News


వృద్ధి బాటలో చిన్న మందగమనమే..!

Friday 30th August 2019
Markets_main1567144682.png-28108

  • ఆర్థిక వ్యవస్థపై ఆర్‌బీఐ విశ్లేషణ
  • సైక్లికల్‌ ఎఫెక్ట్‌గా అభిప్రాయం
  • 2018-19 వార్షిక నివేదిక విడుదల
  • వినియోగం, ప్రైవేటు పెట్టుబడుల వృద్ధిపై
  • దృష్టి అవసరమని సూచన

ముంబై: భారత్‌ ప్రస్తుత మందగమన పరిస్థితులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తక్కువ చేసి చూపించింది. భారీ వృద్ధికి ముందు చిన్న మందగమన పరిస్థితులను భారత్‌ ఎదుర్కొంటోందని పేర్కొంది. దీనిని సైక్లింగ్‌ ఎఫెక్ట్‌ (ఎగువ దిగువ)గా పేర్కొంది. వినియోగం, ప్రైవేటు పెట్టుబడుల పునరుద్ధరణ కేంద్రం, విధాన నిర్ణేతల అధిక ప్రాధాన్యత కావాల్సిన అవసరం ఉందని వివరించింది. 2018-19 (జూలై-జూన్‌) వార్షిక నివేదికను ఆర్‌బీఐ గురువారం ఆవిష్కరించింది. నివేదికలోని ముఖ్యాంశాలను చూస్తే...

- ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది ఏమిటి అన్నది ఖచ్చితంగా చెప్పడం కష్టం. అయితే ఒక్కటిమాత్రం చెప్పవచ్చు. సమస్యలు వ్యవస్థాపరమైనవి కావు. భూ, కార్మిక, వ్యవసాయ ఉత్పత్తి, మార్కెటింగ్‌ రంగాల్లో మాత్రం సంస్కరణలు అవసరం. 
- భారీ వృద్ధికి ముందు చిన్న కుదుపా లేక అప్‌ అండ్‌ డౌన్స్‌లో భాగమా? లేక వ్యవస్థాగత మందగమనమా? అన్నది ప్రస్తుతం ప్రశ్న. అయితే భారీ వృద్ధికి ముందు మందగమనం, సైక్లింగ్‌ ఎఫెక్ట్‌ అని మాత్రమే దీనిని చెప్పవచ్చు. తీవ్ర వ్యవస్థాగత అంశంగా దీనిని పేర్కొనలేము.
- వరుసగా నాలుగు ద్వైమాసికాలాల్లో ఆర్‌బీఐ 1.10 శాతం రెపో రేటు కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 5.40 శాతం) లక్ష్యం వృద్ధి మందగమన నిరోధమే. 2019-20లో వృద్ధి 6.9 శాతంగా భావించడం జరుగుతోంది. 
- బ్యాంకింగ్‌, బ్యాంకింగేతర రంగాలను పటిష్టం చేయాలి. మౌలిక రంగ వ్యయాలకు భారీ మద్దతు నివ్వాల్సిన అవసరం ఉంది. కార్మిక  చట్టాలు, పన్నులు, ఇతర న్యాయ సంస్కరణల అంశాల్లో వ్యవస్థాగత సంస్కరణల అమలు అవసరం ఉంది. 
- దేశీయ డిమాండ్‌ పరిస్థితులు ఊహించినదానికన్నా బలహీనంగా ఉంది. దీని పునరుద్ధరణకు వ్యవస్థలో తగిన చర్యలు తీసుకోవడం అవసరం. 
- వ్యాపారం చేసుకునే విధానాలను మరింత సరళతరం చేయడం, భూ, కార్మిక చట్టాల సంస్కరణలపై దృష్టి పెట్టాలి. 
- ద్రవ్య క్రమశిక్షణలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్న మాట వాస్తవం. రైతుల రుణ మాఫీ, ఏడవ వేతన కమిషన్‌ నివేదిక అమలు, వివిధ ఆదాయ మద్దతు పథకాలు ఆర్థిక క్రమశిక్షణా పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఆయా పరిస్థితులు ఆర్థిక ఉద్దీపనల అవకాశాలకూ విఘాతం కలిగిస్తున్నాయి.
- ఆర్థిక వ్యవస్థలో సానుకూల అంశాలూ ఉన్నాయి. తగిన వర్షపాతంతో అదుపులో ఉండే ధరలు, ద్రవ్యలోటు కట్టుతప్పకుండా చూసే పరిస్థితులు, దేశంలోకి వచ్చీపోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం- కరెంట్‌ అకౌంట్‌ లోటు కట్టడి అంశాలు ఇక్కడ చెప్పుకోతగినవి. 
- నాన్‌ బ్యాంకింగ్‌ రంగం సమస్యలను ఎదుర్కొంటోంది. అయితే నిధుల అందుబాటు- రుణాల మంజూరుల మధ్య భారీ వ్యత్యాసం ఇందులో కీలకమైనది. అయితే ఈ సవాళ్ల పరిష్కారానికి తగిన చర్యలు కొనసాగుతున్నాయి. 
- బ్యాంకింగ్‌ రంగంలో విలీనాల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. 
- ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ వైఫల్యం నేపథ్యంలో- వాణిజ్య రంగానికి నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) వాణిజ్య రంగానికి రుణం 20 శాతం పడిపోయింది. 2017-18లో రుణ పరిమాణం రూ.11.60 లక్షల కోట్లు ఉంటే, ఇది 2018-19లో ఈ మొత్తం రూ.9.34 లక్షల కోట్లకు తగ్గింది. 
- అమెరికా-చైనాల మధ్య వాణిజ్య సంబంధ అంశాలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇది అంతర్జాతీయ మందగమన పరిస్థితులకు దారితీసి, ఫైనాన్షియల్‌ మార్కెట్లపై సైతం ప్రతికూల ప్రభావం చూపుతోంది. 
- ఇన్ని సమస్యలున్నా, ఒడిదుడుకుల పరిస్థితులను భారత్‌ సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతుంది. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు కట్టడి, అదుపులో కరెంట్‌ అకౌం‍ట్‌ లోటు వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలు. 

