News


వృద్ధి, ఉద్యోగ కల్పనకు చర్యలేవి?

Saturday 6th July 2019
news_main1562396898.png-26856

 • బడ్జెట్‌పై ప్రముఖ పారిశ్రామిక వేత్తల ప్రశ్నలు
 • 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు బ్లూప్రింట్‌
 • భారీ పెట్టుబడులకు అనుకూలమని కొందరి వ్యాఖ్యానం

నిర్మలా సీతారామన్‌ తీసుకొచ్చిన తొలి బడ్జెట్‌పై దేశీయ పారిశ్రామిక రంగ ‍ప్రముఖులు కొందరు ప్రశంసలు కురిపిస్తే, మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను 2025 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యానికి బ్లూప్రింట్‌ మాదిరిగా ఉందని, భారీ పెట్టుబడులను ఆకర్షించాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఉందని కొందరు పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడితే... వృద్ధిని పెంచేందుకు, ఉద్యోగాల కల్పనకు, డిమాండ్‌ను పెంచే నిర్మాణాత్మక చర్యలు లోపించాయని, ఇది ప్రజాకర్షణగా ఉందని మరికొందరు విమర్శించారు. ఐదేళ్ల క్రితం మన ఆర్థిక రంగం 1.85 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంటే, అదిప్పుడు 2.7 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుందని, వచ్చే కొన్నేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోగలదని మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ సందర్భంగా వ్యాఖ్యానించారు.

 •  ‘‘ఇది ప్రగతిశీల బడ్జెట్‌. కీలకమైన ఆరోగ్యం, పారిశుద్ధ్యం, నీరు, ప్రజా సంక్షేమంతోపాటు భారీ టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా భారత్‌ను పరుగులు తీసేందుకు సిద్ధం చేసే విధంగా ఉంది. మౌలిక రంగంలో రానున్న ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడుల భారీ లక్ష్యాలు బడ్జెట్‌లో ఉన్నాయి. ఇది దేశ రూపాన్నే మార్చేస్తుంది. 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు సాయపడుతుంది’’ అని వేదాంత రీసోర్సెస్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ అన్నారు. 
 • ‘‘సంప్రదాయంగా బ్రీఫ్‌కేసుతో రాకుండా మంత్రి ఎర్రరంగు వస్త్రంతో కూడిన బ్యాగుతో వచ్చారు. భారత దేశ చరిత్రలో ఇది నూతన శకం. ఏవో పొడి అంకెలు కాకుండా, లక్ష్యిత వృద్ధి కోసం తీసుకొచ్చిన బ్లూప్రింట్‌ ఇది’’ అని ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ హర్ష్‌ గోయంకా అన్నారు.-
 • నమ్మకాన్ని పాదుకొల్పే బడ్జెట్‌ 2019ను ఓ మహిళా ఆర్థిక మంత్రి తీసుకురావడం చూడ్డానికి గర్వంగా ఉందని బయోకాన్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌షా అన్నారు.
 • దీర్ఘకాలిక లక్ష్యమైన 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాకారం చేసే విధంగా బడ్జెట్‌ ఉందని అపోలో హాస్పిటల్స్‌ గ్రూపు చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి అభివర్ణించారు. దేశాన్ని రానున్న ఐదేళ్లలో నూతన శిఖరాలకు తీసుకెళ్లాలన్న మోదీ 2.0 విజన్‌కు దర్పణం పడుతోందన్నారు. 
 • ఫార్మాస్యూటికల్‌, హెల్త్‌కేర్‌ రంగాలకు బడ్జెట్‌ ఏ విధమైన ప్రోత్సాహకాలు కల్పించలేదని, ఇది నిరుత్సాహపరిచేదిగా డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌ సతీష్‌రెడ్డి అన్నారు. ముఖ్యంగా పరిశోధన, అభివృద్ధిపై చేసే వ్యయాలకు వెయిటెడ్‌ డిడక్షన్‌లో మార్పు ఉంటుందని ఆశించగా, అది జరగలేదన్నారు.  
 • ప్రజాకర్షణగా కాకుండా ప్రజామోదనీయంగా బడ్జెట్‌ ఉందని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌బెనర్జీ అన్నారు. సమాజంలో మహిళలు, యువత, రైతులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, పరిశ్రమ అన్ని వర్గాలకు సంబంధించి చర్యలను ప్రకటించారని పేర్కొన్నారు. ఉన్న ద్రవ్య పరిమితుల్లోనే గ్రామీణ, పట్టణాలకు ప్రయోజనాలు కల్పించే విధంగా ఉందన్నారు. 
 • ‘‘బడ్జెట్‌లో ఎన్నో సానుకూలతలు ఉన్నాయి. సమాజంలో చాలా వర్గాలకు ప్రయోజనాలు కల్పించారు. వచ్చే కొన్నేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణ ‍ప్రణాళికను చూస్తున్నాం’’ అని ఫిక్కీ ప్రెసిడెంట్‌ సందీప్‌ సోమాని చెప్పారు.
 • ‘‘మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి కొనసాగడం తక్షణావసరమైనదే. వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీ లక్ష్యాన్ని ప్రశంసించాల్సిందే. 8 శాతం స్థిరమైన జడీపీ వృద్ధి రేటుకు తోడు, ద్రవ్య లోటు పరంగా కఠిన క్రమశిక్షణ అవసరం’’అని విప్రో సీఎఫ్‌వో రాఘవ్‌ స్వామినాథన్‌ పేర్కొన్నారు. 
 • ‘‘అందరికీ 2022 నాటికి నివాసం కల్పించాలన్న ప్రభుత్వ ఉద్దేశ్యం సిమెంట్‌, స్టీల్‌ వంటి రంగాల్లోనూ వృద్ధికి వీలు కల్పిస్తుంది. అలాగే, కీలక రంగాల్లో ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది’’ అని పిరమల్‌ గ్రూపు అధినేత అజయ్‌ పిరమల్‌ అన్నారు. 
 • ‘‘వృద్ధిని పెంచే విధంగా బడ్జెట్‌ ఉందని నేను భావించడం లేదు. స్టాక్‌ మార్కెట్‌ కూడా చెప్పుకోతగినంత తగ్గింది’’ అని గోద్రేజ్‌ గ్రూపు చైర్మన్‌ ఆది గోద్రేజ్‌ వ్యాఖ్యానించారు.
 • ‘‘చాలా ప్రజాకర్షక చర్యలు ఉన్నాయి. ఉద్యోగాల కల్పన అనే అతిపెద్ద సవాల్‌ను దేశం ఎదుర్కొంటోంది. కానీ, బడ్జెట్లో దీనికి పరిష్కారం చూపలేదు. మన పిల్లలకు ఉద్యోగాలు సృష్టించలేకపోతే అది సామాజిక సమస్యలకు దారితీస్తుంది’’ అని మహీంద్రా హాలిడేస్‌ చైర్మన్‌ అరుణ్‌నందా అన్నారు.
 • ‘‘ఆలోచనల పరంగా, 360 డిగ్రీల కోణంలో ఈ బడ్జెట్‌ చాలా పెద్దగా ఉంది. మౌలిక సదుపాయాలు, కార్మిక సంస్కరణలు, లిక్విడిటీ, ఎన్‌బీఎఫ్‌సీ, స్టార్టప్‌లు, డిజిట్‌, ఎంఎస్‌ఎంఈ, ఎలక్ట్రిక్‌ వాహనాల ఇలా అన్నింటిపై ఈ బడ్జెట్‌ దృష్టి సారించింది. వీటన్నింటినీ ఎలా నెరవేరుస్తారన్న వివరాలు దేవుడికే తెలియాలి’’ అని అభివర్ణించారు బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఎండీ సంజీవ్‌ బజాజ్‌.
 • ‘‘ఆటోమోటివ్‌ విడిభాగాలపై కస్టమ్స్‌ సుంకం పెంచడం అన్నది, ఇప్పటికే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న ఈ రంగంలో డిమాండ్‌ పెంచేందుకు ఏ మాత్రం సాయపడదు’’ అని మెర్సెడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ మార్టిన్‌ షూవెంక్‌ అన్నారు. కస్టమ్స్‌ సుంకాలు పెంచడం, ఇంధన ధరలు కూడా పెరగడం వల్ల ముడి సరకుల వ్యయాలు పెరిగి, కార్ల ధరల పెరుగుదలకు దారితీస్తాయన్నారు. 

