News


అందరివాడు... అరుణ్‌ జైట్లీ

Sunday 25th August 2019
Markets_main1566707312.png-27995

- విద్యార్థి దశ నుంచే రాజకీయ ప్రస్థానం
- ఎమర్జెన్సీ సమయంలో 19 నెలలు జైలుకు
- తరవాత బీజేపీ... వయా జనసంఘ్‌
- మొదటి నుంచీ మోదీకే మద్దతుదారు
- కీలక నిర్ణయాలన్నిట్లోనూ ఆయన వెంటే
- న్యాయవాదిగా కాంగ్రెస్‌ వారూ క్లయింట్లే

(సాక్షి నాలెడ్జ్‌ విభాగం)
రాజకీయాల్లో అందరి మనసుసూ గెలవటమంటే అంత సులభమేమీ కాదు. పార్టీలు కత్తులు దూసుకుంటూ.. వ్యక్తిగత వైషమ్యాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో కూడా అరుణ్‌ జైట్లీ అంటే అజాత శత్రువే. భారతీయ జనతా పార్టీకి దాదాపు మూడు దశాబ్దాలు సేవలందించిన అరుణ్‌ జైట్లీ... తన వాక్చాతుర్యంతో, అపార ప్రతిభాపాటవాలతో అందరి మనసులూ చూరగొన్నారు. ఒక న్యాయవాదిగా పార్టీలకతీతంగా ఎవరి తరఫునైనా వాదించే విలక్షణత్వం, ప్రత్యర్థుల్ని విమర్శించడంలో కనబరిచే హేతుబద్ధత ఇవన్నీ జైట్లీకి రాజకీయాల్లో ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చాయి. అందుకే ప్రధానిగా ఎవరున్నా బీజేపీలో అరుణ్‌జైట్లీ స్థానం ప్రత్యేకమే. అందుకే కావచ్చు! కాంగ్రెస్‌లోనూ ఆయనకు వీరాభిమానులున్నారు. 
న్యాయవాదిగా ప్రస్థానం 
అరుణ్‌ జైట్లీది న్యాయవాద కుటుంబం. న్యూఢిల్లీలో డిసెంబర్‌ 28, 1952లో జన్మించారు. ఆయన తండ్రి ఢిల్లీలో పేరు ప్రఖ్యాతులున్న న్యాయవాది మహరాజ్‌ కిషన్‌ జైట్లీ. తల్లి రతన్‌ ప్రభ సామాజిక కార్యకర్త. చిన్నప్పటి నుంచి చర్చాగోష్టుల్లో పాల్గొనటం అంటే జైట్లీకి చాలా ఇష్టం. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ చేశారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా పాల్గొని ఆ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. దాదాపు 19 నెలలు జైల్లో ఉన్నారు కూడా. అప్పట్లో ఏబీవీపీ యువమోర్చా కన్వీనర్‌ బాధ్యతలు నిర్వహించేవారు. 1977లో ఏబీవీపీ అ«ఖిల భారత కార్యదర్శిగా ఉన్నారు. 1980లో బీజేపీలో చేరారు. పార్టీ తరఫున ఎన్నో కేసులు వాదించారు. బోఫోర్స్‌ వంటి కుంభకోణాలను వెలికితీయడంలో జైట్లీ పాత్ర కీలకం. కాంగ్రెస్‌ నేత మాధవరావు సింధియా, జనతాదళ్‌ నేత శరద్‌యాదవ్‌ వంటి వారు కూడా జైట్లీ క్లయింట్లే. న్యాయపరమైన అంశాలపై  పుస్తకాలు కూడా రాశారాయన. జైట్లీ భార్య సంగీతా జైట్లీ. ఆయనకు కుమారుడు రోహన్‌, కుమార్తె సొనాలీ ఉన్నారు. పిల్లలిద్దరూ న్యాయవాద వృత్తిలోనే ఉన్నారు. 
వాదనలో పదునెక్కువ 
గోధ్రా మతఘర్షణల్లో మోదీ తరపున, సొహ్రాబుద్దీన్, ఇష్రాత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌ కేసుల్లో కూడా జైట్లీ వాదించారు. సోనియా, రాహుల్‌ నిందితులుగా ఉన్న నేషనల్‌ హెరాల్డ్‌ కేసు, చిదంబరం ఇరుక్కకున్న కేసులు, ఇంకా ఎన్నో ప్రత్యేక కేసుల్లో అవి తప్పా, ఒప్పా అన్నది పక్కన పెడితే కోర్టుల్లో ఆయన వాదనా పటిమకు ప్రత్యర్థులు కూడా ముగ్ధులయ్యేవారు. ప్రఖ్యాత లాయర్‌ రామ్‌జెఠ్మలానీ వంటి వారి ప్రశంసలు అందుకున్నారు. 
మోదీకి ప్రధాన మద్దతుదారు 
వాజపేయి హయాంలోనే జైట్లీ అత్యంత కీలకమైన శాఖల్ని నిర్వహించారు. న్యాయశాఖ, సమాచార శాఖ, వాణిజ్యం కార్పొరేట్‌ వ్యవహారాల శాఖలపై తనదైన ముద్రవేశారు. మోదీ ప్రభుత్వంలోనూ ఓ వెలుగు వెలిగారు. 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో బీజేపీలో దిగ్గజ నాయకులు కొందరు తీవ్రంగా వ్యతిరేకించి అడ్వాణీ వెంట నడిచారు. కానీ జైట్లీ అలా కాదు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోదీ నియామకం సమయంలో... గోద్రా ఘర్షణల సమయంలోనూ మోదీ వెంటే ఉన్నారు. ప్రధానిగా మోదీ అభ్యర్థిత్వానికి గట్టిగా మద్దతు పలికారు. మోదీ ఆర్థిక నిర్ణయాలకు అండగా ఉండి ప్రత్యర్థుల నోరు మూయించారు. సోషల్‌ మీడియా అందుబాటులోకి  వచ్చాక ఆయన చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఫేస్‌బుక్‌లో తరచూ పోస్టులు పెట్టేవారు. తర్వాత అనారోగ్య కారణాలతో మీడియా ముందుకు రాకపోయినా సొంతగా బ్లాగు నిర్వహించి ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తూ పోస్టులు పెట్టేవారు. మోదీ సర్కార్‌లో ట్రబుల్‌ షూటర్‌గా õపేరుపొందారు. జైట్లీ సోషల్‌ మీడియాలో చురుగ్గా  మారాక  కాంగ్రెస్‌ ఆయన్ను ‘బ్లాగ్‌ మంత్రి’ అని వెటకారం చేసేది. 
