News


ఈ సారికి... ఏమీ లేదు!!

Friday 6th December 2019
news_main1575602308.png-30080

(అప్‌డేటెడ్‌...)

  • రెపో, రివర్స్‌ రెపో రేట్లు యథాతథం
  • తాత్కాలిక విరామం ఇవ్వాలని ఆర్‌బీఐ నిర్ణయం
  • ద్రవ్యోల్బణం పెరుగుదలపై ఆందోళనలే కారణం
  • జీడీపీ వృద్ధి అంచనాలు 5 శాతానికి తగ్గింపు
  • మున్ముందు పరిస్థితులు మెరుగుపడితే చూస్తాం
  • మందగమనం పోయిందని ఇప్పుడే చెప్పలేం
  • రిజర్వు బ్యాంకు గవర్నరు శక్తికాంత దాస్‌ వ్యాఖ్యలు

ముంబై: విశ్లేషకులు, బ్యాంకర్ల అంచనాలకు భిన్నంగా ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరోసారి రేట్ల కోతకు వెళ్లకుండా యథాతథ పరిస్థితికి మొగ్గు చూపించింది. ప్రస్తుతమున్న రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ) 5.15 శాతం, రివర్స్‌ రెపో రేటు (బ్యాంకుల నుంచి ఆర్‌బీఐ తీసుకునే నిధులపై చెల్లించే వడ్డీ) 4.90 శాతాన్ని అలాగే కొనసాగించాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అధ్యక్షతన సమావేశమైన ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. దేశ జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 4.5 శాతానికి పడిపోవడంతో (ఆరేళ్ల కనిష్ట స్థాయి), ఒకవైపు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆర్‌బీఐ ఎంపీసీ.. కనీసం పావు శాతం వరకు రెపో రేటును తగ్గిస్తుందని విశ్లేషకులు, నిపుణులు ఊహించారు. అయితే, ద్రవ్యోల్బణం పెరిగిపోతుండడం, రానున్న కాలంలో మరింతగా  పెరిగే అవకాశాలుండటం రేట్ల కోతకు వెళ్లకుండా అడ్డుపడ్డాయి. అంతేకాదు, తాజా స్థూల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ఎంపీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) జీడీపీ వృద్ధి అంచనాలను ఏకంగా 5 శాతానికి తగ్గించేసింది. అక్టోబర్‌ నాటి సమీక్షలో వృద్ధి అంచనాను 6.1 శాతంగా పేర్కొన్నటం ఇక్కడ ప్రస్తావనార్హం. తన సర్దుబాటు విధానాన్ని ఎంపీసీ కొనసాగించడం ఒక్కటే తాజా భేటీలో సానుకూలత. వృద్ధికి మద్దతుగా అవసరమైనంత వరకు ఇదే విధానం కొనసాగుతుందని పేర్కొంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటే తదుపరి సమావేశాల్లో రేట్ల కోతకు అవకాశం ఉంటుందని సంకేతం పంపింది. అంటే రానున్న కాలంలో ద్రవ్యోల్బణమే వడ్డీ రేట్లను నిర్ణయించగలదని స్పష్టం చేసింది. అంతేకాదు, తదుపరి రేట్ల కోత రానున్న బడ్జెట్‌పైనా ఆధారపడి ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ చెప్పారు.


తాత్కాలికమే: దాస్‌
‘‘వడ్డీ రేట్ల సవరణకు విరామం తాత్కాలికమే. ఈ ఏడాది ఐదు సమీక్షా సమావేశాల్లో (ఫిబ్రవరి నుంచి అక్టోబర్‌ వరకు) 135 బేసిస్‌ పాయింట్ల వరకు (1.35 శాతం) రేట్లను తగ్గించాం. దీని ప్రభావం ఏ మేర ఉందో చూడాలంటే కొంత సమయం ఇవ్వాలి. బ్యాంకులు ఇంత వరకు 44 బేసిస్‌ పాయింట్ల వరకే రేట్ల తగ్గింపును రుణ గ్రహీతలకు బదిలీ చేశాయి. రేట్ల తగ్గింపు ప్రయోజనం గరిష్ట స్థాయిలో నెరవేరాల్సి ఉంది. అప్పుడే తదుపరి రేట్ల కోతకు అవకాశం ఉంటుంది. వృద్ధి- ద్రవ్యోల్బణానికి సంబంధించిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి విరామమే మేలని ఎంపీసీ భావించింది. ఒక యంత్రం మాదిరిగా ప్రతీసారి ఆర్‌బీఐ రేట్లను తగ్గించదు. గడిచిన కొన్ని నెలల్లో వృద్ధికి ఊతమిచ్చేందుకు ఆర్‌బీఐ, ప్రభుత్వం సంయుక్తంగా కొన్ని చర్యలు తీసుకున్నాయి. వాటి ప్రభావాన్ని చూశాక గానీ రేట్లపై నిర్ణయం తీసుకోలేం. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్నట్లు ముందస్తు సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ, వాటి స్థిరత్వంపై ఇప్పుడే నిర్ణయానికి రావడం తొందరపాటే. అక్టోబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.6 శాతంగా నమోదవడం అంచనాల కంటే చాలా ఎక్కువ. ఇటీవలి ప్రభుత్వ చర్యలతో సెంటిమెంట్‌ మెరుగుపడి డిమాండ్‌ ఊపందుకుంటుంది. ప్రభుత్వం ద్రవ్యలోటుపై ఆందోళన చెందడం లేదు. వృద్ధి కోసం ప్రభుత్వం, ఆర్‌బీఐ సమన్వయంతో పనిచేస్తాయి’’ అని ఎంపీసీ భేటీ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శక్తికాంతదాస్‌ వ్యాఖ్యానించారు. 

