వ్యక్తిగత కారణాలు... ఇక సెలవు!
By Sakshi

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా డాక్టర్ విరాల్ ఆచార్య రాజీనామా చేశారు. తన మూడు సంవత్సరాల పదవీకాలం ఇంకో ఆరు నెలలు ఉండగానే ఆయన తన బాధ్యతలను విరమించారు. వ్యక్తిగత కారణాలే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు. ఇదే కారణంగా చూపుతూ ఆర్బీఐ గవర్నర్‌గా రాజీనామా చేసిన ఉర్జిత్పటేల్ తర్వాత, బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఉన్నత పదవికి రాజీనామా చేసిన వ్యక్తిగా ఆచార్య ఉండడం గమనార్హం. ప్రభుత్వంతో పొసగకే ఆయన రాజీనామా చేశారన్న పుకార్లు షికారు చేయడం మరో విశేషం. బాధ్యతలు పూర్తవడానికి దాదాపు 9 నెలల ముందే వ్యక్తిగత కారణాలతో అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసినప్పుడూ, ఇదే విధమైన విశ్లేషణలు రావడం గమనార్హం. కాగా, ఉర్జిత్ పటేల్ రాజీనామా నాటినుంచే విరాల్ ఆచార్య కూడా అదే బాటన పయనిస్తారన్న వార్తలు కొనసాగాయి. 45 సంవత్సరాల విరాల్ ఆచార్య, ఆర్బీఐ గవర్నర్లలో అతి చిన్నవారు. మోదీ ప్రభుత్వం రెండవదఫా అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యున్నత స్థాయిలో జరిగిన తొలి రాజీనామా ఇది కావడం మరో విశేషం. ఆర్బీఐ ప్రకటన ఏమి చెప్పిందంటే... కేంద్రం ఏరికోరి... వివాదాల్లో... పాలసీపై విభేదాలు..? రాకేష్ మోహన్ తరువాత... జలాన్ కమిటీ నివేదిక నేపథ్యం...
ఆర్బీఐ సోమవారంనాడు విడుదల చేసిన ప్రకటనను చూస్తే, ‘‘అనివార్యమైన వ్యక్తిగత పర్యవసానాల వల్ల తాను జూలై 23 తర్వాత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా కొనసాగలేనని కొద్ది వారాల క్రితం డాక్టర్ విరాల్ ఆచార్య ఒక లేఖను సమర్పించారు’’ అని ఒక క్లుప్తమైన ప్రకటన వెలువడింది. డాక్టర్ ఆచార్య రాజీనామాతో నూతన నియామకం జరిగేంతవరకూ డిప్యూటీ గవర్నర్లుగా ఇక ముగ్గురు- ఎన్ఎస్ విశ్వనాథన్, బీపీ కనుంగో, ఎంకే జైన్లు ఉంటారు.
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ విరాల్ ఆచార్యను ఆర్బీఐ డిప్యూటీ గరవ్నర్‌గా 2016 డిసెంబర్లో నియమించింది. 2017 జనవరిలో ఆయన మూడేళ్ల తన బాధ్యతలను చేపట్టారు. అప్పట్లో ఆయన న్యూయార్క్ యూనివర్శిటీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు, డిపాజిట్లు, విత్‌డ్రాయెల్స్‌కు సంబంధించి నిబంధనలనూ తరచూ మార్చుతూ ఆర్బీఐ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన డిప్యూటీ గవర్నర్ బాధ్యతలను చేపట్టారు. ద్రవఅంశాల విభాగాన్ని ఆయన ఆర్బీఐలో పర్యవేక్షించారు. రాజీనామా అనంతరం విరాల్ ఆచార్య ఏమిచేస్తారన్న అంశంపై ఇంకా స్పష్టత రానున్నప్పటికీ, ఆయన తిరిగి ప్రొఫెసర్‌గానే వెళతారన్న అంచనాలు వెలువడుతున్నాయి.
స్వతంత్ర నిర్ణయాలు, ఆలోచనలు కలిగిన ఆర్థికవేత్తగా విరాల్ ఆచార్య పేరుంది. ఇది ఆయనను పలు దఫాలు వివాదాల్లోకీ నెట్టింది. పలు సందర్భాల్లో ఆయన ప్రత్యక్షంగా కేంద్రంపై, ఆర్థిక మంత్రిత్వశాఖపై తన నిరసన గళం వినిపించారు. ప్రత్యేకించి సెంట్రల్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తి పరిరక్షణకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృషించాయి. అందులో కొన్ని అంశాలు చూస్తే...
- గత ఏడాది అక్టోబర్‌లో ఆయన ఏడీ షరోఫ్ స్మారకోపాన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్ణయ రూపకల్పన దీర్ఘకాలం దృష్టితో కాకుండా, స్వల్పకాల ప్రయోజనాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడుకుని ఉంటోందని పేర్కొన్నారు. పలు అంశాలపై ప్రభుత్వం-ఆర్బీఐ మధ్య ఉన్న విభేదాలను కూడా ఆయన ఈ ప్రసంగంలో పేర్కొన్నారు.