జైట్లీ హయాంలోనే కీలక నిర్ణయాలు
2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక మోదీ సర్కార్‌ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు వంటి అత్యంత కీలకమైన నిర్ణయాలన్నీ ఆర్థిక శాఖ మంత్రిగా జైట్లీ హయాంలోనే జరిగాయి. జీఎస్టీ అమలుకు యూపీఏ సర్కార్‌ ప్రయత్నించినా ఏకాభిప్రాయం సాధించలేకపోయింది. కానీ జైట్లీ అత్యంత సమర్థవంతంగా అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారు. ఐఎంఎఫ్‌ సమావేశాల్లో కూడా భారత్‌ ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఉండడానికి పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ఊతంగా ఉంటాయని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గాడిన పడితే భారత్‌ కూడా బాగుపడుతుందని ప్రకటించారు. సాధారణ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ను విలీనం చేయాలన్న నిర్ణయం కూడా జైట్లీ హయాంలోనే జరిగింది. దివాలా చట్టాన్ని (ఐబీసీ) ప్రవేశపెట్టి కంపెనీల సమస్యలకు చెక్‌ పెట్టారు. 
తెరవెనుక వ్యూహకర్త 
జైట్లీ మంచి వ్యూహకర్త. అమిత్‌ షా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి ముందు ఎక్కడ ఎన్నికలు జరిగినా జైట్లీ పేరే వినిపించేది. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా డజనుకిపైగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ పథాన నడిపించారు. గోధ్రా ఘర్షణల సమయంలో గుజరాత్‌ పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న జైట్లీ.. మోదీకి అత్యంత అండగా నిలిచి ఎన్నికల్లో పార్టీని గెలుపుతీరాలకు చేర్చారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం వెనుక జైట్లీ కృషి కూడా ఉంది. ఆ ఎన్నికల వ్యూహకర్తల్లో జైట్లీ కూడా ఒకరు.
ఒక్కసారి కూడా లోక్‌సభకు ఎన్నిక కాలేదు... 
ఎంతో రాజకీయ అనుభవం ఉన్న అరుణ్‌ జైట్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ నెగ్గలేదు. ఒక్కసారీ లోక్‌సభకు ఎన్నిక కాలేదు. అమృత్‌సర్‌ నియోజకవర్గం నుంచి ఒకే ఒక్కసారి పోటీ చేసినా కాంగ్రెస్‌ అభ్యర్థి అమరీందర్‌ సింగ్‌ను ఎదుర్కోలేక ఓడిపోయారు. అనారోగ్య కారణాలతో 2019 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన బీజేపీ అధిష్టానం రాజ్యసభకు పంపి ఆయన సేవలను వినియోగించుకుంది. పార్టీ అధికార ప్రతినిధిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా సైతం జైట్లీ కొనసాగారు. 
క్రికెట్‌ అంటే ప్రాణం
న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా, ఎన్నికల వ్యూహకర్తగా అనూహ్యమైన విజయాలు సాధించిన అరుణ్‌ జైట్లీకి క్రికెట్‌ అంటే ప్రాణం. చిన్నతనంలో క్రికెట్‌ బాగా ఆడేవారు. బీజేపీలో చేరాక బీసీసీఐ ఉపాధ్యక్షుడిగానూ కొనసాగారు. అయితే ఐపీఎల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో తన పదవికి రాజీనామా చేరు. ఢిల్లీ క్రికెట్‌ అధ్యక్షుడిగా పదమూడేళ్లపాటు ఉన్న జైట్లీ రాజధానిలో క్రికెట్‌ స్టేడియం నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి కృషి చేశారు. ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌లో జైట్లీ అవకతవకలకి పాల్పడ్డారని ఆప్‌ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రివాల్‌ ఆరోపణు చేయడంతో ఆయనను కోర్టుకు లాగారు. జైట్లీ వాదనా పటిమతో ఆఖరికి కేజ్రివాల్‌ క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసింది.



