News


సావరిన్‌ బాండ్ల జారీపై ప్రభుత్వంతో చర్చిస్తాం!

Tuesday 9th July 2019
news_main1562652370.png-26919

- ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌
- ఆర్థికమంత్రితో భేటీ

న్యూఢిల్లీ: విదేశీ సావరిన్‌ బాండ్ల జారీపై ప్రభుత్వంపై సెంట్రల్‌ బ్యాంక్‌ చర్చిస్తుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ సోమవారంనాడు పేర్కొన్నారు. 2019-20 వార్షిక బడ్జెట్‌ ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.4.48 లక్షల కోట్లు మార్కెట్‌ నుంచి సమీకరించుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2018-18లో ఈ మొత్తం 4.22 లక్షల కోట్లు. స్థూలంగా రుణ సమీకరణ గణాంకాలను చూస్తే, ఈ మొత్తాన్ని బడ్జెట్‌ రూ.5.71 లక్షల కోట్ల నుంచి రూ.7.1 లక్షల కోట్లకు పెంచింది. తన మొత్తం రుణాల్లో కొంత భాగాన్ని విదేశీ మార్కెట్ల ద్వారా విదేశీ కరెన్సీలో సమకూర్చుకోవాలని బడ్జెట్‌ నిర్దేశించింది.  స్థూల దేశీయోత్పిత్తి (జీడీపీ) స్థాయితో పోల్చిచూస్తే,  ప్రభుత్వ (సావరిన్‌) విదేశీ రుణ భారం అతితక్కువగా ఉన్న ప్రపంచ దేశాల్లో భారత్‌ ఒకటని పేర్కొన్న ఆర్థికమంత్రి, ఈ వ్యత్యాసం ఐదు శాతం కన్నా తక్కువగా ఉందని ఆర్థికమంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. కాగా  విదేశీ మార్కెట్‌ నుంచి నిధులు సమీకరణపై త్వరలో ఒక బ్లూప్రింట్‌ను విడుదల చేస్తామని ఫైనాన్స్‌ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ తెలిపారు. ఎంత మొత్తాన్ని విదేశీ మార్కెట్‌ నుంచి సమీకరించాలన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. ఇప్పటివరకూ ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ ఇన్వెస్టర్లకు అనుమతి ఉంది. విదేశీ మార్కెట్లో మాత్రం బాండ్ల జారీ జరగలేదు. అయితే త్వరలో బాండ్ల జారీ ఉంటుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.  ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును పూడ్చుకోడానికి దోహదపడే చర్యల్లో విదేశీ సావరిన్‌ బాండ్ల జారీ ఒకటి. అయితే ఈ బాండ్లను ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ జారీ చేస్తుంది. బడ్జెట్‌ నేపథ్యంలో శక్తికాంతదాస్‌ సోమవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యాంశాలు చూస్తే...

- స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటు శాతాన్ని 3.4 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గించడం హర్షణీయం. ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెరగడానికీ దోహదపడే చర్య ఇది. 
- ద్రవ్యలోటు విషయంలో ప్రభుత్వం జాగరూకతతో వ్యవహరిస్తోంది. 4.5 శాతం నుంచి 3.3 శాతానికి కట్టడి చేస్తున్న విషయం గమనార్హం. 
- ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వంలో పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది. పరస్పర చర్చలు జరుపుతుంది. 
- ప్రభుత్వంలో, అలాగే ఆర్‌బీఐలో సమగ్ర చర్చ తర్వాతే గృహ రుణ కంపెనీ (హెచ్‌ఎఫ్‌సీ) నియంత్రణ బాధ్యతలను సెంట్రల్‌ బ్యాంక్‌కు ఇవ్వడం జరిగింది. ఈ అదనపు బాధ్యతలను సమర్ధవంతంగా ఆర్‌బీఐ విశ్వాసం నిర్వహిస్తుందన్న విశ్వాసం నాకు ఉంది. నియంత్రణ బాధ్యతలను ఆర్‌బీఐ నిర్వహిస్తే, పర్యవేక్షణా బాధ్యతలను నాబార్డ్‌ (వ్యయసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంక్‌) చేస్తుంది.
- బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- రెపో (ప్రస్తుతం 5.75 శాతం)  తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు త్వరితగతిన వినియోగదారుకు మళ్లిస్తారని భావిస్తున్నాం. జూన్‌ 6 నాటికి ఆర్‌బీఐ 50 బేసిస్‌ పాయింట్లు (నాటి నిర్ణయం కూడా కలుపుకుంటే 0.75 శాతం) ఆర్‌బీఐ తగ్గిస్తే, బ్యాంకులు కేవలం 21 బేసిస్‌ పాయింట్ల ప్రయోజనాన్నే గృహ, వాహన, వ్యక్తిగత రుణ గ్రహీతలకు అందించాయి. 
- నేషనల్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల పనితీరును ఆర్‌బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. 
- పెట్రో ధరల పెంపు ప్రభావం ద్రవ్యో‍ల్బణంపై ప్రభావం చూపడానికి ఇంకా సమయం పడుతుంది. 
- ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం రూ.70,000 కోట్ల తాజా మూలధన సమకూర్పు సానుకూల చర్య.

