News


టోకు ద్రవ్యోల్బణానికి ఉల్లి సెగ

Wednesday 15th January 2020
news_main1579059523.png-30935

(అప్‌డేటెడ్‌...)

  • డిసెంబర్‌లో 2.59 శాతంగా నమోదు
  • ఇది 8 నెలల గరిష్టం
  • జనవరిలోనూ ధరల మంట తప్పదంటున్న విశ్లేషకులు

న్యూఢిల్లీ: ఉల్లి, బంగాళదుంప తదితర కూరగాయల ధరలు భారీగా పెరగడంతో డిసెంబర్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (ఽడబ్ల్యూపీఐ) ఎనిమిది నెలల గరిష్టానికి ఎగిసింది. 2.59 శాతంగా నమోదైంది. నవంబర్‌లో ఇది 0.58 శాతంగా ఉండగా, 2018 డిసెంబర్‌లో 3.46 శాతంగా నమోదైంది. 2019 ఏప్రిల్‌లో 3.24 శాతం తర్వాత మళ్లీ ఆ స్థాయి నమోదు కావడం డిసెంబర్‌లోనే కావడం గమనార్హం. డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం అయిదున్నరేళ్ల గరిష్టమైన 7.35 శాతంగా ఉన్న నేపథ్యంలో తాజాగా డబ్ల్యూపీఐ కూడా ఎగియడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్థిక సలహాదారు కార్యాలయం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ..  ఆహారపదార్థాల విభాగంలో కూరగాయల ధరలు అత్యధికంగా 69.69 శాతం ఎగిశాయి. ఉల్లి, బంగాళాదుంప రేట్లే ఇందుకు కారణం. ఉల్లి రేటు 456 శాతం పెరగ్గా, బంగాళాదుంప ధర 45 శాతం పెరిగింది. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని ఇటీవలి దాకా ఉల్లి రేటు చాలా ప్రాంతాల్లో రూ. 100 పైగా పలికిన సంగతి తెలిసిందే. ‍తాజాగా దిగుమతులతో పాటు కొత్త పంట కూడా చేతికి రావడంతో క్రమంగా ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. టోకు ద్రవ్యోల్బణం గణాంకాల ప్రకారం...


- ఆహార పదార్థాల ధరల పెరుగుదల నవంబర్‌లో 11 శాతంగా ఉండగా, డిసెంబర్‌లో 13.12 శాతంగా ఉంది. ఆహారేతర ఉత్పత్తుల ‍ద్రవ్యోల్బణం నవంబర్‌లో నమోదైన 1.93 శాతంతో పోలిస్తే సుమారు నాలుగు రెట్లు పెరిగి 7.72 శాతంగా నమోదయ్యాయి. 
- తయారీ ఉత్పత్తుల టోకు ద్రవ్యోల్బణం మైనస్‌ 0.25 శాతంగా ఉంది. 
- ఇంధన విభాగం ద్రవ్యోల్బణం మైనస్ 1.46, విద్యుత్ విభాగం మైనస్ 7.32 శాతంగా నమోదైంది.
- ప్రాథమిక ఉత్పత్తుల రేట్ల పెరుగుదల నవంబర్‌లో 7.68 శాతంగా ఉండగా.. డిసెంబర్‌లో 11.46 శాతంగా ఉంది. ప్రాథమిక ఉత్పత్తుల్లో ఆహారపదార్థాలు, ఆహారేతర ఉత్పత్తులు, ఖనిజాలు, ముడి చమురు, సహజ వాయువు మొదలైనవి ఉంటాయి. దీనికి టోకు ధరల సూచీలో 22.62 శాతం వాటా ఉంటుంది. 

జనవరిలో మరింతగా ...
వినియోగదారుల ధరల సూచీ ఆధారిత (సీపీఐ) రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలోనూ మరింత పెరిగే అవకాశమే ఉందని, 8 శాతం స్థాయిని దాటేయొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఆహారపదార్ధాలు.. ముఖ్యంగా కూరగాయల ధరలు అధిక స్థాయిలో ఉంటుండటమే ఇందుకు కారణం. "జనవరిలో ‍ద్రవ్యోల్బణం 8 శాతం స్థాయిని దాటేయొచ్చు. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చు" అని ఎస్‌బీఐ ఎకనమిక్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ ఒక నివేదికలో పేర్కొంది. 

యథాతథంగా ఆర్‌బీఐ రేట్లు...
రిటైల్ ద్రవ్యోల్బణం మరింత ఎగియనున్న నేపథ్యంలో వచ్చే నెల 6న జరిగే ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్‌ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని ఎకోర్యాప్ అధ్యయన నివేదికలో ఎస్‌బీఐ పేర్కొంది. గతేడాది ఫిబ్రవరి-అక్టోబర్‌ మధ్యలో వరుసగా అయిదు దఫాలు రెపో రేట్లను ఆర్‌బీఐ తగ్గించింది. కానీ డిసెంబర్‌ సమావేశంలో మాత్రం తగ్గించకపోవడంతో ప్రస్తుతం ఇది 5.15 శాతంగా ఉంది. మరోవైపు, రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కేంద్రీయ గణాంకాల సంస్థ (సీఎస్‌వో) లెక్కించే తీరును కూడా సమీక్షించాల్సిన అవసరం ఉందని ఎస్‌బీఐ నివేదిక అభిప్రాయపడింది. "సీఎస్‌వో ఉపయోగిస్తున్న విధానం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం అసలు స్థాయి కన్నా 200 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉంటోంది. ఇది విధానపరంగా తప్పుడు నిర్ణయాలకు దారి తీసే ప్రమాదముంది. కాబట్టి లెక్కింపు తీరును సమీక్షించాల్సిన అవసరం ఉంది" అని పేర్కొంది. You may be interested

భారత్‌లో అమెజాన్‌ రూ. 1,700 కోట్ల పెట్టుబడులు

Wednesday 15th January 2020

న్యూఢిల్లీ: భారత్‌లో జోరుగా కార్యకలాపాలు విస్తరిస్తున్న అమెరికన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌..  చెల్లింపులు, హోల్‌సేల్‌ వ్యాపార విభాగాల్లోకి రూ. 1,700 కోట్ల పైగా ఇన్వెస్ట్ చేసింది. అమెజాన్‌ పే ఇండియా విభాగానికి అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్స్‌, అమెజాన్‌డాట్‌కామ్‌డాట్‌ఐఎన్‌సీఎస్‌ నుంచి రూ. 1,355 కోట్లు వచ్చాయి. ఇందుకు ప్రతిగా ఆయా సంస్థలకు అమెజాన్ పే ఇండియా షేర్లు కేటాయించింది. ఆ రెండు సంస్థల నుంచి రూ. 360 కోట్లు అందుకున్న అమెజాన్

మైండ్‌ట్రీ ఆదాయం రూ.1,965 కోట్లు

Wednesday 15th January 2020

10 శాతం వృద్ధి  3 శాతం పెరిగిన నికర లాభం  న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ మైండ్‌ట్రీకి ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.197 కోట్ల నికర లాభం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.191 కోట్ల నికర లాభం ఆర్జించామని కంపెనీ సీఈఓ, ఎమ్‌డీ దేబాశిష్‌ చటర్జీ తెలిపారు. 3 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు. గత క్యూ3లో రూ.1,787 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ3లో 10 శాతం

Most from this category