You may be interested

ప్రారంభమైన ఎన్‌ఏఆర్‌ ఇండియా సదస్సు

Sunday 25th August 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ రియల్టర్స్‌ (ఎన్‌ఏఆర్‌) ఇండియా 11వ కన్వెన్షన్‌ శనివారమిక్కడ ఘనంగా ప్రారంభమైంది. ‘గేమ్‌ చేంజర్‌’ థీమ్‌తో నిర్వహిస్తున్న రెండు రోజుల ఈ సదస్సుకు సాక్షి గ్రూప్‌ మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తుంది. ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌ (పీడబ్ల్యూసీ) అసోసియేట్‌ డైరెక్టర్‌ మహ్మద్‌ ఆసిఫ్‌ ఇక్బాల్‌ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రియల్టర్లు అంటే గృహాలు నిర్మించడంతోనే సరిపోదని,

మార్కెట్‌ ఉత్సాహానికి ట్రేడ్‌ వార్‌ అడ్డంకి?

Saturday 24th August 2019

ఆర్థిక మంత్రి ప్రకటించిన ఆర్థిక చర్యల ప్రభావం మార్కెట్‌పై సోమవారం పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉంది. కానీ ఈ మార్కెట్‌ ఉత్సాహాన్ని తీవ్రతరమవుతున్న యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ తగ్గించవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. మార్కెట్‌ల బౌన్స్‌బ్యాక్‌కు ఈ ట్రేడ్‌ వార్‌ అడ్డంకి కాగలదని వారు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న 550 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులపై అదనంగా 5 శాతం టారీఫ్‌లను విధించనున్నామని శుక్రవారం ప్రకటించడంతో

Most from this category