STOCKS

News


మారని రేట్లు.. వృద్ధికి చర్యలు

Friday 7th February 2020
news_main1581043180.png-31575

  • మారని రేట్లు.. వృద్ధికి చర్యలు
  • రియల్టీ, ఆటో, బ్యాంకింగ్‌ రంగాలకు ప్రోత్సాహకాలు
  • రెపో, రివర్స్‌ రెపో రేట్లలో యథాతథ స్థితికి మొగ్గు
  • కొనసాగిన ద్రవ్యోల్బణ ఆందోళనలు
  • సర్దుబాటు విధానం కొనసాగింపు
  • అవసరమైతే రేట్ల కోత ఉంటుందన్న సంకేతాలు

(అప్‌డేటెడ్‌...)
ముంబై: వడ్డీరేట్లను ప్రభావితం చేసే కీలకమైన రెపో రేటు, రివర్స్‌ రెపో రేట్లను ఎలాంటి మార్పులూ చేయకుండా యథాతథంగా ఉంచుతున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. అయితే 11 ఏళ్ల కనిష్టానికి చేరిన ఆర్థిక వృద్ధికి మద్దతుగా బ్యాంకింగ్‌, రియల్టీ, ఎంఎస్‌ఎంఈ, ఆటో రంగాలకు ప్రోత్సాహక చర్యలతో ముందుకు వచ్చింది. అయితే, తన సర్దుబాటు విధానాన్ని మార్చుకోకపోవటం ద్వారా అవసరమైతే మున్ముందు రేట్ల కోతకు అవకాశం ఉంటుందని ఆర్‌బీఐ సంకేతమిచ్చింది. రుణ రేట్లను తగ్గించేందుకు వీలుగా బ్యాంకులకు రూ.లక్ష కోట్లను సమకూర్చనున్నట్టు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రకటించారు.


రుణాలకు మంచి రోజులు...
- సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ), ఆటోమొబైల్‌, గృహ రుణ వితరణ పెంపునకు వీలుగా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌) నిబంధనలను ఆర్‌బీఐ సడలించింది. దీంతో ఈ రంగాలకు అదనంగా ఇచ్చే రుణాల విషయంలో బ్యాంకులు 4 శాతాన్ని సీఆర్‌ఆర్‌ రూపంలో పక్కన పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇది ఈ ఏడాది జూలై వరకు అమల్లో ఉంటుంది. ఇది బ్యాంకులకు సానుకూలం. ఎందుకంటే ఇలా మిగిలిన నిధులను రుణాలివ్వటానికి వినియోగించవచ్చు.
- దేశాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఎంఎస్‌ఎంఈ రంగానికి మద్దతుగా.. డిఫాల్టయిన రుణాలను 2021 మార్చి 31 వరకు పునరుద్ధరిస్తున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. జీఎస్టీ నమోదిత ఎంఎస్‌ఎంఈలకే ఇది వర్తిస్తుంది. జీడీపీలో ఎంఎస్‌ఎంఈ రంగం వాటా 28 శాతం. ఎగుమతుల్లో వాటా 40 శాతం. అంతేకాదు 11 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం కూడా. 
- వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ రంగానికి పెద్ద ఉపశమనం కల్పించింది. ప్రమోటర్ల చేతుల్లో లేని అంశాలతో వాణిజ్య రియల్టీ ప్రాజెక్టుల కార్యకలాపాల ఆరంభం ఆలస్యమైతే, వాటి రుణ గడువును ఏడాది పాటు పొడిగించేందుకు అనుమతించింది. అంటే ప్రాజెక్టులు ఆలస్యమైనా ఆయా రుణాలను డౌన్‌గ్రేడ్‌ చేయరు. ఇన్‌ఫ్రాయేతర రంగాల రుణాల మాదిరే వీటినీ పరిగణిస్తారు. రియల్‌ ఎస్టేట్‌ రంగం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఇది అదనపు మద్దతునిస్తుందని ఆర్‌బీఐ ఎంపీసీ పేర్కొంది.


మా వద్ద ఎన్నో ఆయుధాలు...
‘‘సెంట్రల్‌ బ్యాంకు వద్ద ఎన్నో సాధనాలున్నాయని గుర్తుంచుకోవాలి. వృద్ధి మందగమనం రూపంలో భారత ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైతే వాటిని సంధిస్తాం’’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. తద్వారా 2008 ఆర్థిక మాంద్యం తర్వాత అమెరికాలో మాదిరే అసాధారణ పరికరాలను వినియోగించేందుకు ఆర్‌బీఐ వెనుకాడదన్న సంకేతాన్ని ఇచ్చారు. రేట్లలో మార్పులు చేయకపోవడం అంచనాలకు అనుగుణంగానే ఉందన్నారు. కరోనా వైరస్‌ కారణంగా అంతర్జాతీయ వృద్ధి తగ్గే రిస్క్‌ పెరిగిందన్నారు. పూర్తి స్థాయి ప్రభావంపై ప్రస్తుతానికి అనిశ్చితి ఉందని చెప్పారు. 

