News


ఫ్రీ... వాళ్ల పాలసీ... మీరేం చేయాలి?

Monday 30th December 2019
personal-finance_main1577676724.png-30509

  • క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై ఉచిత బీమా
  • మ్యూచువల్‌ ఫండ్స్‌ సిప్‌ పెట్టుబడులపైనా..
  • టర్మ్‌, ప్రమాద, పర్యాటక, ఆరోగ్య బీమాలు
  • నియమ, నిబంధనలు తెలుసుకోవడం అవసరం
  • అవగాహనతోనే వీటివల్ల ప్రయోజనం

బీమా పాలసీలు ఉచితంగా రావడం ఏంటి... అని ఆశ్చర్యపోతున్నారా..? ఇది నిజమే. ఆర్థిక ఉత్పత్తులు, పెట్టుబడి సాధనాలకు అనుబంధంగా ఉచిత బీమా పాలసీలను కంపెనీలు ఆఫర్‌ చేయటం కొత్తేమీ కాదు. బ్యాంకు ఖాతాలు, డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు, మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇలా ఎన్నింటికో బీమా పాలసీలను కూడా జతచేసి బండిల్డ్‌గా ఆఫర్లు చేస్తు‍న్నాయి కంపెనీలు. అంతేకాదు!! భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థ కొన్ని ప్రీపెయిడ్‌ ప్లాన్లపైనా టర్మ్‌ లైఫ్‌ పాలసీలను ఆఫర్‌ చేస్తోంది. అదీ ఉచితంగా. నెలసరి రీచార్జ్‌ ప్లాన్‌పై అంతే కాల వ్యవధికి కస్టమర్‌ బీమా కవరేజీ అందుకోవచ్చు. ఈ సంస్థలు గ్రూపు ఇన్సూరెన్స్‌ కవరేజీ తీసుకుని, కస్టమర్లకు ఉచితంగా, తక్కువ చార్జీలకు లేదా ఫ్రీగా ఆఫర్‌ చేస్తుంటాయి. కానీ, ఇలా ఉచితంగా లభించే పాలసీ ప్రయోజనాలపై చాలా మందికి ఇప్పటికీ అవగాహన లేదు. ఇతర ఉత్పత్తులతో పాటు ఉచితంగా వచ్చే బీమా పాలసీలను చాలా మంది వినియోగించుకోవడం లేదు. నిజం చెప్పాలంటే... ఇలాంటి పాలసీలపై పూర్తిగా ఆధారపడటం సరికాదు. ఎందుకంటే వీటి ప్రయోజనాలు మీ అవసరాలను తీర్చే విధంగా ఉండకపోవచ్చు. వీటిని అదనపు కవరేజీలుగానే చూడాలి. కాకపోతే అవసరం వచ్చినపుడు ఉపయోగించుకోవటం మాత్రం చేయాలి. ఈ తరహా బండిల్డ్‌ బీమా కవరేజీల గురించి అవగాహన కల్పించే కథనమే ఇది.

