News


శామ్‌సంగ్‌కు కరోనా వరం!

Friday 21st February 2020
news_main1582255679.png-31971

  • చైనా కంపెనీల ప్రణాళికలపై వైరస్‌ ప్రభావం
  • ఉత్పత్తుల విడుదలలో జాప్యం
  • దూకుడు పెంచిన శామ్‌సంగ్‌
  • 9 మొబైల్‌ ఫోన్ల విడుదలకు ప్రణాళిక

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19) చైనా ఎలక్ట్రానిక్‌ కంపెనీలను కలవర పెడుతుంటే.. భారత మార్కెట్లో ఆధిపత్యం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న దక్షిణ కొరియా కంపెనీ శామ్‌సంగ్‌ ఈ వైరస్‌ రూపంలో లాభపడనుంది.! చైనా మొబైల్‌ తయారీ కంపెనీలు, ఎలక్ట్రానిక్‌ సంస్థల ప్రణాళికలపై కోవిడ్‌ ప్రభావం చూపిస్తోంది. యాపిల్‌తోపాటు చైనాకు చెందిన షావోమీ, ఒప్పో, వివో, రియల్‌మీ తదితర ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల విడుదల ప్రణాళికలను సమీక్షించుకుంటున్నాయి. కానీ, శామ్‌సంగ్‌ మాత్రం తన ప్రణాళికలను వాయిదా వేసుకోకుండా మరింత దూకుడుగా ఉత్పత్తులను విడుదల చేసే కార్యక్రమంలో ఉంది. భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్‌) గణాంకాల ప్రకారం.. శామ్‌సంగ్‌ ఇండియా 2020 ప్రారంభంలోనే తొమ్మిది నూతన మొబైల్‌ ఫోన్లకు సంబంధించి బీఐఎస్‌ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకుంది. కానీ, ఇదే సమయంలో షావోమీకి చెందిన రెడ్‌మీ, దక్షిణ కొరియాకు చెందిన మరో సంస్థ ఎల్‌జీ రెండేసి ఉత్పత్తులకు రిజిస్ట్రేషన్‌ కోరడం చూస్తుంటే.. శామ్‌సంగ్‌ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. ఇక ఇదే కాలంలో మోటరోలా, కూల్‌ప్యాడ్‌ సంస్థలు ఒక్కొక్క ఉత్పత్తి రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు పెట్టుకున్నాయి.
దేశీయ కంపెనీలదీ దూకుడే..
ఈ సమయంలో దేశీయ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల విడుదలలో వేగాన్ని పెంచడాన్ని పరిశీలించాలి. ఢిల్లీకి చెందిన సెల్‌కార్‌ జనవరి 1 నుంచి ఇప్పటికే 15 మోడళ్లకు బీఐఎస్‌ రిజిస్ట్రేషన్‌ తీసుకుని చార్ట్‌లో అగ్రస్థానంలో ఉంది. మరో స్థానిక బ్రాండ్‌ హైటెక్‌ కూడా మూడు మోడళ్లకు ఈ కాలంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం గమనార్హం. ‘‘పెద్ద తయారీ సంస్థలు (ఓఈఎంలు) తమ ఉత్పత్తుల విడుదలను జాప్యం చేస్తున్నట్టు కనిపిస్తోంది. సాధారణంగా బీఐఎస్‌ రిజిస్ట్రేషన్‌ తర్వాత ఉత్పత్తుల విడుదలకు 4-6 వారాల సమయం తీసుకుంటుంది. ప్రస్తుత పరిస్థితి శామ్‌సంగ్‌కు అనుకూలిస్తుంది. ఎందుకంటే ప్రముఖ తయారీ కంపెనీగా కొరియా, ఇతర ప్రాంతాల నుంచి విడిభాగాలను సమీకరించుకుంటుంది. దీంతో కంపెనీ సరఫరా వ్యవస్థపై వైరస్‌ ప్రభావం ఉండదు’’ అని టెక్‌ఆర్క్‌కు చెందిన ముఖ్య అనలిస్ట్‌ ఫైసల్‌కవూసా తెలిపారు. 
చైనా కంపెనీలకు ఇబ్బందులు...
చైనాలో కోవిడ్‌ వైరస్‌ తీవ్రతతో కొన్ని ప్రాంతాల్లో తయారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇది సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపించనుంది. దీని తాలూకూ వేడి భారత్‌లో కార్యకలాపాలు కలిగి ఉన్న చైనా కంపెనీలకు ఇప్పటికే తాకింది. చైనాకు చెందిన ప్రముఖ కంపెనీలకు భారత్‌లో తయారీ కేంద్రాలు ఉన్నప్పటికీ.. విడి భాగాల కోసం అవి మాతృదేశంపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. కానీ, వైరస్‌ ప్రభావం శామ్‌సంగ్‌పై తక్కువే ఉండనుంది. ఎందుకంటే అధిక శాతం మొబైల్‌ ఫోన్లను ఈ సంస్థ నోయిడాలోని కేంద్రంలోనే తయారు చేస్తోంది. పైగా 2018లో తయారీ సామర్థ్యాన్ని కూడా గణనీయంగా పెంచుకుంది. అంతకుముందు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 68 మిలియన్‌ యూనిట్లుగా ఉంటే, 120 మిలియన్‌ యూనిట్లకు విస్తరించింది. ఇక విడిభాగాలను కూడా స్థానికంగానే సమీకరించుకుంటోంది. అలాగే, వియత్నాంలో భారీ తయారీ కేంద్రం కూడా కలిగి ఉంది. ‘‘చైనా సంస్థలతో పోలిస్తే శామ్‌సంగ్‌ కార్యకలాపాలు ఎన్నో ఖండాల్లో విస్తరించి ఉన్నాయి. కనుక అతిపెద్ద నిల్వలను కలిగి ఉంటుంది. చైనా నుంచి సరఫరా పరంగా ఉన్న ఇబ్బందులు మొదటి త్రైమాసికంలో శామ్‌సంగ్‌కు కలసి రానున్నాయి’’ అని రీసెర్చ్‌ సంస్థ ఐడీసీ డైరెక్టర్‌ నవకేందర్‌సింగ్‌ తెలిపారు. 
పెద్దగా ప్రభావం ఉండదు..
‘‘చాలా వరకు విడిభాగాలను భారత్‌లోనే తయారు చేస్తున్నాం. అంతేకాదు వియత్నాంలో భారీ తయారీ కేంద్రం కూడా ఉంది. కరోనా వైరస్‌ సంక్షోభ ప్రభావం మా కార్యకలాపాలపై పెద్దగా ఉండదు’’ అని శామ్‌సంగ్‌ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు తెలిపారు. ఫ్లాగ్‌షిప్‌ మోడళ్లు అయిన శామ్‌సంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌, ఎస్‌20 ప్లస్‌ మోడళ్లను మార్చి నాటికి విడుదల చేయనున్నట్టు చెప్పారు. వీటికి ఇప్పటికే బుకింగ్‌లను ప్రారంభించినట్టు తెలిపారు. ఒకప్పుడు దేశీయ మార్కెట్లో మొదటి స్థానంలో ఉన్న శామ్‌సంగ్‌ 2019 డిసెంబర్‌ నాటికి మూడో స్థానానికి పడిపోయింది. షావోమీ, వివో మొదటి రెండు స్థానాలను ఆక్రమించేశాయి. 2019 జూన్‌ క్వార్టర్‌ నాటికి శామ్‌సంగ్‌కు 25.3 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉండగా, డిసెంబర్‌ నాటికి అది 15.5 శాతానికి తగ్గింది. 



