News


చిన్నారి బీమా... ధీమానిస్తుందా..?

Monday 24th February 2020
personal-finance_main1582514041.png-32026

  • ఇవి ఎండోమెంట్‌, యులిప్‌ ప్లాన్లు
  • వీటిల్లో పెట్టుబడులతో పాటు బీమా
  • పాలసీదారు మరణించినా పెట్టుబడుల కొనసాగింపు
  • కానీ, వీటిల్లో చార్జీలు ఎక్కువ
  • రాబడులు చాలా తక్కువ
  • బీమా కవరేజీ కూడా అంతంతే
  • పూర్తి కవరేజీతో టర్మ్‌ ప్లాన్‌ తీసుకోవడం మేలైనది

పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నవి చైల్డ్‌ ప్లాన్లు. అయితే, వీటి గురించి పూర్తిగా తెలిసినది అతి తక్కువ మందే. బీమా ఏజెంట్లు చైల్డ్‌ ప్లాన్ల గురించి ఆకర్షణీయమైన అంశాలు... ఆకర్షణీయ రాబడుల గణాంకాలను చూపించినప్పుడు ఇన్వెస్ట్‌ చేయాలన్న ఆసక్తి ఏర్పడవచ్చు. అంతేకాదు, కొందరు వెంటనే ఇన్వెస్ట్‌మెంట్‌ కూడా ప్రారంభిస్తారు. ‘దిగితేకానీ లోతు ఎంతో తెలియదు’ అన్న చందంగా ఈ ప్లాన్లను అభివర్ణించాల్సి ఉంటుంది. ‘నీ ముక్కు ఏది?’ అని ప్రశ్నిస్తే తలచుట్టూ వేలిని తిప్పి చూపించనట్టుగా చైల్డ్‌ ప్లాన్లను పేర్కొనక తప్పదు. 

చైల్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లు, ఇన్వెస్ట్‌మెంట్‌తో కలసి ఉంటాయి. వీటిని ఎండోమెంట్‌ పాలసీలుగానే చూడాల్సి ఉంటుంది. వీటిల్లో పాలసీదారులకు ఎంతొస్తుందన్నది పక్కన పెడితే.. పాలసీ చేయించిన ఏజెంట్‌కు మాత్రం మంచి కమీషన్‌ ముడుతుంది. ముఖ్యంగా ఈ పాలసీల్లో ఇన్వెస్ట్‌ చేసే వారిని ప్రధానంగా ఆకర్షించే అంశం ఒకటుంది. పాలసీదారుడు దురదృష్టవశాత్తూ మరణిస్తే.. ఆ తర్వాత కూడా ఈ పాలసీ కొనసాగుతుంది. కాకపోతే ఆ తర్వాత వార్షిక ప్రీమియంలను కట్టే బాధ్యత పాలసీదారుడి కుటుంబంపై పడదు. పాలసీదారుడి తరఫున బీమా కంపెనీయే పాలసీ గడువు తీరే వరకు వార్షిక ప్రీమియంను జమ చేస్తూ మెచ్యూరిటీ తర్వాత అసలు, రాబడులను కలిపి చెల్లిస్తుంది. దీంతో పిల్లల చదువులకు ఉద్దేశించిన పెట్టబడుల లక్ష్యం ఆగకుండా కొనసాగుతుంది. చూడ్డానికి బాగానే ఉంది కానీ.. ఈ సదుపాయం కోసం పాలసీదారుడు భారీ ప్రీమియంను చెల్లించుకోవాల్సి వస్తుంది. అంటే ఈ రిస్క్‌ను కూడా పాలసీలో చేర్చి అధిక ప్రీమియంను కంపెనీలు రాబడతాయి. ఒకవేళ పాలసీ గడువు తీరే వరకు పాలసీదారుడు జీవించి ఉంటే చివర్లో వచ్చే రాబడులు చాలా తక్కువ. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని పూడ్చుకునేందుకు సరిపోతాయో లేదో కూడా అనుమానమే. పాలసీల్లో చేరాలని కోరే బీమా ఏజెంట్లు ఈ చైల్డ్‌ ప్లాన్లలో ఉండే వివిధ చార్జీల గురించి వివరంగా చెప్పడం అరుదే. అందుకే పాలసీ తీసుకునే ముందు అన్ని అంశాలను అధ్యయనం చేయడం ఎంతో అవసరం. 