ముఖ్యాంశాలు
- తాజా సమీక్ష తర్వాత రెపో రేటు 5.15 శాతం, రివర్స్‌రెపో రేటు 4.90 శాతంగా ఉంటాయి.. 
- 2019-20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలు 6.1 శాతం నుంచి 5 శాతానికి సవరించారు. 
- డిసెంబర్‌ 3 నాటికి విదేశీ మారక నిల్వలు 451.7 బిలియన్‌ డాలర్లకు చేరాయి.
- తదుపరి ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ ఫిబ్రవరి 4-6 తేదీల మధ్య జరగనుంది.

ద్రవ్యోల్బణం పెరగొచ్చు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.7-5.1 శాతం మధ్య.. 2020-21 మొదటి అర్ధభాగంలో 4.3-4.8 శాతం మధ్య ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. ‘‘నాలుగో త్రైమాసికంలో (వచ్చే జనవరి-మార్చి) ఆహార ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లో ఉండొచ్చు. రానున్న నెలల్లో ఇది నియంత్రణలోకి రావడం అన్నది ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంది. కూరగాయల ధరల పెరుగుదల ఒకటి, రెండు నెలలు కొనసాగొచ్చు. ఖరీఫ్‌లో ఆలస్యంగా వేసిన పంటల దిగుబడులు, సరఫరా దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో 2020 ఫిబ్రవరికి కూరగాయల ధరలు శాంతించొచ్చు. టెలికం చార్జీలు పెంచడం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుంది. అయితే, టోకు ద్రవ్యోల్బణం మాత్రం ప్రస్తుత స్థాయి 4 శాతం లోపే కొనసాగొచ్చు’’ అని ఆర్‌బీఐ ఎంపీసీ పేర్కొంది. అక్టోబర్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.6 శాతానికి చేరిన విషయం తెలిసిందే. 4 శాతానికి కట్టడి చేయాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం.


వృద్ధి 5 శాతం
2019-20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 5 శాతం మేరే ఉండొచ్చని ఎంపీసీ పేర్కొంది. 6.1 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాలను సవరించింది. 2019-20 రెండో అర్ధభాగంలో (2019 అక్టోబర్‌- 2020 మార్చి) వృద్ధి రేటు 4.9-5.5 శాతం మధ్య.. 2020-21 మొదటి ఆరు నెలల కాలంలో 5.9-6.3 శాతం మధ్య ఉంటుందని ఆర్‌బీఐ ఎంపీసీ అంచనా వేసింది. రానున్న కేంద్ర బడ్జెట్‌ సందర్భంగా ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు, వృద్ధిపై వాటి ప్రభావం విషయమై స్పష్టత వస్తుందని పేర్కొంది. డిమాండ్‌ పరిస్థితులు బలహీనంగా ఉన్నట్టు ఎన్నో అంశాలు స్పష్టం చేస్తున్నాయని అభిప్రాయపడింది. You may be interested

మైనింగ్‌కు అది వర్తించదు

Friday 6th December 2019

15 శాతం కార్పొరేట్ ట్యాక్స్‌పై ఆర్థిక మంత్రి స్పష్టీకరణ న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటు చేసే తయారీ రంగ కంపెనీలకు 15 శాతం కార్పొరేట్ ట్యాక్స్‌ విధించే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టతనిచ్చారు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌, మైనింగ్‌, పుస్తకాల ముద్రణకు ఇది వర్తించదని పేర్కొన్నారు. ట్యాక్సేషన్ చట్ట సవరణ బిల్లు 2019 ప్రకారం నెగటివ్ లిస్టులో ఇవి ఉన్నట్లు గురువారం రాజ్యసభకు ఆమె తెలిపారు. వీటిని తయారీ

యస్‌ బ్యాంకుకు షాకిచ్చిన మూడిస్‌

Thursday 5th December 2019

కీలకమైన నిధుల సమీకరణకు ముందు యస్‌ బ్యాంకు రేటింగ్‌ను డౌన్‌ గ్రేడ్‌ చేస్తూ అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ‘మూడిస్‌’ షాకింగ్‌ నిర్ణయాన్ని వెలువరించింది. యస్‌బ్యాంకు దీర్ఘకాలిక ఫారీన్‌ కరెన్సీ ఇష్యూయర్‌ రేటింగ్‌ను బీఏ3 నుంచి బీ2కు తగ్గించడంతోపాటు, నెగెటివ్‌ అవుట్‌లుక్‌ ఇచ్చింది. వాస్తవానికి యస్‌ బ్యాంకు రేటింగ్‌ తగ్గించే అవకాశం ఉందని గత నెల 6వ తేదీనే మూడిస్‌ హెచ్చరించడం గమనార్హం. ఆస్తుల నాణ్యత ఆందోళనలు, బ్యాంకు నిధులు అడుగంటిపోతుండడం

Most from this category