పెట్టుబడులను పెంచుతుంది...
భారీ పెట్టుబడులను రాబట్టే విధంగా సీతారామన్‌ బడ్జెట్‌ ఉందన్నారు అసోచామ్‌ ప్రెసిడెంట్‌ బీకే గోయంకా.  గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, డిమాండ్‌ను పెంచడంపై దృష్టి సారించే విదంగా ఉందన్నారు. ‘‘వీటికితోడు పన్నుల సులభతర చర్యలు వృద్ధికి ఊతమిచ్చే విధంగా, ద్రవ్య క్రమశిక్షణ కొనసాగించే విధంగా ఉన్నాయి. మార్పును తీసుకొచ్చే బడ్జెట్‌. భారత ఆర్థిక వ్యవస్థను 2025 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లే లక్ష్యంతో ఉంది’’ అని వ్యాఖ్యానించారు. 25 శాతం కార్పొరేట్‌ పన్నును రూ.400 కోట్ల టర్నోవర్‌ కలిగిన కంపెనీలకూ కూడా వర్తింపజేయడం వల్ల అధిక పెట్టుబడులకు ప్రోత్సాహానిచ్చినట్టు అవుతుందన్నారు. బీమా ఇంటర్‌మీడియరీలు, ఏవియేషన్‌లో ఎఫ్‌డీఐల నిబంధనలను మరింత సరళీకరించడం ప్రోత్సాహానిచ్చేదిగా పేర్కొన్నారు. 

 You may be interested

జీరో బడ్జెట్‌... ఖర్చు లేని సాగు

Saturday 6th July 2019

ఈ దిశగా ‘సాగా’లన్న ఆర్థిక మంత్రి సుభాష్‌ పాలేకర్‌ పద్ధతిపై ప్రత్యేక ప్రస్తావన జీరో బడ్జెట్‌ వ్యవసాయం దిశగా దేశం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు పూర్వ పద్ధతుల వైపు మళ్లాల్సి ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. బడ్జెట్‌ ప్రసంగంలో దేశ వ్యవసాయ స్థితిగతులను ప్రస్తావిస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఐక్య రాజ్య సమితికి చెందిన ఆహార –

రైల్వే ప్రాజెక్టుల్లోనూ ‘పీపీపీ’

Saturday 6th July 2019

బడ్జెట్‌లో 65 వేల కోట్ల కేటాయింపులు మూలధన వ్యయం కింద మరో 1.6 లక్షల కోట్లు 2030 నాటికి రూ. 50 లక్షల కోట్లు అవసరం: నిర్మల న్యూఢిల్లీ: రైల్వేల సత్వర అభివృద్ధి కోసం ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ప్రాజెక్టులు చేపట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రతిపాదించారు. రైల్వేలో మౌలిక వసతుల కల్పన కోసం 2018 నుంచి 2030 సంవత్సరాల మధ్య రూ. 50 లక్షల కోట్ల

Most from this category