ఎండోమెంట్‌ ప్లాన్‌...
బీమా ఏజెంట్లు మార్కెటింగ్‌ చేసే చిన్నారి పథకాల్లో ఎక్కువగా ఎండోమెంట్‌ ప్లాన్లే ఉంటున్నాయి. ఇవి పొదుపు, బీమా కలసిన ప్లాన్లు. బీమా ప్లాన్లు కావడంతో పెట్టుబడులకు సంబంధించిన వివరాల్లో పారదర్శకత చాలా తక్కువ. పెట్టుబడుల వివరాలను కంపెనీలు వెల్లడించవు. సాధారణంగా డెట్‌ సాధనాల్లోనే బీమా సంస్థలు ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. డెట్‌ సాధనాల్లో రాబడులు 7-9 శాతం మించవని తెలిసిందే. బీమా రిస్క్‌ చార్జీలను కంపెనీలు మినహాయించుకుంటాయి. దీంతో చెల్లించే ప్రీమియం అంతా పెట్టుబడులకు వెళ్లదు. ఫలితంగా దీర్ఘకాలానికి సగటు రాబడులు ఈ ప్లాన్లలో 4-5 శాతం వరకే ఉంటాయి. ఒకవేళ పిల్లల పేరిట పాలసీ తీసుకున్న పేరెంట్‌ (తల్లి లేదా తండ్రి)... పాలసీ ఆరంభమైన తొలినాళ్లలో మరణిస్తే ఇంటర్నల్‌ రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌ (రాబడి రేటు) కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. స్థూల రాబడి రేటును 8 శాతం అంచనాగా చూపించినప్పటికీ.. నికర రాబడులు 5 శాతం మించవు. పార్టిసిపేటింగ్‌ ప్లాన్ల (బీమా లాభాల నుంచి వాటా లభించేవి)లో రాబడి రేటు దీనికి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే ఏటా బోనస్‌ చెల్లిస్తాయి కనుక. అయితే, ఈ బోనస్‌ను ఏటా ప్రకటించాలన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత ఐదేళ్లలోపు తప్పుకుంటే అప్పుటి వరకు చెల్లించిన ప్రీమియం మొత్తంలో చాలా వరకు నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే బీమా సంస్థలు వివిధ చార్జీలను మినహాయించుకుని మిగిలినది చెల్లిస్తాయి. కనుక ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి.

చిన్నారుల భవిష్యత్తు లక్ష్యాల కోసం ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెళ్లడం దీని కంటే మంచి ఆప్షన్‌ అవుతుంది. డెట్‌ సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో రాబడులే మెరుగ్గా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, చిన్నారుల ఉన్నత విద్య, వివాహం ఇతర లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులు అన్నింటినీ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేయకుండా భిన్న సాధనాల మధ్య (పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన) మధ్య వర్గీకరించుకోవడం వైవిధ్యంతో కూడుకున్న ఆప్షన్‌ అవుతుంది. 

చైల్డ్‌ యులిప్‌లు...
చిన్నారుల పేరుతో ఆఫర్‌ చేసే యులిప్‌ ప్లాన్లు కూడా  మార్కెట్లో ఉన్నాయి. ఇవి కూడా బీమా, పెట్టుబడులు కలగలసిన సాధనాలు. ఇవి ఈక్విటీ మార్కెట్‌తో ముడిపడిన సాధనాలు. బీమా, ఇతర ఖర్చులు పోను చెల్లించిన ప్రీమియంలో మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లో బీమా కంపెనీలు ఇన్వెస్ట్‌ చేసి, వచ్చిన రాబడులను పాలసీదారులకు పంచుతుంటాయి. ఈ ప్లాన్లలో ఈక్విటీ లేదా డెట్‌.. ఈక్విటీ, డెట్‌ కలిసిన ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈక్విటీ ఆప్షన్‌తో కూడిన యులిప్‌ ప్లాన్లలో రాబడులు ఎండోమెంట్‌ ప్లాన్లతో పోల్చుకుంటే కాస్త నయమే. ఈక్విటీ ఆప్షన్‌తో కూడిన ప్లాన్లలో దీర్ఘకాలంలో సగటున 7-8 శాతం రాబడులను ఆశించొచ్చు. స్థూల, నికర రాబడుల మధ్య వ్యత్యాసం కూడా 2 శాతాన్ని మించి ఉండదు. అయితే, యులిప్‌ ప్లాన్లలో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. ఇందులోనూ బీమా రక్షణ ఉంటుంది. 