సావరిన్‌ బాండ్ల ప్రయోజనం!
సావరిన్‌ బాండ్ల జారీ ద్వారా  సమీకరించిన రుణాలను సావరిన్‌ రుణం లేదా ప్రభుత్వ రుణం లేదా పబ్లిక్‌ డెట్‌ లేదా నేషనల్‌ డెట్‌ అంటారు. ఈ ప్రక్రియలో విదేశీ కరెన్సీ రూపంలో బాండ్ల జారీ చేసి, వాటిని విదేశీ ఇన్వెస్టర్లకు విక్రయించి ప్రభుత్వ నిధులు సమీకరిస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక మందగమన పరిస్థితుల్లో అమెరికాసహా పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు తక్కువ స్థాయి వడ్డీరేట్ల వ్యవస్థకు మళ్లుతున్నాయి. ఇదే తరుణంలో అంతర్జాతీయంగా రుణ సమీకరణ వల్ల కేంద్రానికి కూడా తక్కువ వడ్డీ రేట్లకు రుణ సౌలభ్యం కలుగుతుంది. అలాగే కరెన్సీ విలువల ఒడిదుడుకుల సవాళ్లను కూడా అధిగమించడానికి ఈ చర్య దోహదపడుతుంది. దేశీయ మార్కెట్ల ప్రభుత్వ సెక్యూరిటీలకు కూడా దీనివల్ల డిమాండ్‌ పెరుగుతుంది. అంతర్గత రుణ సమీకరణకు కేంద్రానికి ఉన్న వనరులు తగ్గుతున్నట్లు తాజా నిర్ణయం సంకేతాలు పంపుతుండడం ఇక్కడ మరో విషయం.

భారత్‌ సావరిన్‌ రుణం ఎంత?
భారత స్థూల దేశీయోత్పత్తి విలువ డాలర్లలో చూస్తే, ప్రస్తుతం దాదాపు 2.5 ట్రిలియన్‌ డాలర్లు (2,500 బిలియన్‌ డాలర్లు)గా ఉంది. ఇక ఇప్పుడు భారత్‌ సావరిన్‌ రుణం విషయానికి వస్తే, 2019 మార్చి నాటికి ఈ మొత్తం 104 బిలియన్‌ డాలర్లు. అంటే భారత్‌ స్థూల దేశీయోత్పత్తితో పోల్చిచూస్తే, 5 శాతంకన్నా తక్కువగా ఈ రుణ భారం ఉంది. భారత్‌ మొత్తం (కేంద్రం, రాష్ట్రాలు, ప్రైవేటు) విదేశీ రుణ భారం 2019 మార్చి నాటికి 543 బిలియన్‌ డాలర్లుగా ఉంది (జీడీపీతో పోల్చితే 19.7 శాతం). దీనితో పోల్చితే భారత్‌ సావరిన్‌ రుణం ఐదవవంతన్నమాట. నిజానికి మోదీ ప్రభుత్వ నేతృత్వంలో జీడీపీలో భారత్‌ సావరిన్‌ రుణ నిష్పత్తి తగ్గుతూ వస్తోంది. విదేశీ రుణాలవైపు భారత్‌ ప్రభుత్వం అంతగా దృష్టి పెట్టకపోవడం దీనికి కారణం.  ప్రభుత్వ రుణం మొత్తాన్ని జీడీపీతో పోల్చిచూస్తే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఇటీవలి విశ్లేషణ ఒకటి పేర్కొంది.  ప్రపంచంలో బ్రెజిల్‌ తర్వాత ఇంత తీవ్ర స్థాయిలో రుణం-జీడీపీ నిష్పత్తి ఉన్న దేశం భారత్‌ కావడం గమనార్హం. 2014 నుంచీ మోదీ ప్రభుత్వ హయాంలో భారత్‌ మొత్తం రుణ భారం దాదాపు 50 శాతం పెరిగింది.You may be interested

వచ్చే నెలలో మొబైల్ ట్రాకింగ్‌ వ్యవస్థ

Tuesday 9th July 2019

న్యూఢిల్లీ: దొంగతనానికి గురైన లేదా పోయిన మొబైల్ ఫోన్స్‌ ఆనవాళ్లు పట్టుకునేందుకు ఉపయోగపడే ట్రాకింగ్ విధానాన్ని ఆగస్టులో అందుబాటులోకి తేవాలని టెలికం శాఖ యోచిస్తోంది. మొబైల్ ఫోన్ నుంచి సిమ్‌ కార్డు తీసేసినా, ఐఎంఈఐ నంబరును మార్చేసినా కూడా ట్రాకింగ్ చేయగలిగేంత శక్తివంతంగా ఈ విధానం ఉంటుందని అధికారి ఒకరు తెలిపారు. సెంటర్‌ ఫర్ డెవలప్‌మెంట్‌ ఆఫ్ టెలిమాటిక్స్‌ (సీ-డాట్‌) ఇప్పటికే ఈ టెక్నాలజీని సిద్ధం చేసిందని, ఆగస్టు నుంచి

హీరో వాహనాలు మరింత ప్రియం

Tuesday 9th July 2019

 ఒక శాతం వరకు ధరల పెంపు న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తన మోటార్ సైకిళ్ళు, స్కూటర్ల ధరలను ఒక శాతం వరకు పెంచినట్లు సోమవారం ప్రకటించింది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాల మోడల్‌ ఆధారంగా ఒక శాతం వరకు పెంపు అమల్లోకి వచ్చినట్లు ప్రకటించిన సంస్థ.. ఏ మోడల్‌కు ఎంత పెంపు ఉందనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. 

Most from this category