You may be interested

టీవీల రేట్లకు రెక్కలు!!

Friday 21st February 2020

10 శాతం దాకా పెరగనున్న ధరలు మార్చి నుంచే అమల్లోకి కరోనా దెబ్బతో ప్యానళ్ల కొరతే కారణం న్యూఢిల్లీ: టీవీలకు కూడా కరోనా వైరస్ (కోవిడ్‌19) సెగ తగలనుంది. టీవీల్లో కీలకమైన ఓపెన్ సెల్ టెలివిజన్ ప్యానళ్ల సరఫరా తగ్గి, కొరత పెరిగిపోతుండటంతో మార్చి నుంచి రేట్లు 10 శాతం దాకా ఎగియనున్నాయి. ప్రధానమైన ఈ భాగాన్ని దేశీ సంస్థలు ఎక్కువగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. టీవీ యూనిట్‌ రేటులో దాదాపు 60

మల్టీబ్యాగర్‌ వచ్చేస్తోంది..?

Friday 21st February 2020

హెచ్‌ఢీఎఫ్‌సీ ఏఎంసీ, ఇండియా మార్ట్‌ ఇంటర్‌మెష్‌, యాఫిల్‌ ఇండియా, ఐఆర్‌సీటీసీ ఈ ఐపీవోలు గుర్తుండే ఉంటాయి.. గత ఏడాదిన్నర కాలంలో లిస్ట్‌ అయిన ఈ కంపెనీలు.. ఇష్యూ ధరతో పోలిస్తే పలు రెట్లు పెరిగి ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలు తినిపించాయి. ఈ బస్సులను మిస్‌ అయ్యామని బాధ పడక్కర్లేదు. మరో మల్టీబ్యాగర్‌ వచ్చేస్తోంది..! ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్స్‌ సర్వీసెస్‌ ఐపీవోకు సెబీ ఆమోదం జారీ చేయగా.. గ్రే

Most from this category