ద్రవ్యోల్బణం పెరుగుదల భయాలు...
రిటైల్‌ ద్రవ్యోల్బణం జనవరి-మార్చి క్వార్టర్‌లో 6.5 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ ఎంపీసీ అంచనా వేసింది. జనవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఐదేళ్ల గరిష్ట స్థాయిలో 7.35 శాతంగా నమోదు కావటం తెలిసిందే. వచ్చే ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌కు ద్రవ్యోల్బణం 3.8-4 శాతం మధ్య ఉంటుందని గతంలో చేసిన అంచనాలను సవరిస్తూ 5- 5.4 శాతానికి పెంచింది. ప్రధానంగా కూరగాయలు, పప్పుధాన్యాల ధరలు పెరగొచ్చని అభిప్రాయపడింది. 

వృద్ధి రేటు 5 శాతం
2019-20లో వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. 2020-21లో 6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2020-21 తొలి ఆరు నెలల్లో 5.9- 6.3 శాతం మధ్య ఉంటుందన్న లోగడ అంచనాలను.. 5.5- 6 శాతానికి తగ్గించింది. ‘‘ఆర్థిక కార్యకలాపాలిప్పటికీ స్తబ్దుగానే ఉన్నాయి. ఇటీవల కనిపించిన కొన్ని సంకేతాలు పూర్తి స్థాయిలో పుంజుకోవాల్సి ఉంది’’ అని ఆర్‌బీఐ ఎంపీసీ పేర్కొంది. అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం ఎగుమతులు, పెట్టుబడులను పెంచొచ్చని అభిప్రాయపడింది.

ఇతర ముఖ్యాంశాలు
- రేట్ల యథాతథ స్థితికి ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆధ్వర్యంలోని ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా (ఆరుగురు సభ్యులు) ఓటు వేసింది. ఆర్‌బీఐ ఎంపీసీ గత భేటీలోనూ (2019 డిసెంబర్‌) రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. 
- ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం బడ్జెట్లో 3.8 శాతానికి సవరించగా, దీనివల్ల మార్కెట్‌ నుంచి ప్రభుత్వ రుణ సమీకరణ పెరగదని ఆర్‌బీఐ పేర్కొంది.
- చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీసీ అభిప్రాయపడింది. దీంతో రానున్న త్రైమాసికంలో (ఏప్రిల్‌ నుంచి ఆరంభమయ్యే) వడ్డీ రేట్లను కేంద్రం తగ్గించే అవకాశాలున్నాయి.
- హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (హెచ్‌ఎఫ్‌సీ) నియంత్రణకు సంబంధించి సవరించిన మార్గద్శకాలను త్వరలోనే విడుదల చేస్తారు. అప్పటి వరకు నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు ఆదేశాలు, మార్గదర్శకాలే కొనసాగుతాయి. హెచ్‌ఎఫ్‌సీల నియంత్రణ గతేడాది ఆగస్ట్‌ 9 నుంచి ఆర్‌బీఐకి బదిలీ కావటం తెలిసిందే. 
- కరోనా వైరస్‌ పర్యాటకుల రాకపై, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపిస్తుందని ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది.
- బ్యాంకుల్లో డిపాజిట్‌ బీమాను ఒక డిపాజిట్‌దారునికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం బ్యాంకు బ్యాలన్స్‌ షీట్లపై పెద్దగా ప్రభావం చూపదని పేర్కొంది. ప్రతి రూ.100పై బీమా ప్రీమియం 10పైసల నుంచి 12 పైసలకు పెరుగుతుందని, ఈ ప్రభావం స్వల్పమేనని పేర్కొంది.
- బడ్జెట్లో ప్రభుత్వం వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లలో చేసిన మార్పులు డిమాండ్‌కు మద్దతునిస్తాయని అంచనా వేసింది.
- తదుపరి ఆర్‌బీఐ ఎంపీసీ విధాన ప్రకటన ఏప్రిల్‌ 3న వెలువడనుంది. You may be interested

ఐటీ శాఖ నుంచి ఆదాయ పన్ను కాలిక్యులేటర్‌

Friday 7th February 2020

న్యూఢిల్లీ: మినహాయింపులుండని కొత్త ట్యాక్స్ విధానంలోకి మారదల్చుకునేవారు ఎంత మేర ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకోవడానికి వీలు కల్పిస్తూ ఇన్‌కం ట్యాక్స్ శాఖ ప్రత్యేకంగా ఈ-కాలిక్యులేటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో పాత, కొత్త విధానాలను పోల్చి చూసుకుని, ఏది ప్రయోజనకరంగా ఉంటుందో ఒక అంచనాకు రావచ్చు. రిటర్నులను దాఖలు చేసేందుకు ఉద్దేశించిన https://www.incometaxindiaefiling.gov.in లో ఈ కాలిక్యులేటర్‌ అందుబాటులో ఉంటుంది. తమ ఆదాయాలు, మినహాయింపులు, డిడక్షన్స్‌ మొదలైన వివరాలన్నీ

లక్ష్మీ విలాస్‌ బ్యాంకు ఎవరి చేతికి వెళుతుందో.?

Friday 7th February 2020

లక్ష్మీ విలాస్‌ బ్యాంకు, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ విలీన ప్రతిపాదనకు ఆర్‌బీఐ నో చెప్పిన నాలుగు నెలల తర్వాత.. దక్షిణాదికి చెందిన ఈ బ్యాంకులో పెట్టుబడులకు మూడు సంస్థలు ముందుకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఓ జాతీయ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ‘‘ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌, డీబీఎస్‌ ఇండియా లక్ష్మీ విలాస్‌ బ్యాంకులో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు రేసులో ఉన్నాయి. ఆర్‌బీఐ నిబంధనలకు

Most from this category