News


అదుపులో ధరలు... పరిశ్రమల పరుగు!

Thursday 13th June 2019
news_main1560406985.png-26266

 • అదుపులో ధరలు... పరిశ్రమల పరుగు!
 • ఊరటనిచ్చిన ఆర్థిక గణాంకాలు
 • ఏప్రిల్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 3.4 శాతం
 • ఆరు నెలల గరిష్ట స్థాయి
 • నిరాశలోనే తయారీ, క్యాపిటల్‌ గూడ్స్‌ 
 • మేలో 3.05 శాతంగా రిటైల్‌ ధరల స్పీడ్‌
 • 7 నెలల గరిష్టమైనా నిర్దేశిత స్థాయిలోనే!

న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగానికి సంబంధించి అలాగే రిటైల్‌ ధరల పరిస్థితికి సంబంధించి బుధవారం కేంద్రం విడుదల చేసిన గణాంకాలు కొంత ఊరట కల్పించాయి. ఏప్రిల్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 3.4 శాతంగా నమోదయ్యింది. ఇది ఆరు నెలల గరిష్ట స్థాయి. అయితే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో మెజారిటీ వెయిటేజ్‌ ఉన్న  తయారీ రంగం దీనితోపాటు కీలకమైన క్యాపిటల్‌ గూడ్స్‌ ఉత్పత్తి పరిస్థితి చూస్తే... ఆర్థిక వ్యవస్థలో మందగమన జాడలు స్పష్టంగా కనిపిస్తుండడం గమనార్హం.  ఇక మేలో 3.05 శాతంగా రిటైల్‌ ధరల స్పీడ్‌ నమోదయ్యింది. నిజానికి గడచిన ఏడు నెలల కాలంలో ఈ స్థాయి భారీ ధరల స్పీడ్‌ నమోదుకాకపోయినా, ఆర్‌బీఐ నిర్దేశిత 4 శాతం (ప్లస్‌ 2 లేదా మైనస్‌ 2 శాతాలతో) లోపే ఉండడం గమనార్హం. 
మైనింగ్‌, విద్యుత్‌ వెలుగులు...
ఏప్రిల్‌ 2018లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 4.5 శాతంగా నమోదయ్యింది. అటు తర్వాత 2018 అక్టోబర్‌లో 8.4 శాతంగా భారీ వృద్ధిని నమోదు చేసుకుంది. నవంబర్‌ (0.2 శాతం), డిసెంబర్‌ (2.5 శాతం), జనవరి (1.6 శాతం), ఫిబ్రవరి (0.1 శాతం), మార్చి (0.4 శాతం)ల్లో పారిశ్రామిక వృద్ధి నిరాశపరిచింది. తరుత 2019 ఏప్రిల్‌లోనే కొంత ఊరటనిచ్చే ఫలితాన్ని దేశ పారిశ్రామిక రంగం చూడగలిగింది. మైనింగ్‌, విద్యుత్‌ రంగాలు ఇందుకు ప్రధాన కారణం. కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన వివిధ రంగాల పనితీరును క్లుప్లంగా పరిశీలిస్తే...
మైనింగ్‌: ఈ రంగం 5.1 శాతం ఉత్పత్తి నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే నెలలో ఈ విభాగం వృద్ధి రేటు 3.8 శాతం. 
విద్యుత్‌: ఈ రంగంలో కూడా ఉత్పత్తి వృద్ధి రేటు 2.1 శాతం నుంచి 6 శాతానికి ఎగసింది. 
తయారీ: మొత్తం సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగం మాత్రం మందగమనంలో ఉండడం ఇక్కడ గమనార్హం. ఈ విభాగంలో వృద్ది రేటు 4.9 శాతం (2018 ఏప్రిల్‌) నుంచి 2.8 శాతానికి పడిపోయింది. తయారీ రంగంలోని మొత్తం 23 గ్రూపుల్లో 14 గ్రూపులే సానుకూల ఫలితాలను నమోదు చేసుకున్నాయి. 
క్యాపిటల్‌ గూడ్స్‌: డిమాండ్‌ను ప్రతిబింబించే ఈ భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి విభాగంలో కూడా నిరాశ నెలకొంది. ఉత్పిత్తి 9.8 శాతం నుంచి 2.5 శాతానికి పడిపోయింది. 
దీనితోపాటు మౌలిక, నిర్మాణ, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌, నాన్‌ డ్యూరబుల్స్‌ రంగాలూ మందగమనంలోనే ఉన్నాయి. 