రూ.1.96 లక్షల కోట్లకు ఆర్‌బీఐ అత్యవసర నిధి...
కేంద్రానికి మిగులు నిధులు రూ.52,000 కోట్ల బదలాయింపుల నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద అత్యవసర నిధి రూ.1.96 లక్షల కోట్లకు తగ్గుతోంది. ఆర్‌బీఐ 2018-19 వార్షిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. 2019 జూన్‌ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను ఆర్‌బీఐ గురువారం ఆవిష్కరించింది. మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫారసులను సోమవారంనాడు ఆర్‌బీఐ బోర్డ్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే. బ్యాలెన్స్‌ షీట్‌లో ఆర్‌బీఐ క్యాపిటల్‌ రిజర్వ్స్‌ బఫర్స్‌ పరిమాణం  5.5 నుంచి 6.5 శాతం శ్రేణిలో ఉండాలని కమిటీ సిఫారసు చేసింది.  ఎటువంటి ఆర్థిక సవాళ్లనైనా ఎదుర్కొనగలిగిన అత్యున్నత స్థాయి కలిగిన సెంట్రల్‌ బ్యాంకుల్లో ఆర్‌బీఐ ఒకటని 2018-19 వార్షిక నివేదిక పేర్కొంది. 2018 జూన్‌ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ వద్ద అత్యవసర నిధి పరిమాణం రూ. 2,32,108 కోట్లుగా ఉంది. తాజాగా కేంద్రానికి అందివచ్చిన 52,000 కోట్లు ఆర్‌బీఐకి సంబంధించి 2018-19 ఆర్థిక సంవత్సరం లెక్కలో వేస్తే, ప్రభుత్వానికి వచ్చే సరికి ఈ నిధులు 2019-20 ఆర్థిక సంవత్సరానికి అందినట్లు అవుతుంది. 

