News


మందగమనాన్ని ఎదుర్కొనే సత్తా ఉంది

Saturday 21st December 2019
news_main1576898171.png-30341

  • ఎకానమీ మళ్లీ అధిక వృద్ధి బాట పడుతుంది
  • కార్పొరేట్లు పెట్టుబడులు పెట్టాలి
  • సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలి
  • జీడీపీ వృద్ధికి ఊతమివ్వాలి
  • ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు .. ప్రస్తుత మందగమనం నుంచి బైటపడే సత్తా ఉందని, మళ్లీ అధిక వృద్ధి బాట పట్టగలదని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి ఊతమిచ్చేలా పెట్టుబడులకు సంబంధించి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటూ కార్పొరేట్లకు పిలుపునిచ్చారు. పరిశ్రమల సమాఖ్య అసోచాం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. వ్యాపారాల నిర్వహణ సులభతరం చేసేందుకు, కార్పొరేట్లకు తోడ్పాటునిచ్చేందుకు తీసుకున్న చర్యలను పునరుద్ఘాటించారు. సహేతుకమైన కారణాలతో నిజాయితీగా నిర్ణయాలు తీసుకున్న పక్షంలో కార్పొరేట్లపై ఎలాంటి చర్యలు ఉండబోవని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై రూ. 100 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు, గ్రామీణ ఎకానమీని అభివృద్ధి చేసేందుకు మరో రూ. 25 లక్షల కోట్లు వ్యయం చేయనున్నట్లు మోదీ చెప్పారు. దీంతో 2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా మారడం సాధ్యమేనని ఆయన తెలిపారు.

నాకు అంతా తెలుసు...
"ప్రస్తుత ఆర్థిక మందగమనంపై జరుగుతున్న చర్చల గురించి నాకు అంతా తెలుసు. అయితే, ప్రతికూల వ్యాఖ్యల గురించి నేనేమీ మాట్లాడబోను. కేవలం సానుకూలాంశాల గురించే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాను" అని ప్రధాని చెప్పారు. కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలోనూ ఆర్థిక వృద్ధి ఒక క్వార్టర్‌లో 3.5 శాతానికి పడిపోయిందని గుర్తు చేశారు. పైగా అప్పట్లో ద్రవ్యోల్బణం ఏకంగా 9.4 శాతంగాను, ద్రవ్యలోటు 5.6 శాతానికి పెరిగిపోయి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మోదీ హయాంలో జీడీపీ వృద్ధి వరుసగా ఆరు త్రైమాసికాలుగా క్షీణిస్తూ వస్తోంది. వినియోగం పడిపోయి.. తయారీ రంగం మందగమనంలోకి జారుకోవడంతో ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఏకంగా ఆరేళ్ల కనిష్టమైన 4.5 శాతానికి క్షీణించింది. ఈ అంశాలను ప్రస్తావిస్తూ.. "అధిక వృద్ధి సాధించే క్రమంలో హెచ్చుతగ్గులు చోటుచేసుకోవడం గతంలోనూ జరిగింది. అయితే, భారత దేశానికి  ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుంచి బైటపడే సత్తా ఉంది" అని మోదీ పేర్కొన్నారు.  

130 కోట్ల భారతీయులకు ఏజంట్లం..
వ్యాపారాల నిర్వహణ సులభతరంగా ఉన్న దేశాల జాబితాలో మూడేళ్ల వ్యవధిలోనే భారత్‌ 142వ స్థానం నుంచి ఏకంగా 63వ స్థానానికి చేరిందని మోదీ చెప్పారు. గడిచిన మూడేళ్లుగా నిరంతరం మెరుగుపడుతున్న టాప్‌ 10 దేశాల్లో ఒకటిగా ఉంటోందన్నారు. "ఇదేమీ..  ఆరోపణలు, ప్రజాగ్రహాలు ఎదుర్కొనకుండానే సాధ్యపడలేదు. మమ్మల్ని కార్పొరేట్‌ ఏజంట్లంటూ ఆరోపించారు. కానీ మేం 130 కోట్ల మంది భారతీయులకు ఏజంట్లము" అని ప్రధాని పేర్కొన్నారు. కంపెనీల చట్టంలోని చాలా మటుకు నిబంధనలను క్రిమినల్‌ చర్యల పరిధి నుంచి తప్పించామని, మరిన్ని సవరణలు తేబోతున్నామని ఆయన వివరించారు. ఇక, విఫలమైన సంస్థలు బైటపడేందుకు దివాలా కోడ్‌ ద్వారా వెసులుబాటు లభిస్తోందని చెప్పారు.  ఇవన్నీ కూడా కార్పొరేట్‌ సంస్థలను, వాటి పెట్టుబడులను కాపాడటానికి ఉపయోగపడతాయన్నారు. వ్యవస్థలో బలహీనతలను చాలా మటుకు అధిగమించామని తెలిపారు. ఇక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం, పెట్టుబడులు పెట్టడం మొదలైనవి బ్యాంకింగ్, కార్పొరేట్‌ వర్గాల వంతని ప్రధాని చెప్పారు. అయితే, ఈ క్రమంలో కార్మికుల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.  
 



You may be interested

స్పెక్ట్రం వేలానికి లైన్ క్లియర్‌

Saturday 21st December 2019

మార్చి-ఏప్రిల్‌లో నిర్వహణ రూ. 5.22 లక్షల కోట్ల రిజర్వ్ ధర డీసీసీ ఆమోదముద్ర న్యూఢిల్లీ: దాదాపు రూ. 5.22 లక్షల కోట్ల రిజర్వ్ ధరతో స్పెక్ట్రం వేలం ప్రణాళిక ఖరారైెంది. డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) శుక్రవారం దీనికి ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం 22 సర్కిళ్లలో 8,300 మెగాహెట్జ్ స్పెక్ట్రంను మార్చి-ఏప్రిల్‌లో వేలం వేయనున్నారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సుల మేరకు డీసీసీ ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసినట్లు టెలికం

యస్‌ బ్యాంకు గమనం ఎటు?

Friday 20th December 2019

గురువారం 7 శాతం వరకు లాభపడిన యస్‌ బ్యాంకు, శుక్రవారం కూడా తన ర్యాలీని కొనసాగించింది. మరో 3 శాతం లాభపడి రూ.51.35 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఒక దశలో కొనుగోళ్ల మద్దతుతో రూ.53.50 వరకు పెరిగింది. టెక్నికల్‌గా ఈ స్టాక్‌కు తక్షణ నిరోధం రూ.57 వద్ద ఉందని, దీన్ని అధిగమిస్తే తదుపరి రూ.62.-67 శ్రేణి వరకు వెళుతుందని, ఎగువవైపున 7-26 శాతం ర్యాలీకి అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.   యస్‌ బ్యాంకు

Most from this category