News


పొదుపు ఖాతాలపై వడ్డీకి కత్తెర

Thursday 10th October 2019
news_main1570679153.png-28791

- పావు శాతం తగ్గించిన ఎస్‌బీఐ
- ఇకపై 3.25 శాతమే
- రూ. 1 లక్ష లోపు బ్యాలెన్స్‌కు వర్తింపు
- నవంబర్ 1 నుంచి అమల్లోకి
- రుణాలపైనా వడ్డీ రేటు స్వల్పంగా తగ్గింపు

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పొదుపు ఖాతా డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లకు మరింత కత్తెర వేసింది. రూ. 1 లక్ష లోపు సేవింగ్స్ అకౌంట్స్ డిపాజిట్లపై వడ్డీ రేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటిదాకా 3.50 శాతంగా ఉన్న రేటు ఇకపై 3.25 శాతానికి తగ్గనుంది. నవంబర్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. వ్యవస్థలో తగినంత ద్రవ్య లభ్యత ఉన్నందున సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్‌పై రేటును (రూ. 1 లక్ష దాకా బ్యాలెన్స్‌) సవరిస్తున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. ఏడాది నుంచి రెండేళ్ల లోపు కాల వ్యవధి గల టర్మ్ డిపాజిట్లు, బల్క్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు, 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఇది అక్టోబర్ 10 నుంచి అమల్లోకి వస్తుంది. 

రుణాలపై 0.10 శాతం తగ్గింపు..
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణాలపై వడ్డీ రేటును (ఎంసీఎల్‌ఆర్‌)ను స్వల్పంగా 0.10 శాతం మేర తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా రుణాలపై రేటు తగ్గించడం వరుసగా ఇది ఆరోసారి. ఏడాది కాలవ్యవధి ఎంసీఎల్‌ఆర్‌ ఇకపై 8.15 శాతం కాకుండా 8.05 శాతంగా ఉండనుంది. ఈ తగ్గింపు అక్టోబర్ 10 నుంచి అమల్లోకి వస్తుంది. "పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకుని వివిధ విభాగాల ఖాతాదారులందరికీ ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో ఎంసీఎల్‌ఆర్‌ను 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నాం" అని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. సేవింగ్స్‌ డిపాజిట్లపై వడ్డీ రేటులో పావు శాతం కోత పెట్టిన ఎస్‌బీఐ.. రుణాలపై వడ్డీ రేటును మాత్రం 0.10 శాతం మాత్రమే తగ్గించడం గమనార్హం. వృద్ధికి ఊతమిచ్చే దిశగా తక్కువ వడ్డీ రేట్లకే ప్రజలకు రుణాలు అందాలన్న లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్‌ కీలక పాలసీ రేట్లను (రెపో రేటు) తగ్గిస్తూ వస్తోంది. అయినప్పటికీ బ్యాంకుల స్థాయిలో ఈ ప్రయోజనాలు ఖాతాదారులకు అందడం లేదు. ఆర్‌బీఐ ఈ ఏడాది వరుసగా అయిదు సార్లు రెపో రేటును తగ్గించడంతో ఇది ప్రస్తుతం దశాబ్దపు కనిష్ట స్థాయి 5.15 శాతానికి చేరింది. కానీ బ్యాంకుల స్థాయిలో మాత్రం ఆ మేరకు రుణాలపై వడ్డీ రేటు తగ్గడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 



You may be interested

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Thursday 10th October 2019

గత ట్రేడింగ్‌ సెషన్లో పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ స్టాక్‌ సూచీలు...గురువారం గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 120 పాయింట్ల నష్టంతో 38,055 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 33 .పాయింట్ల తగ్గుదలతో 11,280 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. యస్‌బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌ షేర్లు 2 శాతం వరకూ నష్టాలతో ప్రారంభమయ్యాయి. భారతి ఎయిర్‌టెల్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 5 శాతం జంప్‌చేసి రూ. 380 వద్దకు చేరింది.

లార్జ్‌ క్యాప్స్‌లో ఇవి చాలా చౌక!

Wednesday 9th October 2019

లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో వోలటాలిటీ అన్నది మిగిలిన ‍స్టాక్స్‌తో పోలిస్తే కొంత తక్కువ. రిస్క్‌ కొంచెం తక్కువ ఉండాలనుకునే వారు, మార్కెట్‌ ర్యాలీలో ముందు లాభాలు గడించాలనుకునే వారికి లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ అనుకూలం. ప్రస్తుత కరెక్షన్‌ నేపథ్యంలో ఈ లార్జ్‌క్యాప్‌ విభాగంలో ఆకర్షణీయమైన స్టాక్స్‌ ఎంచుకుని ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా తర్వాతి బుల్‌ ర్యాలీలో లాభాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. గత ఐదు సంవత్సరాల సగటు పీఈతో పోల్చి చూసినప్పుడు ప్రస్తుత

Most from this category