News


అంతా వాళ్లే చేశారు..!!

Thursday 17th October 2019
news_main1571283580.png-28932

  • మన్మోహన్‌, రాజన్‌ హయాంలోనే ప్రభుత్వరంగ బ్యాంకులకు దుర్గతి
  • వాటిని బాగుచేయడమే నా ప్రాథమిక కర్తవ్యం
  • కేంద్ర ఆర్థిక మంత్రినిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మాజీ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ హయాంలోనే ప్రభుత్వరంగ బ్యాంకులు దుర్భర పరిస్థితులను చవిచూశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. దెబ్బతిన్న ప్రభుత్వరంగ బ్యాంకులను బాగు చేయడమే తన ప్రాథమిక కర్తవ్యంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. అమెరికాలోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ అండ్‌ పబ్లిక్‌ అఫైర్స్‌లో.. ‘భారత ఆర్థిక వ్యవస్థ: సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై ఆమె మాట్లాడారు. యూపీఏ-2 పాలనలో 2013 సెప్టెంబర్‌ 4 నుంచి 2016 సెప్టెంబర్‌ 4 వరకు ఆర్‌బీఐ గవర్నర్‌గా, 2012 ఆగస్ట్‌ 10 నుంచి 2013లో ఆర్‌బీఐ గవర్నర్‌ అయ్యే నాటి వరకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా రఘురామ్‌రాజన్‌ పనిచేశారు. గత ప్రభుత్వ అసమర్థ విధానాలను మంత్రి సీతారామన్‌ తన ప్రసంగంలో ఎండగట్టారు. ‘‘ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రాణవాయువు అందించడమే భారత ఆర్థిక మంత్రి ప్రాధమిక విధి. ఈ ప్రాణవాయువు అన్నది రాత్రికి రాత్రి రాదు’’ అని మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఇటీవల బ్రౌన్‌ యూనివర్సిటీలో రాజన్‌ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఆర్థిక రంగానికి సంబంధించి చెప్పుకోతగ్గది ఏదీ చేయలేదంటూ విమర్శించారు. ప్రభుత్వం పూర్తిగా కేంద్రీకృతమైందని, ఆర్థిక వృద్ధికి సంబంధించి నాయకత్వానికి స్పష్టమైన విధానం లోపించిందన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎదురైన ప్రశ్నకు నిర్మలా సీతారామన్‌ గట్టిగానే బదులిచ్చారు. 
ఫోన్‌ కాల్స్‌తో రుణాలు...
‘‘ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజన్‌ హయాంలో సన్నిహిత నేతల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌తో రుణాలు మంజూరు చేశారు. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకులు నాటి ఊబి నుంచి బయటకు వచ్చేందుకు నేటికీ ప్రభుత్వం అందించే నిధులపై ఆధారపడుతున్నాయి. ఎంతో ప్రజాస్వామ్యంతో కూడిన నాయకత్వం (మన్మోహన్‌సింగ్‌) కారణంగా భారీ స్థాయి అవినీతి చోటుచేసుకుంది. భారత్‌ వంటి వైవిధ్య దేశానికి గట్టి నాయకత్వం కావాలి. మరీ ప్రజాస్వామ్యంతో కూడిన నాయకత్వం అంటే నాకు భయమే. ఎందుకంటే అవినీతి తాలూకూ దుర్గంధాన్ని అది విడిచి వెళ్లింది. దాన్ని ఈ రోజూకీ శుద్ధి చేస్తున్నాం’’ అంటూ యూపీఏ పాలనను నిర్మలా సీతారామన్‌ విమర్శించారు. రాజన్‌ను తాను ఎగతాళి చేయడం లేదని, విద్యావంతుడైన ఆయన్ను గౌరవిస్తానంటూనే, వాస్తవాలను తెలియజేస్తు‍న్నానని పేర్కొన్నారు. బ్యాంకుల ఆస్తుల నాణ్యతను సమీక్షించినందుకు రాజన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, బ్యాంకులు నేడు ఏ స్థితిలో ఉన్నాయో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్‌పీఏలు రూ.8,06,412 కోట్లుగా ఉన్నాయి. గత మార్చి నాటికి ఉన్న రూ.8,95,601 కోట్లతో పోలిస్తే రూ.89,189 కోట్లు తగ్గాయి. 
అమెరికాతో త్వరలోనే ట్రేడ్‌డీల్‌
భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య చర్యలు చక్కగా కొనసాగుతున్నాయని, అంచనా కంటే ముందుగానే ఇవి ముగుస్తాయని భావిస్తున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. గత నెలలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో న్యూయార్క్‌లో భేటీ సందర్భంగా ఇరు దేశాల మధ్య పరిమిత వాణిజ్య ఒప్పందం కుదురుతుందని భావించగా, కొన్ని విభేదాల వల్ల అది సాధ్యపడలేదు. దీన్ని మంత్రి అంగీకరిస్తూ ఇరు దేశాలూ అభిప్రాయభేదాల పరిష్కారానికి నిబద్ధతతో పనిచేస్తున్నట్టు చెప్పారు. నోబెల్‌ పురస్కారానికి తాజాగా ఎంపికైన ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్‌ ముఖర్జీ.. భారత ఆర్థికరంగ పరిస్థితి ఏమీ బాగాలేదంటూ చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి ప్రశ్న ఎదుర్కొన్నారు. వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టిందని, ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకుల ద్వారా లిక్విడిటీని పెంచే చర్యలను తీసుకున్నట్టు తెలిపారు. You may be interested

అనుకోకుండా .. అలా ఇన్వెస్ట్ చేశా!

Thursday 17th October 2019

స్టార్టప్‌లలో పెట్టుబడులపై రతన్ టాటా ముంబై: కొన్నాళ్లుగా పలు స్టార్టప్‌లలో పెట్టుబడులతో వార్తల్లో నిలుస్తున్న పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్ రతన్ టాటా తన ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పెదవి విప్పారు. అనుకోకుండానే తాను స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టినట్లు వెల్లడించారు. "నేను కొంత అనుకోకుండానే స్టార్టప్‌ ఇన్వెస్టరుగా మారానని చెప్పవచ్చు. టాటా గ్రూప్‌లో కీలక హోదాలో ఉన్నప్పుడు స్టార్టప్ సంస్థలు ఆసక్తికరంగానే అనిపించినప్పటికీ.. వాటిని కాస్త అంటరానివిగానే చూసేవాణ్ని. ఎందుకంటే

ఆటో స్టాక్స్‌ ఆకర్షణీయం: యోగేష్‌ మెహతా

Wednesday 16th October 2019

ఆటో రంగ స్టాక్స్‌ పతనం ఆగినట్టేనని, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్‌ వాహనాలు, ట్రాక్టర్ల కంపెనీల షేర్లు ప్రస్తుత స్థాయి నుంచి దిద్దుబాటుకు చాలా పరిమిత అవకాశాలే ఉన్నాయని ఈల్డ్‌ మ్యాగ్జిమైజర్‌ వ్యవస్థాపకుడు యోగేష్‌ మెహతా పేర్కొన్నారు. వివిధ రంగాలపై ఆయన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.   ఆటోమొబైల్‌ రంగం ప్యాసింజర్‌ వాహనాలు, ద్విచక్ర వాహన కంపెనీల స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవచ్చు. హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఆటో, మారుతి సుజుకీ, ఎస్కార్ట్స్‌, మహీంద్రా అండ్‌

Most from this category