చిన్నారుల కోసం యులిప్‌ ప్లాన్లలో ఇన్వెస్ట్‌ చేయాలన్న ఆసక్తి ఉన్నట్టయితే.. మ్యాక్స్‌ లైఫ్‌ శిక్షా ప్లస్‌ సూపర్‌ ప్లాన్‌ను పరిశీలించొచ్చు. ఇది నాన్‌ పార్టిసిపేట్‌ యులిప్‌ ప్లాన్‌. ఇందులో ఆరు రకాల ఫండ్లలో ఒకదాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉంది. డైనమిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్టా‍్రటజీని ఎంచుకున్నట్టయితే.. పాలసీ ఆరంభంలో ప్రీమియంను ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. పాలసీ కాల వ్యవధి గడుస్తున్న డెట్‌తో కూడిన కన్జర్వేటివ్‌ ఫండ్‌కు పెట్టుబడులను మళ్లిస్తుంది. అలాగే, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ యంగ్‌స్టార్‌ సూపర్‌ ప్రీమియం కూడా చైల్డ్‌ యులిప్‌ ప్లానే. ఇందులోనూ నాలుగు రకాల ఫండ్‌ ఆప్షన్లు ఉన్నాయి.

చిన్నారుల పేరిట బీమా...
చిన్నారులకు బీమా రక్షణ కల్పించే ప్లాన్లు కూడా ఉన్నాయి. పిల్లలకు ఏదైనా జరిగితే పరిహారాన్ని తల్లిదండ్రులకు చెల్లించడం జరుగుతుంది. ఎల్‌ఐసీ న్యూ చిల్డ్రన్‌ మనీ బ్యాక్‌ పాలసీ ఇటువంటిదే. బీమా రక్షణ అనేది కుటుంబానికి ఆధారమైన వ్యక్తి కోసం ఉద్దేశించినది. అతనికి ప్రాణాపాయం వాటిల్లితే అతని పిల్లల చదువులకు ఇబ్బంది రాకూడదు. బీమా ఉంటే వచ్చే పరిహారం ఇందుకు ఉపయోగపడుతుంది. పిల్లలు ఎవరిమీద ఆధారపడ్డారో వారికి బీమా ఉండాలి. అంతే కానీ, పిల్లల పేరిట బీమా ఉంటే ఉపయోగం ఏమీ ఉండదు. కనుక పిల్లల పేరిట బీమాతో కూడిన పాలసీలను తీసుకోవడం తెలివైన నిర్ణయం అనిపించుకోదు. 

బీమా తగినంత ఉంటుందా..?
చైల్డ్‌ ప్లాన్లలో బీమా రక్షణ వార్షిక ప్రీమియానికి 10 రెట్లకు మించదు. పాలసీదారు మరణించే నాటికి వార్షిక ప్రీమియానికి పది రెట్లు లేదా అప్పటి వరకు చెల్లించిన ప్రీమియానికి 105 శాతం.. ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఉంటే ఆ మేరకు బీమా పరిహారం చెల్లించడం జరుగుతుంది. ఈ ప్రకారం చూస్తే ఒకవేళ వార్షికంగా చెల్లించే ప్రీమియం రూ.50,000 ఉందనకున్నా.. బీమా కవరేజీ రూ.5లక్షలుగానే ఉంటుంది. కానీ, పిల్లల ఉన్నత విద్య, వివాహ అవసరాలకు ఇది ఏ మూలకు సరిపోతుంది..? అందుకే కుటుంబానికి, భవిష్యత్తు లక్ష్యాలకు బీమా రక్షణ కల్పించాలంటే అందుకు ఈ తరహా చైల్డ్‌ ప్లాన్లు లేదా ఎండోమెంట్‌ పాలసీలు ఏ విధంగానూ అనుకూలం కావన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. 

