News


అంతా బాగుండాలి.. అందులో మీరూ ఉండాలి!!

Sunday 2nd February 2020
news_main1580624739.png-31440

  • బడ్జెట్‌ ‘రచ్చ’బండలో సీతారామన్‌ బాణాలు

అదిగో... అదిగో..! అందరూ వచ్చేశారా!! ప్రతిసారీ ఈ రోజున మనం ఎక్కడో ఓ చోట కలుసుకుంటూనే ఉన్నాం. ఈ సారి ఈ రచ్చబండ దగ్గర!!. ఎన్నో కోరికలు కోరి... అవి తీరుతాయన్న ఆశతో మీరిలా రావటం... అన్నీ సాధ్యం కాకున్నా కొన్నిటినైనా నెరవేర్చడానికి నేను ప్రయత్నించటం కొత్తేమీ కాదుగా!!. ఈ సారి మన ఊరి పరిస్థితులు అంత బాగాలేవు. ఆదాయానికి, ఖర్చులకు మధ్య లంకె కుదరటం లేదు. ధరలు పెరుగుతున్నాయి. వాటి మాదిరే అప్పులు కూడా!!. అలాగని ఖర్చులు మానుకోలేం కదా? మీరంతా బాగుండాలని నా ప్రయత్నమైతే నేను చేశా.. ఇదిగో చెబుతా వినండి!!.

రైతన్నా... నేనున్నా...
నీకు విత్తులేసే నాటికి చేతిలో పైకం ఉండాలి. బ్యాంకులకు చెప్పాంలే!! దండిగా రుణాలివ్వమని. ఓ రెండేళ్లలో నీ చేతిలోకి రెండింతల సొమ్ము వచ్చేలా చేయాలన్నదే నా కల. అందుకోసమే ఇదంతా!!. మీరు సోలార్‌ పంపుసెట్టు పెట్టుకోండి. దానిక్కాస్త డబ్బులిస్తాం. అంతేకాదు!! పంటతో పాటు కరెంటూ పండించండి!!. ఆ కరెంటును మేం కొని డబ్బులిస్తాం. నీటి కష్టాలు లేకుండా చేస్తాం. మరి మీరు కూడా నీళ్లు, ఎరువులు తక్కువ వాడాలి సుమా!. మీరు పండించే వస్తువులు పాడైపోకుండా రవాణా చెయ్యటానికి కోల్డ్‌ స్టోరేజీ రైళ్లు మరిన్ని తేవటానికి ప్రయత్నిస్తాం. మీ రైతాంగానికిచ్చే నిధులు కూడా భారీగానే పెంచాంలే!!.

నేను సీతయితే... నువ్వు లక్ష్మి మరి...
స్వయం సహాయక సంఘాల్లోని మహిళలంటే ధన లక్ష్ములే కాదు! ధాన్య లక్ష్ములూ కావాలి!!. అందుకే విత్తనాలు నిల్వ చేయండి. స్టోరేజీలకు కావాల్సిన అప్పులు మేం ఇప్పిస్తాం. గిడ్డంగులూ మేమే కట్టిస్తాం. మీ పంట ఉత్పత్తుల్ని ఇతర ప్రాంతాలకే కాదు... విదేశాలకూ పంపించొచ్చు. ఆడపిల్లల పెళ్లికి  కనీస వయసు పెంచాలని ఉంది. దానికోసం ఓ టాస్క్‌ఫోర్స్‌ పెడతాం. అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్లు కూడా ఇస్తున్నాం.

పన్ను తగ్గింపు కావాలా.. నాయినా!!
మీ ఉద్యోగులెప్పుడూ ఇంతే! పన్ను రేట్లు తగ్గించండని అడుగుతూనే ఉంటారు!!. అదెలా కుదురుతుంది? మీరు పన్నులు కడితేనేగా ఊరికి ఆదాయం వచ్చేది. అయినా సరే... మీరు అడుగుతున్నారు కనక ఏదోకటి చేశాలే!!. మీలో కొందరేమో పొదుపరులు. కొందరేమో వచ్చింది వచ్చినట్లే ఖర్చుపెట్టేస్తారు. అందుకే.. మీ ఇద్దరినీ వేరు చేసి మీకు తగ్గ పన్ను విధానాలు తెచ్చాను. మీరు పొదుపు చేసుకుంటే మీకు మునుపటిలానే పన్ను ఎలాగూ కాస్త మినహాయిస్తాం. ఖర్చు పెట్టేవాళ్లకు మినహాయింపులుండవు కనక పన్ను రేట్లు తగ్గించాం. ఇది ఎవరికి లాభమని మాత్రం నన్ను అడక్కండి. మాక్కూడా లాభం ఉండాలిగా!!.

