News


భారత్‌లో వృద్ధి మాంద్యం..

Monday 9th December 2019
news_main1575861007.png-30120

  • భారత్‌లో వృద్ధి మాంద్యం..
  • అధికారాలన్నీ పీఎంవోలోనే కేంద్రీకృతం
  • దేశానికి ఇది శ్రేయస్కరం కాదు
  • విమర్శిస్తే రాజకీయ దురుద్దేశాలు అంటగట్టొద్దు
  • ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్

న్యూఢిల్లీ: పాలనాధికారాలన్నీ ప్రధాని కార్యాలయంలోనే కేంద్రీకృతమై ఉన్నాయని, మంత్రులంతా నిమిత్తమాత్రులుగానే ఉంటున్నారని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి పాలనతో ఎకానమీ తీవ్ర రుగ్మతలతో సతమతమవుతోందని .. దేశం "వృద్ధి మాంద్యం" పరిస్థితుల్లో చిక్కుకుందని పేర్కొన్నారు. ఒక వార్తాపత్రికకు రాసిన వ్యాసంలో ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశాన్ని గట్టెక్కించాలంటే పెట్టుబడులు, భూ.. కార్మిక చట్టాలపరమైన సం‍స్కరణలు మరిన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో పెట్టుబడులతో పాటు వృద్ధికి కూడా ఊతం లభించగలదని రాజన్ తెలిపారు. దేశ సమర్ధతను మెరుగుపర్చుకోవడానికి, పోటీ దేశాలకు దీటుగా ఎదగడానికి .. ఉపయుక్తంగా ఉండే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంపై భారత్ దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. "ప్రస్తుత ప్రభుత్వంతో సమస్యేమిటంటే .. అధికారాలన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ఉంటాయి. నిర్ణయాలే కాదు.. ఆలోచనలు, ప్రణాళికలు.. అన్నీ కూడా ప్రధాన చుట్టూ ఉండే కొద్ది మంది, ప్రధాని కార్యాలయం నుంచి వస్తుంటాయి. ఒక పార్టీ రాజకీయ, సామాజిక అజెండాను అమలు చేయడానికి ఇలాంటి విధానం పనికొస్తుంది కానీ.. ఆర్థిక సంస్కరణల విషయంలో ఇది పనిచేయదు. ఇందుకు రాష్ట్రాల స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో ఎకానమీ ఎలా పనిచేస్తుందన్న దానిపై అపార పరిజ్ఞానం అవసరమవుతుంది" అని రాజన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు సంకీర్ణంగా నడిచినప్పటికీ.. ఆర్థిక విధానాల సరళీకరణను స్థిరంగా ముందుకు తీసుకెళ్లాయన్నారు. "తీవ్ర స్థాయిలో అధికార కేంద్రీకరణ, మంత్రులకు అధికారాలు లేకపోవడం తదితర అంశాల కారణంగా.. పీఎంవో దృష్టి పెట్టినప్పుడు మాత్రమే సంస్కరణలు జోరందుకుంటున్నాయి. పీఎంవో దృష్టి మిగతా అంశాలవైపు మళ్లిన మరుక్షణం.. సంస్కరణల జోరూ తగ్గిపోతోంది" అని రాజన్ వ్యాఖ్యానించారు. 

ముందుగా సమస్యను గుర్తించాలి ...
ఆర్థిక మందగమనానికి మందు కనుగొనాలంటే.. ముందుగా సమస్య తీవ్రతను గుర్తించడం దగ్గర్నుంచి మొదలుపెట్టాల్సి ఉంటుందని రాజన్ తెలిపారు. "సమస్య పరిమాణాన్ని గుర్తించాలి. సమస్య తాత్కాలికమేనని.. ప్రతికూల వార్తలు, అననుకూల సర్వేలను తొక్కి పెట్టి ఉంచితే అది పరిష్కారమైపోతుందనే ఆలోచనల నుంచి బైటికి రావాలి. విమర్శించే ప్రతీ ఒక్కరికీ రాజకీయ దురుద్దేశాలు ఆపాదించడం మానుకోవాలి. దేశం వృద్ధి మాంద్య పరిస్థితుల మధ్యలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో గణనీయమైన ఒత్తిడి ఉంది" అని ఆయన పేర్కొన్నారు. భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు.. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్టమైన 4.5 శాతానికి పడిపోయిన నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

సంస్కరణలు తేవాలి...
రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ, ఇన్‌ఫ్రా రంగాలు.. వాటికి రుణాలిచ్చిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు సంక్షోభంలో ఉన్నాయని రాజన్ చెప్పారు. బ్యాంకుల్లో మొండి బాకీలు కూడా తోడవడంతో రుణ వితరణ వృధ్ది ఉండటం లేదన్నారు. సామాన్యుల నుంచి కార్పొరేట్ల దాకా అందరి రుణభారం, యువతలో నిరుద్యోగిత పెరిగిపోతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భూ సమీకరణ, కార్మిక చట్టాలపరమైన సంస్కరణలు, స్థిరమైన పన్నులు.. నియంత్రణా వ్యవస్థల విధానాలు అమలు చేయడంతో పాటు సంస్థల దివాలా పరిష్కార ప్రక్రియలు వేగవంతమయ్యేలా చూడటం, విద్యుత్‌కు సముచిత ధరల విధానాల అమలు, టెలికం రంగంలో పోటీని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవడం, రైతులకు ముడి సరుకు.. రుణాలపరమైన లభ్యతను పెంచడం వంటి అంశాలపై ప్రభుత్వం మరింతగా దృష్టి పెట్టాలని రాజన్ సూచించారు. You may be interested

వేల్యూ ఫండ్స్‌ను కొనసాగించవచ్చా ?

Monday 9th December 2019

ధీరేంద్ర కుమార్‌ (వ్యాల్యూ రీసెర్చ్‌ సీఈవో) ప్ర: నేను సీనియర్‌ సిటిజెన్‌ను. గత ఏడాది కాలం నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)మార్గంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో టాటా డిజిటల్‌ ఇండియా ఫండ్‌, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ డిజిటల్‌ ఇండియా ఫండ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ టెక్నాలజీ ఫండ్‌, ఫ్రాంక్లిన్‌ ఇండియా టెక్నాలజీ ఫండ్‌, యాక్సిస్‌ బ్లూచిప్‌ ఫండ్‌లు ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొనసాగించదగ్గ ఫండ్స్‌ ఏవి ?  -రవీందర్‌, కాకినాడ  జ: మీ

ఈసారి 5 శాతం లోపే వృద్ధి

Monday 9th December 2019

ఐహెచ్‌ఎస్ మార్కిట్ నివేదిక న్యూఢిల్లీ: ఉద్దీపన చర్యల ప్రభావం పూర్తి స్థాయిలో ప్రతిఫలించడానికి మరింత సమయం పట్టేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 5 శాతానికన్నా కాస్త తక్కువగానే ఉండవచ్చని కన్సల్టెన్సీ సంస్థ ఐహెచ్‌ఎస్ మార్కిట్ ఒక నివేదికలో పేర్కొంది. బలహీన ఆర్థిక రంగ పరిస్థితులు.. భారత వృద్ధి వేగంపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని తెలిపింది. మొండిబాకీల భారంతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు

Most from this category