ఎలాంటి పాలసీ ఇస్తున్నారు...
సాధారణంగా ఇతర ఉత్పత్తులతో విక్రయించే పాలసీలు.. వ్యక్తిగత ప్రమాద బీమా, పర్యాటక బీమా, ఆరోగ్య బీమా, జీవిత బీమాకు సంబంధించినవే ఉంటాయి. ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, ఎస్‌బీఐ తమ క్రెడిట్‌ కార్డు దారులకు వ్యక్తిగత ప్రమాదబీమాను ఆఫర్‌ చేస్తున్నాయి. ఎంచుకున్న క్రెడిట్‌ కార్డు రకాన్ని బట్టి వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ రూ.50,000- 3,00,000 వరకు ఉంటోంది. బ్యాంకు ఖాతాలు, డెబిట్‌ కార్డులకు అనుబంధంగానూ ఇవే వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీలు ఉంటున్నాయి. కానీ, ఈ కవరేజీలను యాక్టివ్‌గా (మనుగడలో) ఉంచుకోవాలనుకుంటే నిర్ణీత కాల వ్యవధిలోపు డెబిట్‌ కార్డు ద్వారా లావాదేవీలు నిర్వహించాలన్న నిబంధనలను కంపెనీలు విధిస్తున్నాయి. ఉదాహరణకు ఎస్‌బీఐ డెబిట్‌కార్డుపై కనీసం 90 రోజులకు ఒక లావాదేవీ అయినా చేయాలి. అప్పుడే ఈ వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీకి అర్హులవుతారు. ఈ కవరేజీ రూ.2-1 0 లక్షల వరకు ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు అయితే సమగ్ర బీమా పాలసీని అందిస్తోంది. ఇందులో క్రెడిట్‌ కార్డుల చోరీపైనా బీమా రక్షణ ఉంటుంది. డైమంట్‌, సఫైర్‌, రూబిక్స్‌ క్రెడిట్‌ కార్డులపై ఐసీఐసీఐ బ్యాంకు ఈ కవరేజీతోపాటు బర్గలరీ (దొంగతనం వల్ల కలిగే నష్టం) కవరేజీని ఆఫర్‌ చేస్తోంది. విమాన ప్రమాదాలు, ఇతర ప్రమాదాల కారణంగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే కవరేజీ లభిస్తుంది. అలాగే, పర్యటనలో డాక్యుమెంట్లు, బ్యాగేజీ కోల్పోవడం, విమాన ఆలస్యం వల్ల కలిగే నష్టం, క్రెడిట్‌ కార్డులపై అనధికారిక లావాదేవీలకు బీమా రక్షణను అందిస్తోంది. రూ.50,000- 3,00,000 మధ్య వీటికి బీమా కవరేజీ ఉంటుంది. బ్యాంకు తరఫున ఐసీఐసీఐ లాంబార్డ్‌ ఈ కవరేజీలను ఆఫర్‌ చేస్తోంది. కొన్ని రకాల క్రెడిట్‌ కార్డులపై హెల్త్‌ పాలసీలను కూడా కొన్ని సంస్థలు ఆఫర్‌ చేస్తున్నాయి. కాకపోతే మొదటి ఏడాది కాలానికే ఇవి ఉచితం. తర్వాత రెన్యువల్‌ ప్రీమియం చెల్లిస్తేనే అది కొనసాగుతుంది. నేరుగా బీమా కంపెనీల నుంచి తీసుకునే హెల్త్‌ పాలసీలతో పోలిస్తే, ఇలా క్రెడిట్‌ కార్డులకు అనుబంధంగా వచ్చే వాటి ప్రీమియం కొంత తక్కువగా ఉంటుంది. ఆర్‌బీఎల్‌ బ్యాంకు, రెలిగేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సాయంతో ఇటువంటి ప్లాన్‌ను ఆఫర్‌ చేస్తోంది. 

మొబైల్‌ ఫోన్‌ ప్లాన్లకు కూడా...
మొబైల్‌ ఫోన్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్లపైనా బీమా కవరేజీ అందుబాటులో ఉండడం వినియోగదారులను ఆకర్షించేదే. టెలికం పరిశ్రమలో తొలిగా భారతీ ఎయిర్‌టెల్‌ కొన్ని నెలల క్రితమే దీన్ని ప్రవేశపెట్టింది. రూ.599 రీచార్జ్‌ చేసుకున్న కస్టమర్లు భారతీ ఆక్సా లైఫ్‌ నుంచి ఉచితంగా జీవిత బీమా ప్లాన్‌ అందుకోవచ్చు. రూ.599 రీచార్జ్‌పై కస్టమర్లకు వాయిస్‌, ఇంటర్నెట్‌ సేవలతోపాటు రూ.4 లక్షల బీమా కవరేజీ లభిస్తుంది. ఇక గత ఏడాది కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన వాటిల్లో.. మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) పెట్టుబడులపై జీవిత బీమా కవరేజీని ఆఫర్‌ చేయడం కూడా ఒకటి. యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఇటీవలే రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ ఫండ్‌ను తీసుకొచ్చింది. ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసే వారికి ఉచితంగా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీని అందిస్తోంది. యూటీఐతోపాటు మరికొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ కంపెనీలు కూడా ఇదే తరహాలో సిప్‌ ప్లాన్లపై బీమా కవరేజీని ఆఫర్‌ చేస్తున్నాయి. సిప్‌ రూపంలో చేసే పెట్టుబడులపై ఈ కవరేజీ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఎంత కాలానికి సిప్‌ పెట్టుడులకు కట్టుబడి ఉన్నారనే దాని ఆధారంగా బీమా కవరేజీని కంపెనీలు నిర్ణయిస్తున్నాయి. కనీసం 2-3 ఏళ్ల కాలానికి సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేసిన తర్వాతే బీమా కవరేజీ అమల్లోకి వస్తుందన్న నిబంధనలను విధిస్తున్నాయి. కనుక ముందుగా ఈ వివరాలు తెలుసుకోవాలి. యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ అయితే.. ఇన్వెస్టర్‌ సిప్‌ పెట్టుబడుల కాల వ్యవధి సమయంలో మరణిస్తే.. మిగిలిన కాలానికి బీమా పరిహారాన్ని చెల్లించే విధంగా నిబంధనలు రూపొందించింది. ఉదాహరణకు ఇన్వెస్టర్‌ పదేళ్ల కాలాన్ని ఎంచుకుని, ఐదేళ్ల పాటు సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత మరణించినట్టయితే.. అప్పుడు మిగిలిన ఐదేళ్ల కాలానికి అంటే 60 నెలల సిప్‌ మొత్తానికి సరిపడా బీమా పరిహార చెల్లింపులు లభిస్తాయి. 

