News


ఇంటి ముందుకే బ్యాంక్‌ సేవలు!

Monday 4th November 2019
personal-finance_main1572839395.png-29320

 • ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నుంచీ డోర్‌ స్టెప్‌ సేవలు
 • సీనియర్‌ సిటీజన్స్, వికలాంగులకు మాత్రమే ఉచితం
 • డిపాజిట్స్, చెక్‌ బుక్స్, డ్రాఫ్ట్, ఫామ్‌-16 వంటివెన్నో..
 • నగదు లావాదేవీల్లో జాగ్రత్త: నిపుణులు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బ్యాంక్‌ సేవలు మీ ఇంటి ముందుకొచ్చేశాయి. కొన్నాళ్లుగా ప్రైవేట్‌ బ్యాంక్‌లు మాత్రమే అందిస్తున్న డోర్‌ స్టెప్‌ బ్యాంకింగ్‌ సేవలను అందించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లూ సిద్ధమయ్యాయి. 
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 2017లో వృద్ధులకు, బ్యాంక్‌ శాఖలకు రాలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు డోర్‌ స్టెప్‌ సేవలను అందించవచ్చని నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి పలు ప్రైవేట్‌ బ్యాంక్‌లు తమ ఖాతాదారులకు ఇంటి వద్దకే బ్యాంక్‌ సేవలను అందించడం ప్రారంభించాయి. కస్టమర్ల నుంచి డిమాండ్‌ పెరగటంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లూ ఈ తరహా సేవలందించేందుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంక్‌ మిత్ర పేరిట ఈ తరహా సేవలను అందిస్తున్నాయి. ఇక మెట్రో నగరాల్లోనూ వీటిని అందించనున్నాయి. ఎస్‌బీఐ, పీఎన్‌బీ వంటి దేశంలోని పలు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు ఈ డోర్‌స్టెప్‌ సేవల కోసం ప్రత్యేక సర్వీస్‌ ప్రొవైడర్‌ను నియమించుకున్నాయి. 

ఎలా వినియోగించుకోవాలంటే?
హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ సహా అన్ని ప్రైవేట్, కో–ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌లు డోర్‌ స్టెప్‌ సర్వీసెస్‌ను అందిస్తున్నాయి. వీటిని పొందాలంటే.. ముందుగా కస్టమర్లు తమ హోమ్‌ బ్రాంచ్‌లో పేర్లను నమోదు చేసుకొని, కేవైసీని నింపాలి. వికలాంగులైతే మెడికల్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలి. బ్యాంక్‌ నుంచి 5 కి.మీ. పరిధిలో ఉండే కస్టమర్లకు మాత్రమే ఈ సేవలందిస్తారు. కాల్‌ సెంటర్, వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ ద్వారా ఖాతాదారులు రిక్వెస్ట్‌ పంపిస్తే చాలు. అదే రోజు సర్వీసెస్‌ను అందిస్తారు. ఒకవేళ బ్యాంక్‌ సమయం దాటిపోతే మర్నాడు కచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. మైనర్‌ ఖాతాలు, జాయింట్‌ ఖాతాలకు డోర్‌ స్టెప్‌ సేవలుండవు.
చార్జీలు ఎంత ఉంటాయంటే...
60 ఏళ్లు పైబడిన వృద్ధులు, మానసిక, శారీరక వికలాంగులకు డోర్‌ స్టెప్‌ సేవలను ఉచితంగానే అందిస్తారు. మిగిలిన కస్టమర్లు ఈ సేవలను పొందాలంటే కొంత చార్జీలుంటాయని, అవి బ్యాంక్‌ను బట్టి మారుతుంటాయని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ చైర్మన్‌ వి. అరవింద్‌ తెలిపారు. నగదు లావాదేవీలపై రూ.100, నాన్‌–ఫైనాన్షియల్‌ సేవలపై రూ.60 వరకు చార్జీలుంటాయి.
ఎలాంటి సేవలుంటాయంటే?

