News


పండుగ చేస్కో!

Saturday 5th October 2019
news_main1570249404.png-28726

  • రెపో, రివర్స్‌ రెపో రేట్లు పావు శాతం తగ్గింపు
  • గృహ, వాహణ, వ్యక్తిగత రుణాలు చౌక
  • వృద్ధి రేటును భారీగా తగ్గించిన ఆర్‌బీఐ ఎంపీసీ
  • 2019-20కు 6.1 శాతంగా అంచనా

ముంబై: దేశ వృద్ధికి ఆర్‌బీఐ విధానం మద్దతుగా నిలుస్తుందన్న మాటను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ మరో విడత ఆచరణలో చూపించారు. ఇందుకు గాను కీలక రేట్లకు మరో పావు శాతం కోత పెట్టారు. రెపో, రివర్స్‌ రెపోలను 25 బేసిస్‌ పాయింట్ల చొప్పున (0.25శాతం) తగ్గించారు. తద్వారా రుణాల రేట్లను మరి కాస్త దిగొచ్చేలా చేశారు. ఎందుకంటే గతంలో మాదిరిగా బ్యాంకులు ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించకుండా ఉండేందుకు అవకాశం లేదు. అక్టోబర్‌ 1 నుంచి ఆర్‌బీఐ పేర్కొన్న ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేట్లలో (ముఖ్యంగా రేపోరేటు) ఏదో ఒకదాని ఆధారంగా బ్యాంకులు రిటైల్‌ రుణాలపై రేట్లను అమలు చేయాల్సి ఉంటుంది. నిదానించిన ఆర్థిక వృద్ధికి మద్దతుగా గడిచిన ఏడాది కాలంలో ఆర్‌బీఐ రేట్లను తగ్గిస్తూనే వస్తోంది. 2019 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఐదు పర్యాయాలు నికరంగా 135 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించడం జరిగింది. కాకపోతే బ్యాంకులే ఈ ప్రయోజాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురాలేదు. ఇప్పటి వరకు రుణాలపై అవి తగ్గించింది 50 బేసిస్‌ పాయింట్లకు మించలేదు. ఇకపై ఆర్‌బీఐ విధాన నిర్ణయాలకు అనుగుణంగా బ్యాంకులు కూడా రిటైల్‌ రుణ రేట్లను వెంటనే సవరించాల్సి వస్తుంది. దీనివల్ల వాహన, గృహ, వ్యక్తిగత, ఇతర రుణాలు చౌకగా మారనున్నాయి. తక్కువ వడ్డీ రేట్లతో కార్పొరేట్‌ కంపెనీలపైనా భారం తగ్గుతుంది. దీంతో అవి మరింత పెట్టుబడులతో ముందుకు రాగలవు. రుణాల వినియోగం పెరిగితే, అది వ్యవస్థలో డిమాండ్‌ పెరిగేందుకు దారితీస్తుంది. ముఖ్యంగా పండుగల సమయంలో ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు వినియోగదారులకు ఉత్సాహాన్నిచ్చేదే.
ముఖ్యాంశాలు... 
- ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో ఉన్న ఆరుగురు సభ్యులు కూడా పాలసీ రేట్ల తగ్గింపునకు ఏకగ్రీవంగా ఓటు వేశారు. ఐదుగురు సభ్యులు పావు శాతం తగ్గింపునకు అనుకూలంగా ఓటు వేయగా, రవీంద్ర ధోలాకియా మాత్రం 0.40 బేసిస్‌ పాయింట్ల తగ్గింపునకు అనుకూలంగా ఓటేశారు.  
- ఆర్‌బీఐ తన ప్రస్తుత విధానమైన సర్దుబాటు ధోరణిని అలాగే కొనసాగించింది. అంటే పరిస్థితులకు అనుగుణంగా రేట్ల తగ్గింపు నిర్ణయాలకు ఇది వీలు కల్పిస్తుంది. 
- తాజా రేట్ల తగ్గింపు తర్వాత రెపో రేటు 5.15 శాతానికి, రివర్స్‌ రెపో రేటు 4.9 శాతానికి చేరాయి. రెపో రేటు అంటే... బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటు. రివర్స్‌ రెపో రేటు అంటే బ్యాంకులు తన వద్ద ఉంచిన నిధులపై ఆర్‌బీఐ చెల్లించే వడ్డీ రేటు. రెపో రేటు 2010 తర్వాత కనిష్ట స్థాయికి చేరింది. 2010 మార్చిలో రెపో రేటు 5 శాతంగా ఉంది. గత ఎంపీసీ సమీక్షలో 35 బేసిస్‌ పాయింట్లు మేర రెపోను తగ్గించారు. ఈ విడత పావు శాతం నుంచి అర శాతం వరకు రేట్ల తగ్గింపు ఉంటుందని విశ్లేషకులు, నిపుణులు అంచనా వేశారు.
- క్రితం నాలుగు ఎంపీసీ భేటీల్లో వడ్డీ రేట్లను 110 బేసిస్‌ పాయింట్లు తగ్గించినప్పటికీ, వినియోగదారులకు రుణాలపై ఈ ప్రయోజన బదలాయింపు అస్థిరంగా, అసంపూర్ణంగా ఉందని ఆర్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది.
- మన కేంద్ర బ్యాంకు మాత్రమే కాదు.. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో పడిపోతున్న వృద్ధిని నిలువరించేందుకు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు (అమెరికా ఫెడ్‌ సహా) వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
- 2019-20 రెండో త్రైమాసికానికి ద్రవ్యోల్బణం అంచనాలను 3.6 శాతానికి ఆర్‌బీఐ ఎంపీసీ సవరించింది. అలాగే, ద్వితీయ ఆరు నెలల కాలంలో ద్రవ్యోల్బణం 3.5-3.7శాతం మధ్య ఉంటుందన్న గత అంచనాలనే కొనసాగించింది. ద్రవ్యోల్బణాన్ని మధ్య కాలానికి 4 శాతానికే పరిమితం చేయాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం. కనుక తాజా అంచనాలు ఈ పరిధిలోనే ఉండడం గమనార్హం. 2020-21 ప్రారంభం వరకు నిర్దేశిత లక్ష్య పరిధిలోనే ద్రవ్యోల్బణం ఉంటుందన్న నమ్మకంతో ఆర్‌బీఐ ఉంది. 
- వ్యవసాయ రంగ పరిస్థితులు ఆశాజనకంగా మారాయని ఎంపీసీ పేర్కొంది. తిరిగి ఉపాధి కల్పనకు, ఆదాయానికి, దేశీయ వృద్ధికి సానుకూలించనున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. 
వృద్ధి రేటు అంచనాలు తగ్గింపు 

దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గించి ఆర్‌బీఐ షాక్‌కు గురిచేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.1 శాతంగా ఉంటుందని తాజాగా పేర్కొంది. గత పాలసీ సమావేశంలో వృద్ధి రేటును ఆర్‌బీఐ 6.9 శాతంగా అంచనా వేయడం గమనార్హం. అయితే, జూన్‌ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయి ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరుతుందని ఆర్‌బీఐ కూడా ఊహించలేదు. ఈ విషయాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ దాస్‌ ఓ సందర్భంలో పేర్కొన్నారు కూడా. వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుని, అంతర్జాతీయ మందగమన పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తన అంచనాలను 6.1 శాతానికి కుదించింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు పుంజుకోకపోవడంతోపాటు, ఎగుమతులు తగ్గడమే తన అంచనాల తగ్గింపునకు కారణాలుగా పేర్కొంది. కాకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ అర్ధభాగం.. అక్టోబర్‌ నుంచి వృద్ధి రికవరీ అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు (ఎఫ్‌డీఐ విధానాల్లో సంస్కరణలు, ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధన సాయం, కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, ఎగుమతులు, రియల్టీ రంగాలకు ప్రోత్సాహకాలు), పాలసీ రేట్ల తగ్గింపు, బేస్‌ ప్రభావం అనుకూలంగా ఉండడం వల్ల ప్రతీ క్వార్టర్‌కు ఇకపై వృద్ధి పురోగమిస్తుందని ఆర్‌బీఐ ఎంపీసీ అభిప్రాయపడింది. 2019-20 మొదటి క్వార్టర్‌లో జీడీపీ వృద్ధి రేటు 5 శాతంగా నమోదవగా, రెండో త్రైమాసికంలో (సెప్టెంబర్‌) 5.3 శాతం, మూడో త్రైమాసికం (డిసెంబర్‌)లో 6.6 శాతం, నాలుగో త్రైమాసికంలో (2020 మార్చి) 7.2 శాతానికి వృద్ధి రేటు రికవరీ అవుతుందన్న అంచనాలను వ్యక్తపరిచింది. ఇక, 2020-21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7 శాతానికి పుంజుకుంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. సమీప కాలంలో మాత్రం ఆర్థిక వ్యవస్థకు ఎన్నో సవాళ్లు ఉన్నాయని పేర్కొంది. వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం, బ్రెగ్జిట్‌కు సంబంధించి తగిన డీల్‌ లేకపోవడం లేదా కఠినంగా ఉండడం, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరతలు వృద్ధి తగ్గేందుకు ఉన్న రిస్క్‌లుగా అంచనా వేసింది. కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం దీర్ఘకాల సగటుకు సమీపానికి చేరినప్పటికీ కార్పొరేట్‌ రంగం పెట్టుబడులను ఇంకా పెంచలేదని, ఇటీవలి కాలంలో తీసుకున్న చర్యలతో పెట్టుబడులు ఊపందుకుంటాయన్న ఆశాభావాన్ని ఆర్‌బీఐ వ్యక్తం చేసింది. You may be interested

