News


రిటైర్మెంట్‌కు వీపీఎఫ్‌ ఆయుధం!

Monday 16th March 2020
personal-finance_main1584329528.png-32494

  • రిటైర్మెంట్‌కు వీపీఎఫ్‌ ఆయుధం!
  • ఈపీఎఫ్‌కు అదనంగా జమ చేసుకోవచ్చు
  • తద్వారా రిటైర్మెంట్‌ నాటికి అధిక మొత్తం
  • రాబడి రేటు ఈపీఎఫ్‌లో మాదిరే
  • ఈపీఎఫ్‌ నిబంధనలే అమలవుతాయి
  • పీపీఎఫ్‌, ఇతర స్థిరాదాయ సాధనాల కంటే అధిక రాబడి
  • అత్యవసరాల్లో ఉపసంహరణకు వీలు


రిటైర్మెంట్‌ తర్వాత జీవితానికి సంబంధించి చాలా మందిలో ప్రణాళిక కనిపించదు. ఎన్నో ఏళ్ల తర్వాత అవసరాల కంటే ప్రస్తుత జీవన అవసరాలే వారికి ప్రాధాన్యంగా ఉంటుంటాయి. ఎక్కువగా మధ్యతరగతి, దిగువ ఆదాయ వర్గాల్లో ఇది చూడొచ్చు. కానీ, 60 ఏళ్ల తర్వాత ఆర్జనా శక్తి తగ్గిపోయిన పరిస్థితుల్లో తమ జీవన అవసరాలు, ఆరోగ్య సంరక్షణ, వైద్య ఖర్చులు భరించాలంటే.. కచ్చితంగా అందుకు చిన్న నాటి నుంచే తగిన ప్రణాళిక కావాలి. అన్ని అవసరాలను తీర్చేంత నిధి సమకూర్చుకోవాలి. దీన్ని విస్మరిస్తే విశ్రాంత జీవనంలో ఇబ్బందులు (స్థిర, చరాస్తులు కలిగిన వారు మినహా) ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ నిధి ఎలానూ ఉంటుంది. ప్రైవేటు రంగంలోని వారికి ఈపీఎఫ్‌ సదుపాయం ఉంది. కానీ, దీని వాటా స్వల్ప మొత్తమే. ఇంకాస్త అదనంగా ఈపీఎఫ్‌కు జమ చేసుకుంటానంటే అందుకు వీలు పడదు. కానీ, ఇటువంటి వారు ఈపీఎఫ్‌కు అదనంగా మరికొంత మొత్తాన్ని ప్రతీ నెలా స్వచ్చంద భవిష్యనిధి (వీపీఎఫ్‌) రూపంలో సమకూర్చుకోవచ్చు. 

రిస్క్‌ లేని అధిక రాబడులు
రిటైర్మెంట్‌ తర్వాత అవసరాల కోసం స్థిరాదాయ సాధనాల్లో పొదుపు చేసుకోవాలనుకునే వారికి వీపీఎఫ్‌ ఒక మంచి సాధనమన్నది నిపుణుల అభిప్రాయం. ఈపీఎఫ్‌ చందాకు అదనంగా స్వచ్చందంగా ఉద్యోగులు ఇందులో జమ చేసుకోవచ్చు. ప్రైవేటు రంగ ఉద్యోగులకు వారి మూల వేతనం, డీఏలో 12 శాతాన్ని ప్రతీ నెలా వేతనం నుంచి మినహాయించి వారి ఈపీఎఫ్‌ ఖాతాకు సంస్థలు జమ చేస్తుంటాయి. ఇంతే మొత్తాన్ని ఉద్యోగి తరఫున సంస్థ కూడా తన వాటాగా అందజేస్తుంది. కానీ, ఈ పరిమితికి మించి ఈపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు అవకాశం లేదు. దీనికి అదనంగా రిటైర్మెంట్‌ ఫండ్‌ కోసం మరికొంత పొదుపు చేసుకోవాలని భావించే వారికి వీపీఎఫ్‌ అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగి తన మూలవేతనం, డీఏకు నూరు శాతం సమాన మొత్తాన్ని ప్రతీ నెలా వీపీఎఫ్‌లో జమ చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి మూల వేతనం 12,000, డీఏ రూ.3,000 అనుకుంటే అప్పుడు ప్రతీ నెలా గరిష్టంగా రూ.15,000ను వీపీఎఫ్‌లో జమ చేసుకోవచ్చు. 

