News


వృద్ధి వేగం మందగమనం!

Saturday 30th November 2019
news_main1575085558.png-29963

  • జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో వృద్ధి 4.5 శాతమే
  • ఆరేళ్లలో ఎన్నడూలేనంత తక్కువ స్థాయి
  • తయారీ, ‍వ్యవసాయం పేలవ పనితీరు
  • నిర్మాణ రంగమూ నిరాశే!
  • వియత్నాంకు ‘వేగవంతమైన వృద్ధి’ హోదా 
  • ఆర్థిక సంవత్సరం ఆరు నెలల వృద్ధి 5 శాతం దిగువకు...

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వృద్ధి తీవ్ర మందగమనంలోకి జారినట్లు తాజా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి గణాంకాలు మరింత స్పష్టం చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్‌- 2020 మార్చి) రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్‌) కేవలం 4.5 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. గడచిన ఆరు సంవత్సరాల్లో వృద్ధి వేగం ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. 2012-13 జనవరి-మార్చి త్రైమాసికంలో 4.3 శాతం వృద్ధి నమోదయ్యింది. 2018-19 రెండవ త్రైమాసికంలో వృద్ధి రేటు 7 శాతం నమోదయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ మధ్య ఈ రేటు 5 శాతం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎస్‌ఎస్‌ఓ) విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
- ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్‌-సెప్టెంబర్‌) వృద్ధి రేటు 4.8 శాతంగా నమోదయ్యింది. 2018-19 ఇదే కాలంలో ఈ రేటు 7.5 శాతంగా ఉంది. 
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా జీడీపీ వృద్ధి రేటు 6.1 శాతం ఉంటుందన్నది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనా. తాజా గణాంకాలు చూస్తే, ఆ స్థాయి వృద్ధి రేటయినా సాధ్యమేనా అన్న సందేహం కలుగుతోంది.
- క్యూ2లో వృద్ధిరేటు కనీసం 4.7 శాతమే ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ ఫిచ్‌ దేశీయ విభాగం ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇటీవలే విశ్లేషించింది. అంతకన్నా తక్కువ రేటు నమోదుకావడం గమనార్హం. 
- 2018-19 మొదటి త్రైమాసికంలో 8 శాతం వృద్ధి రేటు నుంచీ చూస్తే,  వరుసగా ఆరు త్రైమాసికాల నుంచీ భారత్‌ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతోంది. అంటే ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తోంది.  2012 తరువాత ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారి.
- ప్రభుత్వానికి వచ్చే ఆదాయం- చేసే వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటు జీడీపీలో 3.3 శాతం దాటరాదని బడ్జెట్‌ నిర్దేశం. దీనికే కట్టుబడి వ్యయాల కోతకు కేంద్రం సిద్ధమయితే, జీడీపీ వృద్ధి రేటు ఆర్థిక సంవత్సరం మొత్తంగా 5.6 శాతంకూడా దాటదన్నది విశ్లేషణ. 
- ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశం హోదాను గత ఆర్థిక సంవత్సరం (5 శాతం) వరకూ భారత్‌ పొందుతోంది. అయితే ప్రస్తుత జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి  7.3 శాతం వృద్ధి రేటుతో వియత్నాం మొదటిస్థానంలో ఉంది. చైనా వృద్ధి రేటు  6 శాతంగా (27 సంవత్సరాల కనిష్టం) ఉంది. తరువాత వరుసలో ఈజిఫ్ట్‌ (5.6 శాతం), ఇండోనేషియా (5 శాతం)లు ఉన్నాయి. దీనితో క్యూ2కు సంబంధించి ‘వేగవంతమైన వృద్ధి’ హోదాను వియత్నాం దక్కించుకున్నట్లు అయ్యింది. కాగా అమెరికా వృద్ధి రేటు ఈ కాలంలో 2.1 శాతం. 

రంగాల వారీగా...
- జీడీపీలో దాదాపు 16 శాతం వెయిటేజ్‌ ఉన్న తయారీ రంగంలో అసలు వృద్ధిలేకపోగా క్యూ2లో ఒకశాతం క్షీణతను (మైనస్‌) నమోదుచేసుకుంది. 2018 ఇదే కాలంలో ఈ రంగంలో 6.9 శాతం వృద్ధిని సాధించింది. 2019-20 క్యూ1లో కనీసం 0.6 శాతం వృద్ధి నమోదయ్యింది. 
- ఇక వ్యవసాయ రంగం చూసినా 4.9 శాతం వృద్ధి రేటు 2.1 శాతానికి పడిపోయింది. అయితే క్యూ1కన్నా (2 శాతం) ఈ రేటు కొంచెం మెరుగుపడ్డం గమనార్హం. 
- ఇక నిర్మాణ రంగం విషయానికి వస్తే, వృద్ధి రేటు 8.5 శాతం నుంచి 3.3 శాతానికి పడిపోయింది. 
- ఇక మైనింగ్‌ అండ్‌ ‍క్వారీయింగ్‌ విషయానికి వస్తే కొంత బాగుంది. 2018-19 క్యూ2లో వృద్ధిలేకపోగా - 2.2 శాతం క్షీణత నమోదయితే, తాజా గణాంకాల్లో కొద్దిపాటి మెరుగుదలతో 0.1 శాతం వృద్ధిలోకి మళ్లింది. అయితే క్యూ1 కన్నా (2.7 శాతం) వృద్ధి భారీగా పడిపోవడం గమనార్హం. 
- విద్యుత్‌, గ్యాస్‌, నీటి పారుదల ఇతర యుటిలిటీ సర్వీసుల విషయంలో వృద్ధి రేటు 8.7 శాతం నుంచి 3.6 శాతానికి పడిపోయింది.  క్యూ1లో ఈ వృద్ధిరేటు మరింత మెరుగైన స్థితిలో 8.6 శాతంగా ఉంది. 
- వాణిజ్యం, హోటెల్స్‌, రవాణా, కమ్యూనికేషన్లు, సేవల రంగంలో వృద్ధి రేటు 6.9 శాతం నుంచి 4.8 శాతానికి పడిపోయింది. క్యూ1లో ఈ రేటు కొంత మెరుగ్గా 7.1 శాతంగా ఉంది. 
- ఫైనాన్షియల్‌, రియల్టీ, బీమా ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ విషయంలో వృద్ధి రేటు 7 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గింది. ​క్యూ1లో ఈ విభాగంలో వృద్ధి రేటు 5.8 శాతం. 
- ఇక పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, రక్షణ ఇతర సేవల విషయంలో వృద్ధి రేటు కొంత మెరుపడి 8.6 శాతం నుంచి 11.6 శాతానికి చేరింది. 