వీటిపై దృష్టి పెట్టాలి...
ఏదేనీ ఆర్థిక సాధనంతో పాటు ఉచితంగా బీమా పాలసీ ఇచ్చినప్పుడు మొదట చేయాల్సిన పని ఒకటుంది. వెంటనే నామినీని రిజిస్టర్‌ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఆకస్మిక మరణం చోటు చేసుకుంటే పరిహారం నామినీకి లభిస్తుంది. ముఖ్యంగా టర్మ్‌ పాలసీలకు ఇది అవసరం. తర్వాత ఎవరి పేరును నామినీగా నమోదు చేశారో, వారికి మీ పాలసీ వివరాల గురించి వెంటనే తెలియజేయాలి. నామినీగా పేర్కొనడానికి కారణం తెలియజేస్తే మరీ మంచిది. టర్మ్‌ పాలసీలు, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలు, పర్యాటక బీమా పాలసీలకు ఇది చేయాలి. నామినీలకు క్లెయిమ్‌ ప్రక్రియ గురించి తెలియజేయడం కూడా అవసరమే. ఇలా వేరే ఉత్పత్తులకు అనుబంధంగా వచ్చే పాలసీలకు సంబంధించి అన్ని షరతులు, ప్రయోజనాల గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎంతో అవసరం. ఈ వివరాలను నామినీకి తెలియజేయడం అంతే అవసరం. You may be interested

2019 బిజినెస్‌ రివైండ్‌: స్టాక్‌ మార్కెట్లు ... రికార్డు పరుగులు

Monday 30th December 2019

ఈ ఏడాది ఎకానమీ పరిస్థితి ఎలా ఉన్నా.. స్టాక్‌ మార్కెట్లు మాత్రం దానికి భిన్నంగా రయ్‌న ఎగిశాయి. నిఫ్టీ సుమారు 13 శాతం, సెన్సెక్స్‌ దాదాపు 15 శాతం పెరిగాయి. 2017 తర్వాత దేశీ సూచీలకు 2019 బాగా కలిసొచ్చింది. ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ. 10.2 లక్షల కోట్లు ఎగిసింది. జనవరి 1న 36,162 పాయింట్లుగా ఉన్న సెన్సెక్స్‌ 5,000 పాయింట్లు పైగా పెరిగి 41,000 పైకి చేరింది.

రూ.45 రీచార్జ్‌తోనే ఎయిర్‌టెల్‌ నంబర్‌ రింగింగ్‌!

Monday 30th December 2019

న్యూఢిల్లీ: ఇక మీదట ఎయిర్‌టెల్‌ కస్టమర్లు ప్రతీ 28 రోజులకు చేసుకోవాల్సిన కనీస రీచార్జ్‌ మొత్తాన్ని కంపెనీ రూ.23 నుంచి రూ.45కు పెంచింది. ‘‘‍ప్రతీ 28 రోజులకు కనీసం రూ.45 లేదా అంతకుమించి రీచార్జ్‌ చేసుకుంటేనే సేవలు లభిస్తాయి’’ అని ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఈ నెల 29 నుంచే ఇది అమల్లోకి వస్తుందని కూడా తెలిపింది. ప్రస్తుత టారిఫ్‌ గడువు ముగిసే నాటికి రూ.45 లేదా అంతకుమించిన రీచార్జ్‌ చేసుకోకపోతే..

Most from this category