కార్పొరేట్లూ... ఇంకా ఎంత తగ్గిస్తాం?
బడ్జెట్‌ కోసం మీరు ఎదురు చూడటమే సరికాదు. ఎందుకంటే మొన్నేగా మీ పన్ను తగ్గించింది!!. అసలు ప్రపంచం మొత్తమ్మీద కంపెనీలకు తక్కువ పన్నులున్నది ఇక్కడే తెలుసా? ఇంకా ఎంత తగ్గిస్తాం చెప్పండి!!. మీరిప్పుడు డివిడెండ్లు ఇస్తూ... వాటిపైనా పన్ను చెల్లించాల్సి వస్తోంది కదా? దాన్ని... అదే డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ పన్ను తీసేస్తున్నాం లెండి. కాకపోతే ఇకమీదట డివిడెండ్‌ తీసుకునే వాళ్ళు పన్ను కడతారు. ఇద్దరూ కట్టకపోతే ఎలా చెప్పండి? 

సురక్షితంగా దాచుకోండి... బ్యాంకుల్లో...
పాపం! బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తారు కానీ మీ భయం మీకుంటుంది!!. ఏ బ్యాంకు ఎప్పుడు బిచాణా ఎత్తేస్తుందో తెలీదు. అందుకే... ఇకపై మీరు చేసే డిపాజిట్లకు రూ.5 లక్షలవరకూ బీమా ఉండేలా చూస్తాం. ఇప్పటిదాకా ఇది లక్ష రూపాయలే కదా!!. అలాగని మీరు చేసే డిపాజిట్లన్నిటికీ 5 లక్షల చొప్పున గ్యారంటీ ఉంటుందనుకోకండి. మీరు ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని డిపాజిట్లు చేసినా... ఒక మనిషికి రూ.5 లక్షల వరకే బీమా ఉంటుంది. అది కాస్తా చూసుకోండి!!.

ఎగుమతిదారులూ.. మీకో పథకం...
ఎగుమతులు తగ్గాయని మీకూ తెలుసు!. డిసెంబరు దాకా ఐదునెలలు వరసగా తగ్గుతూనే వచ్చాయి. డిసెంబర్‌లో 1.8 శాతం తగ్గి 27.36 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అందుకే మీరు చెల్లించే సుంకాలు, పన్నుల్ని రీయింబర్స్ చెయ్యడానికి ఒక పథకం తెస్తున్నాం. వ్యాట్‌, విద్యుత్ సుంకాలు, రవాణా ఇంధనాల వ్యయాలు రీయింబర్స్‌ చేస్తాం. ప్రతి జిల్లానూ ఎగుమతి హబ్‌గా చేసేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేస్తున్నాయి. 

చిన్న కంపెనీకి... చింతలుండవు...
మరీ పెద్ద కంపెనీలు కాదుగానీ... సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలన్నిటికీ ఇది మంచి వార్తే లెండి!!. మీ టర్నోవర్‌ రూ.5 కోట్ల లోపుంటే మీకు ఆడిటింగ్‌ అవసరం లేదు. ఇపుడు కోటిదాటితే ఆడిట్‌ చేయాల్సి వస్తోంది కదా? దీన్ని సవరించాం. ఎందుకంటే ఎకానమీ బాగుండాలంటే మీరే ముందుండి నడిపించాలి. మీకు తక్కువ వడ్డీ రేటుండే రుణాలివ్వటానికి (సబార్డినేట్‌) కూడా మరో పథకం తెస్తున్నాం. మీకు రుణ పునరుద్ధరణ సదుపాయ విండోను 2021 మార్చి వరకు కొనసాగించాలని ఆర్‌బీఐని అడిగాం. రేపో మాపో ఊ కొడుతుంది లెండి!!.