చెల్లింపుల్లో సౌలభ్యం..?
ఇక చైల్డ్‌ ప్లాన్లలో పిల్లల అవసరాలకు అనుగుణంగా చెల్లింపులను ఎంచుకునే సౌలభ్యం తక్కువే. ఉదాహరణకు ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ చాంప్‌ ఇన్సూరెన్స్‌ లో చెల్లింపులు పిల్లలకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత ప్రారంభం అవుతాయి. వార్షికంగా నాలుగు సమాన వాయిదాల్లో చెల్లింపులు జరుగుతాయి. ఒకవేళ 21 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఏకమొత్తంలో చెల్లింపులు కోరుకుంటే ఆ అవకాశం లేదు. అదే విధంగా బజాజ్‌ అలియాంజ్‌ యంగ్‌ అష్యూర్‌ ప్లాన్‌లోనూ ఏక మొత్తంలో మెచ్యూరిటీ ప్రయోజనాలను చెల్లించే ఆప్షన్‌ లేదు. పాలసీ కాల వ్యవధి 10, 15, 20 ఏళ్లుగా ఉండగా, ఈ కాల వ్యవధి ముగిసిన తర్వాత 3/5/7 వాయిదాల్లో బీమా సంస్థ చెల్లింపులు చేస్తుంది. ఇలా కాకుండా మ్యాక్స్‌ లైఫ్‌ ఫ్యూచర్‌ జీనియర్‌ ఎడ్యుకేషన్‌ ప్లాన్‌లో అయితే 16, 18, లేదా 21 ఏళ్ల వయసులో మెచ్యూరిటీ చెల్లించే ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. 

ఈ ప్లాన్లను తీసుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశ్యాన్ని గమనించినట్టయితే.. తమకు ఏదైనా జరగరానిది జరిగితే తమ పిల్లల విద్య, ఇతర కుటుంబ లక్ష్యాలకు విఘాతం కలగకుండా ఉండాలని ఎక్కువ మంది కోరుకుంటుంటారు. కానీ, ఇందుకు టర్మ్‌ లైఫ్‌ ప్లాన్‌ చక్కగా సరిపోతుంది. ఎక్కువ చార్జీలను పిండుకునే ఈ తరహా చైల్డ్‌ప్లాన్లు లేదా ఎండోమెంట్‌ పాలసీలు, యులిప్‌లకు బదులు టర్మ్‌ పాలసీ తీసుకోవడం ఉత్తమం. టర్మ్‌ పాలసీల్లో మెచ్యూరిటీ అనంతరం ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. అందుకే తక్కువ ప్రీమియానికి ఎక్కువ కవరేజీ లభిస్తుంది. దీంతో కుటుంబం కోసం ఎక్కువ కవరేజీతో కూడిన ప్లాన్‌ తీసుకోవచ్చు. ఉదాహరణకు పిల్లల ఉన్నత విద్య, కుటుంబ పోషణ, ఇతర లక్ష్యాలకు రూ.కోటి కవరేజీతో టర్మ్‌ ప్లాన్‌ తీసుకోవాలనుకుంటే.. ప్రీమియం 30 ఏళ్ల వయసున్న ఆరోగ్యవంతుడైన వ్యక్తికి రూ.10,000గానే ఉంటుంది. కనుక ఇటువంటి గందరగోళాలకు తావివ్వని, సులభమైన, సూటి అయిన టర్మ్‌ ప్లాన్‌ మేలైనది. భవిష్యత్తు లక్ష్యాల కోసం పెట్టుబడులు పెట్టుకోవాలని భావిస్తే అందుకు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌, పీపీఎఫ్‌ వంటి పథకాలను ఎంచుకోవచ్చు. You may be interested

ఈఎల్‌ఎస్‌ఎస్‌, పీపీఎఫ్‌, ఎఫ్‌డీ.. వీటిల్లో మీ చాయిస్‌?

Monday 24th February 2020

పన్ను ఆదా చేసుకునేందుకు మరో నెలరోజులే వ్యవధి మిగిలి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పన్ను ఆదా కోసం బీమా వైపు చూడకుండా.. ఇతర పెట్టుబడి విధానాలను పరిశీలించినట్టయితే... ఈక్విటీలతో కూడిన ఈఎల్‌ఎస్‌ఎస్‌, పీపీఎఫ్‌, బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నవి. అవగాహన విస్తృతం కావడంతో పన్ను ఆదా చేసే ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ ఫండ్స్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) గత కొన్ని సంవత్సరాలుగా

మరో 5 మెట్రో క్యాష్‌ అండ్‌ క్యార్టీ సోర్లు

Monday 24th February 2020

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ దేశీయంగా కార్యకలాపాలను విస్తరించనున్నట్టు ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ ఏడాది అదనంగా మరో 5 మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ స్టోర్లను ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఈ సంస్థకు పస్తుతం దేశవ్యాప్తంగా 17 పట్టణాల్లో 27 క్యాష్‌ అండ్‌ క్యారీ దుకాణాలున్నాయి. అలాగే, కిరాణా స్టోర్లతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు, ఈకామర్స్‌లోనూ విస్తరణ బాట పట్టనున్నట్టు వెల్లడించింది. ఈ

Most from this category