తగ్గిన మొండిబకాయిలు...
బ్యాంకింగ్‌ మొండిబకాయిలు తగ్గాయని ఆర్‌బీఐ వార్షిక నివేదిక తెలిపింది. 2017-18లో మొత్తం రుణాల్లో మొండిబాకాయిలు 11.2 శాతం ఉంటే, ఇది 2018-19లో 9.1 శాతానికి తగ్గిందని వివరించింది. వ్యవస్థాపూర్వక ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 60.9 శాతానికి పెరగడం వల్ల కొత్తగా మొండిబకాయిల సమస్య తగ్గింది. అలాగే మొండిబకాయిల సమస్య తగ్గడంలో దివాలా చట్టం కూడా కీలకంగా మారిందని నివేదిక వివరించింది. 

రూ. 71,543 కోట్లకు బ్యాంక్‌ మోసాల విలువ...
బ్యాంక్‌ మోసాల విలువ 2018-19లో రూ.71,543 కోట్లకు చేరినట్లు ఆర్‌బీఐ నివేదిక వివరించింది. 2017-18 నుంచి చూస్తే ఈ విలువ 73.8 శాతం (రూ.41,167.04 కోట్లు) పెరిగినట్లు తెలిపింది. ఇక కేసుల విషయానికి వస్తే, 15 శాతం పెరుగుదలతో 5,916 నుంచి 6,801కి చేరినట్లు వివరించింది. సంబంధిత మోసాల విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందు ఉండగా, తరువాతి స్థానాల్లో ప్రైవేటు రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు ఉన్నట్లు నివేదిక వివరించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి మోసాల సంఖ్య 2,885 నుంచి 3,766కు చేరితే, ఈ విలువ రూ.38,260.8 కోట్ల నుంచి రూ.64,509.43 కోట్లకు ఎగసింది. కార్డ్‌, ఇంటర్నెట్‌ సంబంధ మోసాలు, డిపాజిట్‌ సంబంధ మోసాలు అధికంగా జరిగాయి. బ్యాంకింగ్‌ మోసాలను తగ్గించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోంది. 



You may be interested

సీజీ పవర్ నుంచి థాపర్ అవుట్‌

Friday 30th August 2019

సీజీ పవర్ నుంచి థాపర్ అవుట్‌ చైర్మన్‌గా తొలగించిన బోర్డు కొత్త చైర్మన్ ఎంపిక కోసం నేడు సమావేశం న్యూఢిల్లీ: ఆర్థిక అవకతవకలు వెలుగుచూసిన నేపథ్యంలో సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్‌ సంస్థ చైర్మన్‌ పదవి నుంచి గౌతమ్ థాపర్‌ను తప్పిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. థాపర్‌ తొలగింపు తీర్మానానికి మెజారిటీ బోర్డు సభ్యులు ఆమోదం తెలిపినట్లు స్టాక్‌ ఎక్స్చేంజీలకు సీజీ పవర్ తెలిపింది. తీర్మానాన్ని థాపర్ వ్యతిరేకించగా, సీఈవో.. ఎండీ కేఎన్

డిజిటల్‌లో అగ్రగామిగా భారత్‌

Friday 30th August 2019

రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ గాంధీనగర్‌: డిజిటల్ రంగంలో భారత్ త్వరలోనే అగ్రగామిగా ఎదుగుతుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్ ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. "డిజిటల్ రంగం ప్రతీ రోజూ, ప్రతీ క్షణం కొత్త పుంతలు తొక్కుతున్న దేశం ఏదైనా ఉందంటే .. అది భారత్‌ మాత్రమేనని ఘంటాపథంగా చెప్పగలను. మొబైల్ డేటా విభాగంలో ప్రపంచ దేశాల జాబితాలో 155వ స్థానంలో ఉండే భారత్‌

Most from this category