అన్ని కంపెనీలకూ అంతో ఇంతో...
రవాణా మౌలిక సదుపాయాలకు రూ.1.7 లక్షల కోట్లు కేటాయించాం. మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, సెమీ కండక్టర్ల తయారీని ప్రోత్సహించాలని భావిస్తున్నాం. భారత్‌ నెట్‌ను మరింత అభివృద్ధి చేసి గ్రామాలకు బ్రాడ్‌ బ్యాండ్‌ను అందుబాటులోకి తెస్తాం. విద్యకు రూ.99,300 కోట్లు కేటాయించాం. ఆన్‌లైన్‌ విద్యను ప్రోత్సహిస్తాం. డేటా సెంటర్‌ పార్కులు ఏర్పాటుకు ప్రైవేటు రంగాన్ని అనుమతిస్తాం. జాతీయ గ్యాస్‌ గ్రిడ్‌ను 16,200 కి.మీ. నుంచి 27,000 కిలోమీటర్లకు విస్తరిస్తాం. ఇవన్నీ చిన్న విషయాలా? ఈ రంగాల్లోని కంపెనీల చరిత్రే మారిపోతుంది. చూస్తూ ఉండండి!!.

విద్యార్థులూ... టూరిస్టులూ...
రవాణా ఎంత ముఖ్యమో మీకు తెలుసు? కొత్త హైస్పీడ్‌ రైళ్లు... 100 కొత్త ఎయిర్‌పోర్ట్‌లూ తెస్తాం. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే పూర్తి చేస్తాం. హర్యానా, గుజరాత్‌, తమిళనాడు, అసోం సహా ఐదు చారిత్రక ప్రాంతాలతో పాటు రాంచీలో ట్రైబల్‌ మ్యూజియం, అహ్మదాబాద్‌లో మ్యారిటైమ్‌ మ్యూజియం కడతాం. ఎంచక్కా మీరు వెళ్లి చూడొచ్చు. విద్యారంగంలో విదేశీ పెట్టుబడులొస్తాయి. 150 యూనివర్సిటీల్లో కొత్త స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులు పెడతాం. జిల్లా ఆసుపత్రులన్నీ మెడికల్‌ కాలేజీలుగా మారుస్తాం.You may be interested

ఈయూను వీడిన బ్రిటన్‌

Sunday 2nd February 2020

శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి వచ్చిన బ్రెగ్జిట్‌ దేశ చరిత్రలో కొత్త శకమన్న ప్రధాని జాన్సన్‌ ప్రజలు, మీడియాలో మిశ్రమ స్పందనలు లండన్‌: యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)తో బ్రిటన్‌ తన 47 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంది. ఈ చారిత్రక సందర్భం బ్రెగ్జిట్‌ను పురస్కరించుకుని బ్రిటన్‌ వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం బ్రెగ్జిట్‌ శుక్రవారం అర్థరాత్రి 11 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. బ్రెగ్జిట్‌ మరో కొత్త శకానికి నాంది అని ఈ సందర్భంగా

పేదవిద్యార్థులకు ఆన్‌లైన్‌ డిగ్రీ

Sunday 2nd February 2020

దేశంలోని 100 అగ్ర విద్యాసంస్థల్లో అమలు త్వరలో నూతన విద్యా విధానం ప్రారంభం విద్యారంగానికి రూ.99,300 కోట్లు నిధులు  నైపుణ్యాభివృద్ధికి మరో రూ.3000 కోట్లు   విదేశీ విద్యార్థులకు ఇండ్‌-సాట్‌ పరీక్ష, ఉపకార వేతనాలు యువ ఇంజినీర్లకు ఇంటర్న్‌షిప్‌, విద్యా‍ర్థుల్లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట జాతీయ పోలీస్‌, ఫోరెన్సిక్‌ వర్సిటీల ఏర్పాటు బడ్జెట్‌లో ప్రకటించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ: త్వరలో ప్రారంభించనున్న నూతన విద్యావిధానంలోని పలు అంశాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం పార్లమెంటులో ప్రకటించారు. దానిప్రకారం.. ఉన్నతవిద్యలో

Most from this category