఎస్‌ఎల్‌ఆర్‌ తగ్గాలి...
వ్యవస్థలో లిక్విడిటీ పెంపునకు బ్యాంకుల నగదు నిల్వల నిష్పత్తిని  (సీఆర్‌ఆర్‌- ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు తప్పనిసరిగా డిపాజిట్‌ చేయాల్సిన పరిమాణం) ప్రస్తుత 4 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని, స్టాండెర్డ్‌ లిక్విడిటీ రేషియోను (ఎస్‌ఎల్‌ఆర్‌- బాండ్లు, ఇతర ఇన్‌స్ట్రమెంట్లలో బ్యాంకులు తప్పనిసరిగా ఉంచాల్సిన నిధుల మొత్తం) ప్రస్తుత 19 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్‌ తల్వార్‌ సూచించారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపోను (ప్రసుతం 5.75 శాతం) ఇటీవల 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించడాన్ని స్వాగతించిన తల్వార్‌... రానున్న త్రైమాసికాల్లో ఇది 4.5 శాతానికి చేరుతుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే ఆశించిన వృద్ధి ఫలితాల సాధనకు రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. 
ఆదాయపు పన్ను సరళం చేయాలన్న ఫిక్కీ
వ్యక్తులకు సంబంధించి ఆదాయపు పన్ను శ్లాబ్స్‌ను సరళతరం చేయాలని ఫిక్కీ ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. రూ.20 లక్షల ఆదాయం దాటిన వారికే 30 శాతం పన్ను రేటును అమలు చేయాలని పేర్కొంది. ప్రస్తుతం 10 లక్షల ఆదాయం దాటిన వారికి 30 శాతం పన్ను రేటు అమల్లో ఉంది. ‍కార్పొరేట్‌ పన్నును 25 శాతానికి తగ్గించాలని ఫిక్కీ అభిప్రాయపడింది. భారత వ్యాపారాలు అధిక పన్ను భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోందని, అన్ని పన్నులూ కలుపుకుంటే 50 శాతం దాటిపోయే పరిస్థితి నెలకొందని ఫిక్కీ ప్రెసిడెంట్‌ సందీప్‌ సోమానీ పేర్కొన్నారు. 
కార్మిక, భూ సంస్కరణలు కీలకం: అసోచామ్‌
కాగా అసోచామ్‌ డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ సౌరభ్‌ సన్యాల్‌ మరో ప్రకటన చేస్తూ... దేశంలో కార్మిక, భూ సంస్కరణల అవసరం ఎంతో ఉందన్నారు. ఈ చర్యలు దేశంలో అంతర్గతంగా పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, విదేశీ పెట్టుబడిదారులను కూడా దేశానికి ఆకర్షించడానికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో... పరిమిత కాలానికి ప్రభుత్వ వ్యయాలకు వీలు కల్పిస్తూ, ఫిబ్రవరి 1న కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలోని తాజా బడ్జెట్‌ టీమ్‌లో ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌, ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్‌ ఉన్నారు. ఫైనాన్స్‌ కార్యదర్శి సుభాష్‌ చం‍ద్ర గార్గ్‌ నేతృత్వంలోని అధికారుల బృందం‍లో వ్యయ వ్యవహారాల కార్యదర్శి గిరీష్‌ చంద్ర ముర్మూ, రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషన్‌ పాండే, డీఐపీఏఎం సెక్రటరీ అతన్‌ చక్రవర్తి, ఫైనాన్స్‌ సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌లు ఉంటారు. కొత్తగా ఎన్నికైన 17వ లోక్‌సభ మొదటి సమావేశాలు జూన్‌ 17 నుంచి జూలై 26వ తేదీ వరకూ జరుగుతాయి. 2018-19 ఆర్థిక సర్వేను జూలై 4న ఆర్థికమంత్రి ప్రవేశపెడతారు. ఆ తదుపరిరోజు 2018-19 పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంటు ముందు ఉంచుతారు. You may be interested

త్వరలో మైండ్‌ట్రీలో మెజార్టీ వాటా సొంతం!

Thursday 13th June 2019

ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ ధీమా ఇంజినీరింగ్‌ దిగ్గజం లార్సన్‌–టూబ్రో(ఎల్‌ అండ్‌ టీ) మరికొద్ది కాలంలో మైండ్‌ ట్రీలో మెజార్టీ వాటాను దక్కించుకుంటుందని ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఏఎమ్‌ నాయక్‌ అన్నారు. 40 శాతం కంటే ఎక్కువ వాటాను  ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా పొందే దారిలో ఉన్నామన్నారు. ప్రస్తుతం ఈ బెంగుళూరు కంపెనీలో ఎల్‌అండ్‌టీ వాటా 28.9శాతానికి చేరింది. జూన్‌ 17 న ప్రారంభమై జూన్‌ 28 ను ముగియనున్న ఓపెన్‌ ఆఫర్‌లో

అనిల్‌ అంబానీ కంపెనీల నుంచి వైదొలగిన పీడబ్ల్యూసీ

Thursday 13th June 2019

స్టాట్యుటరీ ఆడిటర్‌ పదవికి గుడ్‌బై న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీల స్టాట్యుటరీ ఆడిటర్‌ పదవి నుంచి పీడబ్ల్యూసీ వైదొలగింది. ప్రైస్‌ వాటర్‌హౌస్‌ అండ్‌ కో చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ (పీడబ్ల్యూసీ) ఈ నెల 11 నుంచి అమల్లోకి వచ్చే విధంగా స్టాట్యుటరీ ఆడిటర్‌ పదవికి రాజీనామా చేసిందని, రెండు కంపెనీలూ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు నివేదించాయి. గత ఆర్థిక సంవత్సరం ఆడిట్‌కు  సంబంధించి పీడబ్ల్యూసీ కొన్ని

Most from this category