4.5 శాతం ఎలా అంటే...
2018-19 క్యూ2లో భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ అంచనా (2011-12 బేస్‌ ఇయర్‌గా) రూ.34.43 లక్షల కోట్లు. ఈ విలువ 2019-20 క్యూ2లో రూ.35.99 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వృద్ధి రేటు 4.5 శాతం పెరిగిందన్నమాట. 
--------------
ఆందోళనకరం...
జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతంగా నమోదుకావడం ఆందోళనకరం. ఆమోదనీయంకాని అంశం.  వృద్ధిరేటు 8 నుంచి 9 శాతం మేర వృద్ధి చెందాలని భారత్‌ ఆకాంక్షిస్తోంది. కేవలం ఆర్థిక విధానాల్లో మార్పు వల్ల ఆర్థిక పునరుత్తేజం జరగదు. ముందు వ్యవస్థను భయాందోళనల నుంచి విశ్వాసం వైపునకు నడిపించాలి. అలాంటప్పుడే అధిక వృద్ధి రేటు బాటకు మళ్లుతాం. ఇప్పుడు జరగాల్సిది ఇదే.
- మన్మోహన్‌ సింగ్‌, మాజీ ప్రధాని 
----------
ఆర్థిక మూలాలు పటిష్టం...
భారత్‌ ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయి. 2019-20 మూడవ త్రైమాసికం నుంచీ వృద్ధి పుంజుకుంటుంది. వృద్ధి రేటు 2019-20లో 6.1 శాతం, 2020-21లో 7 శాతం ఉంటుందని తన అక్టోబర్‌ వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పేర్కొనడం ఇక్కడ గమనార్హం. 
- అతనూ చక్రవర్తి, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి
-------
సహకారాత్మక చర్యలు అవసరం
పరిస్థితిని ఎదుర్కొనడానికి కేం‍ద్రం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాల మధ్య సమన్వయ చర్యలు అవసరం. రెపో రేటు కోతలు సకాలంలో బదలాయింపు జరగడం, అదే సమయంలో ప్రభుత్వ వ్యయాల పెరుగుదల వంటి అంశాలు వ్యవస్థలో డిమాండ్‌ మెరుగుదలకు దోహదం చేస్తాయి. వినియోగ డిమాండ్‌, ఎగుమతుల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొనడమే తాజా మందగమనానికి కారణం. పెట్టుబడులూ మరింత పెరగడానికి తగిన చర్యలు అవసరం.
- సునిల్‌ సిన్హా, ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌



You may be interested

పసిడి నగలకు ‘హాల్‌ మార్క్‌’

Saturday 30th November 2019

2021 జనవరి 15 నుంచీ తప్పనిసరి వచ్చే జనవరి 15న నోటిఫికేషన్‌ వ్యాపారులకు ఏడాది పాటు సమయం కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ప్రకటన న్యూఢిల్లీ: దేశంలో బంగారం ఆభరణాలు, బంగారంతో చేసిన కళాకృతులకు హాల్‌ మార్కింగ్‌ ధ్రువీకరణను 2021 జనవరి 15 నుంచి తప్పనిసరి చేయనున్నట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ శుక్రవారం ప్రకటించారు. ‘‘ఇందుకు సంబంధించి రాబోయే జనవరి 15న నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం. ఆభరణాల వ్యాపారులు తమ వద్దనున్న

మార్జిన్లు క్రమంగా పెరుగుతున్నాయ్‌..! 

Saturday 30th November 2019

లాభాల మార్జిన్లను క్రమంగా పెంచుకుంటున్న కంపెనీలు పెట్టుబడులకు మంచి అవకాశాలు అవుతాయా..? బీఎస్‌ఈ 500 సూచీలోని ఏడు కంపెనీలు గత నాలుగు త్రైమాసికాల నుంచి తమ లాభాల మార్జిన్లలో వృద్ధిని చూపిస్తున్నాయి. మరి పెరుగుతున్న మార్జిన్లకు అనుగుణంగా ఈ స్టాక్స్‌ ర్యాలీ చేయాలి కదా..! కానీ, అన్నింటిలోనూ ర్యాలీ కనిపించడం లేదు. వీటిల్లో ర్యాలీకి మంచి అవకాశం ఉందన్నది విశ్లేషకుల అంచనాగా ఉంది.    లాభాల మార్జిన్లను పెంచుకుంటున్న వాటిల్లో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ

Most from this category