- మరో సందర్భంలో ఆయన మాట్లాడుతూ, ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని తక్కువచేస్తే, అది క్యాపిటల్ మార్కెట్లలో విశ్వాస సంక్షోభాన్ని తీసుకువస్తుందని అన్నారు. అలాగే సెంట్రల్‌బ్యాంక్ సమర్థతపైనా ఆయా అంశాల ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.
- మొండిబకాయిలకు సంబంధించి కొన్ని బ్యాంకులపై ప్రయోగించిన ‘దిద్దుబాటు చర్యల ప్రక్రియ’ (పీసీఏ)ను కూడా ఆయన పలు సందర్భాల్లో గట్టిగా సమర్థించారు.
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఆయన గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి సమీక్షా కమిటీ (ఎంపీసీ) సభ్యునిగా కూడా ఉన్నారు. జూన్‌లో ఆర్బీఐ పాలసీ సమీక్ష సందర్భంగా గవర్నర్ శక్తికాంత్‌దాస్ అభిప్రాయాలతో విరాల్ ఆచార్య కొంత విభేదించినట్లు సంబంధిత మినిట్స్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఆదాయ-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటుపై ఆయన తాజా పాలసీ సమీక్షలో ఆందోళన వెలిబుచ్చారు. గడచిన ఐదు బడ్జెట్లలో మూడుసార్లు ద్రవ్యలోటు కట్టుతప్పిన విషయాన్ని ప్రస్తావించారు. 2013 నుంచీ ఇటు కేంద్రం, అటు రాష్ట్రాల ద్రవ్యలోటు పరిస్థితి దిగజారుతూ వస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
‘ఫారిన్ ట్రైన్డ్’ ఎకనమిస్ట్‌గా ఆర్బీఐలో పనిచేసి బాధ్యతల కాలం పూర్తికాకుండానే తప్పుకున్న రెండవ వ్యక్తి విరాల్ ఆచార్య. ఇంతక్రితం 2009 మేలో అప్పటి డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్ తన బాధ్యతలకు రాజీనామా చేశారు. అప్పట్లో జూలై 23తో ఆయన పదవీకాలం పూర్తికావాల్సి ఉంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద ఉన్న రూ.9.6 లక్షల కోట్ల అదనపు నిధుల్లో కొంత మొత్తాన్ని కేంద్రానికి బదలాయించాలన్న విషయమై ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ఏర్పాటయిన ఆరుగురు సభ్యుల కమిటీ తన నివేదికను మరో నెల రోజుల్లో సమర్పించనున్న నేపథ్యంలో విరాల్ రాజీనామా మరో విశేషం. నిజానికి జూన్ చివరికల్లా కమిటీ నివేదిక సమర్పించాల్సిఉన్నా, అది అసాధ్యమని వార్తలు వస్తున్నాయి. పలు అంశాలపై విభిన్న అభిప్రాయాలు ఉండడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
You may be interested
నో బ్యాక్ డోర్ ఒప్పందానికి సిద్ధం: హువావే
Tuesday 25th June 2019ఇతర ఓఈఎంలు ముందుకు రావాలని పిలుపు భారత్‌లో మరిన్ని పెట్టుబడులకు సిద్ధమని ప్రకటన న్యూఢిల్లీ: భారత ప్రభుత్వంతో ‘నో బ్యాక్ డోర్’ ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామని చైనాకు చెందిన టెలికం ఎక్విప్మెంట్ తయారీ దిగ్గజం హువావే ప్రకటించింది. అలాగే, ఇతర కంపెనీలు కూడా దీన్ని అనుసరించాలని సూచించింది. గూఢచర్యాన్ని నిరుత్సాహపరిచేందుకు ఈ ప్రతిపాదన చేసింది. అమెరికా ప్రభుత్వం హువావే హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సరఫరాలపై నిషేధం విధించిన నేపథ్యంలో మన దేశంలోనూ ఈ
ఎస్బీఐ లైఫ్ షేర్లను విక్రయించనున్న బీఎన్పీ పారిబా
Tuesday 25th June 2019ఫ్రాన్స్ మల్టినేషనల్ బ్యాంక్ బీఎన్పీ పారిబా కార్డిఫ్ 2.5 కోట్ల ఎస్బీఐ లైఫ్ ఇన్య్సూరెన్స్ షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా మంగళవారం, బుధవారం విక్రయించనుంది. గత సెషన్ ధరతో పోలిస్తే 8.5 శాతం రాయితీతో షేర్‌ను రూ.650 వద్ద విక్రయించనున్నారు. ఈ ఆఫర్‌ను జూన్ 25న నాన్ రిటైల్ ఇన్వెస్టర్ల కోసం అందుబాటులో ఉంచగా, జూన్ 26న రిటైల్ ఇన్వెస్టర్ల కోసం అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా రిటైల్ ఇన్వెస్టర్ల కోసం