వీపీఎఫ్‌ ఎందుకు ఆకర్షణీయం అంటే.. ఈపీఎఫ్‌ చందాలపై లభించే వడ్డీ రేటే వీపీఎఫ్‌ నిధికి కూడా వర్తిస్తుంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ‍ప్రతీ ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడులపై వచ్చిన ఆదాయం, నిధుల లభ్యతకు అనుగుణంగా వడ్డీ రేటును నిర్ణయిస్తుంటుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ రేటు 8.65 శాతం కాగా, 2019-20 సంవత్సరానికి 8.5 శాతంగా నిర్ణయించింది. స్థిరాదాయ పథకాల్లో ఇది అత్యధిక రేటు. కొంత మంది విడిగా పీపీఎఫ్‌ ఖాతా తెరిచి ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. కానీ పీపీఎఫ్‌తో పోలిస్తే కనీసం అర శాతానికి పైనే వీపీఎఫ్‌లో వడ్డీ రేటు ఉంటుందని ఆశించొచ్చు. ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌ రెండూ కూడా క్యుములేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలే. అంటే ఇందులో చేసే పెట్టుబడులపై వడ్డీ ఆదాయం ఏటా అసలుకు కలుస్తుంటుంది. దీంతో దీర్ఘకాలంలో మంచి కాంపౌండింగ్‌ వృద్ధి ఉంటుంది. అయితే, ఈపీఎఫ్‌ జమలకు వర్తించే లాకిన్‌, పాక్షిక ఉపసంహరణల నిబంధనలే వీపీఎఫ్‌కూ వర్తిస్తాయి. 

రాబడుల వ్యత్యాసం
బ్యాంకు డిపాజిట్లపై ఇప్పుడు వడ్డీ రేటు 6.5 శాతం స్థాయిలకు పడిపోయింది. దీంతో వడ్డీ రేటు పరంగా వీపీఎఫ్‌ ఎంతో ఆకర్షణీయమనే చెప్పుకోవాలి. పెద్దల కోసం ఉద్దేశించిన సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (8.6 శాతం)ను మినహాయిస్తే చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లతో పోల్చి చూసినా వీపీఎఫ్‌ రేటే అధికం. ఈక్విటీల్లో ఈపీఎఫ్‌ పెట్టుబడులు పెరుగుతూ ఉండడం, కార్మిక సంఘాల డిమాండ్ల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌పై అధిక వడ్డీ రేటును నిర్ణయించక తప్పడం లేదు. రిటైర్మెంట్‌ పథకం ఎన్‌పీఎస్‌లో ఈక్విటీలకు గరిష్టంగా 75 శాతం కేటాయింపులకు అవకాశం ఉండడంతో దీర్ఘకాలంలో వీపీఎఫ్‌తో పోలిస్తే కొంత అదనపు రాబడులకు వీలుంటుంది. కానీ, గడువు ముగిసిన తర్వాత ఉపసంహరించుకునే విషయంలో పరిమితులు ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే వీపీఎఫ్‌ ఎంతో సౌలభ్యం. ఈపీఎఫ్‌/వీపీఎఫ్‌కు చేసే జమలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఉండడం అదనపు ఆకర్షణ. 

పన్ను వర్తించని సాధనం
వీపీఎఫ్‌కు చేసే జమలు, రాబడులు, ఉపసంహరణలు అన్నీ కూడా పన్ను ఆదా ప్రయోజనం కలిగినవి. కనుక ఇది కూడా మరో ఆకర్షణీయ అంశమే. ఎన్‌పీఎస్‌లో గడువు తీరే నాటికి సమకూరిన నిధిలో 40 శాతంపై పన్ను చెల్లించి ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తే, వీపీఎఫ్‌లో జమ అయిన మొత్తాన్ని ఎటువంటి పన్ను లేకుండా వెనక్కి తీసేసుకోవచ్చు. ఇందులో చేసే జమలకు సెక్షన్‌ 80సీ కింద రూ.1.5లక్షల వరకు పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఏ దశలోనూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు కనుక.. వాస్తవికంగా పొందే రాబడి రేటు మెరుగైనదిగా భావించాలి. అయితే, వడ్డీ రేటు 9.5 శాతం మించితే అప్పుడు ఆ మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఇటీవలి సంవత్సరాల్లో ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌పై వడ్డీ రేటు 8.5-9 శాతం మధ్యే స్థిరపడడాన్ని చూస్తూనే ఉన్నాం. రిటైర్మెంట్‌ అనంతరం ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌ నిధిని పన్ను లేకుండా వెనక్కి తీసేసుకోవచ్చు. ఒకవేళ రిటైర్మెంట్‌కు ముందుగా ప్రత్యేక అవసరాల్లో కొంత వెనక్కి తీసుకున్నా కానీ పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. అయితే, కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన తర్వాత తీసుకుంటేనే పన్ను మినహాయింపు ప్రయోజనం వర్తిస్తుంది. ఐదేళ్ల సర్వీసు పూర్తి కాకముందే ఉపసంహరించుకునే మొత్తం రూ.50,000 మించితే 10 శాతాన్ని టీడీఎస్‌ కింద మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తారు. అలాగే, అప్పటి వరకు ఆర్జించిన వడ్డీ రాబడిపైనా పన్ను పడుతుంది. 