వేగం పుంజుకుంటున్న ధరల స్పీడ్‌
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రసుతం 5.75 శాతం) నిర్ణయానికి ప్రాతిపదికగా తీసుకునే వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం మే నెల్లో కట్టడిలోనే ఉంది. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం- మే  నెల్లో ఈ రేటు 3.05 శాతం పెరిగింది. అంటే 2018 మే నెల వస్తువుల రిటైల్‌ బాస్కెట్‌ ధర, 2019 మే నెలలో 3.05 శాతం పెరిగిందన్నమాట. 2 శాతం అటు ఇటుగా (మైనస్‌ లేదా ప్లస్‌)తో 4 శాతంగా ఉండాలన్నది ఆర్‌బీఐ విధానం. దీని ప్రకారం, రిటైల్‌ ద్రవ్యో‍ల్బణం కట్టడిలోనే ఉందని పేర్కొనవచ్చు. అయితే జనవరి నుంచీ రిటైల్‌ ధరల స్పీడ్‌ పెరుగుతుండడం ఇక్కడ గమనార్హం. జనవరిలో 1.97 శాతంగా ఉన్న రిటైల్‌ ధరల స్పీడ్‌, ఫిబ్రవరిలో 2.57 శాతానికి చేరింది. మార్చి, ఏప్రిల్‌లో వరుసగా 2.86 శాతం, 2.99 శాతంగా నమోదయ్యాయి. ఇక మే నెల్లో ఈ రేటు ఏకంగా 3 శాతం దాటడం గమనార్హం. సూచీలోని ఐదు ప్రధాన విభాగాలనూ వేర్వేరుగా చూస్తే...

 • ఆహారం, పానీయాల విభాగంలో  ధరల స్పీడ్‌ 2.03 శాతంగా నమోదయ్యింది. 
 •  పాన్‌, పొగాకు ఇతర మత్తు ప్రేరిత ఉత్పత్తుల ధరల స్పీడ్‌ 3.93 శాతంగా ఉంది. 
 • దుస్తులు, పాదరక్షల విభాగంలో ధరల స్పీడ్‌ 1.80 శాతంగా నమోదయ్యింది.
 • గృహ రంగానికి సంబంధించి ద్రవ్యోల్బణం 4.82 శాతంగా ఉంది. 
 • ఫ్యూయల్‌, లైట్‌ విభాగంలో రేటు 2.48 శాతం

ఆహారం, పానీయాల విభాగం చూస్తే...
ఒక్క పండ్ల ధరలు మాత్రం 2018 మేతో పోల్చి 2019 మేలో -5.17 శాతం తగ్గాయి. మాంసం చేపల ధరలు 8.12 శాతం పెరిగాయి. కూరగాయల విషయంలో ధరల స్పీడ్‌ 5.46 శాతంగా ఉంది. ఆల్కాహాలేతర పానీయాల ధరలు 3.16 శాతం ఎగశాయి. తృణ ధాన్యాలు (1.24 శాతం), గుడ్లు (1.8 శాతం), ఆయిల్‌ అండ్‌ ఫ్యాట్స్‌ (0.91  శాతం), పప్పు దినుసులు, సంబంధిత ఉత్పత్తులు (2.13 శాతం), చక్కెర సంబంధిత ఉత్పత్తులు (0.27 శాతం), సుగంధ ద్రవ్యాలు (1.23 శాతం), ప్రెపేర్డ్‌ మీల్స్‌ (2.03 శాతం) విషయంలో ధరల స్పీడ్‌ కొంత నెమ్మదిగానే ఉంది. You may be interested

సుప్రీం కోర్ట్‌లో సత్వర విచారణ పిటీషన్‌

Thursday 13th June 2019

దాఖలు చేసిన ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ సెలవుల అనంతరం విచారిస్తామన్న వెకేషన్‌ బెంచ్‌ న్యూఢిల్లీ: ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌) కంపెనీకి  సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఈ కంపెనీలో రూ.98,000 కోట్ల మేర అవకతవకలు జరిగాయంటూ సుప్రీం కోర్ట్‌లో పిటీషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. కేవలం రూ.3,000తో నాలుగు ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్లు కొనుగోలు చేసిన పాలు విక్రయదారొకరు ఈ పిటిషన్‌ను దాఖలు చేశాడని ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌ తరపున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది ఏ.ఎమ్‌. సింఘ్వి పేర్కొన్నారు.

పరీక్ష పాసైతేనే కంపెనీకి డైరెక్టర్‌

Thursday 13th June 2019

మోదీ సర్కారు యోచన కార్పొరేట్‌ మోసాలకు చెక్‌ పెట్టే లక్ష్యం అనుభవజ్ఞులకు మినహాయింపు న్యూఢిల్లీ: కార్పొరేట్‌ పరిపాలనను పారదర్శకంగా మార్చేందుకు, కార్పొరేట్‌ కంపెనీల్లో అక్రమాలు, మోసాలకు చెక్‌ పెట్టేందుకు నరేంద్ర మోదీ సర్కారు త్వరలోనే చర్యలు చేపట్టనుంది. దేశ కార్పొరేట్‌ రంగంలో గతేడాది ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ రుణ చెల్లింపుల్లో విఫలం కావడం లిక్విడిటీని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ గ్రూపు ప్రమోటర్ల మోసాలు ఒక్కొక్కటీ దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వస్తున్నాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును వజ్రాల వ్యాపారి

Most from this category