News


అంత డబ్బు ఎలా ఇచ్చేస్తారండీ!

Thursday 29th August 2019
Markets_main1567060819.png-28088

  • కేంద్రానికి ఆర్‌బీఐ అదనపు నిధుల
  • బదలాయింపుపై బ్యాంకింగ్‌ సంఘం విమర్శ
  • ఇది తీవ్ర ఆందోళనకరం
  • ఆర్‌బీఐ కేంద్రానికి బ్రాంచ్‌ ఆఫీస్‌ కారాదు

న్యూఢిల్లీ: కేంద్రానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) భారీ నిధుల బదలాయింపుపై అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆర్‌బీఐ అదనపు నిధుల బదలాయింపును ప్రస్తావిస్తూ, ‘‘ఇది తీవ్ర ఆందోళనకర అంశం’’ అని పేర్కొంది. ఆర్థిక మంత్రిత్వశాఖకు ఆర్‌బీఐ అదనపు బ్రాంచ్‌ ఆఫీస్‌ (ఎక్స్‌టెన్షన్‌ కౌంటర్‌) కారాదని స్పష్టంచేసింది. ఒక స్వతంత్ర సంస్థగా ఆర్‌బీఐ ఏర్పాటయ్యిందని పేర్కొంటూ, ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం, విదేశీ అనిశ్చితి పరిస్థితుల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థకు రక్షణ, ద్రవ్య స్థిరత్వం, దవ్య లభ్యత, సరఫరాల్లో ఇబ్బందులు లేకుండా చూడ్డం వంటివి ఆర్‌బీఐ ప్రధాన లక్ష్యాలుగా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. ఆర్‌బీఐ మిగులు నిధులను కేంద్రానికి బదలాయింపులపై ఏర్పాటయిన బిమల్‌ జలాన్‌ కమిటీ ఇచ్చిన సిఫారసులను ఆర్‌బీఐ బోర్డ్‌ ఆమోదించిన నేపథ్యంలో ఏఐబీఈఏ తాజా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.1,23,414 కోట్లు మిగులు లేదా డివిడెండ్‌ రూపంలో, మరో రూ. 52,637 కోట్లు మిగులు మూలధనం రూపంలో మొత్తం రూ.1,76,051 కోట్లను కేంద్రానికి బదలాయించాలని ఆర్‌బీఐ సోమవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏఐబీఈఏ జనలర్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలం చేసిన ప్రకటనలో ముఖ్యాంశాలు చూస్తే...

- ఆర్‌బీఐ పూర్తి స్వతంత్ర సంస్థ. ఆర్థిక మంత్రిత్వశాఖకు లేదా ప్రభుత్వానికి ఎక్స్‌టెన్షన్‌ కౌంటర్‌ ఎంతమాత్రం కాకూడదు. సెంట్రల్‌ బ్యాంక్‌ నిర్వర్తించాల్సిన ప్రత్యేక బాధ్యతలు దానికి ఉన్నాయి. దీనిలో ఎవ్వరి జోక్యం ఉండకూడదు.
- అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఇది తీవ్ర ఆందోళనకరం. ప్రభుత్వ కోర్కెలకు బలవంతంగా తలొగ్గే సంస్థగా ఆర్‌బీఐ మారుతున్నట్లు కనబడుతోంది. ప్రభుత్వ ద్రవ్యలోటును పూడ్చడానికి తన నిధులు ఇవ్వాలని ఆర్‌బీఐ నిర్ణయించడం ఇక్కడ ప్రస్తావనాంశం. 
- ఆర్‌బీఐ ఇప్పుడు తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఇంతక్రితం గవర్నర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. వారి ఉద్యోగాలను మధ్యలోనే వదిలేసి కూడా వెళ్లిపోయారు. 
- భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటోంది. మందగమనంలో ఉంది. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి చర్యలు తీసుకుంటున్నా, అంతగా ఫలితాలను ఇవ్వడం లేదు. అయితే ఆర్‌బీఐ స్వతంత్రతను దెబ్బతీస్తే, ఆర్థిక స్థిరత్వం మరింత దెబ్బతింటుంది. 
- తాజా నిధుల బదలాయింపుతో ఆర్‌బీఐ నిధుల నిర్వహణ 6.5 శాతం  హయ్యర్‌ బ్యాండ్‌ నుంచి 5.5 శాతం లోయర్‌ బ్యాండ్‌కు పడిపోతుంది. భారీ నిధుల బదలాయింపుతో అత్యవసర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనడం ఆర్‌బీఐకి కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయా అంశాలు ఆర్థిక స్థిరత్వానికి తీవ్ర ఇబ్బందికరమవడంలో సందేహం లేదు. 
- భారత్‌ ఎటువంటి ఆర్థికమందగమనాన్నీ ఎదుర్కొనడం లేదని పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో పేర్కొన్న కేంద్రం, గత వారం గత వారం కొన్ని ఉద్దీపన చర్యలను ప్రకటించింది. అయితే ఈ ఉద్దీపనలు అటు ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి  ఉపయోగపడేట్లు లేవు. కేవలం కార్పొరేట్లకు సహాయం చేయడానికి ఉద్దేశించినవిగా ఉన్నాయి. కార్పొరేట్లకు ఎన్నో రాయితీలు ఇచ్చారు. అదేమంటే వారిని సంపద సృష్టికర్తలు అంటున్నారు. వారిని గౌరవించి తీరాలంటున్నారు. నిజానికి  వాస్తవిక సంపద సృష్టికర్తలు కర్మాగారాల్లో, తయారీ రంగంలో పనిచేసే కార్మికులే. వ్యవసాయ రంగంలో ఉన్న పేద రైతులే. ఈ వాస్తవిక సంపద సృష్టికర్తలకు ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలూ లభించడంలేదు. 
- ఇప్పటికే బ్యాంకులు కార్పొరేట్ల భారీ మొండిబకాయిల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వారికి మరిన్ని రుణాలు ఇచ్చేలా వచ్చే ఒత్తిడి బ్యాంకింగ్‌కు కష్టాలనే తెచ్చిపెడతాయి. 
- రుణాలపై వడ్డీరేట్లు తగ్గించమని బ్యాంకులపై ఒత్తిడి వస్తోంది. బ్యాంకులకు వచ్చే ఆదాయ నష్టాన్ని ఎవరి భరిస్తారు?. బ్యాంకులపై భారం పెంచే పని చేయకూడదు. 

