News


రిటైర్మెంట్‌కి ఎంత కావాలంటే...

Monday 11th November 2019
personal-finance_main1573443940.png-29492

  • వార్షిక ఖర్చులకు 20 రెట్లుతో నిధి
  • ఏటా 4 శాతం చొప్పున విత్‌డ్రాయల్‌

    గడిచిన కొద్ది దశాబ్దాలుగా ఉమ్మడి కుటుంబాల స్థానంలో చిన్న కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. దీంతో రిటైర్మెంట్‌ దశ గురించి ఆలోచించే తీరూ మారుతోంది. వృద్ధాప్యంలో ఆర్థికావసరాల కోసం పిల్లలపై ఆధారపడకూడదనే అభిప్రాయం తల్లిదండ్రుల్లో ఉంటోంది. ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే కాకుండా ఇతరత్రా వ్యాపకాలను చూసుకునేందుకు వీలైనంత త్వరగా రిటైర్‌ అవుదామనుకునే వారూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్‌ ప్లానింగ్‌కి కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. ఇదంతా బాగానే ఉంది కానీ.. నిజంగా రిటైరయ్యే నాటికి ఎంత మొత్తం కూడబెట్టుకోవాలి అన్నది చాలా మందికి వచ్చే సందేహం. ఇందుకోసం ఎవరికి తోచిన లెక్కలు వారు వేసుకున్నా.. ఆర్థిక నిపుణులు సూచించే  దాని ప్రకారం .. ధరల పెరుగుదలను కూడా పరిగణనలోకి తీసుకుని వార్షిక వ్యయాలకు 20 రెట్లు ఉండేలా రిటైర్మెంట్‌ నిధి సమకూర్చుకోవడం శ్రేయస్కరం (పదవీ విరమణం చేసే నాటికి ఏ రుణభారమూ లేని వారికి ఇది వర్తిస్తుంది).
క్లుప్తంగా చెప్పాలంటే.. ఉదాహరణకు ఏటా మీ ఖర్చులు సుమారు రూ. 9,00,000గా ఉండి.. మీరు మరో 10 ఏళ్లలో రిటైరవుతారనుకుందాం. సాధారణంగా ద్రవ్యోల్బణం 5-6 శాతం శ్రేణిలో ఉంటుంది. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నప్పుడు పదేళ్ల తర్వాత మీ వార్షిక వ్యయాలు సుమారు రూ. 16,00,000కు చేరవచ్చు. పదేళ్ల తర్వాత ఏటా అవసరమయ్యే రూ. 16,00,000ను.. 20తో గుణిస్తే (20 రెట్లు) .. సుమారు రూ. 3,20,00,000 రిటైర్మెంట్‌ నిధి అవసరమవుతుంది.

విత్‌డ్రాయల్‌ ఎంతంటే...
నిధి పోగు చేసుకున్నాం సరే.. అది కరిగిపోకుండా దీర్ఘకాలం ఉండాలంటే.. ఎంత స్థాయిలో విత్‌డ్రా చేసుకోవచ్చన్న మరో ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.  అంతర్జాతీయంగా చూస్తే బండగుర్తుగా విత్‌డ్రాయల్స్‌ను ఏటా నిధిలో 4 శాతానికి పరిమితం చేసుకోవడం మంచిదంటారు. భవిష్యత్‌లో పెరిగే ధరలను ఎదుర్కొనేందుకు తగిన రాబడులిచ్చేలా.. పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ, డెట్‌ సాధనాలు సముచిత రీతిలో ఉన్నప్పుడు ఈ ఫార్ములా పనిచేస్తుందనేది వారి మాట. కట్టు తప్పకుండా ..దీన్నే పాటించిన పక్షంలో కార్పస్‌ నిధి కనీసం 30 ఏళ్ల పాటు కొనసాగుతుంది. అయితే, ఒకవేళ వారసుల కోసం కూడా ఏమైనా మిగల్చాలనుకుంటే మళ్లీ లెక్కలు మారతాయి. దీనితో పాటు మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఆర్థిక సాధనాల నాణ్యత, నిలకడగా వచ్చే రాబడులు, వైద్య బీమా తదితర అంశాలు కూడా ముఖ్యమే.

వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మీకు అనువైన ప్రణాళికను రూపొందించుకునేందుకు అవసరమైతే మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ సలహాలు తీసుకోండి. ఆర్థిక స్వేచ్ఛ దిశగా ధైర్యంగా అడుగేయండి. 
 You may be interested

ఓపిక పడితే... కాసుల పంటే!

Monday 11th November 2019

ఇటీవలి కొన్ని వారాలుగా జరుగుతున్న ర్యాలీని ప్రధానంగా లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ నడిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో తీసుకున్న నిర్ణయాలతో ప్రధానంగా లాభపడేవి ఇవే. కానీ, మార్కెట్‌ మొత్తాన్ని ఓ సారి ఆసాంతం పరిశీలించినట్టయితే, మిడ్‌క్యాప్‌, స్మా్ల్‌ క్యాప్‌ విభాగాల్లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు కనిపిస్తాయి. గత ఏడాది కాలంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 15 శాతం రాబడులను ఇవ్వగా, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇచ్చిన రాబడులు కేవలం 0.1 శాతమే.

గృహ రుణంలోనూ కలసికట్టుగా..

Monday 11th November 2019

దంపతులు జాయింట్‌గా తీసుకుంటే బెటర్‌ అధిక మొత్తంలో గృహ రుణానికి వీలు కలసి దరఖాస్తు చేయడం వల్ల మెరుగైన అర్హత చెల్లింపుల భారం తగ్గుతుంది తక్కువ కాలంలోనే తీర్చేయవచ్చు తక్కువ వడ్డీకే రుణం పొందే అవకాశం పన్ను ఆదా ప్రయోజనాలు కూడా ఎక్కువే ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తేనేకానీ నగరాల్లో జీవనశైలికి అనుగుణంగా బతుకుబండి నడిచే పరిస్థితులు లేవు. అలాంటిది... ఇల్లు సమకూర్చుకోవడం ఎంత పెద్ద ప్రహసనమో చెప్పనక్కర్లేదు!! అయితే, గృహ రుణం ఒక్కరి పేరుతో తీసుకునేకంటే దంపతులు కలసి

Most from this category