News


జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో తగ్గనున్న టాటా వాటా

Thursday 31st October 2019
Markets_main1572492856.png-29248

  • 19.7 నుంచి 14.7 శాతానికి చేరిక
  • నియంత్రణల నేపథ్యంలో తాజా నిర్ణయం
  • నిర్వహణ బాధ్యత జీఎంఆర్‌ చేతిలోనే

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో టాటా గ్రూప్‌ ప్రతిపాదిత వాటా కొనుగోలు డీల్‌ను పునర్‌వ్యవస్థీకరించినట్టు సమాచారం. నియంత్రణ పరమైన అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో టాటా గ్రూప్‌ నేతృత్వంలోని మూడు సంస్థలు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో 44.4 శాతం వాటాను రూ.8,500 కోట్లకు కొనుగోలు చేసేందుకు జీఎంఆర్‌తో డీల్‌ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. వాస్తవ ప్రణాళిక ప్రకారం జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో టాటా గ్రూప్‌ 19.7 శాతం, సింగపూర్‌ సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ జీఐసీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 14.8 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన ఎస్‌ఎస్‌జీ క్యాపిటల్‌ 9.9 శాతం వాటాను దక్కించుకోవాలి. నూతన ప్రణాళిక ప్రకారం టాటాల వాటా 14.7 శాతానికి పరిమితం కానుంది. జీఐసీ వాటా 5 శాతం పెరిగి 19.8 శాతానికి చేరనుంది. ఎస్‌ఎస్‌జీ వాటాలో ఎటువంటి మార్పు లేకుండా 9.9 శాతం ఉండనుంది. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అనుబంధ కంపెనీ అయిన ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌లో టాటా గ్రూప్‌ వాటా డీల్‌ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత నికరంగా 10 శాతానికి చేరుతుంది. 
ఇదీ నేపథ్యం...
జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో టాటా గ్రూప్‌ వాటా కొనుగోలు విషయమై న్యాయపర అంశాలపై ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కొద్ది రోజుల క్రితం  సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అభిప్రాయాన్ని కోరింది. ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటింగ్‌ కంపెనీల్లో దేశీయ ఎయిర్‌లైన్‌ సంస్థల వాటా 10 శాతంలోపే ఉండాలన్న పరిమితి ఉంది. టాటా గ్రూప్‌.. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ భాగస్వామ్యంతో పూర్తిస్థాయి సర్వీస్‌ క్యారియర్‌ ‘విస్తారా ఎయిర్‌లైన్స్‌’, మలేషియాకు చెందిన ఎయిర్‌ ఆసియా బెర్హడ్‌తో కలిసి బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌ ‘ఎయిర్‌ఆసియా ఇండియా’ను నిర్వహిస్తోంది. ఈ రెండు సంస్థల్లోనూ టాటా గ్రూప్‌నకు 51 శాతం వాటా ఉంది. కాగా, డీల్‌ తదనంతరం జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, దాని అనుబంధ సంస్థల వాటా 53.5 శాతంగా ఉంటుంది. కంపెనీ ఎంప్లాయీ వెల్ఫేర్‌ ట్రస్ట్‌కు 2.1 శాతం వాటా ఉంది. ఎయిర్‌పోర్టుల నిర్వహణ బాధ్యత జీఎంఆర్‌ చేతిలోనే ఉండనుంది. డీల్‌తో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రుణం రూ.12,000 కోట్లకు వచ్చి చేరుతుంది. 



You may be interested

ఇండిగోకు ఐఏటీఏలో సభ్యత్వం

Thursday 31st October 2019

న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో.. అంతర్జాతీయ విమానయాన సంఘం (ఐఏటీఏ)లో సభ్యత్వం పొందినట్లు బుధవారం ప్రకటించింది. ఇటీవలి కాలంలోనే సంస్థ సేవలు టర్కీ, వియత్నాం, మయన్మార్, చైనా వంటి దేశాలకు విస్తరించిన విషయం తెలిసిందే కాగా, సరిగ్గా ఇటువంటి సమయంలో సభ్యత్వం పొందడం వల్ల ప్రపంచంలో అత్యుత్తమ వాయు రవాణా వ్యవస్థగా ఇండిగోను తీర్చిదిద్దాలనే లక్ష్యానికి సహకారం లభించిందని సంస్థ సీఈఓ రోనోజోయ్ దత్తా అన్నారు. ఇండిగో

వచ్చే ఏడాది పాలసీల వెల్లువ

Thursday 31st October 2019

ఇండియాఫస్ట్‌ డిప్యూటీ సీఈవో రుషభ్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- బీమా కంపెనీల నుంచి వచ్చే ఏడాది పాలసీలు వెల్లువలా వచ్చిపడతాయని ఇండియా ఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది. ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏ) చొరవతో వినూత్న పాలసీలు రానున్నాయని ఇండియాఫస్ట్‌ డిప్యూటీ సీఈవో రుషభ్‌ గాంధీ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. పాలసీదారులకు అనుకూలంగా ఉండేలా కంపెనీలు వీటిని రూపొందిస్తున్నాయని చెప్పారు. మూడు పాలసీలకు తాము దరఖాస్తు

Most from this category