ఇందుకే భారీ నిధులు ఎలా ఇవ్వగలుగుతోంది!
 కేంద్రానికి ఆర్‌బీఐ భారీ నిధులను ఎలా ఇవ్వగలుగుతోందన్న ప్రశ్నలకు సంబంధింత వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం ఇదీ... భారీ బాండ్‌ కొనుగోళ్లు, తన విదేశీ నిల్వల కార్యకలాపాలకు సంబంధించిన అకౌంటింగ్‌ విధానాల్లో మార్పు ద్వారా ఆర్‌బీఐకి భారీ మొత్తంలో నిధులు సమకూరాయి. సెంట్రల్‌ బ్యాంక్‌ మొత్తం ఆదాయంలో వీటి వాటానే దాదాపు రూ.57,000 కోట్లుగా ఉంది. వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంచడానికి వీలుగా ఆర్‌బీఐ పెద్ద ఎత్తున బాండ్‌ కొనుగోళ్లు జరిపింది. ఇక్కడ ఆర్‌బీఐకి లభించిన అదనపు ఆదాయం రూ.36,000 కోట్లు. అలాగే ఫారెక్స్‌ అకౌంటింగ్‌ విధానాల్లో మార్పు ద్వారా వచ్చిన మొత్తం రూ.21,000 కోట్లు. ఆర్‌బీఐ వద్ద జూన్‌ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్‌ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్‌ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఇందులో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో- డిసెంబర్‌ 10వ తేదీన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ప్రకటించారు. ఈ నిధుల నిర్వహణను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అంతకుముందు నవంబర్‌ 19న ఆర్‌బీఐ బోర్డ్‌ నిర్ణయించింది. శక్తికాంత్‌ దాస్‌ గవర్నర్‌ అయ్యాక డిసెంబర్‌లో జలాన్‌ నేతృత్వంలో ‘నిధుల బదలాయింపుపై’  ఆరుగురు కమిటీ కూడా ఏర్పాటయ్యింది. నిజానికి ఈ కమిటీ జూన్‌నెల చివరికల్లా నివేదిక సమర్పిస్తుందని భావించినా,  కొన్ని భేదాభిప్రాయాల వల్ల నివేదిక సమర్పన వాయిదా పడుతూ వచ్చింది. గడచిన సోమవారం జలాన్‌ కమిటీ సిఫారసులకు ఆర్‌బీఐ ఆమోదముద్ర వేసింది. 6.5 నుంచి 5.5 శాతం శ్రేణిలో రిస్క్‌ బఫర్స్‌ ఉండాలని జలాన్‌ కమిటీ సిఫారసు చేసింది. You may be interested

జీడీపీ అంచనాలకు ఇక్రా కోత

Thursday 29th August 2019

6.7 శాతానికి తగ్గింపు న్యూఢిల్లీ: భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలకు ఇండియా రేటింగ్స్‌ కోత పెట్టింది. వృద్ధి రేటు కేవలం 6.7 శాతమే నమోదవుతుందని పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా 7.3 శాతం. వినియోగంలో మందగమనం, పారిశ్రామిక ఉత్పత్తి రేటు పడిపోవడం వంటి అంశాలు దీనికి కారణమని పేర్కొంది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో కూడా వృద్ధి రేటు 5.7 శాతంగానే ఉంటుందన్నది ఇండియా రేటింగ్స్‌ అంచనా. 

టయోటా, సుజుకీ జట్టు

Thursday 29th August 2019

సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీ కోసం భాగస్వామ్యం టోక్యో: జపాన్‌కు చెందిన వాహన దిగ్గజం టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం).. మరో వాహన కంపెనీ సుజుకీ మోటార్ కార్ప్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు బుధవారం ప్రకటించింది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీ కోసమే పోటీ కంపెనీలో వాటాను కొనుగోలు చేసి జట్టుకట్టినట్లు వివరించింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన తాజా ఒప్పందం ప్రకారం.. సుజుకీ మోటార్ కార్ప్‌లో 4.9 శాతం వాటాను (908

Most from this category