News


వ్యాపార నిర్వహణకు సౌకర్యంగా ఉండాలి

Friday 8th November 2019
news_main1573185673.png-29434

-ఉచిత తాయిలాలు కాదు
-ప్రధాని నరేంద్ర మోదీ

ధర్మశాల (హిమాచల్‌ప్రదేశ్‌): ఉచిత తాయిలాలకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. పారదర్శకమైన, సులభతర వ్యాపార నిర్వహణకు అనుగుణంగా నిబంధనలు ఉండాలేకానీ, ఉచిత విద్యుత్తు, చౌకగా భూమి, పన్ను రాయితీలు కాదన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణకు ధర్మశాలలో ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సును ప్రధాని మోదీ గురువారం ప్రారంభించి మాట్లాడారు. 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల (రూ.350 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న లక్ష్యంలో అన్ని రాష్ట్రాలు, జిల్లాల పాత్ర ఉంటుందన్నారు. ‘‘పరిశ్రమలు పారదర్శకత, స్వచ్ఛమైన వ్యవస్థను ఇష్టపడతాయి. అనవసర నిబంధనలు, అనవసర ప్రభుత్వ జోక్యం పరిశ్రమల వృద్ధికి విఘాతం కలిగిస్తుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రాలు గతంలో పెట్టుబడుల ఆకర్షణకు ఎన్నో రాయితీలు ఇచ్చేవి. ఒక రాష్ట్రం పన్నులను మాఫీ చేస్తే, మరో రాష్ట్రం ఉచిత విద్యుత్‌ ఆఫర్‌ చేసేది. రాష్ట్రాల నుంచి మెరుగైన ‍ప్రోత్సాహకాలను ఆశిస్తూ ఇన్వెస్టర్లు సైతం తమ నిర్ణయాలను వాయిదా వేసుకునే వారు. అయితే గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఈ పరిస్థితి గణనీయంగా మారినందుకు సంతోషిస్తున్నా. ప్రోత్సాహకాలిచ్చే విషయంలో పోటీ అన్నది అటు రాష్ట్రాలకు, ఇటు పారిశ్రామికవేత్తలకు ప్రయోజనకరం కాదని రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకుంటున్నాయి. పెట్టుబడులను ఆకర్షించాలంటే తగిన వ్యవస్థలతోపాటు ఇన్స్‌పెక్టర్‌ రాజ్‌ను లేకుండా చేసి, పర్మిట్ల వ్యవస్థను లేకుండా చేయాలి’’ అని ప్రధాని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు నేడు ఈ దిశగానే పనిచేస్తున్నాయని, వ్యవస్థలను సులభంగా మార్చడంతోపాటు చట్టాల సవరణ, అనవసర చట్టాలను తొలగిస్తున్నట్టు చెప్పారు. పర్యాటకం, ఫార్మా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు హిమాచల్‌ప్రదేశ్‌కు ఎన్నో సామర్థ్యాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, సీఎం జైరామ్‌ఠాకూర్‌ తదితరులు హాజరయ్యారు. 

 You may be interested

భారత్‌ అవుట్‌లుక్‌ తగ్గించిన మూడీస్‌

Friday 8th November 2019

భారత క్రెడిట్‌ రేటింగ్స్‌ అవుట్‌లుక్‌ను నెగిటివ్‌కి తగ్గిస్తున్నట్లు ప్రముఖ రేటింగ్‌ ఏజన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ ప్రకటించింది. ఇలా రేటింగ్‌ నెగిటివ్‌గా మార్చడం డౌన్‌గ్రేడ్‌కు తొలి మెట్టుగా భావిస్తుంటారు. ఎకానమీలో ఆర్థిక మందగమన భయాలు పెరుగుతున్న తరుణంలో మూడీస్‌ ఈ ప్రకటన చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెటరీ లోటు జీడీపీలో 3.7 శాతానికి చేరుతుందని మూడీస్‌ అంచనా వేసింది. ఇది ప్రభుత్వ అంచనా 3.3 శాతం కన్నా అధికం.

మార్కెట్లోకి మెర్సిడెజ్‌ బెంజ్‌ వీ-క్లాస్‌ ఎలైట్‌

Friday 8th November 2019

ధర రూ. 1.10 కోట్లు  11 సెకన్లలో సున్నా నుంచి 100కి.మీ వేగం చెన్నై: జర్మనీకి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ మెర్సిడెస్‌ బెంజ్‌.. కొత్త మల్టీ-పర్పస్‌ వెహికిల్‌ ‘వీ–క్లాస్ ఎలైట్’ను గురువారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీ–క్లాస్ ఎక్స్‌ప్రెషన్, వీ–క్లాస్ ఎక్స్‌క్లూజివ్‌ కార్లకు అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌గా విడుదలైన ఈ విలాసవంతమైన కారు ధర రూ. 1.10 కోట్లు. భారత్‌ స్టేజ్‌–6 నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఈ కారులో 2.0-లీటర్‌ డీజిల్‌

Most from this category