చిన్న నగరాల నుంచీ ఆన్‌‘లైన్‌’

Saturday 5th October 2019

ఈ-కామర్స్‌ అంటే నమ్మకం పెరిగింది అన్ని పిన్‌ కోడ్స్‌కు సరుకుల సరఫరా అమెజాన్‌ డైరెక్టర్‌ షాలిని పుచ్చలపల్లి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ‘నా చిన్నప్పుడు ఊర్లో వస్తువులు ఏవీ దొరికేవి కావు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవి కావు. వచ్చినా ఖరీదెక్కువగా ఉండేవి. ఇప్పుడు ఈ-కామర్స్‌ రాకతో ప్రపంచంలో లభించే ఏ వస్తువైనా ఆర్డరు చేయవచ్చు’ అని అమెజాన్‌ ఇండియా కేటగిరీ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ షాలిని పుచ్చలపల్లి అన్నారు. అమెజాన్‌ ఫెస్టివ్‌ యాత్రలో భాగంగా

యస్‌ బ్యాంకు ర్యాలీ కొనసాగుతుందా..?

Saturday 5th October 2019

యస్‌ బ్యాంకు షేరు శుక్రవారం కూడా స్వల్పంగా లాభపడింది. అంతకుముందు రోజు 30 శాతానికి పైగా పెరిగిన విషయం తెలిసిందే. బ్యాంకు ఫైనాన్షియల్స్‌ చాలా బలంగా ఉన్నాయని, ఆర్‌బీఐ నిర్దేశిత పరిమితుల కంటే లిక్విడిటీ (బ్యాంకు వద్ద నిధులు) ఎక్కువే ఉందంటూ యస్‌ బ్యాంకు ఎండీ, సీఈవో రవనీత్‌ గిల్‌ మీడియాకు ఇచ్చిన స్పష్టత స్టాక్‌ ర్యాలీకి తోడ్పడింది. మరి ఈ ర్యాలీ ఇక ముందు కూడా కొనసాగుతుందా..? అన్న

Most from this category