 • నగదు డిపాజిట్, విత్‌డ్రా
 • కొత్త ఖాతా ప్రారంభం
 • చెక్‌ బుక్‌ రిక్వెస్ట్, పంపిణీ
 • అకౌంట్‌ స్టేట్‌మెంట్‌
 • డ్రాఫ్ట్‌లు, టర్మ్‌ డిపాజిట్‌ రిసిప్ట్స్‌ వంటివి
 • టీడీఎస్, ఎఫ్‌డీల మినహాయింపులకు అవసరమైన 15 జీ, 15 హెచ్, ఫామ్‌ 16 జారీ
 • పాస్‌బుక్స్, డెబిట్, గిఫ్ట్‌ కార్డ్‌ల పంపిణీ
 • ఐటీ చలాన్లు

సేవలు ఎవరందిస్తారు?
డోర్‌ స్టెప్‌ సేవలందించేది ఏజెంట్లే. బ్యాంక్, ఏజెన్సీల మధ్య ఒప్పందం కాల పరిమితి మూడేళ్ల పాటు ఉంటుంది. సేవలు సంతృప్తికరంగా ఉంటే మరో రెండేళ్లు పొడిగిస్తారు. ‘‘ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హెచ్‌డీఎఫ్‌సీ డోర్‌ స్టెప్‌ సర్వీస్‌లను హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి నగరాల్లో అందిస్తోంది. త్వరలోనే మరో 6–7 నగరాల్లో ప్రారంభిస్తాం’’ అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు తెలిపారు. 2 వేల కంటే తక్కువ ఖాతాదారులున్న బ్యాంకుల్లో ఈ సేవలను అందించలేమని, ఉద్యోగులు తక్కువగా ఉన్న బ్యాంక్‌లో ప్రైవేట్‌ వ్యక్తులు ఈ సేవలను అందిస్తారని ఆయన చెప్పారు. డోర్‌ స్టెప్‌ సేవల విషయంలో ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలని ఆల్‌ ఇండియా రీజినల్‌ రూరల్‌ బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ ఎస్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి చెప్పారు. ఈ సేవలను అందించేది ప్రైవేట్‌ వ్యక్తులు కాబట్టి.. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరపకూడదని సూచించారు. You may be interested

లార్జ్‌క్యాప్‌లో రాబడుల కోసం..

Monday 4th November 2019

లార్జ్‌క్యాప్‌లో రాబడుల కోసం.. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌ డి.జయంత్‌కుమార్‌, థర్డ్‌ఫార్టీ ప్రొడక్ట్స్‌ హెడ్‌, కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ దేశ స్టాక్‌ మార్కెట్లు ఇటీవల నూతన శిఖరాలకు చేరినప్పటికీ, స్థూల ఆర్థిక అంశాలు ఇంకా మెరుగుపడలేదు. మెజారిటీ కీలక రంగాల్లో వృద్ధి పదిహేనేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇటీవలే ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలంలో

గృహ రుణంలో మీ ఎంపిక ఏది?

Monday 4th November 2019

ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ రేటుకు మారుతున్న బ్యాంకులు- రెపో ఆధారిత రుణాలకు అధిక ప్రాధాన్యం వీటిల్లో పారదర్శకత పాళ్లు కాస్త ఎక్కువే గతంలో ఎంసీఎల్‌ఆర్‌, బేసు రేటు ఆధారంగా రుణాలు నూతన విధానంలో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనం అధికం  మారే ముందు చూడాల్సిన అంశాలు ఎన్నో.. గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఇప్పుడు బాగా దిగొచ్చాయి. ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ రేట్లతో గృహ రుణ రేట్లను అనుసంధానించాలన్న ఆర్‌బీఐ ఆదేశాలకు లోబడి బ్యాంకులు రెపో రేటుతో

Most from this category