News


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అపార అవకాశాలు

Wednesday 25th December 2019
news_main1577244906.png-30419

  • 2019లో రెట్టింపైన నిపుణులు
  • గ్రేట్ లెర్నింగ్ సంస్థ నివేదిక


న్యూఢిల్లీ: వ్యాపార సంస్థల్లో కొంగొత్త టెక్నాలజీల వినియోగం మెరుగుపడుతున్న నేపథ్యంలో దేశీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. 2019లో ఏఐ ఉద్యోగుల సంఖ్య రెట్టింపయ్యింది. అయితే, నిపుణులు తగినంత స్థాయిలో దొరక్కపోతుండటంతో ఇంకా చాలా రంగాల సంస్థల్లో ఏఐ ఉద్యోగాలు ఖాళీగా ఉంటున్నాయని, ఈ విభాగంలో నిపుణులకు అపార అవకాశాలు ఉన్నాయని ఎడ్యుటెక్ సంస్థ గ్రేట్ లెర్నింగ్ ఒక నివేదికలో వెల్లడించింది. దీని ప్రకారం ఏఐ ఉద్యోగుల సంఖ్య గతేడాది 40,000గా ఉండగా.. 2019లో 72,000కు చేరింది. ఏఐ ప్రాజెక్టులపై పనిచేసే కంపెనీల సంఖ్య గతేడాది సుమారు 1,000 దాకా ఉండగా.. ఈ ఏడాది మూడు రెట్లు పెరిగి 3,000కు చేరింది. వ్యాపారాలు, డేటా నిర్వహణకు కంపెనీలు పెద్ద యెత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతికతను వినియోగిస్తుండటం పెరుగుతోందని గ్రేట్ లెర్నింగ్ తెలిపింది. ఏఐ నిపుణుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. ఇది డిమాండ్‌కు తగ్గ స్థాయిలో ఉండటం లేదని పేర్కొంది. దీంతో వివిధ సంస్థల్లో ఏఐ సంబంధ ఉద్యోగాలు 2,500 పైగా ఖాళీగా ఉన్నాయని వివరించింది.  ఫ్రెషర్స్ మొదలుకుని మధ్య, సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్స్ దాకా దేశీయంగా పలు సంస్థల్లోని ఏఐ, మెషిన్ లెర్నింగ్‌ విభాగాల్లో ప్రొఫెషనల్స్ ఈ సర్వేలో పాల్గొన్నారు.

415 మిలియన్ డాలర్లకు ఏఐ పరిశ్రమ...
గ్రేట్ లెర్నింగ్ అధ్యయనం ప్రకారం.. దేశీ ఏఐ పరిశ్రమ ఆదాయం ఈ ఏడాది 415 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 2,950 కోట్లు) చేరింది. 2018లో ఇది 230 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 1,600 కోట్లు) ఉంది. దేశీయంగా ఏఐ నిపుణుల సగటు అనుభవం 7.2 సంవత్సరాలుగా ఉంటోంది. 29 శాతం మంది ఏఐ ప్రొఫెషనల్స్‌కు పదేళ్ల పైగా అనుభవం ఉంది. ఈ విభాగంలో చేరిన ఫ్రెషర్స్ సంఖ్య గతేడాది 3,700గా ఉండగా.. ఇది ప్రస్తుతం 60 శాతం వృద్ధి చెంది 6,000కు పెరిగింది. "రాబోయే రోజుల్లోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నాం. అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ వచ్చే ఏడాది పెద్ద సంఖ్యలో ఏఐ కెరియర్ల వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయి" అని గ్రేట్ లెర్నింగ్ సహ వ్యవస్థాపకుడు హరి కృష్ణన్ నాయర్ చెప్పారు. 

బెంగళూరు టాప్‌...
ఏఐ నిపుణులు ఎక్కువగా బెంగళూరును ఎంచుకుంటున్నారు. బెంగళూరులో ఏఐ ఉద్యోగాల కల్పన గతేడాది 13,000 స్థాయిలో ఉండగా.. 2019లో 23,000 పైగా నమోదైంది. సుమారు 8,000 ఉద్యోగాలతో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీ (17,000), ముంబై (9,000) రెండు.. మూడు స్థానాల్లో నిల్చాయి. అనుభవం, నైపుణ్యాలను బట్టి ఏఐ నిపుణులకు సగటు జీత భత్యాలు రూ. 14.7 లక్షలుగా ఉంటోంది. ముంబైలో ప్రొఫెషనల్స్ అత్యధికంగా వార్షికంగా రూ. 17 లక్షల ప్యాకేజీ అందుకుంటుండగా, చెన్నైలో అత్యంత తక్కువగా రూ. 10.8 లక్షల స్థాయిలో ప్యాకేజీ ఉంటోంది. 39 శాతం మంది ఏఐ నిపుణులు .. భారీ సంస్థల్లోనూ, 29 శాతం మంది మధ్య స్థాయి సంస్థల్లోనూ, 32 శాతం మంది స్టార్టప్ సంస్థల్లోనూ సేవలు అందిస్తున్నారు. మహిళా ఏఐ నిపుణుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంటోంది. 



You may be interested

వ్యాపార వివాదాలను క్రిమినల్ కేసులుగా చూడొద్దు..

Wednesday 25th December 2019

సీఐఐ స్టార్టప్ కౌన్సిల్ చైర్మన్‌ క్రిస్ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: వ్యాపార, సివిల్ వివాదాలను క్రిమినల్ కేసులుగా చూస్తున్న ఉదంతాలు ఈ మధ్య గణనీయంగా పెరుగుతున్నాయని పరిశ్రమల సమాఖ్య సీఐఐ స్టార్టప్ కౌన్సిల్ చైర్మన్ క్రిస్ గోపాలకృష్ణన్ చెప్పారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు, విదేశీ ఇన్వెస్టర్లను ఇది తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే తప్ప వ్యాపార వివాదాలన్నీ సివిల్ కోర్టుల పరిధిలోకే వస్తాయని, వాటిని క్రిమినల్

బీఎస్‌-6 ద్విచక్ర వాహనాల్లో హోండా రికార్డు

Wednesday 25th December 2019

న్యూఢిల్లీ: హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా బీఎస్‌-6 వాహన అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన యాక్టివా 125 స్కూటర్‌, ఎస్‌పీ 125 మోటారు సైకిల్‌ను విడుదల చేయగా, ఇవి 60,000 వాహన అమ్మకాల రికార్డును అధిగమించాయని సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. వీటికి మంచి స్పందన లభిస్తున్నట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇంకా అన్ని ప్రాంతాల డీలర్ల పరిధిలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ఆ

Most from this category