సులభ ప్రక్రియ
ఈపీఎఫ్‌కు కొనసాగింపు వీపీఎఫ్‌. వేతన జీవులకే ఈ అవకాశం. వీపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే అది సులభమే. తాము పనిచేస్తున్న సంస్థకు ఆ విషయాన్ని తెలియజేసి రిజిస్ట్రేషన్‌ ఫామ్‌ను పూర్తి చేసి ఇస్తే సరిపోతుంది. ప్రతీ నెలా ఎంత మొత్తాన్ని వీపీఎఫ్‌కు జమ చేయాలన్నది కూడా తెలియజేయాలి. అప్పటి వరకు కొనసాగుతున్న ఈపీఎఫ్‌ ఖాతాయే వీపీఎఫ్‌కూ వర్తిస్తుంది. వీపీఎఫ్‌ రూపంలో అదనంగా జమ చేసే మొత్తం కూడా ఈపీఎఫ్‌ బ్యాలన్స్‌కే కలుస్తుంది. వీపీఎఫ్‌లో పెట్టుబడుల పరంగా సౌలభ్యం కూడా ఉంది. వీలున్నంత కాలం ఇన్వెస్ట్‌ చేసి, ఆ తర్వాత కొంత కాలం పాటు నిలిపివేయవచ్చు. అయితే, కొన్ని సంస్థలు ఏడాదికి ఒక్కసారే మార్పులకు అనుమతిస్తున్నాయి. 

అవసరాల్లో అక్కరకు...
ఆర్థిక అత్యవసరాల్లో ఈపీఎఫ్‌లో మాదిరే వీపీఎఫ్‌ బ్యాలన్స్‌ను కూడా వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పిల్లల వివాహాలు, వారి ఉన్నత విద్య, వైద్య అవసరాల కోసం, గృహ కొనుగోలుకు ఇందులోని బ్యాలన్స్‌ను వెనక్కి తీసుకునేందుకు ఈపీఎఫ్‌వో అనుమతిస్తుంది. నిర్ణీత కాలం పాటు ఉద్యోగం లేకుండా ఉన్నా బ్యాలన్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. ఒక నెలకు మించి ఉద్యోగం లేకుండా కొనసాగితే, వీపీఎఫ్‌/ఈపీఎఫ్‌ బ్యాలన్స్‌లో 75 శాతాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. వరుసగా రెండు నెలల పాటు ఉద్యోగం లేని యెడల మిగతా మొత్తాన్ని కూడా వెనక్కి తీసేసుకోవచ్చు. పీపీఎఫ్‌తో పోలిస్తే ఎన్నో విధాలుగా ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌లు ప్రయోజనకరం. పీపీఎఫ్‌లో పాక్షిక ఉపసంహరణలు, అది కూడా ఏడో ఏట నుంచే అవకాశం కల్పిస్తారు. 15 ఏళ్లు పూర్తయిన తర్వాతే పూర్తిగా వెనక్కి తీసుకోగలరు. కానీ, ఈపీఎఫ్‌/వీపీఎఫ్‌లో ఉపసంహరణల పరంగా సౌలభ్యత ఎక్కువ. పైగా రాబడి రేటు కూడా పీపీఎఫ్‌లో ప్రస్తుతమున్న 7.9 శాతంతో పోలిస్తే ఎక్కువే. You may be interested

అమెరికా వడ్డీ రేట్లు@ జీరో

Monday 16th March 2020

పాలసీ సమీక్షకంటే ముందుగానే వడ్డీ రేట్ల కోత రెండు వారాల్లోనే  రెండోసారి రేట్ల తగ్గింపు ఇంతక్రితం 0.5 శాతం- తాజాగా 1 శాతం సున్నా స్థాయికి చేరిన ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 700 బిలియన్‌ డాలర్లతో భారీ సహాయక ప్యాకేజీ చైనాలో పుట్టి యూరోపియన్ దేశాలను దాటి అమెరికా వరకూ పాకిన కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచం నిలువెల్లా వణుకుతోంది. దాదాపు ప్రపంచ దేశాలన్నీ కోవిడ్‌-19 వైరస్‌ ప్రభావానికి లోనైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో అంతర్జాతీయ ఆర్థిక

నేడు మార్కెట్లు మళ్లీ కుప్పకూలతాయా?

Monday 16th March 2020

భారీ గ్యాప్‌ డౌన్‌తో ఓపెనింగ్‌ నేడు! ప్రపంచ మార్కెట్లలో కరోనా విలయం 410 పాయింట్లు కోల్పోయిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  వడ్డీ రేట్లను సున్నాకు చేర్చిన ఫెడరల్‌ రిజర్వ్‌ యూఎస్‌ ఫ్యూచర్స్‌ 4.5 శాతం డౌన్‌ అటూఇటుగా ఆసియా మార్కెట్లు నేడు(సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి పతనం(గ్యాప్‌ డౌన్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం  8.30 ప్రాంతం‍లో 410 పాయింట్లు పడిపోయి 9,574 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 9,984

Most from this category